
ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న వెంకటనారాయణ్. చిత్రంలో గంటా, ఏబీకే, కేవీపీ, దత్తాత్రేయ, జైపాల్ రెడ్డి, రామచంద్రమూర్తి, రాఘవాచారి, కేఆర్ వేణుగోపాల్, ఉండవల్లి, మల్లెపల్లి, హరగోపాల్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన నిలిచి పాలకులకు వాస్తవాలను తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. రామచంద్రమూర్తి 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సీనియర్ పాత్రికేయులు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్ కుమార్‌ల ఆధ్వర్యంలో ఆదివారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మూర్తికి సామాజిక బాధ్యత ఎక్కువ అని, తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా నిర్వహించిన ‘దశ దిశ’కార్యక్రమం అత్యున్నతమైందని పేర్కొన్నారు. మారుతున్న సమాజంలో నిజాయితీతో పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు.
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిజాన్ని వృత్తిగానే కాకుండా ప్రవృత్తిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రామచంద్రమూర్తి అని, ఆయన ఓ విశ్వవిద్యాలయం లాంటివారని అన్నారు. ముక్కుసూటిగా చెప్పడం, నిరాడంబరత నైజమని పేర్కొన్నారు. గంభీర పరిస్థితుల్లోనూ తొణకని మనస్తత్వం ఆయనదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సమస్యలను పరిష్కరించే కోణంలో అన్ని రకాల భావజాలం కలిగిన వ్యక్తులతో సయోధ్య, చర్చకు వీలు కల్పించిన నేర్పు, ఓర్పు రామచంద్రమూర్తి సొంతమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ప్రశంసించారు.
అనేక సంక్లిష్ట పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కొన్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనదని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటుకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎనలేనిదని అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి ‘సాక్షి’లో రాసిన త్రికాలం ఎడిట్ పేజీ వ్యాసాల సంకలనాన్ని మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలికాపీని జైపాల్‌రెడ్డికి అందజేశారు.
అంతకుముందు 50 ఏళ్ల జర్నలిజం ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయులు ఎస్.వెంకటనారాయణ్‌ను రామచంద్రమూర్తి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, రక్షణ మంత్రి సలహాదారు సతీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి, పాశం యాదగిరి, జ్వాలా నరసింహారావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు కాకి మాధవరావు, ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు.