తెలంగాణ ఏర్పడినాక ఎక్కువగా రూపాంతరం చెందింది సినిమా రంగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికిలో ఉన్నప్పుడు తీవ్ర వివక్షకి గురి అయిన వాటిలో భాష ఒకటి. రెండున్నర జిల్లాల భాషే ప్రామాణిక భాష అని ఒక ప్రామాణికతను తీసుకుని వచ్చి తెలంగాణ యాసను రౌడీలకు, గూండాలకు, హాస్యనటులకు ఉపయోగించి దాన్ని ఆధిపత్య రథచక్రాల కింద నలిపివేసిన దుస్థితి వుంది. తెలంగాణ వచ్చాక ఆ భాష మారింది. తెలంగాణ యాస కాదు తెలంగాణ భాష అన్న గ్రహింపు, గుర్తింపు వచ్చింది. తెలంగాణ సంస్కతీ నేపథ్యంగా సిని మాలు తీయడం మొదలు అయింది.
రౌడీలు, గూండాలకి కాక కథానాయకులు తెలంగాణ భాషలో మాట్లాడటం మొదలు అయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ జాతీయ అవార్డు అందుకోవడంతో తెలం గాణ సినిమా వైపు దేశం దృష్టి సారించింది. శేఖర్ కమ్ముల తీసిన ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ కావడంతో తెలంగాణ భాషకి తెలంగాణ అవతల కూడా జయకేతనం ఎగురవేసినట్టు అయింది. నల్లగొండ జిల్లాకి చెందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తీసిన ‘మల్లేశం’ బయోపిక్ విజయవంతం కావడం... అటు ఉత్తరాంధ్ర నుండి ‘పలాస’ రావడంతో తెలుగు సినిమాలో వైవిధ్యతకి తెలంగాణ మార్గం చూపినట్లు అయింది.
రాష్ట్ర అవతరణ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలగంగ ఎగిసిపడి ఎగువ భూములను, కరువు నేలలను ఏ విధంగా సస్యశ్యామలం చేస్తోందో, అలాగే తెలంగాణ తల్లి భాష కూడా వెల్లివిరిసిన పండు వెన్నెలలా సాహిత్య సౌరభాలను దిగంతాలకు వెదజల్లుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 9ని ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని ‘‘తెలంగాణ భాషా దినోత్సవం’’గా ప్రకటించి సమున్నతంగా గౌరవించారు. తెలంగాణ రాష్ట్రం రావటం వల్లనే దాశరథి, కాళోజీల పేరున అవార్డులను ప్రకటించుకుని మన కవులను సత్కరించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చాకనే విస్మృత తెలంగాణ సాహితీవేత్తలను వెలుగులోకి తెచ్చి 1వ తరగతి నుంచి 10 వరకు, ఇంటర్, డిగ్రీలలో సిలబస్‌ల్లోకి చేర్చి ఈ తరానికి పాఠ్యాంశాలుగా బోధించటం జరుగుతోంది.
అన్ని రకాల పోటీ పరీక్షలలో తెలంగాణ సాహిత్య వైతాళికులు, కవులు, రచయితలు, సాహితీమూర్తులు, సాంస్కృతిక యోధుల సేవలను, రచనలను అడుగుతున్నారు. ఈ నేలమీద పాలనారంగం నుంచి అన్నిశాఖ లలో పని చేసేవారు విధిగా తెలంగాణ సాహిత్యం, మన కళలు, సంస్కృతి, మన పండుగలకు సంబంధించిన అవగాహన చేసుకునే విధంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల జీవన సాంస్కృతిక నేపథ్యాన్ని ఈ తరం చదువుకునే విధంగా సిలబస్‌లను రూపకల్పన చేయటమైనది.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషను తక్కువ చేసి చూశారు. కాళోజీ అన్నట్లు రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాషగా మనపై రుద్దారు. ఇపుడాస్థితి లేదు. తెలంగాణ తల్లిభాషకు విముక్తి లభించింది. తెలంగాణ యాసనే ఇపుడు అధికార భాషగా నిలిచింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కాళోజీ జయంతి సభలు జరపటానికి చాలా కష్టపడవలసివచ్చింది. అన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో సమావేశాలు జరిపి తెలంగాణ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ, రాష్ట్రం వచ్చాక సెప్టెంబర్ 9 మాతృభాషా దినోత్సవం లక్షలాది మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో జరుగుతోంది. ఈ రోజున రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ స్కూళ్లలో, వేలాది ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాతృభాషా దినోత్సవ వేడుకలతో కాళోజీ అమర్‌హే, మాతృభాష వర్ధిల్లాలి అన్న సందేశాలతో, నినాదాలతో విద్యాప్రాంగణాలన్నీ మారుమోగుతాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ, మాధ్యమిక విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖలన్నీ వాళ్లకున్న వెసులుబాట్లతో మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు.
విద్యారంగంలో 1వ తరగతి నుంచి అన్ని విద్యాసంస్థలు, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులలో విద్యనభ్యసించే సుమారు కోటిమంది విద్యార్థులకు మాతృభాషా దినోత్సవ సందేశం అందుతుంది. భాషాభిమానులు దీన్ని పెద్ద సాహిత్య సాంస్కృతిక పండుగగా జరుపుకుంటున్నారు. స్వరాష్ట్ర సాధనకోసం స్వయంగా పాటలు రాసిన కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా సాహిత్య సాంస్కృతిక రంగాన్ని కూడా పునర్నిర్వచిస్తున్నారు. మలిదశ ఉద్యమాన్ని ప్రజాకర్షకంగా తీర్చిదిద్ది ప్రజానీకానికి అందించటంలో ఆయనలోని తల్లిభాష, తెలంగాణ నుడికారం, వాక్ శుద్ధి, చెలుకులు, చలోక్తులు, సామెతలతోపాటు, తనదైన శైలిలో భాషకు కూడా యుద్ధాన్ని నేర్పిన యుద్ధ భాషి కేసీఆర్. తెలంగాణ వచ్చాక తానే పాలకుడుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ భాషకున్న సొగసులను, సొబగులను, మన పద్యాన్ని, గద్యాన్ని, కవితను, పాటను పాడి మరీ వినిపించారు. రాష్ట్రం వచ్చాక విస్మృత సాహితీవేత్తలు వెలుగులోకి వచ్చి, పాఠ్యాంశాలుగా నిలిచారు. తెలంగాణ సాహిత్య అకాడమీ 100 పుస్తకాలను ప్రచురించింది. తెలం గాణ కవిత్వం కాళేశ్వరాలుగా ప్రవహిస్తోంది. పద్య కవిత్వం, గద్య కవిత్వం, వచన కవిత్వం, దీర్ఘకవితలు, విడికవితలు విరివిగా వస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ‘నీది నాది ఒకే కథ’ సినిమాకు యువకవి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ‘ఫిధా’ సినిమాలో తెలంగాణ భాష. నిజామాబాద్ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చింది. తెలంగాణ ఫిలిం డెవలప్‌మెంట్ మాజీ చైర్మన్ రామ్మోహన్‌రావు తీసుకువస్తున్న ‘లవ్‌స్టోరి’కి శేఖర్‌కమ్ముల డైరెక్టర్ కాగా ఇంకా విడుదల కాని ఈ సినిమాలోని తెలంగాణ నేపథ్యంలోని పాట ‘దాని కుడిభుజంమీది కడవ.. సారంగదరియా’ అన్న పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో 30 కోట్లమందికిపైగా వీక్షించారు.
ఇప్పుడు తెలంగాణ భాష హీరోల భాష. ఇప్పుడు తెలంగాణ భాష తెలంగాణ సినిమాలను హిట్టుకొట్టించే భాష. తెలంగాణ చారిత్రక విశేషాలను శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాసరావు, అరవింద్ ఆర్యాపకడే, వేముగంటి మురళీలు వెతికితీస్తున్నారు. కరోనా ప్రపంచాన్ని కమ్మేసిన స్థితిలో జూమ్ వేదికగా, యూట్యూబ్‌లు, సోషల్ మీడియాలు వేదికగా వందలమంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ కలాలకు, గళాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ వచ్చాక మన మాతృభాషకు సమున్నత స్థానం లభించింది. సెప్టెంబర్ 9ని మాతృభాషా దినోత్సవంగా ఘనంగా జరుపుకుందాం.
-జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త కవి, విమర్శకుడు
(నేడు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా)
Comments
Please login to add a commentAdd a comment