సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కవులు రచనలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నగరంలో జరుగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను కవిత ఆదివారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి స్టాల్‌ను ప్రారంభించారు. అలిశెట్టి ప్రభాకర్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కవి, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’పుస్తకంపై జరిగిన చర్చా కార్యక్రమంలో కవిత మాట్లాడారు.
‘దేశంలో ఫాసిస్ట్ పాలన సాగుతున్న నేపథ్యంలో కవులు, కళాకారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన సమయం వచ్చింది. మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సురవరం ప్రతాప్‌రెడ్డి నుంచి ఆ పరంపర కొనసాగుతోంది. అనేక మంది గొప్ప కవుల వారసత్వాన్ని తెలంగాణ పుణికిపుచ్చుకుంది. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ రచించిన ‘వల్లంకి తాళం’రచన కూడా అంతే అద్భుతంగా ఉంది’అని ఆమె చెప్పారు.
పనిలోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారని.. అదే ఒరవడితో తెలంగాణలో కూడా కష్టాలు, శ్రమలోంచి వారి రచనలు ఉంటాయని అన్నారు. ఈ రచనలే ఇక్కడి సాహిత్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌గా తెలుగు ఖ్యాతిపొందిందని పేర్కొన్నారు. మట్టితనాన్ని, శ్రమతత్వాన్ని అణువణువునా పొందుపరిచి కవిత్వం రాయడంగోరటి వెంకన్న ప్రత్యేకతని కొనియాడారు.
చిన్న చిన్న పదాలతో అద్భుతంగా రాయడంతోపాటు అడవి గురించి తన ఆకుపచ్చ కోవెలతో పోల్చడం అద్భుతమైన అంశమన్నారు. అందుకే నల్లమలలో యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఇలాంటి కవి పుట్టిన ఈ కాలంలో తాను పుట్టినందుకు గర్వంగా ఉందని, ఆయనతోపాటు కౌన్సిల్‌లో కూర్చోవడం సంతోషంగా ఉందని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ప్రదర్శనలో వివిధ స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించిన కవిత.. సాహిత్యం, కథలు, పిల్లల పుస్తకాలను కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment