
గ్రంథావిష్కరణ చేస్తున్న పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, సుద్దాల, మాశర్మ, డీవీ సూర్యారావు, పైడా కృష్ణప్రసాద్
విశాఖ సిటీ: పాతతరం కవులు రచించిన పద్యాలు నేటితరం కవులకు మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఆదివారమిక్కడ జరిగిన కొప్పరపు కవుల జయంతి సభలో మాట్లాడిన వక్తలు అభిప్రాయపడ్డారు. కొప్పరపు కవుల జయంతిని పురస్కరించుకుని 120 ఏళ్ల కొప్పరపు కవుల కవితా ప్రస్థాన సభను విశాఖలోని పౌరగ్రంథాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పరపు కవుల పీఠం వ్యవస్థాపకుడు మాశర్మ సేకరించి ముద్రించిన కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం గ్రంథాన్ని ఆవిష్కరించారు.
సభాధ్యక్షత వహించిన సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. ఆరురోజుల వ్యవధిలో వందేళ్ల కథకు వందనాలు, కొప్పరపు కవుల సాహిత్య సర్వస్వం అనే రెండు బృహత్ గ్రంథాల విడుదలలో భాగస్వాముడినవడాన్ని అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలుగును పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరి చేయాలనే ఉద్యమం ప్రస్తుతం నడుస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోందని, ఏపీలోనూ తెలుగును తప్పనిసరి చేయాల్సిన అవసరముందని చెప్పారు.
ప్రెస్ అకాడెమీ పూర్వ అధ్యక్షుడు పొత్తూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలుగువారి సొత్తయిన అవధాన విద్యను సుసంపన్నం చేసిన పథ నిర్దేశకులు కొప్పరపు కవులని కొనియాడారు. ప్రముఖ కవి, గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ.. పాతతరం కవులు సూర్యుడి లాంటివారని, వారు వేసిన వెలుగుల దారుల్లో నేటితరం కవులు పయనిస్తున్నారన్నారు.