సీట్లు... ఫీట్లు! | andhra pradesh, telangana chief ministers encouraging defection | Sakshi
Sakshi News home page

సీట్లు... ఫీట్లు!

Published Sun, Apr 24 2016 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

సీట్లు... ఫీట్లు!

సీట్లు... ఫీట్లు!

త్రికాలమ్
 
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావూ (కేసీఆర్) యథేచ్ఛగా  ఉల్లంఘిస్తూ ఉత్సవ వాతావరణంలో ఫిరాయింపుదార్లకు కండువాలతో స్వాగతం చెబుతున్నారు. ఇద్దరి ఆశలూ అసెంబ్లీ స్థానాల పెంపుదల మీదనే. ఈ ఆశ నెరవేరకపోతే కేసీఆర్ కంటే చంద్రబాబునాయుడు ఎక్కువ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఎందుకు?
 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులను నానావిధాలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటున్నారు. వారి నియోజక వర్గాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులకు ఏమని సర్దిచెబుతున్నారు? అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 225కి పెరగడం ఖాయం, కనుక 2014లో గెలిచి, పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌సీపీ శాసనసభ్యుడికీ, ఓడిపోయిన తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థికీ-ఇద్దరికీ  2019లో టిక్కెట్లు ఇస్తానంటూ నమ్మబలుకుతు న్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్థానాలు సైతం 119 నుంచి 153కు పెరుగు తాయని కేసీఆర్ చెబుతున్నారు. ఈ ఒక్క పని చేసిపెట్టాలంటూ ముఖ్య మంత్రులు ఇద్దరూ కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తున్నారు. ఫిరాయింపుదా రులకు నమ్మకం కలిగే విధంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్య నాయుడు కూడా సందర్భం కల్పించుకొని అసెంబ్లీ స్థానాలు పెరగడం ఖాయం అంటూ చీటికీమాటికీ  ప్రకటనలు చేస్తున్నారు. అయినా శాసన సభ్యులలో అనుమానాలు ఉన్నాయి.

ఫిరాయింపులకు ప్రోత్సాహం
శనివారంనాడు పసుపు శాలువా కప్పించుకున్న అనంతపురం జిల్లా కదిరి శాస నసభ్యుడు చాంద్ బాషా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పార్టీ ఫిరాయించిన 13వ వైఎస్‌ఆర్‌సీపీ సభ్యుడు. మరి కొందరు శాసనసభ్యులు ఇదే బాటలో ప్రయా ణం చేయవచ్చునని అంటున్నారు.  శనివారమే ప్రారంభమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఈ పెడధోరణికి సమాధానం. పార్టీ ఫిరాయింపుల కార ణంగా రాష్ట్రంలో ప్రజా ఉద్యమాన్ని అనివార్యం చేస్తున్న ముఖ్యమంత్రిని ఎవరు నియంత్రించాలి? మొన్ననే సుప్రీంకోర్టు డివిజన్ బెంచి రాష్ట్ర అభివృద్ధిపైన శ్రద్ధ పెట్టవలసిందిగా ప్రభుత్వానికి హితవు చెప్పింది. చట్టాన్ని అపహాస్యం చేస్తుంటే రాజ్యాంగ పరిరక్షకులైన గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ జోక్యం చేసుకోకుండా ప్రేక్షకపాత్ర పోషిస్తే బాధితులు ఎవరికి మొరపెట్టుకోవాలి?   
 
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయి 2014 జూన్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇద్దరు ముఖ్యమంత్రులూ  శాసనమండలి సభ్యుల చేత  సామూహిక ఫిరాయింపులు చేయించి సభాధ్యక్ష పదవులు కైవసం చేసుకున్నారు. రెండు శాసన మండళ్ళలోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉండేది.  కొద్దివారాలకే అవి అధికార పార్టీల హస్తగతమైనాయి. తెలంగాణలో టీడీపీ శాసనమండలి సభ్యు లందరూ తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం కావాలని తీర్మానించారు. ఒక్క చేతి వేళ్ళపైన లెక్కపెట్టడానికి సరిపడని సభ్యులున్న టీఆర్‌ఎస్- కాంగ్రెస్, టీడీపీ సభ్యుల ఫిరాయింపు ఫలితంగా మెజారిటీ సాధించడమే కాకుండా మండలి అధ్యక్ష స్థానంలో స్వామిగౌడ్‌ను దర్జాగా కూర్చోబెట్టింది. 15 మంది సభ్యులున్న టీడీపీ శాసనసభా పక్షంలో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. తమ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని అభ్యర్థిస్తూ టీడీపీ శాసనసభా పక్షం నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు సభాపతికి లేఖ సమర్పించారు. అయిదుగురు కాంగ్రెస్ శాసనసభ్యులూ, ఇద్దరు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులూ, ఇద్దరు బీఎస్‌పీ సభ్యులూ టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

ప్రజాతీర్పు తుంగలో...
ప్రభుత్వ మనుగడ ప్రమాదంలో పడినప్పుడు అవసరార్థం పార్టీ ఫిరాయింపు లను ప్రోత్సహిస్తే అర్థం చేసుకోవచ్చు. ఆపద్ధర్మం అని సమాధానం చెప్పుకో వచ్చు. తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్‌లో కానీ ప్రభుత్వాల సుస్థిరతకు వచ్చిన ఆపదంటూ ఏదీ లేదు. సంఖ్యాబలానికి కొదవలేదు. రాజ్యసభ సీట్లు గెలుచు కోవడం కోసమో, ప్రతిపక్షాలని బలహీనపరచడం కోసమో ఫిరాయింపుల చట్టా నికి తూట్లు పొడుస్తున్నారు.  రెండు సంవత్సరాల కిందటే వెలువడిన ప్రజా తీర్పును ఎద్దేవా చేస్తూ  ఏ పార్టీ అభ్యర్థినైతే ఓడించి శాసనసభ్యులైనారో ఆ పార్టీలోనే అట్టహాసంగా చేరడం తమకు ఓటు వేసిన ప్రజలను వంచించడమనే ఇంగితం కూడా లేదు.
తెలంగాణలో తమ పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన టీడీపీ శాసనసభ్యులు టీఆర్‌ఎస్‌లో చేరిపోయి ఉండవచ్చు. ఒక ప్రాంతీయ పార్టీ రెండు రాష్ట్రాలలో అధికారంలో ఉండటం అనేది అసాధ్యం. బహుజన సమాజ్, సమాజ్‌వాదీ పార్టీల వంటి పెద్ద పార్టీలకే ఉత్తరప్రదేశ్ వెలుపల దిక్కులేదు. తెలంగాణలో టీడీపీ బిస్తరు సర్దుకోవచ్చునని మొన్నటి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. క్షేత్ర వాస్తవికతను తెలుసుకున్న చంద్రబాబునాయుడు రెండు కళ్ళ సిద్ధాంతానికి స్వస్తి చె ప్పి ఆంధ్రప్రదేశ్‌పైనే దృష్టి కేంద్రీకరించారు.

వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభ్యులను టీడీపీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి ఒన గూరే ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ. నియోజకవర్గం అభివృద్ధి నిధులను టీడీపీ ఎమ్మెల్యే లేని (వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలున్న) నియోజకవర్గాలలో టీడీపీ పర్యవేక్షకుడి(ఓడిపోయిన అభ్యర్థి)కి ఇస్తూ వచ్చారు. ప్రతిపక్ష శాసనసభ్యుడు అధికార పార్టీలోకి చేరితే నియోజకవర్గం అభివృద్ధి నిధులు శాసనసభ్యుడికి అందుతాయి. ఆ మేరకు టీడీపీని నమ్ముకొని ఉన్న నాయకులకు నష్టం జరుగు తుంది. మనసుకు కష్టం అనిపిస్తుంది. అందుకే వారు వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభ్యుల ప్రవేశాన్ని తమదైన శైలిలో ప్రతిఘటిస్తున్నారు.

కొత్తగా చేరిన ఆది నారాయణరెడ్డికీ, పాత కాపు రామసుబ్బారెడ్డికీ మధ్య ఘర్షణ, భూమానాగి రెడ్డికీ, శిల్పామోహనరెడ్డికీ మధ్య స్పర్థ ఈ కారణంగానే. చాంద్‌బాషా చేరడం పట్ల కదిరి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి కందికుంట ప్రసాద్ బహిరంగంగా నిరసన ప్రకటించి ముఖ్యమంత్రి నివాసం నుంచి విసవిసా వెళ్ళిపోవడానికీ ఇదే కారణం. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఫిరాయింపుదారులందరూ  తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమే అధికారపార్టీలోకి లంఘిస్తున్నట్టు ప్రకటి స్తున్నారు. ఏ మాత్రం సంకోచం లేకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూనే తప్పు చేస్తు న్నట్టు కాకుండా ఏదో ఉదాత్తమైన కార్యక్రమం చేస్తున్నట్టు ఫిరాయింపుదా రులూ, వారి మెడలో కండువాలు వేసే అధినాయకులూ  వ్యవహరించడం కాలమహిమ. ఈ పని ఎవరు చేసినా తప్పే- మినహాయింపులు లేకుండా.
 
సీట్లు పెరుగుతాయా?

ఇద్దరు ముఖ్యమంత్రులూ ఆశిస్తున్నట్టు శాసనసభ స్థానాలు పెరుగుతాయా? అటువంటి అవకాశాలు 2026 వరకూ లేవనేది నిపుణుల అభిప్రాయం. చంద్ర బాబునాయుడికి సానుకూలంగా వ్యవహరించే వాతావరణం కేంద్రంలో  కనిపిం చడం లేదు. వాజపేయి ప్రధానిగా ఉన్న రోజులు వేరు, నరేంద్రమోదీ హయాం వేరు. మొన్న నౌకావిన్యాసాల వీక్షణంకోసం విశాఖపట్టణం వచ్చిన ప్రధాన మంత్రి తన పక్కనే ఉన్న ముఖ్యమంత్రిని మాటవరుసకైనా పలుకరించలేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు చెప్పారు. ఇదివరకటిలాగా ఢిల్లీ ఎప్పుడు పోయినా ప్రధానితో మాట్లాడే అవకాశం చంద్రబాబునాయుడికి ఇప్పుడు లేదు. హైదరాబాద్‌లో ఉండి

ఢిల్లీలో చక్రం తిప్పే రోజులు ఎప్పుడో పోయాయి. పైగా ఆంధ్రప్రదేశ్‌కు అత్యవసరమైన నిధులు అందడం లేదు. అనుకూలమైన నిర్ణ యాలు జరగడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చే ఉద్దేశం కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించే వైఖరి కానీ కనిపించడం లేదు. అటువంటి పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఫిరాయింపులకు వెసులు బాటు కలిగించే విధంగా చట్టాన్ని సవరించే అసాధారణమైన చొరవను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తుందనుకోవడం భ్రమ.
 
ఒక వేళ ఎన్‌డిఏ సర్కార్ చంద్రబాబునాయుడి అభ్యర్థనను మన్నించాలని నిర్ణయించినప్పటికీ రాజ్యాంగం 170వ అధికరణలోని 3వ సెక్షన్ అడ్డు తగులు తుంది. చట్టసభలలో స్థానాల సంఖ్య 2026 వరకూ మారడానికి వీలులేదంటూ ఈ సెక్షన్ నిర్దేశిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం (2014)లోని 26(1)వ సెక్షన్‌లో  శాసనసభ స్థానాల హెచ్చింపునకు సంబంధించి ఈ విధంగా ఉంది: 'Subject to the provisions contained in Article 170 of the Constitution and without prejudice to Section 15 of this Act. the number of seats in the Legislative Assembly of the successor States of Andhra Pradesh and Telangana shall be increased from 175 and 119 to 225 and 153 respectively,. (‘రాజ్యాంగం 170వ అధికరణను దృష్టిలో పెట్టుకొని, అందు లోని 15వ సెక్షన్‌తో నిమిత్తం లేకుండా, విభజన తర్వాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలలో స్థానాలను 175, 119 నుంచి 225, 153కు పెంచాలి).. ఈ చట్టాన్ని అమలు చేయాలంటే మొదటి వాక్యంలో ఉన్న 'subject to the provision...' అనే మాటలకు బదులు 'not withstanding the provisions...' అని సవరించాలి.

కేంద్రం ఎదుట ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి- ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సవరణ చేయడం. రెండు- ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయడం. రాజ్యాంగ సవరణ బిల్లును లోక్ సభలో, రాజ్యసభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు ఆమోదిం చాలనీ, అనంతరం మొత్తం 29 రాష్ట్రాలలోనూ 15 రాష్ట్రాల శాసనసభలు అంగీక రిస్తూ తీర్మానించిన తర్వాతనే రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం వెడుతుందని  రాజ్యాంగంలోని  368వ అధికరణ చెబుతున్నది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న బలాలను పరిగణనలోకి తీసుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లుకు కాంగ్రెస్ సహక రిస్తే తప్పించి ఆ బిల్లు ఆమోదం సాధ్యం కాదు.

తమ పార్టీ శాసనమండలి సభ్యు లనూ, శాసనసభ్యులనూ ఫిరాయింపులకు ప్రోత్సహించిన టీడీపీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వాలకి సహకరించాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిర్ణయిస్తుంది? పైగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో శాసనసభ స్థానాలు పెంచితే మా సంగతి ఏమిటని 2000 సంవత్సరంలోనే ప్రత్యేక ప్రతిపత్తి సాధించిన ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాలు అడుగుతాయి. గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ) బిల్లు ఆమోదానికి కాంగ్రెస్ మద్దతు ఎట్లా కూడగట్టాలా అన్నది ఎన్‌డీఏ ప్రభుత్వం దృష్టిలో అత్యంత ముఖ్యమైన అంశం. ఆంధ్రప్రదేశ్, తెలం గాణ రాష్ట్రాల లో చట్టసభల స్థానాలు పెంచడం మోదీ ప్రాథమ్యాల జాబితాలో ఉండదు. ఆంధ్ర ప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపులను ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్న తీరును బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు సైతం పరోక్షంగానో, ప్రత్యక్షంగానో  విమర్శిస్తున్నారు.
 
శాసనసభ స్థానాలు పెంచేందుకు కేంద్రం సుముఖంగా లేకపోతే చంద్ర బాబునాయుడు ఏమి చేస్తారు? 2014లో ఓడిపోయిన నియోజకవర్గాలలో వైఎస్‌ఆర్‌సీపీ నుంచి ఫిరాయించిన శాసనసభ్యుడికి టిక్కెట్టు ఇస్తారా, 2014లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థికి ఇస్తారా?  తెలంగాణలో ఇటువంటి సమస్య లేదు.  టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి గానీ టీఆర్‌ఎస్‌కు ఫిరాయించిన శాసన సభ్యులకు 2019 టీఆర్‌ఎస్ టిక్కెట్లు ఇవ్వడం కష్టం కాదు. ఎందుకంటే ఆ నియోజకవర్గాలలో టీఆర్‌ఎస్‌కు పెద్దగా బలం లేదు. టిక్కెట్టు కోసం పోటీ పడే నాయకులు తక్కువ.

ఉదాహరణకు ఖమ్మం జిల్లాలో తుమ్మల నాగేశ్వరరావు ప్రవేశానికి ముందు టీఆర్‌ఎస్ తరఫున చెప్పుకోదగిన నాయకుడంటూ లేరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి వేరు. టీడీపీకి దాదాపు అన్ని నియోజకవర్గాల లోనూ బలమైన నాయకులు ఉన్నారు. వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన ముస్లిం, ఎస్‌సి, కాపు శాసనసభ్యులను ఏరికోరి తమ పార్టీలో చేర్చుకోవడంలో గొప్ప వ్యూహం ఉన్నదని టీడీపీ నాయకులు అంటున్నారు. జలీల్‌ఖాన్, చాంద్‌బాషాలతో పాటు విజయవాడ, కదిరి నియోజకవర్గాలలోని ముస్లింలతో సహా వైఎస్‌ఆర్‌సీపీ ఓటర్లు అందరూ టీడీపీకి వలస వెడతారా? ఎస్‌సి శాసనసభ్యులతో పాటు ఎస్‌సి ఓటర్లందరూ ఆ పార్టీ పక్షాన చేరిపోతారా?

కె.రామచంద్రమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement