
భగవంతుని రూపం ‘అమ్మ’
కొమరగిరిపట్నం (ఉప్పలగుప్తం) : అమ్మ భగవంతుని స్వరూపమని, సృష్టికర్తగా.. స్థితికర్తగా పరబ్రహ్మ స్వరూపిణిగా ‘అమ్మ’ నిరంతరం కీర్తింపబడుతుందని, అమ్మను మమ్మీగా పిలిచే నేటి యువతకు అమ్మ ప్రాధాన్యాన్ని చాటిచెప్పే పుస్తకం ఎంతో అవసరమని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. సీనియర్ జర్నలిస్టు నడింపల్లి సీతారామరాజు రచించిన ‘అమ్మ’ పుస్తక ఆవిష్కరణ సభ న్యూక్లియర్ శాస్త్రవేత్త(ఎన్‌ఎఫ్‌సీ) బ్రహ్మశ్రీ జి.వి.రామకృష్ణమూర్తి అధ్యక్షతన అల్లవరం మండలం కొమరగిరిపట్నంలోని అమృతవనంలో ఆదివారం జరిగింది. సభలో పాల్గొన్న పలువురు అమ్మ గురించి తమలో దాగి ఉన్న భావోద్వేగాలను వ్యక్తీకరించారు. తొలుత పుస్తకాన్ని కేంద్ర మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరి ఆవిష్కరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్త్రీ ఆదిశక్తి అని.. ఆమె అమ్మగా మానవాళిపై మమతానురాగాలు కురిపిస్తోందని పేర్కొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లికి ప్రతిబిడ్డా రుణపడే ఉంటాడని, ఆ పేగు బంధంలో ఉన్న మమకారాన్ని స్పృశిస్తూ నడింపల్లి సీతారామరాజు పుస్తకాన్ని రచించడం అభినందనీయమన్నారు. సాక్షి దినపత్రిక ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి మాట్లాడుతూ అమ్మంటే తనకు ఎంత ప్రాణమో సభకు వివరించారు. ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ భగవంతుని ప్రతిరూపమే అమ్మ అని, జన్మ సార్ధకతకు అమ్మే మూలమని, అమ్మ తనకు జన్మనివ్వబట్టే ఉపముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. విశ్రాంత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్‌కందా, కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ మాట్లాడుతూ సృష్టిలో అమ్మ గొప్పతనాన్ని సభికులకు వివరించారు.
కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణరావు, ఆంధ్రాబ్యాంక్ మాజీ డెరైక్టర్ పరసా పరమేశ్వరరావు, రాష్ట్ర ఆల్డా చైర్మన్ యాళ్ళ దొరబాబు, ఏఐకేఎఫ్ కోశాధికారి డి.ఎస్.ఎన్.రాజు, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, అమలాపురం ఆర్డీఓ జి.గణేష్ కుమార్, వయో వృద్ధుల జ్ఞాన ఆశ్రమ నిర్వాహకులు ఆర్.శ్రీరామరాజు కూడా మాట్లాడారు. అమ్మపుస్తకాన్ని ప్రముఖ రచయిత, సినీ గేయ పరిశోధకుడు డాక్టర్ పైడిపాల సమీక్షించారు. ‘పురాణ మహిళలు- వారి పాత్ర’ న్యూక్లియర్ శాస్త్రవేత్త జి.వి రామకృష్ణమూర్తి, ‘భూదేవి సీతమ్మతల్లి-ఆదర్శనారి’పై అల్లూరి రామభద్రరాజు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. కొమరగిరిపట్నం గ్రామ సర్పంచ్ కడలి రామనాథం శెట్టి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, పెన్మత్స సీతారామరాజు, పెన్మత్స చిట్టిరాజు, పి.ఎస్.ఎన్.మూర్తి తదితరులు పాల్గొన్నారు.