thri kaalam
-
‘ప్రత్యేక’ పరీక్ష
త్రికాలమ్ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలన్న రంధిలో అనైతికంగా వ్యవహరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు అనూహ్యంగా మిత్రపక్షానికి దూరం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదనే సంకేతాలు చాలా కాలంగా వెలువడుతున్నాయి. శుక్రవారంనాడు పార్లమెంటులో దేశీయాంగ సహాయమంత్రి హెచ్‌పి చౌదరి ఒక ప్రైవేటు బిల్లుపైన చర్చకు సమాధానం చెబుతూ, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ప్రసక్తి లేదని తేల్చిచెప్పడంతో ఈ విషయంలో కేంద్రప్రభుత్వ వైఖరి పట్ల అనుమానాలు ఏమైనా ఉంటే అవి పటాపంచలైనాయి. 14వ ఆర్థిక కమిషన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాను సిఫార్సు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు. కొత్త రాష్ట్రానికి అదనపు నిధులు సమకూర్చే విషయం నీతిఆయోగ్ పరిశీలనలో ఉన్నదనీ, నీతిఆయోగ్ నివేదిక అందగానే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనీ మంత్రి చెప్పారు. ప్రత్యేక హోదాకోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగార్థులు, కొండంత ఆశతో నిరీక్షిస్తున్నారు. ప్రత్యేక హోదా ఫలితంగా ఆదాయం పన్నులో, ఎక్సైజ్ సుంకంలో, విద్యుచ్ఛక్తి చార్జీలలో లభించే రాయితీలను దృష్టిలో పెట్టు కొని అనేక కొత్త పరిశ్రమలు వస్తాయనీ, వేల సంఖ్యలో ఉద్యోగావకాశాలు ఏర్పడతాయనీ లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. తెలుగుదేశం పార్టీ (తెదేపా) అధ్యక్షుడు చంద్రబాబునాయుడూ, భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రధాని అభ్యర్థి నరేంద్రమోదీ 2014 ఎన్ని కల బహిరంగ సభలలో ప్రత్యేక హోదాపైన సంయుక్తంగా వాగ్దానం చేశారు. ఎన్నికల ప్రణాళికలో ఈ హామీని పొందుపరిచారు. కేంద్ర పార్లమెంటరీ వ్యవ హారాల మంత్రి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అనేక విడతల హామీలు ఇచ్చారు. నాటి ప్రధాని మన్మోహన్సింగ్ అయిదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఉంటుందంటే అయిదేళ్ళు సరిపోవు పదేళ్ళు కావాలంటూ రాజ్యసభలో పోరాడిన వెంకయ్యనాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రత్యేక హోదా వస్తున్నదనే చెప్పుకుంటూ వచ్చారు. అయిదేళ్ళు అస్సలు సరిపోదు కనీసం పదిహేనేళ్ళయినా ప్రత్యేక హోదా ఉంటే పరిశ్రమలు వచ్చి నిలుస్తాయంటూ చంద్రబాబునాయుడు ఎన్నికలకు ముందూ తర్వాతా మాట్లాడారు. ప్రత్యేక హోదా ప్రసక్తి లేదని కేంద్రం స్పష్టం చేయడం వల్ల చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? ‘రాష్ట్రాన్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రత్యేకహోదా, రైల్వేజోన్, ఆర్థిక సహాయం విషయంలో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది’ అంటూ ముఖ్యమంత్రి నిష్ఠురమాడారు. భాజపా ఎదురుదాడి ముఖ్యమంత్రిపైన ఎదురుదాడి చేయడానికి భాజపా నాయకులు సంకోచిం చడం లేదు. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి ఘాటైన విమర్శలు చేస్తున్నారు. ‘నిధులు ఉదారంగా ఇస్తున్నాం. కానీ ఖర్చుల లెక్కలు చెప్పడం లేదు. కేంద్ర నిధులను వినియోగించే పథకాల పేర్లు మార్చి సొంతడబ్బా కొట్టుకుంటున్నారు’ అన్నారు. రెండు లక్షల ఇళ్ళ నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తే ఆ పథకానికి ‘ఎన్టీఆర్ హౌసింగ్ ప్రోగ్రాం’ అని పేరు పెట్టుకున్నారనీ, గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు నిధులు పంపిస్తే ఆ కార్యక్రమం పేరును ‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు’గా మార్చారనీ భాజపా నాయకుల విమర్శ. ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డిని కలుసుకున్నందుకు కేంద్రమంత్రులను రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు తప్పు పడితే, ‘ప్రతిపక్ష నాయకుడిని కేంద్రమంత్రులు కలుసుకోవడంలో తప్పేముంది?’ అంటూ భాజపా మంత్రి మాణిక్యాలరావు ప్రశ్నించారు. హైదరాబాద్ హైకోర్టు విభజన జరగపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కారణమనీ, ఇందుకు అవసరమైన ప్రాథమిక సదుపా యాలను రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కల్పించవలసి ఉన్నదనీ కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ పార్లమెంటులో చెప్పారు. ‘రాజధానే లేకపోతే హైకోర్టుకు ప్రాథమిక సదుపాయాలు ఎక్కడినుంచి తెస్తాం?’ అంటూ రాష్ట్ర మానవవనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మిత్రపక్షాలు పరస్పరం నిందించుకోవడానికి ఏ మాత్రం సంకోచించడం లేదనీ, రెండు పక్షాల మధ్య దూరం పెరుగుతోందనీ ఈ ఉదంతాలు సూచిస్తున్నాయి. మొదటి నుంచీ నరేంద్రమోదీకీ, చంద్రబాబునాయుడికీ మధ్య సంబంధాలు అంతంత మాత్రమే. మోదీ ఏదీ విస్మరించరూ, క్షమించరూ అంటారు. గుజరాత్లో 2002లో మారణహోమం జరిగినప్పుడు ముఖ్యమంత్రి పదవి నుంచి మోదీని తప్పించాలని పట్టుబట్టిన మిత్రపక్షాలలో తెదేపా ప్రధానమైనది. ఈ మేరకు ఎన్డీఏ సమావేశంలో తీర్మానం రూపొందించడంలో చంద్రబాబునాయుడిది కీలకపాత్ర అంటారు. ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరిగినప్పుడు మోదీ ప్రచారానికి వస్తారని తెలిసి అప్పటి నగర పోలీసు కమిషనర్ కృష్ణారావు ‘మోదీ హైదరాబాద్‌లో అడుగుపెడితే అరెస్టు చేస్తాం’ అని ప్రకటించారు. అప్పుడు అడ్వానీ అడ్డుపడకపోతే మోదీ రాజకీయ జీవితం మరో విధంగా ఉండేది. ఇటీవల చంద్రబాబునాయుడు ప్రధానిని కలిసినప్పుడు ‘నాయుడు గారూ మీరు బలమైన ముఖ్యమంత్రి. గట్టి ముఖ్యమంత్రులు తరచుగా ఢిల్లీకి రారు’ అంటూ వ్యాఖ్యానించారట. చంద్రబాబునాయుడికి ప్రధానమంత్రితో మాట్లాడే అవకాశాలే తక్కువ. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రధానిని కలుసుకునే పరిస్థితి లేదు. పైగా అమిత్ర వైఖరి కనిపిస్తోంది. రాష్ట్రంలో భాజపా నాయకులు తెదేపాతో మైత్రీబంధాన్ని ఎంత త్వరగా తెంచుకుంటే అంత మంచిదని తలపోస్తున్నారు. సొంతంగా ఎదగాలని కలలు కంటున్నారు. అందుకే ఇటీవల వారి మాటలలో పదును పెరిగింది. ‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఏమి చేయాలి? భాజపాతో తెగతెంపులు చేసుకోవాలా? ఇద్దరు కేంద్రమంత్రులను ఉపసంహరించుకోవాలా? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డి శనివారం డిమాండ్ చేసింది కూడా ఇదే. చంద్ర బాబునాయుడు భాజపాకి రాంరాం చెప్పగలరా? అవమానాలను సహిస్తూ మౌనంగా మైత్రీబంధంలో కొనసాగుతారా? చాలా జటిలమైన సమస్య. ‘ఢిల్లీతో పెట్టుకోవద్దు’ అన్నది ఎమ్జీ రామచంద్రన్ సిద్ధాంతం (డాక్ట్రిన్). అమెరికాలో రొనాల్డ్ రేగన్ లాగానే ఎమ్జీ రామచంద్రన్ కూడా సినిమాలో విజయఢంకా మోగించి రాజకీయాలలోనూ బావుటా ఎగురవేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడి మాదిరిగానే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కూడా నూటికి నూరుపాళ్ళు ఆచరణవాది. భేషజాలు లేవు. పంతాలూ పట్టింపులూ లేవు. ఇందుకు ఎంజీఆర్ తీసుకున్న కీలకమైన రాజకీయ నిర్ణయాలే నిదర్శనం. 1976లో ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. 1977 మార్చిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఎమ్జీ రామచంద్రన్ నాయక త్వంలో అప్పుడే ఏర్పడిన ఆల్ ఇండియా అన్నా డిఎంకె (ఏఐఏడిఎంకె) కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోరాడింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలలోనూ 34 స్థానాలను కాంగ్రెస్-ఏఐఏడిఎంకె గెలుచుకుంది. ఇందులో సగం (17) స్థానాలు ఏఐఏడిఎంకెకి దక్కాయి. దక్షిణాదిన గెలుపొం దిన కాంగ్రెస్ పార్టీ ఉత్తరాదిలో ఘోర పరాజయం చెందింది. కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వెంటనే ఎంజీఆర్ జనతా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికలు జరిగిన రెండు మాసాలకే, 1977 జూన్‌లో, తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌తో పొత్తుకు స్వస్తి చెప్పి ఏఐఏడిఎంకె ఒంట రిగా పోరాడి మెజారిటీ స్థానాలు గెలుచుకుంది. ఆ విధంగా ఎంజీఆర్ మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఇందిరాగాంధీ ఎంజీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించి ప్రతీకారం తీర్చుకున్నారు. తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎంజీఆర్ విరోధి కరుణానిధితో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకున్నది. అయినా సరే, ఎంజీఆర్ ఒంటరిగా పోరాడి విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వెంటనే కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి విధేయత ప్రకటించారు. కాంగ్రెస్-ఏఐఏడిఎంకెల బంధం 1987లో ఎంజీఆర్ మర ణించేవరకూ కొనసాగింది. ఏ ప్రాంతీయ పార్టీ అయినా కేంద్రంతో సున్నం వేసుకోవడంలో అర్థం లేదని ఎంజీఆర్ అభిప్రాయం. కేంద్రంతో సఖ్యంగా ఉంటే తమిళనాడులో తన పాలనకు అంతరాయం రాకుండా చూసుకోవచ్చు. కేంద్రం నుంచి నిధులు ఉదారంగా లభిస్తాయి. కేంద్రంతో కయ్యం పెట్టుకుంటే ఏదో ఒక మిషతో అస్థిరత సృష్టించవచ్చు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ప్రయోగించవచ్చు. రాష్ట్రపతి పాలన విధించవచ్చు. బొమ్మైకేసుతో మలుపు 1994లో బొమ్మైకేసులో తొమ్మిదిమంది న్యాయమూర్తుల రాజ్యాంగపీఠం తీర్పు ఇచ్చిన తర్వాత 360వ అధికరణను విచ్చలవిడిగా వినియోగించి రాష్ట్రపతి పాలన విధించడం తగ్గింది. 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టం రావడానికి పూర్వం ‘ఆయారాం గయారాం’ సంస్కృతి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. 1977లో జనతా పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రాలలోని కాంగ్రెస్ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది. 1980లో ఇందిరాగాంధీ పునరాగమనంతో రాష్ట్రాలలోని జనతా ప్రభుత్వాలకు కాలంచెల్లింది. ఆ సమయంలోనే హర్యానాలో భజన్‌లాల్ నాయకత్వంలోని జనతా ప్రభుత్వం ‘తెలివిగా’ కాంగ్రెస్ ప్రభుత్వంగా మారింది- అచ్చం మొన్న అరుణాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ సర్కార్ భాజపా సర్కార్‌గా మారినట్టు. భజన్‌లాల్ మెజారిటీ జనతా శాసన సభ్యులతో కలసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కొన సాగారు. ఉత్తరాఖండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్, అనంతరం కర్ణాటక కాషాయ ఛత్రం కిందికి రావలసిందేనంటూ భాజపా పార్లమెంటు సభ్యుడు కైలాష్ విజయవర్గియా జోస్యం చెప్పారు. మోదీ తలచుకుంటే తెదేపా శాసనసభా పక్షాన్ని చీల్చడం ఏ మాత్రం కష్టం కాదు. చంద్రబాబునాయుడి కంటే నరేంద్ర మోదీ దగ్గర వనరులు అధికంగా ఉంటాయి. ఓటుకు కోట్ల కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించవచ్చు. అవినీతి ఆరోపణలపైనా విచారణ చేయించవచ్చు. కేంద్రం తలచుకుంటే ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు. నానాతిప్పలు పడుతున్నవారిని చూస్తున్నాం. ఇదంతా ఇప్పుడు ఊహాజనితంగా కనిపించ వచ్చును. ఒకసారి తెదేపా భాజపాతో తెగతెంపులు చేసుకొని, కేంద్రం నుంచి ఇద్దరు మంత్రులనూ ఉపసంహరించుకొని, ప్రధానమంత్రినీ, కేంద్రప్రభు త్వాన్నీ విమర్శించడం ప్రారంభిస్తే కేంద్రం కాక చంద్రబాబునాయుడికి తగులు తుంది. దోషాలను వెతకడం ప్రారంభిస్తే దొరికిపోవడం ఖాయమని ముఖ్య మంత్రికీ తెలుసు. అందుకనే సాధ్యమైనంత వరకూ భాజపాను పట్టుకొని వేళ్ళా డటానికే చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తారు. ప్రత్యేక హోదా అంటే సర్వస్వం కాదంటూ, హోదా వచ్చినంత మాత్రాన అంతా స్వర్గధామం కాబో దంటూ, అదే సంజీవని అనుకోవద్దంటూ సన్నాయినొక్కులు నొక్కడం అందుకే. ప్రత్యేక హోదా లేకపోవడమే మంచిదనే విధంగా ప్రచారం చేయించి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసినా ఆశ్చర్యంలేదు. మొదటి నుంచీ ప్రచారంతోనే జయ ప్రదంగా కొట్టుకొస్తున్నారు. ప్రత్యర్థులకు వ్యతిరేకంగా, తనకు అనుకూలంగా అసత్య ప్రచారం చేయించి లబ్ధి పొందడం రాజకీయ ఎత్తుగడలలో భాగమేననీ, తప్పు లేదనీ తెదేపా అధినేత విశ్వాసం. ఇదీ చాణక్యమేనని నమ్మకం. తెదేపా సంగతి సరే. ప్రత్యేక హోదా సాధించేందుకు ప్రజలు ఏమి చేయాలి? ఎటువంటి ఉద్యమం నిర్మించాలన్నది వారి ఎదుట నిలిచిన ప్రశ్న. వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి -
సీట్లు... ఫీట్లు!
త్రికాలమ్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావూ (కేసీఆర్) యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఉత్సవ వాతావరణంలో ఫిరాయింపుదార్లకు కండువాలతో స్వాగతం చెబుతున్నారు. ఇద్దరి ఆశలూ అసెంబ్లీ స్థానాల పెంపుదల మీదనే. ఈ ఆశ నెరవేరకపోతే కేసీఆర్ కంటే చంద్రబాబునాయుడు ఎక్కువ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎందుకు? ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను నానావిధాలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటున్నారు. వారి నియోజక వర్గాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమని సర్దిచెబుతున్నారు? అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి పెరగడం ఖాయం, కనుక 2014లో గెలిచి, పార్టీ ఫిరాయించిన వైఎస్సార్సీపీ శాసనసభ్యుడికీ, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థికీ-ఇద్దరికీ 2019లో టిక్కెట్లు ఇస్తానంటూ నమ్మబలుకుతు న్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్థానాలు సైతం 119 నుంచి 153కు పెరుగు తాయని కేసీఆర్ చెబుతున్నారు. ఈ ఒక్క పని చేసిపెట్టాలంటూ ముఖ్య మంత్రులు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తున్నారు. ఫిరాయింపుదా రులకు నమ్మకం కలిగే విధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కూడా సందర్భం కల్పించుకొని అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయం అంటూ చీటికీమాటికీ ప్రకటనలు చేస్తున్నారు. అయినా శాసన సభ్యులలో అనుమానాలు ఉన్నాయి. ఫిరాయింపులకు ప్రోత్సాహం శనివారంనాడు పసుపు శాలువా కప్పించుకున్న అనంతపురం జిల్లా కదిరి శాస నసభ్యుడు చాంద్ బాషా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్టీ ఫిరాయించిన 13వ వైఎస్ఆర్సీపీ సభ్యుడు. మరి కొందరు శాసనసభ్యులు ఇదే బాటలో ప్రయా ణం చేయవచ్చునని అంటున్నారు. శనివారమే ప్రారంభమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఈ పెడధోరణికి సమాధానం. పార్టీ ఫిరాయింపుల కార ణంగా రాష్ట్రంలో ప్రజా ఉద్యమాన్ని అనివార్యం చేస్తున్న ముఖ్యమంత్రిని ఎవరు నియంత్రించాలి? మొన్ననే సుప్రీంకోర్టు డివిజన్ బెంచి రాష్ట్ర అభివృద్ధిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా ప్రభుత్వానికి హితవు చెప్పింది. చట్టాన్ని అపహాస్యం చేస్తుంటే రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ జోక్యం చేసుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తే బాధితులు ఎవరికి మొరపెట్టుకోవాలి? సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయి 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రులూ శాసనమండలి సభ్యుల చేత సామూహిక ఫిరాయింపులు చేయించి సభాధ్యక్ష పదవులు కైవసం చేసుకున్నారు. రెండు శాసన మండళ్ళలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉండేది. కొద్దివారాలకే అవి అధికార పార్టీల హస్తగతమైనాయి. తెలంగాణలో టీడీపీ శాసనమండలి సభ్యు లందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం కావాలని తీర్మానించారు. ఒక్క చేతి వేళ్ళపైన లెక్కపెట్టడానికి సరిపడని సభ్యులున్న టీఆర్ఎస్- కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఫిరాయింపు ఫలితంగా మెజారిటీ సాధించడమే కాకుండా మండలి అధ్యక్ష స్థానంలో స్వామిగౌడ్‌ను దర్జాగా కూర్చోబెట్టింది. 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షంలో 12 మంది టీఆర్ఎస్లో చేరిపోయారు. తమ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేయాలని అభ్యర్థిస్తూ టీడీపీ శాసనసభా పక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు సభాపతికి లేఖ సమర్పించారు. అయిదుగురు కాంగ్రెస్ శాసనసభ్యులూ, ఇద్దరు వైఎస్ఆర్సీపీ సభ్యులూ, ఇద్దరు బీఎస్పీ సభ్యులూ టీఆర్ఎస్లో చేరిపోయారు. ప్రజాతీర్పు తుంగలో... ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు అవసరార్థం పార్టీ ఫిరాయింపు లను ప్రోత్సహిస్తే అర్థం చేసుకోవచ్చు. ఆపద్ధర్మం అని సమాధానం చెప్పుకో వచ్చు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో కానీ ప్రభుత్వాల సుస్థిరతకు వచ్చిన ఆపదంటూ ఏదీ లేదు. సంఖ్యాబలానికి కొదవలేదు. రాజ్యసభ సీట్లు గెలుచు కోవడం కోసమో, ప్రతిపక్షాలని బలహీనపరచడం కోసమో ఫిరాయింపుల చట్టా నికి తూట్లు పొడుస్తున్నారు. రెండు సంవత్సరాల కిందటే వెలువడిన ప్రజా తీర్పును ఎద్దేవా చేస్తూ ఏ పార్టీ అభ్యర్థినైతే ఓడించి శాసనసభ్యులైనారో ఆ పార్టీలోనే అట్టహాసంగా చేరడం తమకు ఓటు వేసిన ప్రజలను వంచించడమనే ఇంగితం కూడా లేదు. తెలంగాణలో తమ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన టీడీపీ శాసనసభ్యులు టీఆర్ఎస్లో చేరిపోయి ఉండవచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండటం అనేది అసాధ్యం. బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీల వంటి పెద్ద పార్టీలకే ఉత్తరప్రదేశ్ వెలుపల దిక్కులేదు. తెలంగాణలో టీడీపీ బిస్తరు సర్దుకోవచ్చునని మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. క్షేత్ర వాస్తవికతను తెలుసుకున్న చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతానికి స్వస్తి చె ప్పి ఆంధ్రప్రదేశ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు. వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులను టీడీపీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి ఒన గూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. నియోజకవర్గం అభివృద్ధి నిధులను టీడీపీ ఎమ్మెల్యే లేని (వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలున్న) నియోజకవర్గాలలో టీడీపీ పర్యవేక్షకుడి(ఓడిపోయిన అభ్యర్థి)కి ఇస్తూ వచ్చారు. ప్రతిపక్ష శాసనసభ్యుడు అధికార పార్టీలోకి చేరితే నియోజకవర్గం అభివృద్ధి నిధులు శాసనసభ్యుడికి అందుతాయి. ఆ మేరకు టీడీపీని నమ్ముకొని ఉన్న నాయకులకు నష్టం జరుగు తుంది. మనసుకు కష్టం అనిపిస్తుంది. అందుకే వారు వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుల ప్రవేశాన్ని తమదైన శైలిలో ప్రతిఘటిస్తున్నారు. కొత్తగా చేరిన ఆది నారాయణరెడ్డికీ, పాత కాపు రామసుబ్బారెడ్డికీ మధ్య ఘర్షణ, భూమానాగి రెడ్డికీ, శిల్పామోహనరెడ్డికీ మధ్య స్పర్థ ఈ కారణంగానే. చాంద్‌బాషా చేరడం పట్ల కదిరి నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి కందికుంట ప్రసాద్ బహిరంగంగా నిరసన ప్రకటించి ముఖ్యమంత్రి నివాసం నుంచి విసవిసా వెళ్ళిపోవడానికీ ఇదే కారణం. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఫిరాయింపుదారులందరూ తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అధికారపార్టీలోకి లంఘిస్తున్నట్టు ప్రకటి స్తున్నారు. ఏ మాత్రం సంకోచం లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూనే తప్పు చేస్తు న్నట్టు కాకుండా ఏదో ఉదాత్తమైన కార్యక్రమం చేస్తున్నట్టు ఫిరాయింపుదా రులూ, వారి మెడలో కండువాలు వేసే అధినాయకులూ వ్యవహరించడం కాలమహిమ. ఈ పని ఎవరు చేసినా తప్పే- మినహాయింపులు లేకుండా. సీట్లు పెరుగుతాయా? ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆశిస్తున్నట్టు శాసనసభ స్థానాలు పెరుగుతాయా? అటువంటి అవకాశాలు 2026 వరకూ లేవనేది నిపుణుల అభిప్రాయం. చంద్ర బాబునాయుడికి సానుకూలంగా వ్యవహరించే వాతావరణం కేంద్రంలో కనిపిం చడం లేదు. వాజపేయి ప్రధానిగా ఉన్న రోజులు వేరు, నరేంద్రమోదీ హయాం వేరు. మొన్న నౌకావిన్యాసాల వీక్షణంకోసం విశాఖపట్టణం వచ్చిన ప్రధాన మంత్రి తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని మాటవరుసకైనా పలుకరించలేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు చెప్పారు. ఇదివరకటిలాగా ఢిల్లీ ఎప్పుడు పోయినా ప్రధానితో మాట్లాడే అవకాశం చంద్రబాబునాయుడికి ఇప్పుడు లేదు. హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు ఎప్పుడో పోయాయి. పైగా ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరమైన నిధులు అందడం లేదు. అనుకూలమైన నిర్ణ యాలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఉద్దేశం కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించే వైఖరి కానీ కనిపించడం లేదు. అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఫిరాయింపులకు వెసులు బాటు కలిగించే విధంగా చట్టాన్ని సవరించే అసాధారణమైన చొరవను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుందనుకోవడం భ్రమ. ఒక వేళ ఎన్డిఏ సర్కార్ చంద్రబాబునాయుడి అభ్యర్థనను మన్నించాలని నిర్ణయించినప్పటికీ రాజ్యాంగం 170వ అధికరణలోని 3వ సెక్షన్ అడ్డు తగులు తుంది. చట్టసభలలో స్థానాల సంఖ్య 2026 వరకూ మారడానికి వీలులేదంటూ ఈ సెక్షన్ నిర్దేశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం (2014)లోని 26(1)వ సెక్షన్లో శాసనసభ స్థానాల హెచ్చింపునకు సంబంధించి ఈ విధంగా ఉంది: 'Subject to the provisions contained in Article 170 of the Constitution and without prejudice to Section 15 of this Act. the number of seats in the Legislative Assembly of the successor States of Andhra Pradesh and Telangana shall be increased from 175 and 119 to 225 and 153 respectively,. (‘రాజ్యాంగం 170వ అధికరణను దృష్టిలో పెట్టుకొని, అందు లోని 15వ సెక్షన్‌తో నిమిత్తం లేకుండా, విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలలో స్థానాలను 175, 119 నుంచి 225, 153కు పెంచాలి).. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మొదటి వాక్యంలో ఉన్న 'subject to the provision...' అనే మాటలకు బదులు 'not withstanding the provisions...' అని సవరించాలి. కేంద్రం ఎదుట ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సవరణ చేయడం. రెండు- ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయడం. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదిం చాలనీ, అనంతరం మొత్తం 29 రాష్ట్రాలలోనూ 15 రాష్ట్రాల శాసనసభలు అంగీక రిస్తూ తీర్మానించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం వెడుతుందని రాజ్యాంగంలోని 368వ అధికరణ చెబుతున్నది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బలాలను పరిగణనలోకి తీసుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ సహక రిస్తే తప్పించి ఆ బిల్లు ఆమోదం సాధ్యం కాదు. తమ పార్టీ శాసనమండలి సభ్యు లనూ, శాసనసభ్యులనూ ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలకి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయిస్తుంది? పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంచితే మా సంగతి ఏమిటని 2000 సంవత్సరంలోనే ప్రత్యేక ప్రతిపత్తి సాధించిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు అడుగుతాయి. గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు ఎట్లా కూడగట్టాలా అన్నది ఎన్డీఏ ప్రభుత్వం దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల లో చట్టసభల స్థానాలు పెంచడం మోదీ ప్రాథమ్యాల జాబితాలో ఉండదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్న తీరును బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు సైతం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో విమర్శిస్తున్నారు. శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్రం సుముఖంగా లేకపోతే చంద్ర బాబునాయుడు ఏమి చేస్తారు? 2014లో ఓడిపోయిన నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన శాసనసభ్యుడికి టిక్కెట్టు ఇస్తారా, 2014లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థికి ఇస్తారా? తెలంగాణలో ఇటువంటి సమస్య లేదు. టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి గానీ టీఆర్ఎస్కు ఫిరాయించిన శాసన సభ్యులకు 2019 టీఆర్ఎస్ టిక్కెట్లు ఇవ్వడం కష్టం కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో టీఆర్ఎస్కు పెద్దగా బలం లేదు. టిక్కెట్టు కోసం పోటీ పడే నాయకులు తక్కువ. ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశానికి ముందు టీఆర్ఎస్ తరఫున చెప్పుకోదగిన నాయకుడంటూ లేరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాల లోనూ బలమైన నాయకులు ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ముస్లిం, ఎస్సి, కాపు శాసనసభ్యులను ఏరికోరి తమ పార్టీలో చేర్చుకోవడంలో గొప్ప వ్యూహం ఉన్నదని టీడీపీ నాయకులు అంటున్నారు. జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలతో పాటు విజయవాడ, కదిరి నియోజకవర్గాలలోని ముస్లింలతో సహా వైఎస్ఆర్సీపీ ఓటర్లు అందరూ టీడీపీకి వలస వెడతారా? ఎస్సి శాసనసభ్యులతో పాటు ఎస్సి ఓటర్లందరూ ఆ పార్టీ పక్షాన చేరిపోతారా? కె.రామచంద్రమూర్తి -
రైతు రక్షణ యాత్ర
త్రికాలమ్ ‘ఆత్మహత్యలు చేసుకోవద్దు. గౌరవప్రదంగా జీవించే హక్కు మీకు రాజ్యాంగం ఇచ్చింది. ఆత్మహత్య చేసుకునే హక్కు ఇవ్వలేదు. ఆత్మహత్య నేరం. ఇది పోరుగడ్డ. పోరాటం చేసి గెలవాలి కానీ గుండె చెదిరి ఆత్మహత్య చేసుకోవద్దు’. రైతు రక్షణ యాత్ర పేరు మీద శుక్రవారం హైదరాబాద్ నుంచి అయినాపూర్ వెళ్లిన హక్కుల కార్యకర్తలం రైతు సోదరీసోదరులకు విజ్ఞప్తి చేశాం. ‘ఈ రోజు మేం ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద సభలో మాట్లాడి వెళ్లిన తర్వాత ఒక్కరు కూడా ఆత్మహత్యకు ఒడిగట్టకూడదు’ అని ప్రొఫెసర్ హరగోపాల్ గట్టిగా చెప్పారు. ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రాజీవ్ రహదారికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న అయినాపూర్ సాయుధ రైతాంగ పోరాటంలో ముఖ్యమైన కేంద్రం. నక్సలైట్ ఉద్యమంలోనూ ముందు పీటీలో ఉన్న గ్రామం. పోరాటంలో ప్రాణ త్యాగం చేయడమే కానీ ఆత్మహత్య చేసుకోవడం ఈ నేల చరిత్రలో లేదని విద్యావేత్త చుక్కా రామయ్య రైతులకు గుర్తుచేశారు. అప్పుల ఊబిలో కూరుకొని దిక్కులేని స్థితిలో మృత్యువును ఆశ్రయిస్తున్న రైతులకు ఈ ఉద్బోధ మనోధైర్యం ఇస్తుందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఈ గ్రామంలో అయిదుగురు రైతులు బలవన్మరణం పొందారు. ‘పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలూ, వ్యాపారవేత్తలూ వేలకోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకుండా మాఫ్ చేయాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు పడవేసి విలాసవంతంగా జీవిస్తున్నారు. మీరేమో ఒకటి, రెండు లక్షల రూపాయల అప్పు చెల్లించడానికి నిజాయితీగా ప్రయత్నించి విఫలమై అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. మీరేమి తప్పు చేశారు? మీరెందుకు చనిపోవాలి? మీ అప్పు తిరిగి చెల్లించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేయండి’, అంటూ ప్రోత్సహించాం. సంఘీభావం ప్రకటించడం, రైతు ఒంటరి కాదనీ, సమాజం వెంట ఉన్నదనీ నమ్మబలకడం మినహా చేయగలిగింది ఏమున్నది? వ్యవసాయం రైతును బలితీసుకోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానిది. రైతులలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం లోగడ జరగకపోలేదు. ఆత్మహత్యల పరంపర 1995-96లో ప్రారంభమైతే 1998లోనే రైతు సహాయ కమిటీ ఏర్పాటు చేసిన ‘పీపుల్స్ ట్రిబ్యూనల్’ సభ్యులుగా పాత్రికేయుడు ఏబీకే ప్రసాద్, విద్యావేత్త బూర్గుల నరసింగరావు, న్యాయమూర్తి పీఏ చౌదరి, ఐఏఎస్ అధికారులు ఎస్ఆర్ శంకరన్, కేఆర్ వేణుగోపాల్ మెదక్, వరంగల్లు, గుంటూరు, హైదరాబాద్‌లలో బహిరంగ చర్చ (జన్ సున్వాయీ) నిర్వహిం చారు. ప్రొఫెసర్ రమా మెల్కోటే నాటి ట్రిబ్యూనల్ పర్యటనలలోనూ, నేటి రైతు రక్షణ యాత్రలోనూ రైతులను కలుసుకున్నారు. వారి వెతలు విన్నారు. రైతు ఆత్మహత్యలకి కారణాలు అప్పుడూ, ఇప్పుడూ ఒక్కటేనని ఆమె చెబుతున్నారు. శాసనసభలో అర్థవంతమైన చర్చ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రెండు రోజులు పూర్తిగా రైతు ఆత్మహత్యలపైనే చర్చ జరిగింది. తెలంగాణ విత్తనాల కేంద్రమనీ, దాదాపు అయిదు వందలకు పైగా విత్తన కంపెనీలు ఇక్కడ ఉన్నాయనీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) శాసనసభలో చెప్పారు. రైతుల ఆత్మహత్యలు నివారించడానికి విత్తన కంపెనీల యజమానులు ముందుకు వచ్చారనీ, వారితో సోమవారంనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఒక సదస్సు ఏర్పాటు చేశారనీ ముఖ్యమంత్రి అన్నారు. వంగడాలపై సంపాదిస్తున్న లాభాలలో కంపెనీలు సగం త్యాగం చేస్తే రైతులకు మహోపకారం చేసినట్టే. రైతులను పీల్చిపిప్పి చేసేవి వంగడాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాలూ, ప్రైవేటు రుణాలూ. అయినాపూర్‌లో కిలో మక్కలు (మొక్కజొన్న గింజలు) రూ. 30కి కొనుగోలు చేసిన కంపెనీలు ఇమిలాక్లోబ్రిడ్ మందు కలిపి నాలుగు కేజీల చొప్పున సంచులు తయారు చేసి సంచి ధర రూ. 1800లుగా నిర్ణయించి, 50 శాతం సబ్సిడీ (రూ. 900) ప్రభుత్వం నుంచి వసూలు చేసి రైతులకు రూ. 900లకు అమ్ముతున్నాయి. వాస్తవానికి నాలుగు కేజీల సంచీని రూ. 300లకు విక్రయించినా కంపెనీలకు న్యాయమైన లాభం మిగులుతుందని భైరాన్‌పల్లికి చెందిన రైతు ఎడవెల్లి చంద్రారెడ్డి వాదించారు. తనకున్న 25 ఎకరాలలో రెండు ఎకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. మొత్తం ఎనిమిది బోర్లు వేసినా ప్రయోజనం లేకపోయింది. భూగర్భ జలాలు అడుగంటాయి. ఆ ప్రాంతంలో అంతటా ఇదే పరిస్థితి. రైతులు సంఘటితం కావాలి బ్యాంకులు అప్పు ఇవ్వడమే తక్కువ. ఇచ్చినప్పుడు షరతు ఏమంటే ఒక సంవత్సరంలోపు తిరిగి చెల్లిస్తే ఏడు శాతం వడ్డీ వసూలు చేస్తారు. సంవత్సరం దాటితే వడ్డీ 12 శాతం. వడ్డీ వ్యాపారుల సంగతి సరేసరి. గ్రామాలు విధ్వంసం కావడం, సహకార వ్యవస్థ కూలిపోవడంతో సంఘీభావం కొరవడింది. ఒకరి బాధను మరొకరితో పంచుకునే పరిస్థితి లేదు. అప్పులతో సతమతం అవుతున్న రైతును వడ్డీ వ్యాపారి కానీ బ్యాంకు అధికారలు కానీ గట్టిగా నిలదీస్తే అవమాన భారంతో తల్లడిల్లిపోతున్నాడు. భార్యాపిల్లలకి కూడా చెప్పకుండా పురుగుల మందు తాగుతున్నారు లేదా ఉరి వేసుకుంటున్నారు. చావొక్కటే అతనికి కనిపించే పరిష్కారం. సంఘటిత రంగంలో ఉన్న ప్రభుత్వోద్యోగులు వేతనాలు దర్జాగా పెంచుకోగలిగారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర పొందలేక దీనంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేస్తున్నారు. అందుకే రైతులు సంఘం ఏర్పాటు చేసుకోవాలంటూ రైతు జేఏసీ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు యోగేంద్రయాదవ్ శనివారంనాడు రంగారెడ్డి జిల్లాలో పర్యటించి రైతుల స్థితిగతులను విచారించారు. నాలుగు రోజుల కిందట మరో ఆమ్ ఆద్మీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ హైదరాబాద్ వచ్చినప్పుడు రైతుల ఆత్మహత్యలపై వాకబు చేశారు. రైతుల తరఫున పోరాడేవారు సమాజంలో చాలామంది ఉన్నారు. ఒంటరిగా కుమిలిపోయి ప్రాణత్యాగం చేయవలసిన అవసరం లేదని హామీ ఇవ్వడమే తెలంగాణ విద్యావంతుల వేదిక, రైతు జెఏసీ సంయుక్తంగా నిర్వహించిన రైతు రక్షణ యాత్ర లక్ష్యం. అయినాపూర్ సమావేశం తర్వాత రైతు యాత్ర చేర్యాల చేరింది. అక్కడ జరిగిన రైతు సభలో విద్యావంతుల వేదిక నాయకుడు మల్లెపల్లి లక్ష్మయ్య నాలుగు సూత్రాలు ఆధారంగా ఉద్యమం నిర్మించాలని ఉద్బోధించారు. ఒకటి, నకిలీ విత్తనాలు, ఎరువులూ, మందులూ అమ్మే కంపెనీలను మూసివేయడం, ఆ కంపెనీల యజమానులను అరెస్టు చేయడం. రెండు, బ్యాంకులు రైతులను చులకనగా చూడకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించడం, రుణ సౌకర్యం కల్పించడం. మూడు, వ్యవసాయ విస్తరణాధికారుల చేత పని చేయించడం, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయడం, వారి చేత భూసార పరీక్షలు చేయించడం, ఏ భూమిలో ఏ పంట వేయాలో రైతులకు సలహా చెప్పడం వంటి విధులు నిర్వర్తింపజేయడం. వేలంవెర్రిగా పత్తి పండించేందుకు రైతులు శక్తికి మించి అప్పులు చేయడం, పంట నష్టం కావడంతో కుదేలైపోవడం చూస్తున్నాం. ఆత్మహత్య చేసుకున్న రైతులలో తొంభైశాతం మంది పత్తి రైతులే. 2002లో బీటీ (బయోటెక్) పత్తి వంగడాలు దేశంలో ప్రవేశించడంతో వ్యవసాయం జూదమైపోయింది. దళారులు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించి పత్తి కొనుగోలు చేస్తారు కనుక ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ పత్తి పంటే గిట్టుబాటు అవుతుందనే భ్రమలో రైతులు పడిపోయారు. విత్తనాల కంపెనీల వ్యాపార ప్రకటనలు ఈ భ్రమ కల్పించాయి. కౌలు రైతులు సర్వస్వం వొడ్డి పత్తి పండించే ప్రయత్నం చేస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. లోగడ నల్లరేగడి భూములలోనే పత్తి వేసేవారు. ఇప్పుడు ఎక్కడపడితే అక్కడ పత్తి పండిస్తున్నారు. మూల్యం చెల్లిస్తున్నారు. వ్యవసాయ విస్తరణ వ్యవస్థ లేకపోవడంతో విత్తనాల, ఎరువుల, పురుగుమందుల కంపెనీల ప్రతినిధులే రైతుల శ్రేయస్సు కాకుండా కంపెనీ లాభాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు పత్తి వేయమని సలహా ఇస్తున్నారు. నాలుగు, కరువు మాన్యువల్ తయారు చేయడం. మూడు నెలలో నమోదైన వర్షపాతం ఆధారంగా కరువు ఉన్నదీ లేనిదీ నిర్ణయించడం సరి కాదు. భారీ వర్షాలు వచ్చిన సందర్భాలలో కూడా ప్రయోజనం కంటే నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఈ సంవత్సరం అదే జరిగింది. ఖరీఫ్ పంట ఎండిపోయిన తర్వాత వానలు దండిగా పడినాయి. ప్రయోజనం శూన్యం. పంట స్థితినీ, దిగుబడినీ పరిశీలించిన తర్వాత అసవరమైన సహాయసహకారాలను ప్రభుత్వం అందించే విధంగా కరువు మాన్యువల్ ఉండాలి. బ్యాంకు రుణం ఇచ్చినవారికే పంట బీమా (ఇన్సూరెన్స్) ఇస్తున్నారు. తక్కినవారికి ఈ సౌకర్యం అందుబాటులో లేదు. రైతులందరికీ బీమా సౌకర్యం కల్పించే బాధ్యత ప్రభుత్వం స్వీకరించాలి. రైతులను ఆదుకోవడానికి తీసుకోవలసిన తక్షణ చర్యలు ఇవి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకూ ఇది వర్తిస్తుంది. వైద్యం, విద్యలో సర్కార్ ప్రమేయం తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయరంగానికి నిధుల కేటాయింపులు తగ్గుతు న్నాయి. మార్కెట్ స్థిరీకరణకు 2014-15లో రూ. 400 కోట్లు కేటాయిస్తే, ఈ సంవత్సరం రూ. 75 కోట్లకు కుదించారు. అధీకృత సాగుచట్టం 2011లో వచ్చిన తర్వాత కూడా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే కార్యక్రమం మందకొడిగానే సాగుతోంది. గుర్తింపు కార్డులు కలిగిన కౌలు రైతులకు సైతం బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. పత్తి విస్తీర్ణం హెచ్చిన ఫలితంగా కౌలు రైతుల సంఖ్య గణనీయంగా పెరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే కనీసం పది లక్షల మంది కౌలు రైతులు ఉంటారని అంచనా. వీరిలో అత్యధికులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులపైన ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. అప్పులు పెరిగి తీర్చలేక నిస్పృహకు లోనై ఆత్మహత్య చేసుకుంటున్నారు. రుణాలూ, వాటి మాఫీ ఫలితాలూ కూడా హైదరాబాద్‌లో ఉన్న భూమి యజమానులకు అందుతున్నాయి కానీ సేద్యం చేసే కౌలు రైతులకు అందడం లేదు. రూ.4000 కోట్ల మేరకు వ్యవసాయ రుణాలూ, రూ.400 కోట్లు పంటరుణాలు ఒక్క ఎకరం కూడా సాగు చేయని హైదరాబాద్ నగరవాసులకు దక్కుతున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విద్య, ఆరోగ్య రంగం నుంచి ప్రభుత్వం వైదొలగడం కూడా రైతుల ఉసురు తీస్తున్నది. పిల్లల చదువుకోసం, ఆరోగ్యం కోసం రైతు కార్పొరేట్ రంగంపైనే ఆధారపడవలసి వస్తున్నది. ఈ రెండు రంగాలలోకి ప్రభుత్వం తిరిగి రావడం, చెరువులను పునరుద్ధరించడం ద్వారా గ్రామాలకు పాత వైభవం తిరిగి తీసుకురావడం ద్వారా రైతుల బతుకులలో వెలుగు నింపే అవకాశం ఉంది. రైతు సంక్షేమం కోసం కృషి చేయాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అందుకు తగిన వ్యూహాన్ని తయారు చేసుకోవడం కష్టం కాదు. ఆకాశహర్మ్యాల గురించి కాకుండా వ్యవసాయ క్షేత్రాల గురించి ఆలోచించడం తక్షణావసరం. నేల విడిచి సాము చేయడం వివేకవంతుల లక్షణం కాదు. - కె.రామచంద్రమూర్తి