Editorial Director ramachandra murthy
-
రామచంద్రమూర్తికి ఆత్మీయ సమ్మేళనం
-
‘ప్రజల మనిషి రామచంద్రమూర్తి’
సాక్షి, హైదరాబాద్: సుమారు ఐదు దశాబ్దాల పాటు ప్రజల పక్షాన నిలిచి పాలకులకు వాస్తవాలను తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి ‘సాక్షి’ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి అని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ కొనియాడారు. రామచంద్రమూర్తి 70వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని సీనియర్ పాత్రికేయులు, బుద్ధవనం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, ఎమెస్కో విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో ఆదివారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. మూర్తికి సామాజిక బాధ్యత ఎక్కువ అని, తెలంగాణ ఉద్యమం సమయంలో రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు తలెత్తకుండా నిర్వహించిన ‘దశ దిశ’కార్యక్రమం అత్యున్నతమైందని పేర్కొన్నారు. మారుతున్న సమాజంలో నిజాయితీతో పనిచేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జర్నలిజాన్ని వృత్తిగానే కాకుండా ప్రవృత్తిగా మార్చుకున్న గొప్ప వ్యక్తి రామచంద్రమూర్తి అని, ఆయన ఓ విశ్వవిద్యాలయం లాంటివారని అన్నారు. ముక్కుసూటిగా చెప్పడం, నిరాడంబరత నైజమని పేర్కొన్నారు. గంభీర పరిస్థితుల్లోనూ తొణకని మనస్తత్వం ఆయనదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సమస్యలను పరిష్కరించే కోణంలో అన్ని రకాల భావజాలం కలిగిన వ్యక్తులతో సయోధ్య, చర్చకు వీలు కల్పించిన నేర్పు, ఓర్పు రామచంద్రమూర్తి సొంతమని కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి ప్రశంసించారు. అనేక సంక్లిష్ట పరిస్థితులను నిబ్బరంగా ఎదుర్కొన్న విశిష్ట వ్యక్తిత్వం ఆయనదని టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఏర్పాటుకు ఆయన ఇచ్చిన స్ఫూర్తి ఎనలేనిదని అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి ‘సాక్షి’లో రాసిన త్రికాలం ఎడిట్ పేజీ వ్యాసాల సంకలనాన్ని మాజీ ఐఏఎస్ అధికారి కేఆర్ వేణుగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. తొలికాపీని జైపాల్‌రెడ్డికి అందజేశారు. అంతకుముందు 50 ఏళ్ల జర్నలిజం ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ పాత్రికేయులు ఎస్.వెంకటనారాయణ్‌ను రామచంద్రమూర్తి సన్మానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు, రక్షణ మంత్రి సలహాదారు సతీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్, సీనియర్ పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, ప్రొఫెసర్ హరగోపాల్, రాఘవాచారి, పాశం యాదగిరి, జ్వాలా నరసింహారావు, కె.శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, నవ తెలంగాణ ఎడిటర్ వీరయ్య, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారులు కాకి మాధవరావు, ఐవైఆర్ కృష్ణారావు, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, ప్రకాశ్, దేశపతి శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. -
భగవంతుని రూపం ‘అమ్మ’
కొమరగిరిపట్నం (ఉప్పలగుప్తం) : అమ్మ భగవంతుని స్వరూపమని, సృష్టికర్తగా.. స్థితికర్తగా పరబ్రహ్మ స్వరూపిణిగా ‘అమ్మ’ నిరంతరం కీర్తింపబడుతుందని, అమ్మను మమ్మీగా పిలిచే నేటి యువతకు అమ్మ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పుస్తకం ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్టు నడింపల్లి సీతారామరాజు రచించిన ‘అమ్మ’ పుస్తక ఆవిష్కరణ సభ న్యూక్లియర్ శాస్త్రవేత్త(ఎన్ఎఫ్సీ) బ్రహ్మశ్రీ జి.వి.రామకృష్ణమూర్తి అధ్యక్షతన అల్లవరం మండలం కొమరగిరిపట్నంలోని అమృతవనంలో ఆదివారం జరిగింది. సభలో పాల్గొన్న పలువురు అమ్మ గురించి తమలో దాగి ఉన్న భావోద్వేగాలను వ్యక్తీకరించారు. తొలుత పుస్తకాన్ని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ ఆదిశక్తి అని.. ఆమె అమ్మగా మానవాళిపై మమతానురాగాలు కురిపిస్తోందని పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లికి ప్రతిబిడ్డా రుణపడే ఉంటాడని, ఆ పేగు బంధంలో ఉన్న మమకారాన్ని స్పృశిస్తూ నడింపల్లి సీతారామరాజు పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ అమ్మంటే తనకు ఎంత ప్రాణమో సభకు వివరించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ భగవంతుని ప్రతిరూపమే అమ్మ అని, జన్మ సార్ధకతకు అమ్మే మూలమని, అమ్మ తనకు జన్మనివ్వబట్టే ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌కందా, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ సృష్టిలో అమ్మ గొప్పతనాన్ని సభికులకు వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, ఆంధ్రాబ్యాంక్ మాజీ డెరైక్టర్ పరసా పరమేశ్వరరావు, రాష్ట్ర ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, ఏఐకేఎఫ్ కోశాధికారి డి.ఎస్.ఎన్.రాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, అమలాపురం ఆర్డీఓ జి.గణేష్ కుమార్, వయో వృద్ధుల జ్ఞాన ఆశ్రమ నిర్వాహకులు ఆర్.శ్రీరామరాజు కూడా మాట్లాడారు. అమ్మపుస్తకాన్ని ప్రముఖ రచయిత, సినీ గేయ పరిశోధకుడు డాక్టర్ పైడిపాల సమీక్షించారు. ‘పురాణ మహిళలు- వారి పాత్ర’ న్యూక్లియర్ శాస్త్రవేత్త జి.వి రామకృష్ణమూర్తి, ‘భూదేవి సీతమ్మతల్లి-ఆదర్శనారి’పై అల్లూరి రామభద్రరాజు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కొమరగిరిపట్నం గ్రామ సర్పంచ్ కడలి రామనాథం శెట్టి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, పెన్మత్స సీతారామరాజు, పెన్మత్స చిట్టిరాజు, పి.ఎస్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.