వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి! | Juluri Gouri Shankar About Hyderabad National Book Fair 2022 | Sakshi
Sakshi News home page

వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి!

Dec 21 2022 2:40 AM | Updated on Dec 21 2022 10:56 AM

Juluri Gouri Shankar About Hyderabad National Book Fair 2022 - Sakshi

‘జనంలో చైతన్యం రావాలంటే పుస్తకం కావాలి.. ఓ ఉద్యమం వైపు ప్రజలను కదిలించాలంటే పుస్తకం పట్టాలి. అందుకే నిజాంపై వ్యతిరేక పోరాటానికి గ్రామీణ జనాన్ని సమాయత్తం చేసేందుకు వట్టికోట ఆళ్వార్‌స్వామి బుట్టలో పుస్తకాలు పెట్టుకుని సైకిల్‌పై తిరుగుతూ పంచారు. పుస్తకాన్ని చదివించటం ద్వారా జనాన్ని కదిలించారు. ఇప్పుడు మళ్లీ వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి.

ఆయనలాంటి వేల చేతుల చేయూత కావాలి.  అలనాటి గ్రంథాలయోద్యమం తరహాలో సమాజం మళ్లీ పుస్తకం పట్టేలా కదిలించాలి. అందుకు హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన ఊతమిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హైదరాబాద్‌ నేషనల్‌ బుక్‌ఫెయిర్‌–2022 అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరి గౌరీ శంకర్‌.  

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 22(గురువారం) నుంచి జనవరి ఒకటో తేదీ వరకు హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఈసారి కనీసం 10 లక్షలమంది ఈ ప్రదర్శనను తిలకిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ప్రతిష్టాత్మక బుక్‌ఫెయిర్‌కు సార«థ్యం వహిస్తున్న జూలూరి గౌరీశంకర్, ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తూ సమాజంలో మళ్లీ పుస్తక ప్రాధాన్యం పెరిగేందుకు యత్నిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బుక్‌ఫెయిర్‌ లక్ష్యసాధనలో సాగుతున్న తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే...

ప్రజల్లో పఠనాసక్తి క్రమంగా పెరుగుతోంది. కాకపోతే, గతంలో చేతిలో పుస్తకం ఉండేది, ఇప్పుడు డిజిటల్‌ పుస్తకం విస్తృతమైంది. పీడీఎఫ్‌ల రూపంలో పుస్తకాలు డౌన్‌లోడ్‌ చేసుకుని చదువుతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య కోటి వరకు ఉంది. వీరంతా నిత్యం పుస్తకాలతోనే గడుపుతున్నారు. అయితే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, వారి దృష్టి ఇతర పుస్తకాల వైపూ మళ్లించాలి. రాష్ట్రంలో వేయి పాఠశాలల్లో విద్యార్థులకు రీడింగ్‌ రూములు ఏర్పాటు చేశారు. వాటిని ఇతర పాఠశాలలకూ విస్తరిస్తుండటం శుభసూచకం. తెలంగాణ వచ్చాక మేం వందల విద్యాసంస్థలు తిరిగి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారిని చైతన్యపరిచేందుకు కృషి చేశాం. ఆ తర్వాతే బుక్‌ఫెయిర్‌కు విద్యార్థుల రాక బాగా పెరిగింది.  

ఓ చిన్న ప్రయత్నం ఆశ్చర్యపరిచింది.. 
విద్యార్థులే కథలు రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సాహిత్య అకాడమీ చైర్మన్‌ అయ్యాక నేను చేసిన ఓ ప్రయత్నం ఇచ్చిన ఫలితం ఆశ్యర్య పరిచింది. ‘మన ఊరు– మన చెట్లు’అన్న శీర్షిక ఇచ్చి వారి ఊరి దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కథ రాయమని సూచిస్తే బడి పిల్లల చేతుల్లో ఏకంగా 5 లక్షల కథలు సిద్ధమయ్యాయి. వాటిల్లో ఉత్తమమైనవాటిని క్రోడీకరించగా 1,030 సిద్ధమయ్యాయి. ఇప్పుడు జిల్లాల వారీగా వాటికి పుస్తక రూపమిచ్చి అన్ని బడులకు ఉచితంగా పంచబోతున్నాం. 

ఎన్నో సూచనలొస్తున్నాయి.. 
జనం మళ్లీ పుస్తకాలు కొనాలి. అందుకే విద్యాసంస్థల్లో ‘పుస్తకం చదివే రోజు’అంటూ క్రాఫ్ట్, క్రీడలులాగా ఓ నిర్ధారిత రోజును కేటాయించి వారితో చదివిస్తే మంచి ఫలితముంటుందన్న సూచన వచ్చింది. రచ్చబండ స్థాయిలో పుస్తకపఠన బృందాలు ఏర్పడాలి. ఇవి భవిష్యత్తులో గ్రామస్థాయి పుస్తక ప్రదర్శనలుగా మారతాయి.

రచయితలూ.. బడులకు వెళ్లండి.. 
వేలసంఖ్యలో ఉన్న కవులు, రచయితలు బడులకు వెళ్లి నేరుగా విద్యార్థులకు వారి రచనలను పరిచయం చేయాలి. ఆ రచన నేపథ్యం, ప్రాధాన్యాన్ని వివరించటం ద్వారా పఠనాసక్తి పెరుగుతుంది. ‘అందమైన ఊళ్లు.. ఇళ్ల చుట్టూ చెట్లు.. ఇది చందమామ పుస్తకాల్లో ముద్రించిన బొమ్మల్లో కనిపిస్తుంది. మరి మనూళ్లో అలా చెట్లెందుకు లేవు’అని ఓ ఐదో తరగతి విద్యార్థి ఆ ఊరి సర్పంచ్‌ని నిలదీశాడని నా మిత్రుడొకరు చెప్పారు.

పుస్తకం చదివితే ఆలోచించే ధోరణి కూడా మారుతుందనటానికి ఇదే నిదర్శనం. ఆ ధోరణిని విద్యార్థులు మొదలు అందరిలో పాదుకొల్పాలనేదే బుక్‌ఫెయిర్‌ ఉద్దేశం. జనాన్ని కదిలించే శక్తి ఉన్న పుస్తకం.. తనకు మళ్లీ మంచిరోజులు తెచ్చుకునే శక్తి కూడా ఉందని నమ్ముదాం.. దానికి ఊతమిచ్చేలా చేయీచేయీ కలుపుదాం’   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement