తెలంగాణ సాహిత్య అకాడమీ గ్రామ చరిత్రలను రికార్డు చేసే బృహత్తర పనికి శ్రీకారం చుట్టింది. కళాశాలలో చదువుకునే విద్యార్థుల చేతే వారి వారి గ్రామ చరిత్రల్ని రాయించే పనికి పూనుకొంది. నల్లగొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో మార్చి 29న వందలాది మంది విద్యార్థులు ‘మన చరిత్రను మనం రాసుకుందాం’ అనే బృహత్తర సామూహిక చరిత్ర రచనా కార్యక్రమానికి నాంది పలికి ‘చరిత్ర సృష్టించారు’.
తెలంగాణ సాహిత్య అకాడమీ, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని 860 గ్రామాల చరిత్రను ఆ గ్రామాలకు చెందిన యువకులే రచించేందుకు ముందుకు రావటం విశేషం. ప్రఖ్యాత సామాజిక శాస్త్రజ్ఞుడు ఎస్సీ దూబే 1951–52లో షామీర్‌పేట గ్రామంపై పరిశోధన చేసి రాసిన ‘ఇండియన్ విలేజ్’ గ్రంథం ప్రేరణతో గ్రామ చరిత్రలను విద్యార్థులతో రికార్డు చేయించే పనికి పూనుకుంది అకాడమీ. ప్రముఖ చరిత్రకారుడు బీఎన్ శాస్త్రి చరిత్ర రచనకు కొనసాగింపుగా వేలమంది విద్యార్థులు నూతన చరిత్ర రచనకు ఉద్యుక్తులు కావటం విశేషం.
ఇప్పటికే ఊరు తనకు తానుగా స్వతంత్రంగా రూపొందిన చరిత్రను, ఊళ్లో ఉన్న ఆలయాలు, వాటి ప్రాచీనత, శాసనాలు, పాత నిర్మాణ అవశే షాలను విద్యార్థులే రికార్డు చేస్తారు. రాష్ట్ర అవతరణ తర్వాత వేగవంతంగా జరిగిన పనులన్నింటినీ చరిత్ర పేజీలకెక్కిస్తారు. తమ వ్యవసాయ పంటలు, ఊర్లోని పరిశ్రమలు, చేతివృత్తులు, రవాణా సౌకర్యాలు, రహదార్లు, తారురోడ్లు, సిమెంట్ రోడ్లు, కంకర రోడ్లు, మట్టి రోడ్లు, గ్రామంలో వ్యాపారాలు, వాహనాల దగ్గర్నుంచి అన్నింటినీ లెక్కలు కట్టి విద్యార్థులు తమ ఊరి చరిత్రలో లిఖిస్తారు.
గ్రామంలో కులాలు, మతాలు, పండుగలు, ఆటపాటలు, ఈ నేలమీద ఉన్న గంగా జమునా తెహజీబ్ సంస్కృతులను విద్యార్థులు తమ కలాలతో రాస్తారు. తమ గ్రామం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగొచ్చిన వారి చరిత్రలను, వాటి వివరాలను కూడా రికార్డ్ చేస్తారు. ఈ నేలమీద భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన యోధులు, తొలి మలి దశ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వాళ్ల చరిత్రలను తెలిసిన మేరకు సమాచార సేక రణతో విద్యార్థులు గ్రామ చరిత్రలను రాస్తారు. విద్యార్థులు తీసుకువచ్చిన సమాచారంతో సాహిత్య అకాడమీ వాటిని గ్రంథాలుగా వెలువరిస్తుంది.
ఎస్‌సీ దూబే నేతృత్వంలో 1951–52 ఉస్మా నియా ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు షామీర్ పేట గ్రామంపై చేసిన పరిశోధన ‘ఇండియన్ విలేజ్’ గ్రంథంగా వెలువడింది. ఎంఎన్ శ్రీనివాస్ కర్ణాటకలోని రాంపూర్ గ్రామంపై అధ్యయనం చేశారు. సోషల్ ఆంత్రోపాలజిస్టు అయిన ఎంఎన్ శ్రీనివాస్ ‘సోషల్ ఛేంజ్ ఇన్ మోడ్రన్ ఇండియా’, ‘ది రిమెమ్బర్డ్ విలేజ్’, ‘రిలిజియన్ అండ్ సొసైటీ అమాంగ్ ది క్రూగ్స్ ఆఫ్ సౌత్ ఇండియా’ గ్రంథాలు రాశారు. యాంద్రీ బెతిల్ వే అనే మరో సోషల్ ఆంత్రోపాలజిస్టు తమిళనాడు తంజావూరు జిల్లా లోని శ్రీపురం గ్రామంపై అధ్యయనం చేసి గొప్ప గ్రంథాన్ని రాశారు.
మహారాష్ట్రకు చెందిన ఏఆర్ దేశాయ్ గ్రామీణ జీవితాన్ని విశ్లేషిస్తూ గ్రంథం రాశారు. మన తెలంగాణలో ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు కపిలవాయి లింగమూర్తి, బీఎన్ శాస్త్రి తెలంగాణ చరిత్రకు ఎనలేని సేవ చేశారు. వ్యక్తులుగా చరిత్రకారులు చేసిన పరిశోధన వేరు.. ఇపుడు నల్లగొండ ఎన్జీ కాలేజీ విద్యార్థులు 860 గ్రామాల చరిత్రలను రాయటానికి సామూహిక ఆంత్రోపాలజిస్టులుగా కదలిరావటం వేరు. రేపటి కొత్త చరిత్రకారుల ఆవిర్భావానికి వీరి పూనికతో బలమైన బీజం పడుతుంది.
-జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment