త్రికాలమ్
ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న రంధిలో అనైతికంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అనూహ్యంగా మిత్రపక్షానికి దూరం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనే సంకేతాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. శుక్రవారంనాడు పార్లమెంటులో దేశీయాంగ సహాయమంత్రి హెచ్‌పి చౌదరి ఒక ప్రైవేటు బిల్లుపైన చర్చకు సమాధానం చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ప్రసక్తి లేదని తేల్చిచెప్పడంతో ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల అనుమానాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైనాయి. 14వ ఆర్థిక కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సిఫార్సు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు సమకూర్చే విషయం నీతిఆయోగ్ పరిశీలనలో ఉన్నదనీ, నీతిఆయోగ్ నివేదిక అందగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ మంత్రి చెప్పారు.
ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు, కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా ఫలితంగా ఆదాయం పన్నులో, ఎక్సైజ్ సుంకంలో, విద్యుచ్ఛక్తి చార్జీలలో లభించే రాయితీలను దృష్టిలో పెట్టు కొని అనేక కొత్త పరిశ్రమలు వస్తాయనీ, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయనీ లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ, భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2014 ఎన్ని కల బహిరంగ సభలలో ప్రత్యేక హోదాపైన సంయుక్తంగా వాగ్దానం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఈ హామీని పొందుపరిచారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అనేక విడతల హామీలు ఇచ్చారు. నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉంటుందంటే అయిదేళ్ళు సరిపోవు పదేళ్ళు కావాలంటూ రాజ్యసభలో పోరాడిన వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా వస్తున్నదనే చెప్పుకుంటూ వచ్చారు.
అయిదేళ్ళు అస్సలు సరిపోదు కనీసం పదిహేనేళ్ళయినా ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వచ్చి నిలుస్తాయంటూ చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందూ తర్వాతా మాట్లాడారు. ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేయడం వల్ల చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? ‘రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఆర్థిక సహాయం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది’ అంటూ ముఖ్యమంత్రి నిష్ఠురమాడారు.
భాజపా ఎదురుదాడి
ముఖ్యమంత్రిపైన ఎదురుదాడి చేయడానికి భాజపా నాయకులు సంకోచిం చడం లేదు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ‘నిధులు ఉదారంగా ఇస్తున్నాం. కానీ ఖర్చుల లెక్కలు చెప్పడం లేదు. కేంద్ర నిధులను వినియోగించే పథకాల పేర్లు మార్చి సొంతడబ్బా కొట్టుకుంటున్నారు’ అన్నారు. రెండు లక్షల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఆ పథకానికి ‘ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాం’ అని పేరు పెట్టుకున్నారనీ, గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నిధులు పంపిస్తే ఆ కార్యక్రమం పేరును ‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు’గా మార్చారనీ భాజపా నాయకుల విమర్శ.
ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిని కలుసుకున్నందుకు కేంద్రమంత్రులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పడితే, ‘ప్రతిపక్ష నాయకుడిని కేంద్రమంత్రులు కలుసుకోవడంలో తప్పేముంది?’ అంటూ భాజపా మంత్రి మాణిక్యాలరావు ప్రశ్నించారు. హైదరాబాద్ హైకోర్టు విభజన జరగపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమనీ, ఇందుకు అవసరమైన ప్రాథమిక సదుపా యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కల్పించవలసి ఉన్నదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పార్లమెంటులో చెప్పారు. ‘రాజధానే లేకపోతే హైకోర్టుకు ప్రాథమిక సదుపాయాలు ఎక్కడినుంచి తెస్తాం?’ అంటూ రాష్ట్ర మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు పరస్పరం నిందించుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదనీ, రెండు పక్షాల మధ్య దూరం పెరుగుతోందనీ ఈ ఉదంతాలు సూచిస్తున్నాయి.
మొదటి నుంచీ నరేంద్రమోదీకీ, చంద్రబాబునాయుడికీ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. మోదీ ఏదీ విస్మరించరూ, క్షమించరూ అంటారు. గుజరాత్‌లో 2002లో మారణహోమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తప్పించాలని పట్టుబట్టిన మిత్రపక్షాలలో తెదేపా ప్రధానమైనది. ఈ మేరకు ఎన్‌డీఏ సమావేశంలో తీర్మానం రూపొందించడంలో చంద్రబాబునాయుడిది కీలకపాత్ర అంటారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు మోదీ ప్రచారానికి వస్తారని తెలిసి అప్పటి నగర పోలీసు కమిషనర్ కృష్ణారావు ‘మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేస్తాం’ అని ప్రకటించారు. అప్పుడు అడ్వానీ అడ్డుపడకపోతే మోదీ రాజకీయ జీవితం మరో విధంగా ఉండేది.
ఇటీవల చంద్రబాబునాయుడు ప్రధానిని కలిసినప్పుడు ‘నాయుడు గారూ మీరు బలమైన ముఖ్యమంత్రి. గట్టి ముఖ్యమంత్రులు తరచుగా ఢిల్లీకి రారు’ అంటూ వ్యాఖ్యానించారట. చంద్రబాబునాయుడికి ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాలే తక్కువ. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రధానిని కలుసుకునే పరిస్థితి లేదు. పైగా అమిత్ర వైఖరి కనిపిస్తోంది. రాష్ట్రంలో భాజపా నాయకులు తెదేపాతో మైత్రీబంధాన్ని ఎంత త్వరగా తెంచుకుంటే అంత మంచిదని తలపోస్తున్నారు. సొంతంగా ఎదగాలని కలలు కంటున్నారు. అందుకే ఇటీవల వారి మాటలలో పదును పెరిగింది.
‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’
ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? భాజపాతో తెగతెంపులు చేసుకోవాలా? ఇద్దరు కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవాలా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి శనివారం డిమాండ్ చేసింది కూడా ఇదే. చంద్ర బాబునాయుడు భాజపాకి రాంరాం చెప్పగలరా? అవమానాలను సహిస్తూ మౌనంగా మైత్రీబంధంలో కొనసాగుతారా? చాలా జటిలమైన సమస్య.
‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ అన్నది ఎమ్జీ రామచంద్రన్ సిద్ధాంతం (డాక్ట్రిన్). అమెరికాలో రొనాల్డ్ రేగన్ లాగానే ఎమ్జీ రామచంద్రన్ కూడా సినిమాలో విజయఢంకా మోగించి రాజకీయాలలోనూ బావుటా ఎగురవేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడి మాదిరిగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూడా నూటికి నూరుపాళ్ళు ఆచరణవాది. భేషజాలు లేవు. పంతాలూ పట్టింపులూ లేవు. ఇందుకు ఎంజీఆర్ తీసుకున్న కీలకమైన రాజకీయ నిర్ణయాలే నిదర్శనం.
1976లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 1977 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎమ్జీ రామచంద్రన్ నాయక త్వంలో అప్పుడే ఏర్పడిన ఆల్ ఇండియా అన్నా డిఎంకె (ఏఐఏడిఎంకె) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోరాడింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలలోనూ 34 స్థానాలను కాంగ్రెస్-ఏఐఏడిఎంకె గెలుచుకుంది. ఇందులో సగం (17) స్థానాలు ఏఐఏడిఎంకెకి దక్కాయి. దక్షిణాదిన గెలుపొం దిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో ఘోర పరాజయం చెందింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటనే ఎంజీఆర్ జనతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన రెండు మాసాలకే, 1977 జూన్‌లో, తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌తో పొత్తుకు స్వస్తి చెప్పి ఏఐఏడిఎంకె ఒంట రిగా పోరాడి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఆ విధంగా ఎంజీఆర్ మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.
1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రతీకారం తీర్చుకున్నారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎంజీఆర్ విరోధి కరుణానిధితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. అయినా సరే, ఎంజీఆర్ ఒంటరిగా పోరాడి విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి విధేయత ప్రకటించారు. కాంగ్రెస్-ఏఐఏడిఎంకెల బంధం 1987లో ఎంజీఆర్ మర ణించేవరకూ కొనసాగింది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంతో సున్నం వేసుకోవడంలో అర్థం లేదని ఎంజీఆర్ అభిప్రాయం. కేంద్రంతో సఖ్యంగా ఉంటే తమిళనాడులో తన పాలనకు అంతరాయం రాకుండా చూసుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు ఉదారంగా లభిస్తాయి. కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే ఏదో ఒక మిషతో అస్థిరత సృష్టించవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించవచ్చు.
బొమ్మైకేసుతో మలుపు
1994లో బొమ్మైకేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగపీఠం తీర్పు ఇచ్చిన తర్వాత 360వ అధికరణను విచ్చలవిడిగా వినియోగించి రాష్ట్రపతి పాలన విధించడం తగ్గింది. 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం రావడానికి పూర్వం ‘ఆయారాం గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది. 1980లో ఇందిరాగాంధీ పునరాగమనంతో రాష్ట్రాలలోని జనతా ప్రభుత్వాలకు కాలంచెల్లింది. ఆ సమయంలోనే హర్యానాలో భజన్‌లాల్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ‘తెలివిగా’ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారింది- అచ్చం మొన్న అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ భాజపా సర్కార్‌గా మారినట్టు. భజన్‌లాల్ మెజారిటీ జనతా శాసన సభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొన సాగారు.
ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్, అనంతరం కర్ణాటక కాషాయ ఛత్రం కిందికి రావలసిందేనంటూ భాజపా పార్లమెంటు సభ్యుడు కైలాష్ విజయవర్గియా జోస్యం చెప్పారు. మోదీ తలచుకుంటే తెదేపా శాసనసభా పక్షాన్ని చీల్చడం ఏ మాత్రం కష్టం కాదు. చంద్రబాబునాయుడి కంటే నరేంద్ర మోదీ దగ్గర వనరులు అధికంగా ఉంటాయి. ఓటుకు కోట్ల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించవచ్చు. అవినీతి ఆరోపణలపైనా విచారణ చేయించవచ్చు. కేంద్రం తలచుకుంటే ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు. నానాతిప్పలు పడుతున్నవారిని చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఊహాజనితంగా కనిపించ వచ్చును. ఒకసారి తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని, కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులనూ ఉపసంహరించుకొని, ప్రధానమంత్రినీ, కేంద్రప్రభు త్వాన్నీ విమర్శించడం ప్రారంభిస్తే కేంద్రం కాక చంద్రబాబునాయుడికి తగులు తుంది. దోషాలను వెతకడం ప్రారంభిస్తే దొరికిపోవడం ఖాయమని ముఖ్య మంత్రికీ తెలుసు.
అందుకనే సాధ్యమైనంత వరకూ భాజపాను పట్టుకొని వేళ్ళా డటానికే చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తారు. ప్రత్యేక హోదా అంటే సర్వస్వం కాదంటూ, హోదా వచ్చినంత మాత్రాన అంతా స్వర్గధామం కాబో దంటూ, అదే సంజీవని అనుకోవద్దంటూ సన్నాయినొక్కులు నొక్కడం అందుకే. ప్రత్యేక హోదా లేకపోవడమే మంచిదనే విధంగా ప్రచారం చేయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యంలేదు. మొదటి నుంచీ ప్రచారంతోనే జయ ప్రదంగా కొట్టుకొస్తున్నారు. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా అసత్య ప్రచారం చేయించి లబ్ధి పొందడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేననీ, తప్పు లేదనీ తెదేపా అధినేత విశ్వాసం. ఇదీ చాణక్యమేనని నమ్మకం. తెదేపా సంగతి సరే. ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజలు ఏమి చేయాలి? ఎటువంటి ఉద్యమం నిర్మించాలన్నది వారి ఎదుట నిలిచిన ప్రశ్న.
వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి
‘ప్రత్యేక’ పరీక్ష
Published Sun, May 1 2016 9:05 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement