అటో, ఇటో, ఎటో...! | What Pranab Mukherjee Next Steep On Political Entry | Sakshi
Sakshi News home page

అటో, ఇటో, ఎటో...!

Published Sun, Jun 10 2018 12:38 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

What Pranab Mukherjee Next Steep On Political Entry - Sakshi

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌ ముఖర్జీకి ప్రధాని కావాలనే ఆకాంక్ష ఉన్నదా? కుమార్తె శర్మిష్ఠను బీజేపీలో చేర్చి, 2019 ఎన్నికలలో ఢిల్లీ నుంచి లోక్‌సభకు పోటీ చేయించి, ఎన్‌డీఏ ప్రభుత్వంలో మంత్రిగా నియమిస్తామని ఆయనకు బీజేపీ అధినాయకత్వం హామీ ఇచ్చిందా? రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అధినేత మోహన్‌ భాగవత్‌ ఆహ్వానం మన్నించి గురువారం నాగపూర్‌లో సుదీర్ఘకాలం ప్రచారక్‌ శిక్షణ పొందినవారిని ఉద్దేశించి ప్రసంగించడానికి ప్రణబ్‌దా వెళ్ళడం కొందరికి సంతోషం కలిగించింది. మరికొందరికి ఖేదం కలిగించింది. అందరికీ ఆశ్చర్యం కలిగించింది. సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆనందశర్మ, మనీష్‌ తివారీ నాగపూర్‌ వెళ్ళడానికి మాజీ రాష్ట్రపతి అంగీకరించడాన్ని తప్పుపట్టారు. వెళ్లినా వారి తప్పులను ఎత్తిచూపండని చిదంబరం చెప్పారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వేచి చూసే ధోరణిని ఆశ్రయించింది. 

కాకలు తీరిన కాంగ్రెస్‌వాది 
దాదాపు అర్ధశతాబ్ది కాంగ్రెస్‌తో మమేకమైన ప్రణబ్‌ ముఖర్జీ నాగపూర్‌ వెళ్ళడమే విశేషం. పండిట్‌ నెహ్రూ భావ జాలాన్ని గుండె నిండా నింపుకున్న ప్రణబ్‌ అందుకు విరు ద్ధమైన ఆదర్శాలను ఆరాధించే ఆర్‌ఎస్‌ఎస్‌ కేంద్ర కార్యాల యాన్ని సందర్శించడం అంటే దానికి గౌరవం ఆపాదించడమే. ఆ సంస్థను ప్రధాన స్రవంతికి చేరువ చేయడమే.  ఆర్‌ఎస్‌ఎస్‌ను నిషేధించిన 1975 నాటి ఇందిరాగాంధీ మంత్రివర్గంలోనూ, 1992 నాటి పీవీ నరసింహారావు ప్రభుత్వంలోనూ ప్రణబ్‌ సభ్యుడుగా ఉన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ఖండిస్తూ ఏఐసీసీ ఆమోదించిన అనేక తీర్మానాల దస్తూరీ ఆయనదే. దైవభక్తి కలిగిన హిందువు అయినా లౌకికవాదంతో ఎన్నడూ రాజీపడని రాజకీయ వేత్త. ఆమధ్య దాద్రీలో మహమ్మద్‌ అఖ్లాక్‌ హత్యనూ, దేశంలో పెచ్చరిల్లుతున్న అసహన ధోరణులనూ నిర్ద్వంద్వంగా ఖండించిన నాయకుడు. 

ఆర్‌ఎస్‌ఎస్‌ పట్ల తన వ్యతిరేకతను దాచుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించని నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్‌వాది ఆయన. అటువంటి వ్యక్తి ఆర్‌ఎస్‌ఎస్‌ వేదికను సర్‌సంఘ్‌చాలక్‌ మోహన్‌ భాగవత్‌తో పంచుకోవడం, వారి కార్యకర్తల కవాతు తిలకించడం, సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కేశవ్‌ బలిరాం హెడ్గేవార్‌ను భరతమాత వరిష్ఠ పుత్రుడంటూ అభివర్ణించడం కాంగ్రెస్‌వాదులను ఆందోళనకు గురి చేసింది. మహాత్మా గాంధీని హత్య చేసింది ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తేనంటూ  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పదేపదే ఆరోపిస్తున్న సమయంలో కాంగ్రెస్‌కి చెందిన అతి పెద్ద రాజనీతిజ్ఞుడు నాగపూర్‌ సందర్శించడం సంచలనాత్మకమైన ఘట్టమే. 

 ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రతిసారీ ప్రతివిమర్శ చేస్తూ వస్తున్న రాహుల్‌ ఇటీవలి కాలంలో స్వరం పెంచడం, ఆరోపణలలోని తీవ్రతను హెచ్చించడం, బీజేపీ నాయకులు అంతకంటే బిగ్గరగా, కటువుగా తిరుగు దాడి చేయడం,  ఫలితంగా రాజకీయ వాతావరణమే వేడెక్కిపోవడం వల్ల ప్రత్యర్థులు కలుసుకొని మాట్లాడుకోవడం అన్నది అసంభవంగా కనిపిస్తున్న రోజులలో ప్రణబ్‌ను భాగవత్‌ నాగపూర్‌కు ఆహ్వానించడం శుభపరిణామం. ఆర్‌ఎస్‌ఎస్‌ను ఎంత వ్యతిరేకించినా ఆ సంస్థ ప్రతినిధు లతో మాట్లాడటానికి కాంగ్రెస్‌ నాయకులు ఎవ్వరూ నిరా కరించేవారు కాదు. 22 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీకి మార్గదర్శనం చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్‌ ఉనికిని గుర్తిం చకపోవడం, ఆ సంస్థ ప్రతినిధులతో సమాలోచనలు జరపడానికి నిరాకరించడం పరిణతి లేని రాజకీయం. 

గాంధీ–నెహ్రూ వంశం వ్యతిరేకత
ఒక అధ్యాపకుడుగా జీవితం ప్రారంభించి, రాజకీయాలలో ప్రవేశించి, కేంద్రంలో మంత్రి పదవులు అనేకం నిర్వహించి, అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిష్ఠించిన ప్రణబ్‌ ముఖర్జీ కేవలం కాంగ్రెస్‌ నాయకుడు కాదు. పార్టీలకు అతీతంగా అన్ని పక్షాలనూ కలుపుకొని పోతూ సమాజ హితం కోసం పరిశ్రమించే రాజనీతిజ్ఞుడు. కొడుకూ, కూతురూ విభేదించినా లెక్క చేయకుండా ప్రణబ్‌దా నాగపూర్‌ సందర్శించడం సరైన నిర్ణయం. నాగపూర్‌ సందర్శన వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నదంటూ మీడియాలో, రాజకీయవర్గాలలో ఊహాగానాలు ప్రచారం కావడానికి నేపథ్యం ఉంది. 1984లో సిక్కు అంగరక్షకులు నాటి ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసినప్పుడు తనకు ప్రధాని పదవి ఇస్తారని ప్రణబ్‌ ముఖర్జీ ఆశించారు. అటువంటి ఆలోచన చేయడమే నేరంగా గాంధీ–నెహ్రూ కుటుంబం భావించింది. ప్రణబ్‌దాను పక్కన పెట్టింది. ఆయన కాంగ్రెస్‌ నుంచి నిష్క్రమించి కొత్తపార్టీ పెట్టి చేయి కాల్చుకున్నారు. 1991లో పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్‌లో ప్రణబ్‌ ముఖర్జీ పునరావాసం సంపూర్ణంగా జరిగింది.

2004లో కాంగ్రెస్‌ నాయకత్వంలో యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలపైన చర్చించడానికి రావలసిందిగా సోనియాగాంధీని రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం ఆహ్వానించారు. అంతలోనే డాక్టర్‌ సుబ్రహ్మణ్యస్వామి పితలాటకం కారణంగా ఆమెతో ప్రమాణం చేయించడానికి కలాం సంకోచించారు. ఆ విషయం సోనియాకు ఒక లేఖ ద్వారా కలాం తెలియజేశారని సుబ్రహ్మణ్యస్వామి అంటారు. మొత్తంమీద తాను ప్రధాని పదవీ బాధ్యతలు స్వీకరించరాదని సోనియా నిర్ణయించారు. పదవీత్యాగం పేరుతో నాటకీయ సన్నివేశాలు కాంగ్రెస్‌ హృదయాలను పిండివేసిన అనంతరం యూపీఏ ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ను సోనియాగాంధీ నియమించారు.

ఆర్థికమంత్రి హోదాలో మన్మోహన్‌ను రిజర్వుబ్యాంకు గవర్నర్‌గా నియమించిన ప్రణబ్‌కు మరోసారి ఆశాభంగం తప్పలేదు. 2007లోనే సోనియా సమ్మతిస్తే ఆయన రాష్ట్రపతి అయ్యేవారు. ఆమె ససేమిరా అన్నారు. 2011–12లో యూపీఏ సర్కారుపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినప్పుడు మన్మోహన్‌ను తప్పించి ప్రణబ్‌కు బాధ్యతలు అప్పగించాలనే సూచనలు బలంగా వచ్చాయి. కానీ సోనియా ఒప్పుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రపతి చేయడానికి సోనియా సమ్మతించక తప్ప లేదు. సోనియా తన పట్ల సుముఖంగా లేరనే అవగాహన తోనే 1998 నుంచి రాష్ట్రపతిగా ఎన్నికయ్యేవరకూ ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్‌లో ప్రణబ్‌ కొనసాగారు. ఈ నేపథ్యంలో ప్రణబ్‌ ప్రధాని కావడానికి అవకాశం అంటూ ఉంటేగింటే అది బీజేపీ సహకారంతోనే సాధ్యం. ప్రణబ్‌కూ, మోదీకీ మంచి సంబంధాలు ఉన్నాయి. ఉప రాష్ట్రపతిగా పదవీవిరమణ చేసిన సందర్భంలో హమీద్‌ అన్సారీని మోదీ సూటిపోటి మాటలు అన్నారు కానీ ప్రణబ్‌ను పల్లెత్తు మాట అనకపోగా చాలా గౌరవంగా చూసేవారు. ఆయనను ‘గార్డియన్‌’గా అభివర్ణించారు. 

మోదీ అయినా, మరొకరైనా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశీస్సులు ఉంటేనే ప్రధాని పదవిలో ఉంటారనే వాస్తవం ప్రణబ్‌కూ తెలుసు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీకి మెజారిటీ లభించపోతే, 200లకు సమీపంలో లోక్‌సభ స్థానాలు దక్కితే ఎన్‌డీఏ–3 ఏర్పాటు చేయడానికి అత్యధిక ప్రాంతీయ పార్టీలకు ఆమోదయోగ్యుడైన నాయకుడు అవ సరం. మోదీని చాలామంది ప్రాంతీయ నాయకులు వ్యతిరే కిస్తారు. సంకీర్ణధర్మాన్ని నెరవేర్చడానికి అవసరమైన ఓర్పూ, నేర్పూ మోదీకి లేవనే అభిప్రాయం సర్వత్రా ఉంది. అటువంటి ప్రత్యేక సందర్భం ఏదైనా తారసిల్లితే ఎన్‌డీ ఏ–3 ప్రధాని అభ్యర్థిగా ప్రణబ్‌దా పేరును పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రతిపాదిస్తే, ఆర్‌ఎస్‌ఎస్‌ ఆమోదించవచ్చు. ఆ విధంగా ప్రణబ్‌ చిరకాలవాంఛ తీరవచ్చు. అనేక పరిస్థితులు కలసివస్తేనే అటువంటి అవకాశం లభిస్తుంది. రాజకీయాలలో ఏదైనా సంభవమే. మలేసియా ప్రధానిగా 92 సంవత్సరాల మహతీర్‌ మహమ్మద్‌ బాధ్య తలు స్వీకరించగా లేనిది 82 ఏళ్ళ ప్రణబ్‌ ప్రధాని కావాలని కోరుకోవడంలో తప్పేముంది? ప్రణబ్‌ అంతరంగం ఏమిటో తెలియదు కానీ ఒక వాదనగా ఇది సమంజంగానే వినిపిస్తుంది. 

అందరికీ ఆనందం
ప్రణబ్‌ చేసిన ప్రసంగంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు దగ్గరైనట్టు కనిపించే ధోరణులు ఏమైనా ఉన్నాయా? దీనికి స్పష్టమైన సమాచారం చెప్పడం కష్టం. ఇరు పక్షాలనూ సంతోష పెట్టారని చెప్పవచ్చు. అస్పష్ట రాజకీయ విన్యాసాలు చేయడంలో ప్రణబ్‌ బహునేర్పరి. గాంధీ–నెహ్రూ వంశం వ్యతిరేకత సహా అనేక అవాంతరాలను అధిగమిస్తూ రాజకీయ ప్రస్థానం చేసిన వ్యక్తికి ఎంత సహనం, ఎంత ప్రావీణ్యం, ఎంత గడుసుదనం, ఎంత పట్టుదల ఉండాలో ఊహించుకోవచ్చు. నాగపూర్‌ ప్రయాణానికి ముందు ప్రణబ్‌ని విమర్శించిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు ఆ తర్వాత ప్రశంసించడం మొదలు పెట్టారు–ఒక్క మనీష్‌ తివారీ తప్ప. లౌకికవాదాన్నీ, భిన్నత్వంలో ఏకత్వాన్నీ, బహుళత్వాన్నీ, సహనాన్నీ పరిపాలనలో అనివార్యమైన అంశాలుగా స్పష్టంగా చెప్పినందుకు కాంగ్రెస్‌వాదులు సంతోషించారు. సంఘ్‌ పరివారం తరచుగా విమర్శించే నెహ్రూ దార్శనికత గురించి మాట్లాడినందుకు ఆనందించారు.

ప్రత్యర్థులతో సమాలోచన జరపడం, చర్చాగోష్ఠులు నిర్వహించడం (ఎంగేజ్‌మెంట్, డైలాగ్, డిబేట్‌) అత్యవసరమని ఉద్ఘాటించడం వారికి నచ్చింది. పేదరికాన్ని, అనారోగ్యాన్నీ, లేమినీ పారదోలాలనీ, ప్రగతినీ, సామరస్యాన్నీ, సంతోషాన్నీ పెంపొందించాలనీ ఎన్‌డీఏ ప్రభుత్వానికి పరోక్షంగా ప్రబోధించారు. ఇవన్నీ కాంగ్రెస్‌ నాయకత్వానికి సంతృప్తి కలి గించాయి. భాగవత్‌ ప్రణబ్‌కి స్వాగతం చెప్పిన తీరునూ, హెడ్గేవార్‌ను మాజీ రాష్ట్రపతి కీర్తించడాన్నీ, జాతి, జాతీయత, దేశభక్తి (నేషన్, నేషనలిజం, పేట్రియాటిజం) అనే మాటలకు ప్రణబ్‌ చెప్పిన నిర్వచనాలు భాగవత్‌ నిర్వచనాలను పోలి ఉండటాన్నీ తమకు సానుకూలమైన అంశాలుగా నందకుమార్‌ వంటి సీనియర్‌ సంఘపరివారం నాయకులు భావిస్తున్నారు. అయిదు వేల సంవత్సరాల చరిత్రను రేఖామాత్రంగా చెబుతూ, బౌద్ధం పరిఢవిల్లిన కాలాన్ని ప్రస్తావించారు. చంద్రగుప్త మౌర్యుడూ, అశోకుడి వరకూ నెహ్రూ చెప్పిన చరిత్రను అనుసరించారు. ఆ తర్వాత ఆ దృక్కోణం మరుగున పడింది. మహమ్మదీ యుల దండయాత్రలను క్లుప్తంగా చెప్పారు. 

నెహ్రూ విశేషంగా వివరించిన అక్బర్‌ మతసహనం గురించి ప్రణబ్‌ మాట్లాడలేదు. రాజ్యాంగాన్ని ప్రశంసించారు కానీ అంబేడ్కర్‌ను ప్రస్తావించలేదు. ఇప్పుడు అంబేడ్కర్‌ని ప్రస్తుతించినా ఎవ్వరికీ అభ్యంతరం లేదు. అది వేరే విషయం.  గాంధీని గాడ్సే హత్య చేసిన ఉదంతాన్ని దాటవేశారు. బాబరీ మసీదు విధ్వంసాన్నీ, అనంతరం దేశవ్యాప్తంగా జరిగిన మతకలహాలనూ, హింసాకాండనూ ప్రస్తావించ లేదు. అందువల్ల సంఘపరివారం సైతం సంతోషంగా ఉంది. ఇటీవలి చరిత్రలో ప్రణబ్‌దా పోషించినటువంటి పాత్రనే బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అడ్వాణీ నిర్వహించి మూల్యం చెల్లించిన సంగతి ఈ సందర్భంగా గుర్తురాక మానదు. 2005లో అడ్వాణీ పాకిస్తాన్‌ సందర్శించి కరాచీలో మహమ్మదలీ జిన్నా సమాధిని చూసిన తర్వాత జిన్నాను లౌకికవాది అంటూ ప్రశంసించారు. 

పాకిస్తాన్‌ నిర్మాత జిన్నా లౌకికవాదిగా ఉండేవారనీ, ఇరుకు మనస్తత్వం కలిగిన మతవాది కారనీ అప్పుడు పాకిస్తాన్‌లో ఇస్లామిక్‌ ప్రభుత్వం నడుపుతున్న జనరల్‌ ముషారఫ్‌కు చెప్పాలని అడ్వాణీ ఉద్దేశం. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు  అపార్థం చేసుకొని, ఆయనను దేశద్రోహి అంటూ నిందించి పక్కన పెట్టారు. అటువంటి ప్రమాదాన్ని ప్రణబ్‌దా తప్పించుకున్నారు. అటు బీజేపీకీ, ఇటు కాంగ్రెస్‌కీ ఆనందం కలిగించే విధంగా ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెప్పవలసిన పాఠాలు చెప్పారు. అభ్యంతరకరమైన అంశాలను ప్రస్తావించకుండా దాటవేశారు. నెహ్రూ నుంచి గోల్వాల్కర్‌ వైపు కొన్ని అడుగులు వేశారు. కానీ నెహ్రూ భావజాల పరిధిని పూర్తిగా దాటలేదు. నెహ్రూ, హెడ్గేవార్‌ వంటి పరస్పర విరుద్ధమైన వ్యక్తిత్వాల మధ్య సమన్వయం అసాధ్యం. ఆ ప్రయత్నం చేయకుండానే ఇద్దరి అభిమానులనూ మెప్పించే విధంగా ప్రసంగించారు.  భవిష్యత్తులో అవసరమైతే, అవకాశం దొరికితే పదవీరాజకీయ విన్యాసాలకు కావలసిన వెసులుబాటు మిగుల్చుకున్నారు. అందుకే ఆయనను ఎవ్వరికీ అందని మేధావి అంటారు.

- కె. రామచంద్రమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement