juluri gouri shankar
-
దీర్ఘ కవితల నుండి దీర్ఘ కావ్యం దాకా...
‘తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులు.’ – (జూలూరు పథం: పుట 43) తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు 20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి), ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం. ‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది. తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్. కవి, కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట. ‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్ 31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్, కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు. తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’ వ్యాసకర్త సాహితీ విమర్శకులు (రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ) -
వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి!
‘జనంలో చైతన్యం రావాలంటే పుస్తకం కావాలి.. ఓ ఉద్యమం వైపు ప్రజలను కదిలించాలంటే పుస్తకం పట్టాలి. అందుకే నిజాంపై వ్యతిరేక పోరాటానికి గ్రామీణ జనాన్ని సమాయత్తం చేసేందుకు వట్టికోట ఆళ్వార్‌స్వామి బుట్టలో పుస్తకాలు పెట్టుకుని సైకిల్‌పై తిరుగుతూ పంచారు. పుస్తకాన్ని చదివించటం ద్వారా జనాన్ని కదిలించారు. ఇప్పుడు మళ్లీ వట్టికోట ఆళ్వార్‌స్వాములు రావాలి. ఆయనలాంటి వేల చేతుల చేయూత కావాలి. అలనాటి గ్రంథాలయోద్యమం తరహాలో సమాజం మళ్లీ పుస్తకం పట్టేలా కదిలించాలి. అందుకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ఊతమిస్తుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హైదరాబాద్ నేషనల్ బుక్‌ఫెయిర్–2022 అధ్యక్షులు, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీ శంకర్. సాక్షి, హైదరాబాద్: ఈ నెల 22(గురువారం) నుంచి జనవరి ఒకటో తేదీ వరకు హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు రంగం సిద్ధమైంది. ఈసారి కనీసం 10 లక్షలమంది ఈ ప్రదర్శనను తిలకిస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ప్రతిష్టాత్మక బుక్‌ఫెయిర్‌కు సార«థ్యం వహిస్తున్న జూలూరి గౌరీశంకర్, ఇప్పుడు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తూ సమాజంలో మళ్లీ పుస్తక ప్రాధాన్యం పెరిగేందుకు యత్నిస్తున్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. బుక్‌ఫెయిర్ లక్ష్యసాధనలో సాగుతున్న తీరును వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రజల్లో పఠనాసక్తి క్రమంగా పెరుగుతోంది. కాకపోతే, గతంలో చేతిలో పుస్తకం ఉండేది, ఇప్పుడు డిజిటల్ పుస్తకం విస్తృతమైంది. పీడీఎఫ్‌ల రూపంలో పుస్తకాలు డౌన్లోడ్ చేసుకుని చదువుతున్నవారి సంఖ్య బాగా పెరిగింది. రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్య కోటి వరకు ఉంది. వీరంతా నిత్యం పుస్తకాలతోనే గడుపుతున్నారు. అయితే పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, వారి దృష్టి ఇతర పుస్తకాల వైపూ మళ్లించాలి. రాష్ట్రంలో వేయి పాఠశాలల్లో విద్యార్థులకు రీడింగ్ రూములు ఏర్పాటు చేశారు. వాటిని ఇతర పాఠశాలలకూ విస్తరిస్తుండటం శుభసూచకం. తెలంగాణ వచ్చాక మేం వందల విద్యాసంస్థలు తిరిగి విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారిని చైతన్యపరిచేందుకు కృషి చేశాం. ఆ తర్వాతే బుక్‌ఫెయిర్‌కు విద్యార్థుల రాక బాగా పెరిగింది. ఓ చిన్న ప్రయత్నం ఆశ్చర్యపరిచింది.. విద్యార్థులే కథలు రాస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో సాహిత్య అకాడమీ చైర్మన్ అయ్యాక నేను చేసిన ఓ ప్రయత్నం ఇచ్చిన ఫలితం ఆశ్యర్య పరిచింది. ‘మన ఊరు– మన చెట్లు’అన్న శీర్షిక ఇచ్చి వారి ఊరి దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కథ రాయమని సూచిస్తే బడి పిల్లల చేతుల్లో ఏకంగా 5 లక్షల కథలు సిద్ధమయ్యాయి. వాటిల్లో ఉత్తమమైనవాటిని క్రోడీకరించగా 1,030 సిద్ధమయ్యాయి. ఇప్పుడు జిల్లాల వారీగా వాటికి పుస్తక రూపమిచ్చి అన్ని బడులకు ఉచితంగా పంచబోతున్నాం. ఎన్నో సూచనలొస్తున్నాయి.. జనం మళ్లీ పుస్తకాలు కొనాలి. అందుకే విద్యాసంస్థల్లో ‘పుస్తకం చదివే రోజు’అంటూ క్రాఫ్ట్, క్రీడలులాగా ఓ నిర్ధారిత రోజును కేటాయించి వారితో చదివిస్తే మంచి ఫలితముంటుందన్న సూచన వచ్చింది. రచ్చబండ స్థాయిలో పుస్తకపఠన బృందాలు ఏర్పడాలి. ఇవి భవిష్యత్తులో గ్రామస్థాయి పుస్తక ప్రదర్శనలుగా మారతాయి. రచయితలూ.. బడులకు వెళ్లండి.. వేలసంఖ్యలో ఉన్న కవులు, రచయితలు బడులకు వెళ్లి నేరుగా విద్యార్థులకు వారి రచనలను పరిచయం చేయాలి. ఆ రచన నేపథ్యం, ప్రాధాన్యాన్ని వివరించటం ద్వారా పఠనాసక్తి పెరుగుతుంది. ‘అందమైన ఊళ్లు.. ఇళ్ల చుట్టూ చెట్లు.. ఇది చందమామ పుస్తకాల్లో ముద్రించిన బొమ్మల్లో కనిపిస్తుంది. మరి మనూళ్లో అలా చెట్లెందుకు లేవు’అని ఓ ఐదో తరగతి విద్యార్థి ఆ ఊరి సర్పంచ్‌ని నిలదీశాడని నా మిత్రుడొకరు చెప్పారు. పుస్తకం చదివితే ఆలోచించే ధోరణి కూడా మారుతుందనటానికి ఇదే నిదర్శనం. ఆ ధోరణిని విద్యార్థులు మొదలు అందరిలో పాదుకొల్పాలనేదే బుక్‌ఫెయిర్ ఉద్దేశం. జనాన్ని కదిలించే శక్తి ఉన్న పుస్తకం.. తనకు మళ్లీ మంచిరోజులు తెచ్చుకునే శక్తి కూడా ఉందని నమ్ముదాం.. దానికి ఊతమిచ్చేలా చేయీచేయీ కలుపుదాం’ -
మన గ్రామ చరిత్ర మనమే రాద్దాం
తెలంగాణ సాహిత్య అకాడమీ గ్రామ చరిత్రలను రికార్డు చేసే బృహత్తర పనికి శ్రీకారం చుట్టింది. కళాశాలలో చదువుకునే విద్యార్థుల చేతే వారి వారి గ్రామ చరిత్రల్ని రాయించే పనికి పూనుకొంది. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మార్చి 29న వందలాది మంది విద్యార్థులు ‘మన చరిత్రను మనం రాసుకుందాం’ అనే బృహత్తర సామూహిక చరిత్ర రచనా కార్యక్రమానికి నాంది పలికి ‘చరిత్ర సృష్టించారు’. తెలంగాణ సాహిత్య అకాడమీ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని 860 గ్రామాల చరిత్రను ఆ గ్రామాలకు చెందిన యువకులే రచించేందుకు ముందుకు రావటం విశేషం. ప్రఖ్యాత సామాజిక శాస్త్రజ్ఞుడు ఎస్సీ దూబే 1951–52లో షామీర్పేట గ్రామంపై పరిశోధన చేసి రాసిన ‘ఇండియన్ విలేజ్’ గ్రంథం ప్రేరణతో గ్రామ చరిత్రలను విద్యార్థులతో రికార్డు చేయించే పనికి పూనుకుంది అకాడమీ. ప్రముఖ చరిత్రకారుడు బీఎన్ శాస్త్రి చరిత్ర రచనకు కొనసాగింపుగా వేలమంది విద్యార్థులు నూతన చరిత్ర రచనకు ఉద్యుక్తులు కావటం విశేషం. ఇప్పటికే ఊరు తనకు తానుగా స్వతంత్రంగా రూపొందిన చరిత్రను, ఊళ్లో ఉన్న ఆలయాలు, వాటి ప్రాచీనత, శాసనాలు, పాత నిర్మాణ అవశే షాలను విద్యార్థులే రికార్డు చేస్తారు. రాష్ట్ర అవతరణ తర్వాత వేగవంతంగా జరిగిన పనులన్నింటినీ చరిత్ర పేజీలకెక్కిస్తారు. తమ వ్యవసాయ పంటలు, ఊర్లోని పరిశ్రమలు, చేతివృత్తులు, రవాణా సౌకర్యాలు, రహదార్లు, తారురోడ్లు, సిమెంట్ రోడ్లు, కంకర రోడ్లు, మట్టి రోడ్లు, గ్రామంలో వ్యాపారాలు, వాహనాల దగ్గర్నుంచి అన్నింటినీ లెక్కలు కట్టి విద్యార్థులు తమ ఊరి చరిత్రలో లిఖిస్తారు. గ్రామంలో కులాలు, మతాలు, పండుగలు, ఆటపాటలు, ఈ నేలమీద ఉన్న గంగా జమునా తెహజీబ్ సంస్కృతులను విద్యార్థులు తమ కలాలతో రాస్తారు. తమ గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగొచ్చిన వారి చరిత్రలను, వాటి వివరాలను కూడా రికార్డ్ చేస్తారు. ఈ నేలమీద భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన యోధులు, తొలి మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల చరిత్రలను తెలిసిన మేరకు సమాచార సేక రణతో విద్యార్థులు గ్రామ చరిత్రలను రాస్తారు. విద్యార్థులు తీసుకువచ్చిన సమాచారంతో సాహిత్య అకాడమీ వాటిని గ్రంథాలుగా వెలువరిస్తుంది. ఎస్సీ దూబే నేతృత్వంలో 1951–52 ఉస్మా నియా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు షామీర్ పేట గ్రామంపై చేసిన పరిశోధన ‘ఇండియన్ విలేజ్’ గ్రంథంగా వెలువడింది. ఎంఎన్ శ్రీనివాస్ కర్ణాటకలోని రాంపూర్ గ్రామంపై అధ్యయనం చేశారు. సోషల్ ఆంత్రోపాలజిస్టు అయిన ఎంఎన్ శ్రీనివాస్ ‘సోషల్ ఛేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా’, ‘ది రిమెమ్బర్డ్ విలేజ్’, ‘రిలిజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది క్రూగ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ గ్రంథాలు రాశారు. యాంద్రీ బెతిల్ వే అనే మరో సోషల్ ఆంత్రోపాలజిస్టు తమిళనాడు తంజావూరు జిల్లా లోని శ్రీపురం గ్రామంపై అధ్యయనం చేసి గొప్ప గ్రంథాన్ని రాశారు. మహారాష్ట్రకు చెందిన ఏఆర్ దేశాయ్ గ్రామీణ జీవితాన్ని విశ్లేషిస్తూ గ్రంథం రాశారు. మన తెలంగాణలో ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు కపిలవాయి లింగమూర్తి, బీఎన్ శాస్త్రి తెలంగాణ చరిత్రకు ఎనలేని సేవ చేశారు. వ్యక్తులుగా చరిత్రకారులు చేసిన పరిశోధన వేరు.. ఇపుడు నల్లగొండ ఎన్జీ కాలేజీ విద్యార్థులు 860 గ్రామాల చరిత్రలను రాయటానికి సామూహిక ఆంత్రోపాలజిస్టులుగా కదలిరావటం వేరు. రేపటి కొత్త చరిత్రకారుల ఆవిర్భావానికి వీరి పూనికతో బలమైన బీజం పడుతుంది. -జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు -
మాతృభాషను వదులుకోవద్దు..
కవాడిగూడ (హైదరాబాద్): మాతృభాష సంరక్షణ కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. మాతృభాషాదినోత్సవాలు జీవనోత్సవాలు కావాలని.. తల్లి భాష కోసం, తల్లి నేల కోసం ఏ స్థానంలో ఉన్నా మాతృభాషను వదలం అని ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్లో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభను నిర్వహించారు. తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగుకూటమి, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్య సాధన ఫౌండేషన్, మహిళా భారతి, గోల్కొండ సాహితీ కళాసమితి, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిదారెడ్డి మాట్లాడుతూ.. చదువు లక్ష్యం నెరవేరినప్పుడే భాష బతుకుతుందని అన్నారు. భాషను బతికించేది ప్రజలు కవులు అని పేర్కొన్నారు. మాతృభాషలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రచయిత సంఘం అ«ధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ భాషను పరిరక్షించడానికి మాండలిక నిఘంటువు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజిని దేవి, తెలుగు కూటమి అధ్యక్షుడు కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాంస్కృతిక తెలంగాణ చూపుతున్న వెలుగు దారి
తెలంగాణ ఏర్పడినాక ఎక్కువగా రూపాంతరం చెందింది సినిమా రంగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికిలో ఉన్నప్పుడు తీవ్ర వివక్షకి గురి అయిన వాటిలో భాష ఒకటి. రెండున్నర జిల్లాల భాషే ప్రామాణిక భాష అని ఒక ప్రామాణికతను తీసుకుని వచ్చి తెలంగాణ యాసను రౌడీలకు, గూండాలకు, హాస్యనటులకు ఉపయోగించి దాన్ని ఆధిపత్య రథచక్రాల కింద నలిపివేసిన దుస్థితి వుంది. తెలంగాణ వచ్చాక ఆ భాష మారింది. తెలంగాణ యాస కాదు తెలంగాణ భాష అన్న గ్రహింపు, గుర్తింపు వచ్చింది. తెలంగాణ సంస్కతీ నేపథ్యంగా సిని మాలు తీయడం మొదలు అయింది. రౌడీలు, గూండాలకి కాక కథానాయకులు తెలంగాణ భాషలో మాట్లాడటం మొదలు అయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ జాతీయ అవార్డు అందుకోవడంతో తెలం గాణ సినిమా వైపు దేశం దృష్టి సారించింది. శేఖర్ కమ్ముల తీసిన ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ కావడంతో తెలంగాణ భాషకి తెలంగాణ అవతల కూడా జయకేతనం ఎగురవేసినట్టు అయింది. నల్లగొండ జిల్లాకి చెందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తీసిన ‘మల్లేశం’ బయోపిక్ విజయవంతం కావడం... అటు ఉత్తరాంధ్ర నుండి ‘పలాస’ రావడంతో తెలుగు సినిమాలో వైవిధ్యతకి తెలంగాణ మార్గం చూపినట్లు అయింది. రాష్ట్ర అవతరణ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలగంగ ఎగిసిపడి ఎగువ భూములను, కరువు నేలలను ఏ విధంగా సస్యశ్యామలం చేస్తోందో, అలాగే తెలంగాణ తల్లి భాష కూడా వెల్లివిరిసిన పండు వెన్నెలలా సాహిత్య సౌరభాలను దిగంతాలకు వెదజల్లుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 9ని ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని ‘‘తెలంగాణ భాషా దినోత్సవం’’గా ప్రకటించి సమున్నతంగా గౌరవించారు. తెలంగాణ రాష్ట్రం రావటం వల్లనే దాశరథి, కాళోజీల పేరున అవార్డులను ప్రకటించుకుని మన కవులను సత్కరించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చాకనే విస్మృత తెలంగాణ సాహితీవేత్తలను వెలుగులోకి తెచ్చి 1వ తరగతి నుంచి 10 వరకు, ఇంటర్, డిగ్రీలలో సిలబస్ల్లోకి చేర్చి ఈ తరానికి పాఠ్యాంశాలుగా బోధించటం జరుగుతోంది. అన్ని రకాల పోటీ పరీక్షలలో తెలంగాణ సాహిత్య వైతాళికులు, కవులు, రచయితలు, సాహితీమూర్తులు, సాంస్కృతిక యోధుల సేవలను, రచనలను అడుగుతున్నారు. ఈ నేలమీద పాలనారంగం నుంచి అన్నిశాఖ లలో పని చేసేవారు విధిగా తెలంగాణ సాహిత్యం, మన కళలు, సంస్కృతి, మన పండుగలకు సంబంధించిన అవగాహన చేసుకునే విధంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల జీవన సాంస్కృతిక నేపథ్యాన్ని ఈ తరం చదువుకునే విధంగా సిలబస్‌లను రూపకల్పన చేయటమైనది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషను తక్కువ చేసి చూశారు. కాళోజీ అన్నట్లు రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాషగా మనపై రుద్దారు. ఇపుడాస్థితి లేదు. తెలంగాణ తల్లిభాషకు విముక్తి లభించింది. తెలంగాణ యాసనే ఇపుడు అధికార భాషగా నిలిచింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కాళోజీ జయంతి సభలు జరపటానికి చాలా కష్టపడవలసివచ్చింది. అన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో సమావేశాలు జరిపి తెలంగాణ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ, రాష్ట్రం వచ్చాక సెప్టెంబర్ 9 మాతృభాషా దినోత్సవం లక్షలాది మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో జరుగుతోంది. ఈ రోజున రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ స్కూళ్లలో, వేలాది ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాతృభాషా దినోత్సవ వేడుకలతో కాళోజీ అమర్‌హే, మాతృభాష వర్ధిల్లాలి అన్న సందేశాలతో, నినాదాలతో విద్యాప్రాంగణాలన్నీ మారుమోగుతాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ, మాధ్యమిక విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖలన్నీ వాళ్లకున్న వెసులుబాట్లతో మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యారంగంలో 1వ తరగతి నుంచి అన్ని విద్యాసంస్థలు, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులలో విద్యనభ్యసించే సుమారు కోటిమంది విద్యార్థులకు మాతృభాషా దినోత్సవ సందేశం అందుతుంది. భాషాభిమానులు దీన్ని పెద్ద సాహిత్య సాంస్కృతిక పండుగగా జరుపుకుంటున్నారు. స్వరాష్ట్ర సాధనకోసం స్వయంగా పాటలు రాసిన కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా సాహిత్య సాంస్కృతిక రంగాన్ని కూడా పునర్నిర్వచిస్తున్నారు. మలిదశ ఉద్యమాన్ని ప్రజాకర్షకంగా తీర్చిదిద్ది ప్రజానీకానికి అందించటంలో ఆయనలోని తల్లిభాష, తెలంగాణ నుడికారం, వాక్ శుద్ధి, చెలుకులు, చలోక్తులు, సామెతలతోపాటు, తనదైన శైలిలో భాషకు కూడా యుద్ధాన్ని నేర్పిన యుద్ధ భాషి కేసీఆర్. తెలంగాణ వచ్చాక తానే పాలకుడుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషకున్న సొగసులను, సొబగులను, మన పద్యాన్ని, గద్యాన్ని, కవితను, పాటను పాడి మరీ వినిపించారు. రాష్ట్రం వచ్చాక విస్మృత సాహితీవేత్తలు వెలుగులోకి వచ్చి, పాఠ్యాంశాలుగా నిలిచారు. తెలంగాణ సాహిత్య అకాడమీ 100 పుస్తకాలను ప్రచురించింది. తెలం గాణ కవిత్వం కాళేశ్వరాలుగా ప్రవహిస్తోంది. పద్య కవిత్వం, గద్య కవిత్వం, వచన కవిత్వం, దీర్ఘకవితలు, విడికవితలు విరివిగా వస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ‘నీది నాది ఒకే కథ’ సినిమాకు యువకవి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ‘ఫిధా’ సినిమాలో తెలంగాణ భాష. నిజామాబాద్ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ రామ్మోహన్రావు తీసుకువస్తున్న ‘లవ్‌స్టోరి’కి శేఖర్‌కమ్ముల డైరెక్టర్ కాగా ఇంకా విడుదల కాని ఈ సినిమాలోని తెలంగాణ నేపథ్యంలోని పాట ‘దాని కుడిభుజంమీది కడవ.. సారంగదరియా’ అన్న పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో 30 కోట్లమందికిపైగా వీక్షించారు. ఇప్పుడు తెలంగాణ భాష హీరోల భాష. ఇప్పుడు తెలంగాణ భాష తెలంగాణ సినిమాలను హిట్టుకొట్టించే భాష. తెలంగాణ చారిత్రక విశేషాలను శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాసరావు, అరవింద్ ఆర్యాపకడే, వేముగంటి మురళీలు వెతికితీస్తున్నారు. కరోనా ప్రపంచాన్ని కమ్మేసిన స్థితిలో జూమ్ వేదికగా, యూట్యూబ్‌లు, సోషల్ మీడియాలు వేదికగా వందలమంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ కలాలకు, గళాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ వచ్చాక మన మాతృభాషకు సమున్నత స్థానం లభించింది. సెప్టెంబర్ 9ని మాతృభాషా దినోత్సవంగా ఘనంగా జరుపుకుందాం. -జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త కవి, విమర్శకుడు (నేడు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా) -
పరిశుభ్రం చేసే చేతులే పరిశుద్ధమైనవి
మన ఇంట్లో పాసిపోయిన అన్నం దగ్గర్నుంచి, ఇంట్లో వూడ్చిపారేసిన మకిల వరకు తీసుకెళ్లి వాటిని ఊరి చివరనున్న డంపింగ్‌యార్డులకు తరలిస్తున్న ఆ చేతులెవరివి తల్లీ! తడిచెత్తను, పొడిచెత్తను వేరుచేస్తున్న ఆ చేతులెవరివి తండ్రీ! వాళ్లకు పాదపాదాన పరిపరి దండాలు. ప్రతి నిత్యం ‘అమ్మా, చెత్తబండి వచ్చింది’ అని పలకరిస్తున్న సమాజ ఆరోగ్య దూతల పరిశుభ్ర చేతుల వల్లనే పల్లెల దగ్గర్నుంచి హైదరాబాద్ మహానగరం వరకు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఈ సఫాయి కార్మికులే మన ఆరోగ్య కార్యకర్తలు. వారి సేవలకు వెల కట్టలేం కానీ వారిని ఆదుకోవాలన్న, వారికి అన్నిరకాల సదుపాయాలను అందించాలన్న తలంపు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో పాత పేపర్లు ఏరుకుని జీవించే వాళ్లంతా కలిసి ఇందిరాపార్కు దగ్గర ధర్నాచేశారు. అది ఉద్యమ చరిత్రలో మరిచిపోలేనిది. వీళ్లు చేసే కృషిని గమనించిన కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వీరి జీవనవిధానంలో మార్పులు తెచ్చేందుకు పథక రచన చేశారు. ఈ ఆలోచననే కేటీఆర్ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు. చిన్నప్పుడు మా నడిగూడెంలో ‘నమో వెంకటేశా’ అన్న దేవాలయంలోని పాటో, అల్లాహు అక్బర్ అంటూ మసీదు నుంచి వచ్చే ప్రార్థనా గీతమో, చర్చి గంటలో మేలుకొలిపేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో పొద్దున్నే అందర్నీ లేపేది మాత్రం జీహెచ్ఎంసీ వాహనం నుంచి వచ్చే పాటే. అది ఏ మతానికి చెందిన పాట కాదు. సర్వమానవుల్ని ఆరోగ్యవంతులుగా ఉండమని దీవించి మేలుకొలిపే పాట. ‘పరిశుభ్రత చల్లని రాగం/ పరిశుభ్రత గుండెలోరాగం/ పరిశుభ్రత జీవనవేదం/పరిశుభ్రత వైపుకే పయనం’ అంటూ పాట మొదలవుతుంది. ‘తడిచెత్త, పొడిచెత్తను ఎరువుగా చేసి.../ ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం/ ... ఇంటింటికి ఒక మొక్క నాటుదాం/ స్వచ్ఛదేవా .../ ఆరోగ్య దేవతా .../ స్వచ్ఛ్ హైదరాబాద్/ స్వచ్ఛ్ తెలంగాణ’ అంటూ ముగిసేపాట పరిశుభ్ర దేవతను కొలుస్తూ పాడే పరిశుద్ధ గీతంలాగా ఉంటుంది. హిమాయత్‌నగర్‌లోని ఎమ్.ఎస్.కె. టవర్స్‌కు ప్రతిరోజు గువ్వల రంగడు ఆటోట్రాలీతో వస్తాడు. ఇందులో 80కి పైగా నివాస గృహాలున్నాయి. ప్రతిరోజు రంగడు తన భార్య సుజాతతో కలిసి 500 ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను తీసుకెళతాడు. ఈ భార్యభర్తలిద్దరూ ఐదు గంటలకే ‘మనం మారుదాం మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం’ అన్న నినాదమున్న ఆటోట్రాలీతో వస్తారు. ఇలా గువ్వల రంగడి వాహనంలాగా జీహెచ్ఎంసీ పరిధిలో 4000కు పైగా ఆటో టిప్పర్లను ప్రభుత్వమే సబ్సిడీ కింద అందించింది. 4,50,000 రూపాయల ఖరీదైన ఆటోటిప్పర్ను, 1,50,000 చెల్లిస్తే లబ్ధిదారులకు జీహెచ్ఎంసీ అందించింది. ఈ వృత్తి ద్వారా అతనికి నెలకు అన్ని ఖర్చులు పోను 5 నుంచి 10 వేలు మిగులుతాయంటున్నాడు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన కేటీఆర్ ఆరోగ్య తెలంగాణకు నమూనాగా మొత్తం తెలంగాణలోని పట్టణాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దే కీలకమైన కర్తవ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేస్తున్నారు. ఆటోట్రాలీలు నడిపేవాళ్లు, చెత్తను మోసుకుపోయేవాళ్లు, పొరకల తల్లులకు, తండ్రులకు కొండంత అండగా తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుందన్న విశ్వాసం ఆ వర్గాల్లో బలంగా ఉంది. మా పిల్లలందరూ చదువుకునేందుకు గురుకులాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించి సీట్లివ్వాలని వాళ్లు కోరుతున్నారు. మహానగరాన్ని పరిశుభ్రం చేస్తున్న ఆ తల్లులు, తండ్రుల బిడ్డలు తెలంగాణ ప్రభుత్వానికున్న సామాజిక దృక్కోణపు చూపుడువేలు సాక్షిగా గురుకులాల్లోంచి ఉన్నత స్థానాలకు ఎదిగే శక్తిమంతులవుతారు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
బీసీ విజ్ఞాన సూర్యోదయం
తెలంగాణ రాష్ట్రంలో బహుజనుల జీవన విధానాన్ని మార్చి అన్నీ రంగాల్లో వారిని సమోన్నతంగా నిలపడానికి విద్యా విప్లవాలు విజయవంతమవుతున్నాయి. ఇపుడు తెలంగాణలో విద్యా విప్లవాలు అట్టడుగువర్గాల బహుజన వాకిళ్ల నుంచి విరబూస్తున్నాయి. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన పెద్దమార్పు ఇది. కార్పొరేట్ విద్యావ్యవస్థను పారద్రోలాలని నినాదాలిస్తే సరిపోదు. అందుకు ప్రత్యామ్నాయంగా తెలంగాణలో 959 గురుకుల విద్యాలయాలు కేసీఆర్ దార్శనికతతో ప్రారంభించారు. ఇపుడు 10వ తరగతి, ఇంటర్మీడియట్లలో ఫలితాలన్నీ గురుకులాల విద్యావ్యవస్థకే దక్కాయి. ప్రధానంగా సమాజంలో సగభాగమైన బీసీల జీవితాలు సంపూర్ణంగా మారాలంటే విద్యాపరంగా ఈ వర్గాలు దూసుకుపోయేందుకు బీసీ గురుకులాలు ఎంతో దోహదం చేస్తాయి. పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో బీసీ గురుకులాలే అగ్రభాగాన నిలిచి అత్యధిక ఫలితాలు సాధించాయి. ఇది బీసీ వర్గాలకు పలవరింతల పరవశం. తెలంగాణ రాష్ట్రం అవతరణకు ముందు బీసీలకు 19 గురుకులాల విద్యాసంస్థలు మాత్రమే ఉన్నాయి. ఇపుడవి 281 సంస్థలుగా వెలుగొందుతున్నాయి. 2015 నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభిస్తే ప్రతి ఏడాది ఈ విద్యాసంస్థలే అత్యధిక ఫలి తాలు సాధిస్తున్నాయి. ఒక బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఉంది. అది కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫలితాల్లో ఫస్ట్‌గా నిలిచింది. ఈ డిగ్రీ కాలేజీ నుంచి బైటకు వచ్చిన విద్యార్థులు దేశంలోని ప్రముఖ సంస్థల్లో పైచదువులు, శిక్షణ పొందుతున్నారు. ప్రతిష్ఠాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. ఈ ఫలితాలను చూసిన తర్వాతనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీల పిల్లలకోసం 30 డిగ్రీ కాలేజీలు, ఎస్టీ పిల్లలకోసం 22 డిగ్రీ కాలేజీలు ప్రారంభించారు. ట్రైబల్ వెల్ఫేర్‌లో 7 ఉమెన్స్ డిగ్రీ, 15 మెన్స్ డిగ్రీ కాలేజీలు నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఒక్కొక్క ఆర్మీ డిగ్రీ కాలేజీ పెట్టాలని నిర్ణయించారు. తెలంగాణలో 2023–24కు 119 బీసీల గురుకుల పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అవుతాయి. ప్రతి ఏడాది 20 వేల మంది విద్యార్థులు ఈ సంస్థల నుంచి ఇంటర్ పూర్తి చేసుకుని వస్తారు. అదే ఐదేళ్లలో ఒక లక్షమంది వస్తారు. వీళ్లు తెలంగాణలో అన్నిరంగాల్లోకి ఒక బలమైన శక్తిగా వెళ్లగలుగుతారు. తెలంగాణలో 125 బాలికల గురుకులాల విద్యాసంస్థలవల్ల భవిష్యత్తులో వీళ్లు జీవితంలో ఉన్నతంగా స్థిరపడుతున్న విశ్వాసం వ్యక్తమవుతుంది. బీసీ గురుకులాల్లోని 281 విద్యాసంస్థల్లో 2019–20కి గాను 90 వేలమంది విద్యార్థులుంటే 2020–21కి ఆ సంఖ్య ఒక లక్షా 11వేలకు పెరిగింది. వచ్చే ఏడాదికి 20 వేలమంది పెరుగుతారు. 2024–25 నాటికి ఒక లక్షా 70 వేలమంది బీసీ వర్గాలకు చెందిన పిల్లలు విద్యనభ్యసిస్తారంటే మొత్తం బీసీ కుటుంబాలను అవి ప్రభావితం చేస్తాయి. ప్రతి ఏడాది 10వ తరగతి, ఇంటర్ పూర్తిచేసిన 20వేల మంది ప్రతిభావంతులైన బీసీ విద్యార్థులు పైచదువులకు ఇతర కోర్సుల్లోకి వెళుతున్నారు. కేసీఆర్ ఆలోచనల్తో వెలిసిన 959 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీల గురుకులాలలో 4 లక్షలమంది విద్యనభ్యసిస్తున్నారు. 2024–25 నాటికి ఆ సంఖ్య వూహించని విధంగా పెరుగుతుంది. ఇది విద్యావిప్లవమే. దేశంలో ఎక్కడాలేని విధంగా 959 విద్యాసంస్థలు నెలకొల్పింది తెలంగాణ రాష్ట్రమే. రాబోయే ఐదేళ్లలో మొత్తం తెలంగాణ సమాజాన్ని ప్రభావితం చేసే మహాశక్తులుగా ఈ గురుకుల విద్యార్థులే అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుస్తారనటంలో సందేహం లేదు. ఇది సి.ఎం.కేసీఆర్కున్న దూరదృష్టి. ఇప్పటికే తెలంగాణ సీడ్స్హబ్, ఫార్మాహబ్, ఐటీహబ్, దేశానికి తిండిపెట్టే ధాన్యాగారంగా అగ్రభాగాన నిలిచింది. త్వరలో విద్యాహబ్‌గా తెలంగాణ తయారై తీరుతుంది. రాష్ట్రంలోని 24 లక్షలమంది విద్యార్థులకు విద్యనందించే ప్రభుత్వ స్కూళ్లను సెమి రెసిడెన్షియల్ స్కూళ్లుగా నిర్వహిస్తున్నారు. వీటిని కూడా పకడ్బందీగా నిర్వహించేందుకు అన్నివర్గాల, అన్నికులాల పేదపిల్లలకు ఉచిత చదువునందిం చేందుకు కేసీఆర్ దూరదృష్టితో అడుగులు వేస్తున్నారు. వూహించని విధంగా బీసీ డిగ్రీకాలేజీల సంఖ్యకూడా గణనీయంగా పెంచే ఆలోచనల్లోనే ప్రభుత్వం దృష్టిసారిస్తుంది. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దే కీలకమైన పనిని కేసీఆర్ తన భుజస్కంధాలపై వేసుకున్నారు. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆదివాసీలు 85శాతంగా వున్న ఆ వర్గాలు అన్నిరంగాల్లో శిరసెత్తుకుని నిలవాలంటే అందుకు బలమైన పునాది అయిన విద్యారంగాన్ని తీర్చిదిద్దాలన్న తలం పుతోనే కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. సమాజంలో సగభాగమైన బీసీ పిల్లలు జ్ఞానసూర్యులుగా తయారుకావడం బీసీలకు ఇక ఆకాశమే హద్దు. ఇవే జ్ఞానతెలంగాణకు బలమైన పునాదులు. జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 94401 69896 -
విద్యుత్ తేజో ‘ప్రభాకరుడు’
కొందరికి పదవుల వల్ల పేరొస్తుంది. కానీ, కొందరు వ్యక్తుల కృషి వల్ల ఆ పదవులకు వన్నె వస్తుంది. అలాంటి అరుదైన వ్యక్తులలో ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఒకరు. ఆయన వృత్తిలో ప్రవేశిస్తున్నప్పుడే ఎ.పి.ఎస్.ఇ.బి వ్యవస్థ ఏర్పడింది. ఇపుడు ఆ సంస్థ వయస్సు 50 ఏళ్లయితే ప్రభాకర్‌రావు సర్వీసు కూడా 50 ఏళ్లు అయ్యింది. ఇది కూడా అరుదైన సంఘటనగానే మిగిలిపోయింది. ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖకే వెలుగులు పంచి వన్నె తెచ్చారు. ఇది కూడా ఆయనకు చెరగని కీర్తి తెచ్చి పెట్టింది. ఆయన వృత్తిలో ఎందరెందరో ఉద్యోగులను, ఇంజనీర్లను, ఆడిటింగ్ సెక్షన్ ఆఫీసర్లను, పలురకాల ట్రేడ్ యూనియన్లు చూశారు. వాళ్లందరి తలలో నాలుకలాగా వ్యవహరించటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.ఎస్. రాజశేఖరరెడ్డి నుంచి చివరి ఏపీ సీఎంలు కొణిజేటి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల వరకు ఆయనకు బాగా తెలుసు. ఆ కాలంలోని సీఎంలందరూ ప్రభాకర్‌రావు వ్యక్తిత్వాన్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక సీఎం కేసీఆర్ చేపట్టిన 24 గంటల కరెంట్ సరఫరా ఆలోచన అమలుకు ప్రాణంగా ప్రభాకర్‌రావు పనిచేశారు. విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణను మలచటానికి ఎంతో శ్రమించి ప్రభుత్వానికి కుడిభుజంగా పనిచేశారు. కేసీఆర్ నమ్మి బాధ్యతనిస్తే చిత్తశుద్ధితో పనిచేసి ఆయన మన్ననలు పొందారు. ఈ 50 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ప్రభాకర్‌రావు వ్యక్తిత్వం, పనివిధానం ద్వారా, నిజాయతీ, నిబద్ధతల ద్వారా విద్యుత్ శాఖపై చెరగని ముద్ర వేశారు. ఒక రకంగా ఆయన తన ఇంటిని చూసుకున్నట్లే విద్యుత్ శాఖను కూడా చూసుకున్నారు. చేసే పనిలో చిత్తశుద్ధి, కృషి, ఆత్మగౌరవం, ఎవరికీ తలవంచనితనం, క్లిష్టసమయాల్లో సమస్యలను ఎదుర్కునే శక్తిని అందుకు పరిష్కార మార్గాలను వెతికి పట్టుకోవటంలో ఆయన సిద్ధహస్తుడు. విద్యుత్‌శాఖలో ప్రభాకర్‌రావు ఒక ఇన్‌సైడర్‌గా ఉన్నారు. విద్యుత్ శాఖ ఆత్మను ఆయన పట్టుకున్నారు. ఆయన ఆ శాఖలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించారు. 22 ఏళ్ల వయస్సులో ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ప్రభాకర్‌రావును ఒక అధికారి అపార్థం చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆయనను ‘ఐ విల్ సీ యువర్ ఎండ్’ అని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అధికారి అంతమాట అన్నందుకు ‘మనిద్దరి అంతు చూడటానికి పైవాడున్నాడు. మీరు మంచి మూడ్‌లో లేరు’ అని సమయస్ఫూర్తిగా మాట్లాడారు. ప్రభాకర్రావులో ఒక డైనమిజం ఉంది. ఆయన వృత్తిరీత్యా అకౌంట్స్ విభాగంలో ఉన్నప్పటికీ ఆయనకు స్నేహితులంతా ఇంజనీర్లుగా ఉన్నారు. అది కింది స్థాయి నుంచి పై వరకు ఉన్నారు. అలాగే ఆఫీసులో పనిచేసే వాచ్మెన్ దగ్గర్నుంచి ట్రేడ్‌యూనియన్ల వరకు ఎవరు కన్పించినా ప్రేమగా మాట్లాడటం ఆయన నుంచి నేర్చుకోవాలి. ఇంజనీరింగ్ క్యాటగిరికీ, అకౌంట్స్ శాఖకు మధ్యలో అనేక వైరుధ్యాలుంటాయి. ఒక్కొక్కసారి అవి శత్రుత్వాలుగా మారుతాయి. ప్రభాకర్‌రావు ఈ రెండింటి మధ్యలో ఉన్న రైవలిజం అనే బెర్రను చెరిపివేశారు. అదే ఆయనను ఈ రెండు శాఖల మధ్య వారధిని చేశాయి. ఈ రెండు శాఖల మధ్య ఆయన వంతెనగా మారడంతో విద్యుత్ శాఖలో ‘‘లోపల మనిషి’’ అయ్యారు. ఆయన అకౌంట్స్ ఆఫీసర్‌గా మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఈ దశలోనే ఆయన అసోషియేషన్ అధ్యక్షుడూ అయ్యారు. దీంతో అన్ని శాఖల మధ్య దూరాన్ని తొలగించి మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేయగలిగారు. విద్యుత్ శాఖలో ఆయన ఈ ఉన్నత దశలో ఉండటానికి కారణం ఇదేననుకుంటా! తెలంగాణ రాష్ట్ర అవతరణ తరువాత అలుముకున్న చీకట్లను తొలగించటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే చీకట్లు కమ్ముకుంటాయని జరిగిన ప్రచారాల్ని తిప్పి కొట్టడానికి ఆయన సీఎం అయ్యాక తొలిగా 24 గంటల నిరంతర కరెంటు ఇచ్చే పనికి శ్రీకారం చుట్టారు. చీకట్లను చీల్చుకుంటూ విద్యుత్ వెలుగులను పంచటానికి ముందుకు సాగిన కేసీఆర్‌కు ఈ ప్రభాకర్‌రావు ఒక కార్యకర్తగా కృషిచేశారు. దాన్ని ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా ప్రకటించారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌శాఖ అభివృద్ధి కోసం కృషిచేసిన ప్రభాకర్‌రావుకు అనుకోకుండా రాష్ట్రం రావడంతో తను పుట్టిపెరిగిన నేలకు సేవ చేసి తరించే అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. ట్రాన్స్‌కో సీఎండిగా ప్రభాకర్‌రావును ఎంపిక చేయటం ఒక రకంగా ఆయనకు జీవనసాఫల్య పురస్కారం లభించినట్లుగానే భావించాలి. కేసీఆర్ ఏ పనైనా చేపడితే ఎంత మొండితనంతో దూసుకుపోతాడో తెలిసిందే. అందుకు నికార్సైన మనుషులనే ఆయన ఎంచుకుంటారు. ఈ దారిలో విద్యుత్‌శాఖకు ప్రభాకర్‌రావును ఆయన ఎంచుకున్నారు. సరిగ్గా కేసీఆర్ ఏ ఆలోచనతో ముందుకుపోతున్నారో అందుకు మొత్తం విద్యుత్‌శాఖను సన్నద్ధం చేసిన కార్యకర్తగా ప్రభాకర్‌రావుకు గుర్తింపు ఉంది. ఇది ఆయన జీవితంలో అందుకున్న అన్ని పురస్కారాలకంటే గొప్పది. -జూలూరు గౌరీశంకర్ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు మొబైల్ : 94401 69896 -
సంచారజాతులు సుఖీభవ
భారత రాజ్యాంగం సాక్షిగా సంచార జాతులకు ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. సంచారజాతులకు సమున్నత స్థానం కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం తాపత్రయపడుతోంది. అందుకోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక పథకాలను రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందరి పిల్లల్లాగే సంచారజాతుల పిల్లలు కూడా పుస్తకాల సంచులు భుజాన వేసుకొని బడులకు అడుగులు వేయాలని ఆయన అభిలషిస్తున్నారు. ప్రభుత్వ గురుకులాలలో వారి పిల్లల్ని చేర్పించేందుకు సాంఘిక సంక్షేమ అధికారులు కృషి చేస్తున్నారు. సంచారజాతుల సమగ్రజీవన విధానంపై అధ్యయనం చేయాల్సిందిగా కేసీఆర్ బీసీ కమిషన్‌ను ఆదేశించారు. ఎంబీసీలకు ఉన్న కనీస రక్షణ కూడా సంచారజాతులకు లేదు. నాగరిక సమాజానికి వారు ఎంతో దూరంలో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వం గుర్తించిన అలాంటి వారందరికీ న్యాయం చేసే కృషి మొదలైంది. 1968లో ఏర్పడ్డ అనంతరామన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్‌లో బీసీలను ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించింది. ఆ తర్వాత వచ్చిన మురళీధర్‌రావు కమిషన్ దాన్ని ఏ విధంగా అమలు జరపాలో చెప్పింది. బ్రిటిష్ ప్రభుత్వం 1871లో ఎస్టీ, ఎస్సీలలోని సంచారజాతులను క్రిమినల్ ట్రైబ్స్ అంది. భారత ప్రభుత్వం 1952 ఆగస్టు 31న క్రిమినల్ ట్రైబ్స్ అనే అపవాదం నుంచి విముక్తం చేస్తూ వీరిని విముక్త జాతులు అంది. కానీ సంచారజాతుల వారికి నిలకడ ఉండదు. సంచారమే వారి జీవనం. వారిని నిలకడగల స్థానంలో నిలబెట్టే పని చేయాలి. వారికి ఇళ్లు ఉండవు. వారి పిల్లలకు చదువులుండవు. వారికి ప్రత్యేకంగా ఒక ఊరంటూ కూడా లేని వారున్నారు. వారిని సెటిల్ చేయాలన్నదే లక్ష్యం. ఇప్పుడు ఊరు–వాడ మాత్రమే లెక్కకు వస్తున్నాయి. కానీ, లెక్కలోకి రానిది ఊరులేని కడగొట్టు వారు సంచారజాతి. తెలంగాణ ప్రభుత్వం ఎంబీసీలకుప్రత్యేకంగా ఎంబీసీ కార్పొరేషన్‌ను వేసింది. ఇటీవల సంచారజాతులకు చెందిన వారు తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తులను బీసీ కమిషన్‌కు అందించింది. వారు అనేక విషయాలను కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. దాంతోపాటుగా వారు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వ కుంట్ల చంద్రశేఖర్‌రావు తమతో కలసి ఒక రోజంతా ఉండాలన్న కోరిక ఉందని తెలిపారు. కేసీఆర్ వారితో కలసి భోజనం చేయడమే కాదు, వారి జీవన ముఖచిత్రాన్ని మార్చేందుకు ప్రణాళికలు రూపొందించే పని మొదలైంది. సంచారజాతులు సుఖీభవ! నేడు సంచార జాతుల విముక్త దినం వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు‘ మొబైల్: 9440169896 జూలూరు గౌరీశంకర్