త్రికాలమ్
ఉత్తరాదిలో చలి ఎముకలు కొరుకుతున్నప్పటికీ రాజకీయాలు మాత్రం వేడెక్కుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్నాయి. గెలు పోటములపైన దేశ ప్రజలలో ఇప్పటికే చర్చ జరుగుతున్నది. ప్రధానిగా నరేంద్రమోదీ మరోసారి ప్రమాణం చేస్తారా? కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దేశాన్ని నడిపించగల శక్తిసామర్థ్యాలు ఉన్నాయా? ఒక వేళ బీజేపీకి సీట్లు బాగా తగ్గితే, లోగడ సోనియాగాంధీకి ఇచ్చిన గౌరవం కాకలు తీరిన ప్రాంతీ యపార్టీల నాయకులు ఇప్పుడు రాహుల్‌గాంధీకి ఇస్తారా? ఉత్తరప్రదేశ్ (యూపీ) రాజకీయాలు ఎట్లా ఉంటాయి? బిహార్‌లో లాలూప్రసాద్ పట్ల సానుభూతి పవనాలు వీస్తున్నాయా? యూపీ, బిహార్‌ల ఫలితాలæ ప్రభావం జాతీయ రాజకీయాలపై ఎట్లా ఉంటుంది? ఎక్కడ విన్నా ఇదే చర్చ.
మలుపు తిప్పే రోజు
శనివారం దేశ రాజకీయ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యం సంతరించుకున్న రోజు. యూపీ రాజకీయాలను మలుపు తిప్పే విధంగా సమాజ్‌వాదీపార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లు ఎన్నికల పొత్తు కుదుర్చుకు న్నాయి. బీఎస్పీ అధినేత మాయావతి, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్‌యాదవ్‌లు సంయుక్తంగా మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. యూపీలో ఉన్న 80 లోక్ సభ స్థానాలలోనూ చెరి 38 స్థానాలకు పోటీ చేస్తామనీ, రెండు కాంగ్రెస్‌పార్టీకి వదులుతామనీ చెప్పారు. మిగిలిన రెండు అజిత్‌సింగ్ నాయ కత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆరెల్డీ)కి కేటాయించాలని నిర్ణయం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తెగేసి చెప్పారు. బీఎస్పీ–కాంగ్రెస్ కూటమి 1996లో ఓడిపోయింది.
2017లో ఎస్పీ–కాంగ్రెస్ కూటమి పరాజయం చెందింది. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు నష్టదాయకమని మాయావతి, అఖిలేష్ తీర్మా నించుకున్నారు. నిన్ననే ఢిల్లీలోని రాంలీలా మైదానంలో బీజేపీ జాతీయ మండలి విస్తృత సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పైనా, సోని యాగాంధీ కుటుంబంపైనా ధ్వజమెత్తారు. సుదీర్ఘమైన, ప్రభావవంతమైన ప్రసంగంతో రాబోయే పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ ప్రచారానికి తెరదీశారు. అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లనూ, సర్జికల్‌దాడులనూ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌సీ)నీ, గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)నీ, రామ మందిరం నిర్మాణాన్నీ ఎన్నికల ప్రచారాంశాలుగా చేయబోతున్నట్టు సంకేతం ఇచ్చారు. మచ్చలేని ప్రభుత్వం భారతదేశ చరిత్రలో తనదేనంటూ ప్రకటిం చుకున్నారు.
రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలు విషయంలో అవినీతి లవ లేశమైనా లేదంటూ ఈ దేశంలో పసిబాలలను అడిగినా చెబుతారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ని ఆంధ్రప్రదేశ్‌లోకీ, పశ్చిమబెంగాల్‌లోకీ, ఛత్తీస్ గఢ్‌లోకీ ప్రవేశించనీయబోమని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయిం చడం చట్టవిరుద్ధమంటూ విమర్శించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో సీబీఐ తననూ, అమిత్‌షానూ వేటాడినప్పటికీ (అమిత్‌షా జైలులో కూడా ఉన్నారు) ఆ సంస్థను గౌరవించామే కానీ ఎన్నడూ గుజరాత్‌లోకి ప్రవేశం నిషేధించలేదని గుర్తు చేశారు. రాజ్యాంగం సర్వోన్నతమైనదనీ, అంద రికీ శిరోధార్యమనీ చెప్పారు. మాయావతి–అఖిలేష్ ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, కూటములు ఏర్పాటు చేసుకొని దేశాన్ని కొల్లగొట్టాలని ప్రయత్నించేవారు.
తమ సహాయసహకారాలపైన ఆధారపడే ‘మజ్బూర్ సర్కార్’ కావాలని కోరుకుం టారనీ, దేశ ప్రగతిని ఆకాంక్షించేవారు పటిష్టమైన, స్థిరమైన ‘మజ్బూత్ సర్కార్’ ఉండాలని ఆశిస్తారనీ మోదీ ఉద్ఘాటించారు. రామమందిరం నిర్మా ణానికి న్యాయస్థానాలలో అవరోధాలు సృష్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయ త్నిస్తున్నదని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, హిందూమహాసభ వంటి సంస్థలు ప్రభుత్వంపైన మందిర నిర్మాణం విషయంలో ఒత్తిడి తెస్తున్నాయి. ‘అభీ నహీ తో కభీ నహీ (ఇప్పుడు కాకపోతే ఎప్పటికీ కాదు)’ అంటూ నినాదాలు చేస్తు న్నాయి. సుప్రీంకోర్టు నిర్ణయం కోసం ఎదురు చూడకుండా సుగ్రీవాజ్ఞ (ఆర్డి నెన్స్) ద్వారా రామాలయం నిర్మించాలని కోరుతున్నాయి. సర్వోన్నత న్యాయ స్థానం తీర్పు వెలువడిన తర్వాతనే మందిరం విషయంలో ముందడుగు వేస్తా మని మోదీ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌పైన నిందమోప డానికి ఈ అంశాన్ని మోదీ సంపూర్ణంగా వినియోగించుకోబోతున్నారు.
హిందూత్వ ప్రభావం ఒక్కటే గెలిపించదు
హిందూత్వ ప్రచారం ముమ్మరం చేసినప్పటికీ మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్టీఏ)కి లేదని బీజేపీ నాయ కత్వం గ్రహించింది. 2014లో యూపీఏ పదేళ్ళ పాలన పట్ల వ్యతిరేకత ఉండేది. ఇప్పుడు ఎన్‌డీఏ పాలనపైన కూడా ఎంతోకొంత వ్యతిరేకత ఉంది. అందుకే కొత్త మిత్రులకోసం అన్వేషణ. తమిళనాడులో డిఎంకె, ఏఐఏడి ఎంకెలతో, రజనీకాంత్ పార్టీతో ఒప్పందానికి సిద్ధంగా ఉన్నామంటూ స్వయంగా మోదీ అన్నారు. తాము బీజేపీతో పొత్తుకు సుముఖంగా లేమంటూ డిఎంకే, ఏఐఏడిఎంకేలు స్పష్టం చేశాయి. రజనీకాంత్ ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో యూపీలో పరిస్థితులు తారుమారైతే ఎన్టీఏ మనుగడ కష్టం. యూపీలో ఇదివరకటి కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తామనీ, 74 స్థానాలు గెలిచి చూపిస్తామనీ బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా డాంబికం ప్రదర్శించినా క్షేత్రవాస్తవికత ఇందుకు భిన్నం.
2018 మార్చిలో గోర ఖ్‌పూర్, ఫుల్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలలో ఎస్పీ అభ్యర్థులు బీఎస్పీ మద్దతుతో బీజేపీ అభ్యర్థులను ఓడించారు. నిరుడు మేలో కైరానా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో ఆరెల్డీ అభ్యర్థి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల సమష్టి మద్దతుతో బీజేపీ అభ్యర్థిని ఓడగొట్టారు. ఎస్పీ, బీఎస్పీ భుజం కలిపితే బీజేపీకి నష్టం జరుగుతుందనే అవగాహన మోదీకి లేకపోలేదు. విధానాలూ, సూత్రాలూ ప్రాతిపదిక కాకుండా కేవలం ఒకేఒక వ్యక్తిని ఓడించేందుకు కూట ములు ఏర్పడుతున్నాయంటూ మోదీ విమర్శించడం అందుకే. ఈ కూటము లకు ‘ఒక నేత లేడు. ఒక నీతి లేదు’ అంటూ, రాబోయేది మూడో పానిపట్టు యుద్ధమంటూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు పొంతన లేనివే అయినా జరగబోయే ఎన్నికలు దేశానికి దిశానిర్దేశం చేస్తాయని మాత్రం నిశ్చయంగా చెప్పవచ్చు. బీహార్, యూపీలు ఎన్టీఏ పతనానికి బాట వేస్తాయని లాలూ ప్రసాద్ తనయుడు, ఆర్జేడీ అధినేత తేజశ్వియాదవ్ వ్యాఖ్యానించారు. దీనిని ఉత్తరకుమారుడి ప్రేలాపన అంటూ కొట్టివేస్తే గోడమీది రాతను చదవడానికి నిరాకరించినట్టే.
ఉత్తరప్రదేశ్ ఒక ప్రయోగశాల. అక్కడ అన్ని రకాల ప్రయోగాలూ జరిగాయి. బిహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ లాగానే యూపీలో సోషలిస్టు నాయకుడు ములాయంసింగ్ యాదవ్ ఎస్పీని నెలకొల్పారు. యాదవులనూ, ఇతర వెనుకబడిన కులాలవారినీ, ముస్లింలనూ ఒక తాటిపైకి తెచ్చారు. దళిత మేధావి, దార్శనికుడు కాన్షీరాం దళితులకోసం ప్రత్యేకంగా బీఎస్పీని ఆవి ష్కరించారు. 1989లో ములాయం మొదటిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. 1991లో గద్దె దిగారు. బీజేపీ నాయకుడు కల్యాణ్‌సింగ్ పగ్గాలు చేపట్టారు. అయోధ్య ఉద్యమం, రథయాత్ర, బాబరీ మసీదు విధ్వంసం ఫలితంగా బలం పుంజుకొని బీజేపీ జోరుమీదున్నది. బాబరీ మసీదు కూల్చి వేసిన వెంటనే నాటి ప్రధాని పీవీ నరసింహారావు నాలుగు రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించారు. అనంతరం 1993లో జరిగిన ఎన్నికలలో బీజేపీని నిలువరించడం కోసం కాన్షీరాం ములాయం సింగ్‌లు పొత్తు పెట్టుకున్నారు.
ఒక పార్టీ ఓట్లు మరో పార్టీకి బదిలీ అయ్యాయి. ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. బీజేపీకి 177 స్థానాలు లభిస్తే ఎస్పీ–బీఎస్పీ కూటమికి 176 స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ మద్దతుతో ములాయంసింగ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1995లో ములాయంసింగ్ ప్రభు త్వానికి బీఎస్పీ మద్దతు ఉపసం హరించుకున్నది. అప్పటికే మాయావతి చేతు ల్లోకి బీఎస్పీ పూర్తిగా వచ్చింది. మద్దతు ఉపసంహరించుకున్నందుకు నిరసనగా మాయావతి బసచేసిన అతిథిగృహాన్ని ఎస్పీ కార్యకర్తలు ముట్టడించారు. మాయావతి గదిలో తలు పులు వేసుకొని ఉన్నారు. అప్పుడు బీజేపీ శాసనసభ్యుడు బ్రహ్మదత్ ద్వివేదీ మాయావతిని కాపాడి గవర్నర్ బంగ్లాకు తీసుకొని వెళ్ళారు. అక్కడి నుంచే అటల్‌బిహారీ వాజపేయితో మాట్లాడి మాయావతికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. బీజేపీ మద్దతుతో తొలివిడత ముఖ్యమంత్రిగా మాయావతి ప్రమాణం చేశారు.
దేశంలో ఒక దళిత మహిళ ఒక (అతిపెద్ద) రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అదే ప్రథమం. ప్రజాస్వామ్యంలో జరిగే అద్భుతం ఇది (ఐ్ట జీట్చ ఝజీట్చఛిl్ఛ జీn ఛ్ఛీఝౌఛిట్చఛిy) అని నాటి ప్రధాని పీవీ వ్యాఖ్యానించారు. 1997, 2002లో కూడా మాయావతి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి కాగలిగారు. 2003లో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవ డంతో ఆమె రాజీనామా చేశారు. 2003 నుంచి 2007 వరకూ తిరిగి ములా యంసింగ్ యాదవ్ ముఖ్యమంత్రి. మళ్ళీ మాయావతి 2007 నుంచి 2012 వరకూ పూర్తి కాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 2012లో అఖిలేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2017లో ఎస్పీ–కాంగ్రెస్ కూట మిని మట్టికరిపించి బీజేపీ అఖండ విజయం సాధించింది.
25 ఏళ్ళ తర్వాత ఎస్పీ–బీఎస్పీ కూటమి
2018లో మరో అరుదైన పరిణామం సంభవించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాజీనామా ఫలితంగా ఖాళీ అయిన గోరఖ్‌పూర్ లోక్‌సభ స్థానా నికీ, ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ ఖాళీ చేసిన ఫుల్‌పూర్ స్థానానికీ ఉపఎన్నికలు వచ్చాయి. రెండు స్థానాలలోనూ ఎస్పీ అభ్యర్థులను బీఎస్పీ బలపరిచింది. ఎస్పీ అభ్యర్థులు గెలుపొందారు. ఆ సందర్భంలో అఖిలేష్ లక్నోలో మాయావతి నివాసానికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు. అంటే, అతిథిగృహాన్ని ఎస్పీ కార్యకర్తలు ముట్టడించిన తర్వాత 24 సంవత్సరాలకు తిరిగి ఎస్పీ, బీఎస్పీ నాయకులు స్నేహపూర్వకంగా కలుసుకున్నారు.
ఎస్పీ–బీఎస్పీ కూటమిని ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్లు తెచ్చారు. ఇది బీజేపీ యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలలో బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుందని భావిస్తున్నారు. ఈ రిజర్వేషన్ కారణంగా అగ్రవర్ణాల పట్ల దళితులకూ, వెనుకబడినవర్గాలకూ వ్యతిరేకత పెరుగుతుంది. సరిగ్గా పాతికేళ్ళ కిందట ఎస్పీ, బీఎస్పీ మొదటి దఫా పొత్తు పెట్టుకున్నప్పుడు ఎటువంటి పరిస్థితి ఉన్నదో ఇప్పుడూ అదే వాతావరణం ఉండటం యాదృచ్ఛికం. యోగి పాలనలో ఠాకూర్లదీ, ఇతర అగ్రవర్ణాలదే పెత్తనం. దళితులపైనా, ముస్లిం లపైనా దాడులు పెరిగిపోయాయి.
అయినప్పటికీ, బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదు. దళితులలో జాతవ్ కులానికి మాయావతి తిరుగులేని నాయకురాలు. తక్కిన దళితులను బీజేపీ 2014లో, 2017లో సమీకరించి మాయావతిని ఓడించింది. వెనుకబడిన కులాలలో యాదవులు అఖిలేష్‌కి విధేయులు. తక్కిన వెనుకబడిన కులాలను ఎస్పీకి దూరం చేసి ఎస్పీ–కాంగ్రెస్ కూటమిని బీజేపీ 2017లో ఓడించింది. అదే ప్రయత్నం ఇప్పుడూ చేస్తారు. దళితుల ఓట్లు ఎస్పీ అభ్యర్థులకు పడే విధంగా మాయావతి కట్టడి చేయగలరు. కానీ యాద వులందరూ బీఎస్పీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారని పూచీ లేదు. 2014లో బీజేపీ స్వయంగా 71 స్థానాలు గెలుచుకున్నది. ఎస్పీకి అయిదూ, కాంగ్రెస్‌కు రెండూ దక్కాయి.
బీఎస్పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. బీజేపీ మిత్ర పక్షమైన అప్నాదళ్ రెండు స్థానాలు కైవసం చేసుకున్నది. అయిదేళ్ళ కిందట జరిగిన పోలింగ్ సరళిని గమనంలోకి తీసుకొని ఆరెల్డీని కూడా కూటమిలో కలిపితే ఎస్పీ–బీఎస్పీకి ఆధిక్యం ఉండే సీట్ల సంఖ్య 42. కాంగ్రెస్‌ని సైతం ఈ కూటమిలో చేర్చుకుంటే దాదాపు 58 స్థానాలలో కూటమికి పైచేయి ఉంటుందని అంచనా. ముఖ్యంగా ముస్లిం ఓట్లు చీలకుండా సంఘటితంగా ఉంటాయి. ఎస్పీ–బీఎస్పీ వదిలే రెండు సీట్లు కాంగ్రెస్ ఎట్లాగయినా గెలు చుకుంటుంది.
2009 లోక్‌సభ ఎన్నికలలో యూపీలో కాంగ్రెస్ 22 నియో జకవర్గాలలో విజయం సాధించింది. 2014లో పదేళ్ళ ప్రభుత్వ వ్యతిరేకత, మోదీ ప్రభంజనం ఫలితంగా రెండు స్థానాలే దక్కాయి. కాంగ్రెస్‌ను కలు పుకోకపోతే ముక్కోణపు పోటీ జరుగుతుంది. బీజేపీకి లాభం. ఎన్నికలు ఇంకా మూడు మాసాలు ఉన్నాయి. బీజేపీ చేతులు కట్టుకొని కూర్చోదు. రాహు ల్‌గాంధీ ప్రయాగలో అర్ధకుంభమేళాకు వెళ్ళకుండా ఉండరు. ఇంకా అనేక పరిణామాలు సంభవిస్తాయి. ఇప్పుడే ఒక అంచనాకు రావడం తొందరపాటు అవుతుంది.
కె. రామచంద్ర మూర్తి
Comments
Please login to add a commentAdd a comment