national book fair
-
పుస్తకం.. ఓ బహుమానం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జాతీయ పుస్తక మహోత్సవం శుక్రవారం సందర్శకులతో పోటెత్తింది. మరో రెండు రోజుల్లో ప్రదర్శన ముగియనున్న దృష్ట్యా పుస్తకప్రియులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ చివరి నాటికే ముగిసే పుస్తక ప్రదర్శన ఈ ఏడాది నూతన సంవత్సరంలోకి అడుగిడుతోంది. జనవరి ఒకటో తేదీన ప్రదర్శన ముగియనుంది. పుస్తక ప్రియులను విశేషంగా ఆకట్టుకొనే వైవిధ్యభరితమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 300 స్టాళ్లతో ఈ సంవత్సరం పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఒకవైపు పుస్తక ఆవిష్కరణలు, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తక సమీక్షలు, అమ్మకాలతో సందడి నెలకొంది. పుస్తక ప్రదర్శన కేవలం పుస్తకాల అమ్మకాలకు మాత్రమే పరిమితం కాకుండా రచయితలను, పాఠకులను ఒకచోట చేర్చే వేదికగా మారింది.ఈ నెల 22వ తేదీన ప్రారంభమైనప్పటి నుంచి పుస్తక ప్రియుల నుంచి అనూహ్యమైన స్పందన కనిపిస్తోందని నిర్వాహకులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ‘కొత్త సంవత్సరం పుస్తక పఠనంతో ప్రారంభం కావాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పుస్తకాలు చదవాలనే లక్ష్యంతో జనవరి 1వ తేదీ వరకు ప్రదర్శన ఉండేవిధంగా ఏర్పాటు చేశాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.’ అని బుక్ ఫెయిర్ కమిటీ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ తెలిపారు. గత వారం రోజుల్లో సుమారు 5 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివచ్చినట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఒక వేడుకగా నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన ఈ సంవత్సరం సైతం అదే పండుగ వాతావరణాన్ని తలపించింది. వైవిధ్యభరితమైన జాతీయ, అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థలు ఈ ప్రదర్శనలో భాగస్వాములుగా నిలిచాయి. పుస్తక ప్రదర్శనలో యువత పెద్ద సంఖ్యలో కనిపించడం విశేషం. తెలంగాణ పబ్లిషర్స్, తెలుగు అకాడమీ, విశాలాంధ్ర, నవతెలంగాణ, నవోదయ వంటి సంస్థల్లో పోటీ పరీక్షలకు కావలసిన పుస్తకాలను కొనుగోలు చేయడం మొదలుకొని ఎమెస్కో, సేజ్, పెంగ్విన్, నవయుగ, వీక్షణం, అరుణతార వంటి పుస్తక ప్రచురణ సంస్థల స్టాళ్లలో లభించే విలువైన నవలలు, సాహిత్య విశ్లేషణ పుస్తకాల వరకు పాఠకులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సైతం తరలి వచ్చారు. పుస్తక స్పర్శ గొప్పది డిజిటల్ కంటే పుస్తకస్పర్శ గొప్పది. ప్రస్తుత సమాజం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మార్కెట్ శక్తులు అలజడిని సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మౌలికమైన ఆనందాన్ని ఇచ్చేది పుస్తకమే. బంధువులు, ఆత్మీయులు, స్నేహితుల నుంచి కూడా లభించని సుఖం, సంతోషం పుస్తకం నుంచి లభిస్తాయి. పుస్తకాలను ప్రేమించండి. – గోరటి వెంకన్న, ప్రముఖ గాయకుడు, ఎమ్మెల్సీ -
పల్లె పరిమళాల సౌందర్యం ‘రాళ్లకుచ్చె’
సాక్షి, హైదరాబాద్: స్వచ్ఛమైన తెలంగాణ పల్లె పరిమళాలు దాసరి మోహన్ రాసిన కథా సంపుటి ‘రాళ్లకుచ్చె’లో పుష్కలంగా ఉన్నాయని తెలంగాణ సాహిత్య ఆకాడమీ మాజీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి అన్నారు. 32వ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికగా ఆదివారం పలువురు తెలంగాణ కవులు రాళ్లకుచ్చె కథా సంపుటిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గ్రామీణ సౌందర్యాన్ని దాసరి మోహన్ ఈ కథా సంపుటిలో అద్భుతంగా పొందుపర్చడం అభినందనీయమని పేర్కొన్నారు. రాళ్లకుచ్చె కథా సంపుటిని రచయిత దాసరి మోహన్.. తెలంగాణ రచయితల సంఘానికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమంలో తంగేడు పత్రిక ఎడిటర్ కాంచనపల్లి గోవర్ధన్, జంటనగరాల తెలంగాణ రచయితల సంఘం తరఫున కందుకూరి శ్రీరాములు, ప్రముఖ కవి కూర చిదంబరం తదితరులు పాల్గొన్నారు. -
ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా రచనలు చేయాలి
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఫాసిస్ట్ పాలనకు వ్యతిరేకంగా కవులు రచనలు చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. నగరంలో జరుగుతున్న 35వ జాతీయ పుస్తక ప్రదర్శనను కవిత ఆదివారం సందర్శించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి స్టాల్‌ను ప్రారంభించారు. అలిశెట్టి ప్రభాకర్ వేదికగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కవి, వాగ్గేయకారుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న రచించిన ‘వల్లంకి తాళం’పుస్తకంపై జరిగిన చర్చా కార్యక్రమంలో కవిత మాట్లాడారు. ‘దేశంలో ఫాసిస్ట్ పాలన సాగుతున్న నేపథ్యంలో కవులు, కళాకారులు ప్రజలను చైతన్యం చేయాల్సిన సమయం వచ్చింది. మొదటి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత సురవరం ప్రతాప్‌రెడ్డి నుంచి ఆ పరంపర కొనసాగుతోంది. అనేక మంది గొప్ప కవుల వారసత్వాన్ని తెలంగాణ పుణికిపుచ్చుకుంది. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ రచించిన ‘వల్లంకి తాళం’రచన కూడా అంతే అద్భుతంగా ఉంది’అని ఆమె చెప్పారు. పనిలోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారని.. అదే ఒరవడితో తెలంగాణలో కూడా కష్టాలు, శ్రమలోంచి వారి రచనలు ఉంటాయని అన్నారు. ఈ రచనలే ఇక్కడి సాహిత్యాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయని, ఇటాలియన్ ఆఫ్ ఈస్ట్‌గా తెలుగు ఖ్యాతిపొందిందని పేర్కొన్నారు. మట్టితనాన్ని, శ్రమతత్వాన్ని అణువణువునా పొందుపరిచి కవిత్వం రాయడంగోరటి వెంకన్న ప్రత్యేకతని కొనియాడారు. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా రాయడంతోపాటు అడవి గురించి తన ఆకుపచ్చ కోవెలతో పోల్చడం అద్భుతమైన అంశమన్నారు. అందుకే నల్లమలలో యురేనియం తవ్వకాలను నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేశామన్నారు. ఇలాంటి కవి పుట్టిన ఈ కాలంలో తాను పుట్టినందుకు గర్వంగా ఉందని, ఆయనతోపాటు కౌన్సిల్లో కూర్చోవడం సంతోషంగా ఉందని కవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, డాక్టర్ నాగేశ్వర్ రావు పాల్గొన్నారు. ప్రదర్శనలో వివిధ స్టాల్స్‌ను ఆసక్తిగా తిలకించిన కవిత.. సాహిత్యం, కథలు, పిల్లల పుస్తకాలను కొనుగోలు చేశారు. -
Hyderabad Book Fair 2022: పుస్తకం పులకిస్తోంది..!
ఆదివారం సెలవు రోజు.. ఆ ప్రాంగణం కిటకిటలాడింది.. టికెట్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు.. టికెట్ పొంది లోనికి వెళ్లాలన్న ఆత్రుత వారిలో కనిపించింది.. ప్రదర్శన పూర్తయ్యాక ఎంతో సంతృప్తితో వెనుదిరిగారు. ఇది అవతార్ సినిమా థియేటర్ల ముందు సందడి కాదు. ఎన్టీయార్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం 70 వేల మంది ప్రదర్శనను తిలకించారన్నది నిర్వాహకుల మాట. సాక్షి, హైదరాబాద్: చేతిలో సెల్‌ఫోన్ తప్ప పుస్తకం పట్టరంటూ నేటి తరంపై పెదవి విరుపులు ఎన్నో.. కొత్త పుస్తకాలు అచ్చు వేయడం, అచ్చేసిన పుస్తక విక్రయాలు పలచగా ఉండటం రచయితలకు నీరసాన్నిస్తోంది. పేజీలు తిప్పుతూ, కుదురుగా ఓ చోట కూర్చుని పుస్తకాలు చదివే అలవాటు వేగంగా తగ్గిపోతోందని ఎంతోమంది పుస్తక ప్రియుల నిట్టూర్పులు నిత్యం వింటూంటాం.. ఇవన్నీ నిత్యసత్యాలే. కానీ ఓసారి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలోకి వచ్చి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని తిలకిస్తే మాత్రం పుస్తకానికి మళ్లీ మంచిరోజు వస్తోందా అన్న భావన కలగకమానదు. చిన్నారులు, యువకులు, నడి వయసు వారు, వృద్ధులు.. ఇలా తండోపతండాలుగా వచ్చి స్టాళ్లన్నీ కలియతిరిగి నచ్చిన పుస్తకాలను పట్టుకుని సంబరంగా వెళ్తున్నారు. కోల్‌కతా పుస్తక ప్రదర్శన తర్వాత జాతీయ స్థాయిలో అంత కీర్తిని మూటగట్టుకున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ 35వ ప్రదర్శన ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. నోట్ల రద్దు గందరగోళం ఉన్న తరుణంలో, కోవిడ్ భయాందోళనలు కొనసాగిన సమయంలోనూ సాగిన ఈ బుక్ ఫెయిర్ ఇప్పుడు.. పుస్తక ప్రియుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఇటు పుస్తకాలు, అటు చర్చాగోష్ఠులు, బయట జనం కోసం తినుబండారాల దుకాణాలు.. వెరసి ఆ ప్రాంతం జాతరను తలపిస్తోంది. అవీ ఇవీ.. ►ఈసారి పుస్తకప్రదర్శనలో 340 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాంతీయ, జాతీయ స్థాయి కేంద్రాలున్నాయి. ►ఆధ్యాత్మికం మొదలు ఆటల వరకు జానపదం మొదలు అంతర్జాతీయ విషయాల వరకు ఇలా అన్ని రంగాల పుస్తకాలు కొలువుదీరాయి. ►పోటీ పరీక్షలకు ఉపయోగపడే వాటితోపాటు కాలం తెలియకుండా కొత్త ప్రపంచంలో ఓలలాడించే నవలలు, కులమత సాహిత్యం, అట్లాసులు, పంచాంగాలు.. ఇలా సర్వం అక్కడ సిద్ధంగా ఉన్నాయి. ►ఈసారి 8 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని రాష్ట్రాల నుంచి రాలేదు. ►రచయితలు నేరుగా వారే తమ పుస్తకాలను పరిచయం చేసుకునేందుకు రైటర్స్ హాల్.. పేరుతో ప్రత్యేకంగా ఓ వేదిక ఏర్పాటు చేశారు. ►తెలుగు రచయితలకు రెండు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో స్థానిక రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనకు రాలేకపోయిన జాతీయస్థాయి రచయితలు పలువురు వారి పుస్తకాలను పంపారు. వాటిని నిర్వాహకులే పుస్తక ప్రియుల ముందుంచి అమ్మిస్తున్నారు. ఆ డబ్బును రచయితలకు పంపుతామని నిర్వాహకులు పేర్కొంటున్నారు. ►తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పలువురు రచయితలు రాసిన పుస్తకాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ‘మన ముఖ్యమంత్రి స్టాల్’ఏర్పాటు చేశారు. ఇందులో 24 రచనలున్నాయి. బాల్య స్నేహితులతో కలిసి వచ్చి..: వెంకటేశ్వరరావు ఓ ప్రైవేటు కంపెనీలో విభాగాధిపతిగా పనిచేస్తున్న విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు తన బాల్యమిత్రులతో కలిసి ఈ ప్రదర్శనకు వచ్చారు. నలుగురు మిత్రులు ముందే కావాల్సిన పుస్తక జాబితాతో వచ్చి వాటికోసం స్టాళ్లలో వెతికారు. కోరుకున్నవే కాకుండా, గతంలో చాలా ప్రాంతాల్లో దొరకని పుస్తకాలు కూడా లభించటంతో కొని మురిసిపోయారు. ‘పద్యం ఉంటేనే పుస్తకం చదవాలన్న ఆసక్తి నాలో కలుగుతుంది. ఆధునిక కాలంలో అలనాటి సాహిత్యం మరుగునపడొద్దని ఏరికోరి ఆ పుస్తకాలు చదువుతాను. ఇప్పుడలాంటి ఎన్నో పాత రచనలు సమీకరించాను’అని వెంకటేశ్వరరావు సంబరంగా చెప్పారు. పెద్ద బాలశిక్షా సంబరపడుతోంది.. ‘పెడదారి పడుతున్న ఈ సమాజానికి సంస్కారం అబ్బాలంటే పెద్ద బాలశిక్ష చదివించాలి’ అంటూ ఓ సినీ పాత్ర గంభీరంగా చెబుతుంది. పెద్దబాలశిక్ష అంటూ ఓ పుస్తకం కూడా ఉంటుందా అంటూ ఈ తరం ఆశ్చర్యపోతుంది. కానీ ఈ పుస్తక ప్రదర్శనలో పెద్దబాల శిక్ష నిజంగా మురిసిపోతోంది. ‘‘మా స్టాల్లో రోజుకు 40కి తగ్గకుండా పెద్దబాలశిక్ష పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. ఇతర స్టాళ్లలోనూ వాటికి మంచి ఆదరణ ఉంది.’అని ఆనందంగా చెప్తున్నారు. – శ్యామల, అన్నపూర్ణ పబ్లిషర్స్ స్పందన గొప్పగా ఉంది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఈసారి మరింత ఆదరణ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రచురణ కర్త లు వారి రచనలతో పుస్తకప్రియుల ముందుకొచ్చారు. నేరుగా వారితో మాట్లాడుతూ పుస్తకాలు విక్రయిస్తున్నారు. కానీ, రచయితలే నేరుగా కొనుగోలుదారులతో మాట్లాడుతుండటం, ఆయా పుస్తకాల ప్రత్యేకతలను చర్చాగోష్ఠుల్లో వివరిస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రదర్శనకు ఈ నాలుగు రోజుల్లో 3 లక్షల మందివచ్చి ఉంటారని అంచనా. – కోయ చంద్రమోహన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు -
సందడిగా పుస్తక ప్రదర్శన
సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో రెండవ రోజు పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి వివిధ పాఠశాలల నుంచి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో భాగంగా అలిశెట్టి ప్రభాకర్ వేదికపైన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమకు తాను రావడానికి స్ఫూర్తినిచ్చింది రచయిత వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ అని ప్రముఖ సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ట తెలిపారు. వెంకట సత్యప్రసాద్ రచించిన ‘తొడిమ లేని మొగ్గలు’ కథా సంపుటిని ముఖ్య అతిథిగా హాజరైన మోహనకృష్ట ఆవిష్కరించారు. ఇదే వేదికపైన ఆంగ్ల అనువాదం చేసిన డాక్టర్ కొండపల్లి నిహరిణి కవితా సంపుటి ‘కాల ప్రభంజనం’ (టెంపెస్ట్ ఆఫ్ టైమ్)ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. విశేషమైన ఈ కవితా సంపుటిని ‘ఎలనాగ’ ఆంగ్లానువాదం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. ప్రముఖ కవయిత్రి శిలాలోలిత రచించిన ‘నేను ఇక్కడి భూమిని’ నాలుగో సంపుటిని ప్రసిద్ధ సాహితీవేత్త తెలంగాణ ఉద్యమకారిణి డాక్టర్ తిరునగరి దేవకీదేవీ ఆవిష్కరించారు. స్త్రీల సమస్యలు, సామాజిక సమస్యల్ని ఎత్తిచూపిన కవయిత్రిగా శిలాలోలిత నిలుస్తారని దేవకీదేవి ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ బుక్ ట్రస్ట్ కోయా చంద్రమోహన్, గోపిరెడ్డి, రమేశ్ కార్తీక్, తాళ్లపల్లి శివకుమార్, రూప రుక్మిణి, అనీఫ్ పాల్గొన్నారు. -
హైదరాబాద్ పుస్తకాల పండుగ.. నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం (ఫొటోలు)
-
పుస్తకాలే ఉద్యమాలను ఉరకలెత్తించాయి
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలే ఉద్యమాలను ఉరకలెత్తించి మార్పునకు దోహదపడ్డాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఇక్కడ 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఉద్యమాలకు పుస్తకాలు దన్నుగా నిలిచాయని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా పుస్తక పఠనం, పుస్తక జ్ఞానం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు. మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తే చెడును అధిగమించేందుకు పుస్తకపఠనం చాలా అవసరమన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పుస్తకాల్లోనే చరిత్ర అంతా నిక్షిప్తమవుతుందని పేర్కొన్నారు. గాడ్సేను దేశభక్తుడిగా చేసి గాంధీని చరిత్రలో లేకుండా చేసేందుకు కొంతమంది వక్రీకరణలకు ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ ధోరణి దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, అనేక కొత్త పదాలను నేర్చుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఏడాదికి పది పుస్తకాలు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, పత్రికా సంపాదకులు సుధాభాస్కర్, తిగుళ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. విభిన్నం... వైవిధ్యం... పుస్తక ప్రదర్శనలో మొత్తం 300 స్టాళ్లలో పుస్తకాలు కొలువుదీరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచురణ సంస్థలు విభిన్న రంగాల పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చాయి. మొదటిరోజే పుస్తకప్రియులతో ఆ ప్రాంగణంలో సందడి నెలకొంది. పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనగా సందర్శకులతో కళకళలాడింది. తెలుగు రచయితలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ పబ్లిషర్స్, విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, మంచిపుస్తకం, మిళింద్ పబ్లిషర్స్, అన్వీక్షి, నవతెలంగాణ తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. శ్రీశ్రీ, గోపీచంద్, రావిశాస్త్రి, తిలక్, కొడవటిగంటి కుటుంబరావు వంటి గొప్ప కవులు, రచయితల రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 1వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరు, పుస్తకావిష్కరణలు, సాహిత్యసభలు నిర్వహించే వేదికకు ప్రముఖకవి అలిశెట్టి ప్రభాకర్ పేరు పెట్టారు. -
వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి!
‘జనంలో చైతన్యం రావాలంటే పుస్తకం కావాలి.. ఓ ఉద్యమం వైపు ప్రజలను కదిలించాలంటే పుస్తకం పట్టాలి. అందుకే నిజాంపై వ్యతిరేక పోరాటానికి గ్రామీణ జనాన్ని సమాయత్తం చేసేందుకు వట్టికోట ఆళ్వార్‌స్వామి బుట్టలో పుస్తకాలు పెట్టుకుని సైకిల్‌పై తిరుగుతూ పంచారు. పుస్తకాన్ని చదివించటం ద్వారా జనాన్ని కదిలించారు. ఇప్పుడు మళ్లీ వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి. ఆయనలాంటి వేల చేతుల చేయూత కావాలి. అలనాటి గ్రంథాలయోద్యమం తరహాలో సమాజం మళ్లీ పుస్తకం పట్టేలా కదిలించాలి. అందుకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఊతమిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్–2022 అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్. సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22(గురువారం) నుంచి జనవరి ఒకటో తేదీ వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఈసారి కనీసం 10 లక్షలమంది ఈ ప్రదర్శనను తిలకిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ప్రతిష్టాత్మక బుక్‌ఫెయిర్‌కు సార«థ్యం వహిస్తున్న జూలూరి గౌరీశంకర్, ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తూ సమాజంలో మళ్లీ పుస్తక ప్రాధాన్యం పెరిగేందుకు యత్నిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బుక్‌ఫెయిర్ లక్ష్యసాధనలో సాగుతున్న తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రజల్లో పఠనాసక్తి క్రమంగా పెరుగుతోంది. కాకపోతే, గతంలో చేతిలో పుస్తకం ఉండేది, ఇప్పుడు డిజిటల్ పుస్తకం విస్తృతమైంది. పీడీఎఫ్‌ల రూపంలో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య కోటి వరకు ఉంది. వీరంతా నిత్యం పుస్తకాలతోనే గడుపుతున్నారు. అయితే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, వారి దృష్టి ఇతర పుస్తకాల వైపూ మళ్లించాలి. రాష్ట్రంలో వేయి పాఠశాలల్లో విద్యార్థులకు రీడింగ్ రూములు ఏర్పాటు చేశారు. వాటిని ఇతర పాఠశాలలకూ విస్తరిస్తుండటం శుభసూచకం. తెలంగాణ వచ్చాక మేం వందల విద్యాసంస్థలు తిరిగి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారిని చైతన్యపరిచేందుకు కృషి చేశాం. ఆ తర్వాతే బుక్‌ఫెయిర్‌కు విద్యార్థుల రాక బాగా పెరిగింది. ఓ చిన్న ప్రయత్నం ఆశ్చర్యపరిచింది.. విద్యార్థులే కథలు రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సాహిత్య అకాడమీ చైర్మన్ అయ్యాక నేను చేసిన ఓ ప్రయత్నం ఇచ్చిన ఫలితం ఆశ్యర్య పరిచింది. ‘మన ఊరు– మన చెట్లు’అన్న శీర్షిక ఇచ్చి వారి ఊరి దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కథ రాయమని సూచిస్తే బడి పిల్లల చేతుల్లో ఏకంగా 5 లక్షల కథలు సిద్ధమయ్యాయి. వాటిల్లో ఉత్తమమైనవాటిని క్రోడీకరించగా 1,030 సిద్ధమయ్యాయి. ఇప్పుడు జిల్లాల వారీగా వాటికి పుస్తక రూపమిచ్చి అన్ని బడులకు ఉచితంగా పంచబోతున్నాం. ఎన్నో సూచనలొస్తున్నాయి.. జనం మళ్లీ పుస్తకాలు కొనాలి. అందుకే విద్యాసంస్థల్లో ‘పుస్తకం చదివే రోజు’అంటూ క్రాఫ్ట్, క్రీడలులాగా ఓ నిర్ధారిత రోజును కేటాయించి వారితో చదివిస్తే మంచి ఫలితముంటుందన్న సూచన వచ్చింది. రచ్చబండ స్థాయిలో పుస్తకపఠన బృందాలు ఏర్పడాలి. ఇవి భవిష్యత్తులో గ్రామస్థాయి పుస్తక ప్రదర్శనలుగా మారతాయి. రచయితలూ.. బడులకు వెళ్లండి.. వేలసంఖ్యలో ఉన్న కవులు, రచయితలు బడులకు వెళ్లి నేరుగా విద్యార్థులకు వారి రచనలను పరిచయం చేయాలి. ఆ రచన నేపథ్యం, ప్రాధాన్యాన్ని వివరించటం ద్వారా పఠనాసక్తి పెరుగుతుంది. ‘అందమైన ఊళ్లు.. ఇళ్ల చుట్టూ చెట్లు.. ఇది చందమామ పుస్తకాల్లో ముద్రించిన బొమ్మల్లో కనిపిస్తుంది. మరి మనూళ్లో అలా చెట్లెందుకు లేవు’అని ఓ ఐదో తరగతి విద్యార్థి ఆ ఊరి సర్పంచ్‌ని నిలదీశాడని నా మిత్రుడొకరు చెప్పారు. పుస్తకం చదివితే ఆలోచించే ధోరణి కూడా మారుతుందనటానికి ఇదే నిదర్శనం. ఆ ధోరణిని విద్యార్థులు మొదలు అందరిలో పాదుకొల్పాలనేదే బుక్‌ఫెయిర్ ఉద్దేశం. జనాన్ని కదిలించే శక్తి ఉన్న పుస్తకం.. తనకు మళ్లీ మంచిరోజులు తెచ్చుకునే శక్తి కూడా ఉందని నమ్ముదాం.. దానికి ఊతమిచ్చేలా చేయీచేయీ కలుపుదాం’ -
Hyderabad Book Fair 2022: హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎప్పటి నుంచి అంటే?
సాక్షి, హైదరాబాద్: దేశంలోని వివిధ రకాల సాహిత్యాన్ని ఏటా ఒక్కచోటకు తెచ్చే హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన మరోసారి పుస్తకప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 22 నుంచి జనవరి ఒకటి వరకు 35వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనుంది. కోవిడ్ దృష్ట్యా సందర్శకుల ఆదరణ పెద్దగా ఉండదన్న ఉద్దేశంతో నిర్వాహకులు గతేడాది 260 స్టాళ్లనే ఏర్పాటు చేసినప్పటికీ పుస్తకప్రియులు భారీగా తరలిరావడంతో ప్రదర్శన విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఈసారి 320 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమోహన్ తెలిపారు. అంచెలంచెలుగా... నగరంలో నిజాంల కాలం నుంచే పుస్తకాలకు ఆదరణ ఉంది. అధికార భాష ఉర్దూతోపాటు తెలుగు, మరాఠీ, కన్నడ, హిందీ ఇంగ్లిష్ పుస్తకాలు చదివే ప్రజలు మొదటి నుంచీ ఇక్కడ ఉన్నారు. పాఠకుల అభిరుచికి తగిన విధంగానే పుస్తక ప్రచురణ సంస్థలు ఆవిర్భవించాయి. కోఠిలోని బడీచౌడీ పుస్తక బజార్‌గా వెలుగొందింది. అక్కడి పుస్తక విక్రేతలే హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా పుస్తక పఠనాన్ని పెంచే లక్ష్యంతో ఆవిర్భవించిన నేషనల్ బుక్ ట్రస్ట్ నగరంలోని పుస్తక ప్రచురణ సంస్థలు, విక్రయ సంస్థలతో కలసి 1986లో ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ను తొలిసారి కేశవ మెమోరియల్ స్కూల్ మెదానంలో ఏర్పాటు చేసింది. ఆ తరువాత నిజాం కళాశాల మైదానం, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయం, నెక్లెస్‌రోడ్ తదితర ప్రాంతాల్లో పుస్తక ప్రదర్శనలు జరిగాయి. కథలు, నవలలు, గల్పికలు, చరిత్ర గ్రంథాలదే పుస్తక ప్రదర్శనల తొలినాళ్లలో అగ్రస్థానం. సోవియెట్ సాహిత్యం కూడా పాఠకులను బాగా ప్రభావితం చేసింది. క్రమంగా ప్రముఖుల జీవిత చరిత్రలు, పంచతంత్ర వంటి పిల్లల పుస్తకాలు ఆదరణ పొందాయి. అలాగే యోగా, ఆయుర్వేద, హోమియో వైద్య పుస్తకాలు సైతం బాగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌కు డిమాండ్ బాగా పెరిగింది. ఈ ఏడాది కూడా విభిన్న రంగాలకు చెందిన పుస్తకాలను ప్రదర్శించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
హైదరాబాద్ లో జాతీయ పుస్తకోత్సవం
-
బొకేలు వద్దు, పుస్తకాలు కావాలి: గవర్నర్
సాక్షి, హైదరాబాద్: పుస్తకం చదవకుండా తనకు రోజు గడవదని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌ను సోమవారం సాయంత్రం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలుగులో మాట్లాడారు. పుస్తక ప్రదర్శనకి రావడం చాలా సంతోషంగా ఉందని, అందరూ పుస్తక పఠనం చేయాలని కోరారు. తాను గవర్నర్, రైటర్, డాక్టర్ అయినప్పటికీ చదువరిగా ఉండటమే తనకు ఇష్టమన్నారు. తనను కలవడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు కాకుండా పుస్తకాలు తీసుకురావాలని కోరారు. ఇల్లు కట్టుకునే వారు తప్పనిసరిగా రీడింగ్ రూమ్ ఉండేలా చూసుకోవాలన్నారు. పుస్తకం చదవడం చాలా ముఖ్యమైన పని అని, తాను ఇంత బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజు పడుకునే ముందు ఒక గంట బుక్ చదువుతానని వెల్లడించారు. యువత ప్రతి ఒక్కరు ఇక్కడున్న 330 బుక్ స్టాల్స్ ని సందర్శించాలని అభిలషించారు. బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. పుస్తక ప్రదర్శనకు నగర వాసులు భారీగా తరలిచ్చారు. -
పుస్తకాల పండుగొచ్చే
సాక్షి హైదరాబాద్: నగరానికి పుస్తకాల పండగొచ్చింది. ప్రతి ఏటా డిసెంబరులో 9 రోజులపాటు జరిగే పుస్తకాల ప్రదర్శన పుస్తక ప్రియులకు ఓ ప్రత్యేకమైన సంబురం. నేటి నుంచి తెలంగాణ కళా భారతి (ఎన్టీఆర్ స్టేడియంలో) 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫేర్ ప్రారంభం కానుంది. పుస్తక ప్రదర్శన ఏర్పాట్లు, దాని ప్రత్యేకతలను బుక్ ఫెయిర్ ప్రతినిధులు ఆదివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మీడియాతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో బుక్‌ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, జాయింట్ సెక్రటరీ శోభన్‌బాబు, తదితరులు పాల్గొన్నారు. మొత్తం 330 స్టాళ్లు ఈసారి ప్రదర్శనలో 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు, వీటిలో ప్రముఖ ప్రచురణ సంస్థల, పత్రికల స్టాల్స్, తెలుగు, ఇంగ్లిషు సహా అన్ని భాషల పుస్తకాల స్టాళ్లు ఉన్నాయి. ఇక పిల్లలను పుస్తకాలు చదివించేలా బాల మేళాను ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. గతేడాది 10 లక్షల మంది పాల్గొన్నారని, నగరానికి 50–100 కి.మీ పరిధిలోని పాఠశాలలు తమ విద్యార్థులతో రావాలని గౌరీశంకర్ ఆహ్వానించారు. ఇప్పటివరకు 2 లక్షల పాస్‌లను పంపిణీ చేశామన్నారు. ఎప్పుడు: పుస్తక ప్రదర్శన ఈ రోజు సాయంత్రం 5 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో గౌరవ అతిథులుగా గంటా చక్రపాణి, బి.వినోద్ కుమార్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి పాల్గొననున్నారు. -
పుస్తక కొలువు
-
పుస్తక పఠనం.. ప్రగతికి సోపానం
సాక్షి, హైదరాబాద్: 31వ జాతీయ పుస్తక ప్రదర్శన ఈ నెల 18 నుంచి 28 వరకు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో కొలువుదీరనుంది. ఇందులో రాష్ట్ర, జాతీయ స్థాయిలో పేరొందిన పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. ఈ ఏడాది 333 స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 50కి పైగా జాతీయ స్థాయి పబ్లిషర్స్, 25 పిల్లల పుస్తక సంస్థలు పాల్గొననున్నాయి. బాలల సాహి త్యం, ఆధ్యాత్మికం, వ్యక్తిత్వ వికాసం తదితర రంగాలకు చెందిన పుస్తకాలతో పాటు, చరిత్ర, సాహిత్యం, ప్రముఖుల జీవిత చరిత్ర, గ్రంథాలపై పాఠకులు ఎంతో మక్కువ చూపుతున్నారని హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధి కోయ చంద్రమోహన్ ‘సాక్షి’తో చెప్పారు. డాక్టర్ సినారె వేదిక, వట్టికోట ప్రాంగణం భరత నాట్యం, కూచిపూడి, స్టోరీ టెల్లింగ్ వంటి కార్యక్రమాలతో పాటు వివిధ జిల్లాలకు చెందిన కళారూపాలను ప్రదర్శిస్తారు. 10 రోజుల పాటు పెద్ద సంఖ్యలో పుస్తక ఆవిష్కరణలు, ప్రత్యేక సదస్సులు ఉంటాయి. ఈ ఏడాది హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన వేదికకు డాక్టర్ సి.నారాయణరెడ్డి వేదికగా నామకరణం చేయనున్నా రు. మొత్తం ప్రాంగణానికి వట్టికోట ఆళ్వార్ స్వామి పేరుపెట్టనున్నారు. పుస్తక ఆవిష్కరణలు, సదస్సులు జరిగే వేదికకు సామల సదాశివ సాహి త్య ప్రాంగణంగా, వేదికకు బోయ జంగయ్య వేదికగా నామకరణం చేయనున్నారు. ప్రదర్శనకు ఆహ్వానం పలికే రెండు స్వాగత తోరణాలకు ప్రముఖ రచయితలు, పాత్రికేయులు అయిన అలిశెట్టి ప్రభాకర్, అరుణ్‌సాగర్ పేరు పెట్టనున్నారు. ప్రధాన ద్వారానికి తొలి తెలుగు రచ యిత్రి భండారు అచ్చమాంబ పేరు ఖరారు చేశా రు. గురువారం ప్రారంభం కానున్న ఈ పుస్తక మహోత్సవానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు పిల్లల్లో పుస్తక పఠనాన్ని పెంచేందుకు స్టోరీ టెల్లింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు వంటివి నిర్వహిస్తున్నారు. కొత్తగా ‘బుక్ హంట్’ను ఏర్పాటు చేయనున్నారు. పిల్లలకు రెండు పుస్తకాల పేర్లు చెబుతారు. వాటిని వెతికి ఇచ్చిన వారికి పుస్తక బహుమతులను అందిస్తారు. ప్రతి రోజూ మధ్యా హ్నం 2:30 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన కొనసాగుతుం దని హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ అధ్యక్షుడు జూలూ రు గౌరీశంకర్ తెలిపారు. శని, ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు ఉంటుందన్నారు. విద్యార్థులు తమ స్కూల్ గుర్తింపు కార్డులు చూపిం చి ఉచితంగా ప్రదర్శనలో పాల్గొనవచ్చన్నారు. సాధారణ సందర్శకులు రూ.5 ప్రవేశ రుసుము చెల్లించాలన్నారు. -
ముగిసిన జాతీయ పుస్తక ప్రదర్శన
ఆఖరి రోజు భారీగా తరలి వచ్చిన పుస్తక ప్రియులు సాక్షి, హైదరాబాద్: కన్నుల పండువ గా 12 రోజులపాటు సాగిన హైదరా బాద్ 30వ జాతీయ పుస్తక ప్రదర్శన ఆఖరి రోజు సోమవారం భారీగా తరలి వచ్చిన పుస్తకప్రియుల సమక్షం లో వేడుకగా ముగిసింది. ఈ ఏడాది నోట్ల రద్దు కారణంగా పుస్తక విక్రయా లు 40%వరకు తగ్గినట్లు ప్రదర్శన నిర్వాహకులు తెలిపారు. సందర్శ కులు సైతం తగ్గారు. గతేడాది 12 లక్షల మంది సందర్శించగా.. ఈ ఏడాది 8 లక్షల మందే వచ్చారని నిర్వాహకులు చెప్పారు. జయహో పుస్తక దాతలు మరోవైపు బుక్ ఫెయిర్ కమిటీ ఏర్పాటు చేసిన డోనర్స్ బాక్సులో అనేకమంది దాతలు వందల కొద్దీ పుస్తకాలను వేశారు. రచయిత్రి భానుమతి, రామారావు దంపతులు సోమవారం వందలాది పుస్తకాలను ఈ బాక్సులో వేశారు. పుస్తకం గొప్ప సహచరి బుక్ ఈజ్ బెస్ట్ కంపానియన్. కంప్యూటర్, ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్రభావం నుంచి పిల్లలను బయట పడేసేందుకు ఈ ప్రదర్శనలు దోహదం చేస్తాయి. – టి.అర్చన, జూబ్లీహిల్స్ పుస్తకం లేకుండా ఉండలేను ప్రతిరోజు చదువుతాను. ఒక్క రోజు కూడా పుస్తకం లేకుండా ఉండలేను. ప్రతి సంవత్సరం వస్తాం. నచ్చినవి కొనుగోలు చేస్తాం. – ఉమాగాయత్రి, రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి ఇది కోటి పుస్తకాల ఉత్సవం ఇది కోటి పుస్తకాల మహో త్సవం. ఇందులో పాల్గొనడం చాలా సంతోషాన్నిచ్చింది. ఒక్క పుస్తకం వందల మంది ఉపాధ్యాయులతో సమానం. పుస్తకం ఎంతో గొప్పగా ప్రబోధిస్తుంది. – సుద్దాల అశోక్ తేజ, కవి, రచయిత, గాయకుడు వంటల పుస్తకాలు కొన్నాను నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే వంటలకు సంబంధించినవి నాలుగు బుక్స్ కొన్నాను. – ఆదిత్య, 9వ తరగతి, భారతీయ విద్యాభవన్ -
40 శాతం అమ్మకాలు ఢమాల్!
పుస్తక ప్రదర్శనపైనా నోట్ల రద్దు ప్రభావం గతేడాది కంటే తక్కువగా విక్రయాలు సందర్శకులు వస్తున్నా.. అమ్మకాలు మాత్రం అంతంతే! 26తో ముగియనున్న ప్రదర్శన సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పైనా పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకాలు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది పాఠకులు నగదు కొరత వల్ల వెనుకడుగు వేస్తున్నారు. కేవలం సందర్శనకే పరిమితమవుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది పుస్తకప్రియులు బుక్‌ఫెయిర్‌కు వస్తున్నప్పటికీ కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. గతేడాది రోజుకు సుమారు రూ.లక్ష విలువైన పుస్తకాలు విక్రయించిన స్టాళ్లలో ఇప్పుడు సగం మేరకు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోల్చుకుంటే 40 శాతం మేర అమ్మకాలు తగ్గినట్లు స్టాళ్ల నిర్వాహకులు చెప్తున్నారు. గతేడాది 350కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయగా.. ఈసారి 290 స్టాళ్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. స్టాళ్ల ఎంపికలో స్క్రీనింగ్ పద్ధతిని పాటించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తవాళ్లకు కాకుండా ప్రతి సంవత్సరం వచ్చేవారికే ఈ ఏడాది స్టాళ్లను కేటాయించారు. దీంతో కొంత మేర స్టాళ్ల సంఖ్య తగ్గిందని నిర్వాహకులు చెప్తున్నపటికీ నోట్ల రద్దు ప్రభావం కూడా స్పష్టంగా ఉంది. ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఎమెస్కో, నవచేతన, నవోదయ, నవతెలంగాణ, విశాలాంధ్ర, అరుణోదయ, వీక్షణం, పీకాక్ క్లాసిక్స్ వంటి ప్రముఖ పుస్తక సంస్థలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీకి చెందిన లెఫ్ట్ వరల్డ్, తమిళనాడుకు చెందిన భారతి వంటి ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. రాజమండ్రి వంటి చోట పుస్తక ప్రదర్శనపై నోట్ల ప్రభావం పడ్డప్పటికీ వెరవకుండా హైదరాబాద్‌లో 30వ జాతీయ పుస్తక ప్రదర్శనకు బుక్ ఫెయిర్ కమిటీ సిద్ధపడింది. ఈ నెల 15న ప్రారంభమైన ప్రదర్శన 26న ముగియనుంది. స్వైపింగ్ మిషన్ల కొరత... నగదు కొరత దృష్ట్యా కొన్ని స్టాళ్లు స్వైపింగ్ మిషన్లు, పేటీఎం ద్వారా పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఎమెస్కో, నవతెలంగాణ, నవచేతన, లెఫ్ట్ వరల్డ్, వంటి ప్రముఖ పుస్తకాల స్టాల్స్‌లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి.కానీ చాలా చోట్ల స్వైపింగ్ లేకపోవడంతో కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పాఠకులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు నగదు కొరత కూడా వెంటాడుతోంది.‘‘ వంద రూపాయల బుక్ కోసం రూ.2 వేల నోటుతో వస్తున్నారు. చిల్లర కోసం ఎక్కడికెళ్లగలం. అలా వచ్చే కొద్దిపాటి గిరాకీ కూడా పోతోంది.’’ అని ఒక స్టాల్ నిర్వాహకుడు పేర్కొన్నాడు. ఇక తెలుగు అకాడమీ, నేషనల్‌బుక్ ట్రస్టు వంటి కొన్ని ప్రభుత్వ పుస్తక సంస్థల్లోనే స్వైపింగ్ మిషన్లు లేకపోవడంతో పాఠకులు నిరాశగా వెనుదిరిగి వెళ్తున్నారు. స్వైపింగ్ కోసం తాము అధికారులను కోరినప్పటికీ ఇప్పటి వరకు సరఫరా కాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు అకాడమీలో గతేడాది రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు విక్రయించగా ఈసారి ఇప్పటి వరకు రూ.2 లక్షల కంటే ఎక్కువ విక్రయించలేకపోయారు. ఈ నెల 26తో ప్రదర్శన ము గియనుంది. 24, 25 తేదీల్లో కూడా సందర్శకుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. చివరి రోజులు కావడంతో అమ్మకాలు కూడా పెరుగవచ్చని నిర్వాహకులు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు.