బుధవారం నాగపూర్ విమానాశ్రయానికి చేరుకున్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్
మాజీ రాష్ట్రపతి, జీవితకాలం లౌకికవాది గా, కాంగ్రెస్ వ్యక్తిగా నిలిచిన ప్రణబ్ ముఖర్జీ నేడు (గురువారం) నాగపూర్‌లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యక్రమం లో ఏం మాట్లాడబోతున్నారని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఐదు దశాబ్దాలకు పైగా కొనసాగిన రాజకీయ జీవితంలో ఆయన అనేక ప్రసంగాలు చేశారు. ఐదేళ్లు రాష్ట్రపతిగా ఉన్న సమయంలోనూ వివిధ సందర్భా ల్లో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. వాటి లో ప్రధానంగా ప్రస్తావించదగినవి 2012లో ఆయన రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా చేసిన ప్రసంగం.. మరొకటి, 2017లో రాష్ట్రపతిగా చేసిన చివరి ప్రసంగం.
2012లో..
2012లో లౌకికత, ప్రజాస్వామ్యం, సమాన త్వం తదితరాలను ప్రస్తావించినప్పటికీ.. ప్రధానంగా పేదరిక నిర్మూలన, ఉగ్రవాదం, అవినీతిపై పోరు.. తదితర అంశాలపైనే ఎక్కువగా ఆయన ప్రసంగం కేంద్రీకృతమైంది. ‘భారతదేశ అభివృద్ధిలో తాను కూడా భాగస్వామినేనని దేశంలోని అత్యంత పేదవాడు కూడా విశ్వసించినప్పుడే అది నిజమైన అభివృద్ధి. ఆకలిని మించిన బాధ, వేదన లేదు. ఆధునిక భారతదేశ డిక్షనరీలో నుంచి పేదరికం అనే పదాన్ని లేకుండా చేసేందుకు మనమంతా కృషి చేయాలి’ అని నాడు ప్రణబ్ పేర్కొన్నారు. మన భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిరూపాలైన గుడి, మసీదు, చర్చి, గురుద్వారా.. ఇవన్నీ సఖ్యతగా సాగినప్పుడే సామాజిక సామరస్యత సాధ్యమవుతుంది’ అని కూడా నాడు ప్రణబ్ వ్యాఖ్యానించారు.
2017లో..
గత సంవత్సరం చేసిన ప్రసంగంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధానంగా లౌకికత్వం, సామరస్య పూర్వక సహజీవనం పైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ‘నా ఇన్నేళ్ల జీవితంలో నేను అర్థం చేసుకున్న కొన్ని వాస్తవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సహనశీలత, భిన్నత్వం.. వీటిలోనే మన భారతీయ ఆత్మ నిలిచి ఉంది. భారత్ అంటే కేవలం ఒక భౌగోళిక ప్రాంతమే కాదు.. భిన్న ఆలోచనలు, విభిన్న తాత్వికతలు, మేధో భావనలు, అత్యుత్తమ విలువలు, సృజనాత్మక కళా నైపుణ్యాలు.. ఇవన్నీ కలగలసిన చరిత్రే భారత్.
శతాబ్దాల ఆలోచనల ఫలితంగా మన దేశ భిన్నత్వం రూపుదిద్దుకుంది. సాంస్కృతికంగాను, భాషా విశ్వాసాల్లోనూ భిన్నత్వం మన ప్రత్యేకత. సహనశీలత మన బలం. మన అభిప్రాయాల్లో బేధాలుండొచ్చు.. మనం వాదించుకోవచ్చు.. కానీ విభిన్న అభిప్రాయాలను గౌరవించాలని మనం శతాబ్దాలుగా మన ఆలోచనల్లో, మన రక్తంలో ఇంకించుకున్న ఉన్నత భావనను మాత్రం తొలగించుకోవద్దు. అదే మన దేశ ఔన్నత్యం. దాన్ని కోల్పోతే మన మౌలిక వ్యక్తిత్వాన్నే కోల్పోయినట్లు’ అని ప్రణబ్ ముఖర్జీ నొక్కి చెప్పారు.
2018లో..
ఈ నేపథ్యంలో ఈ రోజు ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలో స్వయం సేవకులను ఉద్దేశించి ప్రణబ్ ఏం ప్రసంగించబోతున్నారన్నది ఆసక్తిగా మారింది. ఆరెస్సెస్ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తారా? లేక సూచనలు, సలహాలు ఇస్తారా? ఇవన్నీ కాకుండా.. సంఘ్ సిద్ధాంతాలకు జై కొడతారా? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఆరెస్సెస్ ఆహ్వానాన్ని ప్రణబ్ అంగీకరించడాన్ని కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల సీనియర్లు కొందరు ఇప్పటికే తప్పుబడుతున్నారు. నాగపూర్ వెళ్లొద్దంటూ లేఖలు, ఫోన్ల ద్వారా ఆయనకు సలహా ఇచ్చారు.
అయితే, ‘వీటన్నింటికీ నా స్పందనను నాగపూర్‌లోనే వెల్లడిస్తా’ అని ఇప్పటికే ప్రణబ్ కూడా తేల్చి చెప్పారు. కొన్నేళ్ల క్రితం ప్రముఖ సామాజిక కార్యకర్త, మెగసేసే అవార్డ్ గ్రహీత అభయ్ బంగ్‌ను కూడా ఆరెస్సెస్ ఆహ్వానించింది. అప్పుడూ ఆయనపై విమర్శలు వచ్చాయి. ‘నా అభిప్రాయాలు చెప్పేందుకు ఏ వేదికైనా ఒకటే’ అంటూ అభయ్ అప్పుడు స్పందించారు. అభిప్రాయాలు వెల్లడించడాన్ని లెఫ్ట్ తప్పుపట్టడాన్ని కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు ఆరెస్సెస్ కార్యక్రమంలో ప్రణబ్ పాల్గొనడాన్ని స్వాగతిస్తున్న వారు కూడా అదే విషయాన్ని నొక్కి చెబుతున్నారు. ఇక ప్రణబ్ పయనమెటో తేలాలంటే.. మరి కొద్దిగంటలు వేచి చూడాల్సిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment