సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు (గురువారం) ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొనబోతుండటంపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రణబ్ సహచరులైన కాంగ్రెస్ నేతలు ఆయన తీరుపై అసమ్మతిని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ప్రణబ్ తీరుపై స్పందించారు. యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి అత్యంత కీలకమైన అనుచరుడిగా పేరొందిన ఆయన.. ‘ప్రణబ్ దా.. మీ నుంచి ఇది ఆశించలేదు’ అని ట్వీట్ చేశారు.
ప్రణబ్ తీరును ఆయన కూతురు షర్మిష్టా ముఖర్జీ కూడా తప్పుబట్టారు. నాగ్‌పూర్‌కు వెళ్లడం ద్వారా బూటకపు కథనాలను సృష్టించేందుకు బీజేపీ-ఆరెస్సెస్‌కు కావాల్సినంత అవకాశం కల్పిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తాను బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. తాను రాజకీయాలను వీడుతాను కానీ, కాంగ్రెస్ పార్టీని వీడబోనని షర్మిష్ట పేర్కొన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) తృతీయ వార్షిక శిక్షణ కార్యక్రమం ముగిసిన సందర్భంగా గురువారం ఆ సంస్థ నిర్వహించబోయే కార్యక్రమంలో ప్రణబ్ ముఖర్జీ ప్రధాన అతిథిగా పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా ఆరెస్సెస్ శ్రేణులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఆరెస్సెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాంగ్రెస్ నాయకుడిగా, లౌకికవాదిగా జీవితమంతా బీజేపీని, దాని మాతృసంస్థ ఆరెస్సెస్‌ను తీవ్రంగా విమర్శించిన ప్రణబ్ రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్న అనంతరం ఆరెస్సెస్ కార్యక్రమంలో పాల్గొండటం రాజకీయ దుమారం రేపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment