telangana language day
-
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలి : కేవీ రమణాచారి
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం ,తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107 వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడుతూ కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం గా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతుందని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని,కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళోజీ సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు .తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు.ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం ,డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజి చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని అన్నారు సామాన్యులను సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి ,కార్యదర్శివి.ఆర్. విద్యార్థి ,కాళోజి కుమారుడు రవికుమార్ ,ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు. -
ప్రజలకు భాషా దినోత్సవ శుభాకాంక్షలు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయం తిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి.. తెలంగాణ సాం స్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని సీఎం అన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసేందుకు తెలంగాణ సాహితీవేత్తలు కృషిని కొనసాగించాలని కోరారు. తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషిచేస్తున్న కవులు, రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ ప్రభుత్వం గౌరవించుకుంటోందని కేసీఆర్ చెప్పారు. ఏటా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరానికి అందుకుంటున్న ప్రముఖ కవి, రచయిత పెన్నా శివరామకృష్ణకు సీఎం అభినందనలు తెలిపారు. -
సాంస్కృతిక తెలంగాణ చూపుతున్న వెలుగు దారి
తెలంగాణ ఏర్పడినాక ఎక్కువగా రూపాంతరం చెందింది సినిమా రంగం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉనికిలో ఉన్నప్పుడు తీవ్ర వివక్షకి గురి అయిన వాటిలో భాష ఒకటి. రెండున్నర జిల్లాల భాషే ప్రామాణిక భాష అని ఒక ప్రామాణికతను తీసుకుని వచ్చి తెలంగాణ యాసను రౌడీలకు, గూండాలకు, హాస్యనటులకు ఉపయోగించి దాన్ని ఆధిపత్య రథచక్రాల కింద నలిపివేసిన దుస్థితి వుంది. తెలంగాణ వచ్చాక ఆ భాష మారింది. తెలంగాణ యాస కాదు తెలంగాణ భాష అన్న గ్రహింపు, గుర్తింపు వచ్చింది. తెలంగాణ సంస్కతీ నేపథ్యంగా సిని మాలు తీయడం మొదలు అయింది. రౌడీలు, గూండాలకి కాక కథానాయకులు తెలంగాణ భాషలో మాట్లాడటం మొదలు అయింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ జాతీయ అవార్డు అందుకోవడంతో తెలం గాణ సినిమా వైపు దేశం దృష్టి సారించింది. శేఖర్ కమ్ముల తీసిన ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ కావడంతో తెలంగాణ భాషకి తెలంగాణ అవతల కూడా జయకేతనం ఎగురవేసినట్టు అయింది. నల్లగొండ జిల్లాకి చెందిన చింతకింది మల్లేశం జీవితం ఆధారంగా తీసిన ‘మల్లేశం’ బయోపిక్ విజయవంతం కావడం... అటు ఉత్తరాంధ్ర నుండి ‘పలాస’ రావడంతో తెలుగు సినిమాలో వైవిధ్యతకి తెలంగాణ మార్గం చూపినట్లు అయింది. రాష్ట్ర అవతరణ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలగంగ ఎగిసిపడి ఎగువ భూములను, కరువు నేలలను ఏ విధంగా సస్యశ్యామలం చేస్తోందో, అలాగే తెలంగాణ తల్లి భాష కూడా వెల్లివిరిసిన పండు వెన్నెలలా సాహిత్య సౌరభాలను దిగంతాలకు వెదజల్లుతోంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 9ని ప్రజాకవి కాళోజీ నారాయణరావు జన్మదినాన్ని ‘‘తెలంగాణ భాషా దినోత్సవం’’గా ప్రకటించి సమున్నతంగా గౌరవించారు. తెలంగాణ రాష్ట్రం రావటం వల్లనే దాశరథి, కాళోజీల పేరున అవార్డులను ప్రకటించుకుని మన కవులను సత్కరించుకుంటున్నాం. రాష్ట్రం వచ్చాకనే విస్మృత తెలంగాణ సాహితీవేత్తలను వెలుగులోకి తెచ్చి 1వ తరగతి నుంచి 10 వరకు, ఇంటర్, డిగ్రీలలో సిలబస్ల్లోకి చేర్చి ఈ తరానికి పాఠ్యాంశాలుగా బోధించటం జరుగుతోంది. అన్ని రకాల పోటీ పరీక్షలలో తెలంగాణ సాహిత్య వైతాళికులు, కవులు, రచయితలు, సాహితీమూర్తులు, సాంస్కృతిక యోధుల సేవలను, రచనలను అడుగుతున్నారు. ఈ నేలమీద పాలనారంగం నుంచి అన్నిశాఖ లలో పని చేసేవారు విధిగా తెలంగాణ సాహిత్యం, మన కళలు, సంస్కృతి, మన పండుగలకు సంబంధించిన అవగాహన చేసుకునే విధంగా పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నాలుగుకోట్ల మంది తెలంగాణ ప్రజల జీవన సాంస్కృతిక నేపథ్యాన్ని ఈ తరం చదువుకునే విధంగా సిలబస్‌లను రూపకల్పన చేయటమైనది. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాషను తక్కువ చేసి చూశారు. కాళోజీ అన్నట్లు రెండున్నర జిల్లాల భాషే తెలుగు భాషగా మనపై రుద్దారు. ఇపుడాస్థితి లేదు. తెలంగాణ తల్లిభాషకు విముక్తి లభించింది. తెలంగాణ యాసనే ఇపుడు అధికార భాషగా నిలిచింది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో కాళోజీ జయంతి సభలు జరపటానికి చాలా కష్టపడవలసివచ్చింది. అన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో సమావేశాలు జరిపి తెలంగాణ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ, రాష్ట్రం వచ్చాక సెప్టెంబర్ 9 మాతృభాషా దినోత్సవం లక్షలాది మంది విద్యార్థులతో, ఉపాధ్యాయులతో జరుగుతోంది. ఈ రోజున రాష్ట్రంలోని 30 వేల ప్రభుత్వ స్కూళ్లలో, వేలాది ప్రైవేట్ విద్యాసంస్థల్లో మాతృభాషా దినోత్సవ వేడుకలతో కాళోజీ అమర్‌హే, మాతృభాష వర్ధిల్లాలి అన్న సందేశాలతో, నినాదాలతో విద్యాప్రాంగణాలన్నీ మారుమోగుతాయి. రాష్ట్రంలోని పాఠశాల విద్యాశాఖ, మాధ్యమిక విద్యాశాఖ, ఉన్నత విద్యా శాఖలన్నీ వాళ్లకున్న వెసులుబాట్లతో మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు. విద్యారంగంలో 1వ తరగతి నుంచి అన్ని విద్యాసంస్థలు, మెడిసిన్, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులలో విద్యనభ్యసించే సుమారు కోటిమంది విద్యార్థులకు మాతృభాషా దినోత్సవ సందేశం అందుతుంది. భాషాభిమానులు దీన్ని పెద్ద సాహిత్య సాంస్కృతిక పండుగగా జరుపుకుంటున్నారు. స్వరాష్ట్ర సాధనకోసం స్వయంగా పాటలు రాసిన కేసీఆర్ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగంగా సాహిత్య సాంస్కృతిక రంగాన్ని కూడా పునర్నిర్వచిస్తున్నారు. మలిదశ ఉద్యమాన్ని ప్రజాకర్షకంగా తీర్చిదిద్ది ప్రజానీకానికి అందించటంలో ఆయనలోని తల్లిభాష, తెలంగాణ నుడికారం, వాక్ శుద్ధి, చెలుకులు, చలోక్తులు, సామెతలతోపాటు, తనదైన శైలిలో భాషకు కూడా యుద్ధాన్ని నేర్పిన యుద్ధ భాషి కేసీఆర్. తెలంగాణ వచ్చాక తానే పాలకుడుగా ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాషకున్న సొగసులను, సొబగులను, మన పద్యాన్ని, గద్యాన్ని, కవితను, పాటను పాడి మరీ వినిపించారు. రాష్ట్రం వచ్చాక విస్మృత సాహితీవేత్తలు వెలుగులోకి వచ్చి, పాఠ్యాంశాలుగా నిలిచారు. తెలంగాణ సాహిత్య అకాడమీ 100 పుస్తకాలను ప్రచురించింది. తెలం గాణ కవిత్వం కాళేశ్వరాలుగా ప్రవహిస్తోంది. పద్య కవిత్వం, గద్య కవిత్వం, వచన కవిత్వం, దీర్ఘకవితలు, విడికవితలు విరివిగా వస్తున్నాయి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్యంపై పరిశోధనలు జరుగుతున్నాయి. తెలంగాణ నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. ‘నీది నాది ఒకే కథ’ సినిమాకు యువకవి వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ‘ఫిధా’ సినిమాలో తెలంగాణ భాష. నిజామాబాద్ ప్రాంత నేపథ్యం నుంచి వచ్చింది. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ మాజీ చైర్మన్ రామ్మోహన్రావు తీసుకువస్తున్న ‘లవ్‌స్టోరి’కి శేఖర్‌కమ్ముల డైరెక్టర్ కాగా ఇంకా విడుదల కాని ఈ సినిమాలోని తెలంగాణ నేపథ్యంలోని పాట ‘దాని కుడిభుజంమీది కడవ.. సారంగదరియా’ అన్న పాటను ఇప్పటికే యూట్యూబ్‌లో 30 కోట్లమందికిపైగా వీక్షించారు. ఇప్పుడు తెలంగాణ భాష హీరోల భాష. ఇప్పుడు తెలంగాణ భాష తెలంగాణ సినిమాలను హిట్టుకొట్టించే భాష. తెలంగాణ చారిత్రక విశేషాలను శ్రీరామోజు హరగోపాల్, కట్టా శ్రీనివాసరావు, అరవింద్ ఆర్యాపకడే, వేముగంటి మురళీలు వెతికితీస్తున్నారు. కరోనా ప్రపంచాన్ని కమ్మేసిన స్థితిలో జూమ్ వేదికగా, యూట్యూబ్‌లు, సోషల్ మీడియాలు వేదికగా వందలమంది కవులు, రచయితలు, సాహితీవేత్తలు తమ కలాలకు, గళాలకు పదును పెడుతున్నారు. తెలంగాణ వచ్చాక మన మాతృభాషకు సమున్నత స్థానం లభించింది. సెప్టెంబర్ 9ని మాతృభాషా దినోత్సవంగా ఘనంగా జరుపుకుందాం. -జూలూరు గౌరీశంకర్ వ్యాసకర్త కవి, విమర్శకుడు (నేడు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా) -
‘తెలంగాణ తెలుగు’ ఉన్నట్టా? లేనట్టా?
సందర్భం ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ తెలుగు భాష అని ప్రజలు అనవద్దు. సరే. ఐతే, తెలంగాణ భాష అనేది ప్రభుత్వం ఉనికిలో ఉందా లేదా అనే విషయాన్ని విస్పష్టంగా ప్రజలకు వివరించవలసి ఉంది. దానినే రేపు తెలంగాణ సమాజం అంతా అంగీకరించవలసి ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీ కాళోజి జయంతి. ఆ రోజున తెలంగాణ భాషా దినోత్సవం జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంతోషించాల్సిందే. ఏటా జయంతులు, వర్ధంతులు తామున్నామని గుర్తు చేస్తుంటాయి. ప్రభుత్వంలో, సమాజంలో ఎలాంటి కదలికలు లేకపోవడం వల్ల అవి యాంత్రికమవుతాయి. అంతేకాదు. ఆయా వ్యక్తుల స్ఫూర్తికి విరుద్ధ దిశలో జరుగుతూ ఉంటాయి. ఇది మరీ విషాదం. ఆయా సుప్రసిద్ధులకు అపచారం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం కూడా సరికాదు. గిడుగు రామ్మూర్తి జన్మదినాన్ని తెలుగు భాషాదినోత్సవంగా జరపాలని ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన తరువాత కాళోజి జయంతిని తెలంగాణ భాషాదినోత్సవంగా జరపాలని తెరాస ప్రభుత్వం నిర్ణయించింది. కానీ రెండు కొత్త రాష్ట్రాలలో ఇప్పుడు రెండు తెలుగు భాషలకు విలువ లేకుండాపోయింది. విద్య, న్యాయ, పరిపాలనా రంగాలలో తల్లి నుడికి అవమానం జరుగుతున్నది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడ్డానికి ఆంధ్ర భాషే కారణం. రాష్ట్రాలు విడిపోవడానికి కూడా తెలుగు భాషే ఒక ప్రధాన కారణం. ఐనా అంతటి, ప్రాధాన్యతా అంశం అయిన భాషలకి దశాబ్దాలుగా అవమానం జరుగుతున్నది. మొదటి ప్రపంచ మహా సభలు జరిపిన ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు దగ్గర నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకు, మధ్యలో తెలుగుదేశం పాలనలో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సైతం అందరిదీ ఒకే తీరు, ఒకే విధానం. వ్యవహార భాషగా, బోధన భాషగా, పాలన భాషగా, కోర్టు భాషగా ఉండాల్సిన తెలుగు భాష ఎక్కడా కానరాదు. ఆయా రంగాలలో తెలుగు ఉంటే ప్రజలకు చాలా ఉపయోగం. కాని ప్రభుత్వాలు ప్రజల దృక్కోణంలోంచి ఆలోచించడం లేదు. అంటే ప్రజలు సృష్టించుకున్న భాషపై ఒకనాడు అగ్రకులాల పెత్తనం, ఇప్పుడు అదే తరహాలో ప్రభుత్వాల పెత్తనం కొనసాగుతున్నది. ప్రజల తల్లి భాషను అసలే పట్టించుకోవద్దు. వ్యవహారంలో, సాహిత్యంలో పండిత భాషకు పట్టం కట్టాలి. సామ్రాజ్యవాదుల, జాతీయ ప్రభుత్వాల భాషా పాలసీలకు అనుగుణంగా తల వంచి జో హుకుం అనాలి. భాషని ప్రజాస్వామీకరించడానికి గిడుగు, కాళోజీలు ఎంతో కృషి చేశారు. నిజాయితీగా పోరాడారు. ఎవరికీ తలవంచలేదు. భాషా ఛాందసాన్ని తగ్గించి, ప్రజల భాషా విధానాన్ని పెంచారు. దానివల్ల అక్షరాస్యత శాతం పెరిగింది. భారత దేశంలో ప్రస్తుతం అక్షరాస్యతలో తెలంగాణ అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల కన్నా అధమ స్థాయిలో అంటే 32వ స్థానంలో ఉంది. ఇప్పుడున్న భాషా విధానాన్ని చూస్తే వయోజన విద్యని కూడా ఆంగ్ల మాధ్యమంలో బోధిస్తారేమో అని భయంగా ఉంది. ఏ భాషకూ కొరగాని సంకర, దద్దమ్మ విద్యార్థుల తరాన్ని తయారు చేయడం వల్ల కొత్త రాష్ట్రంలో విద్యాస్థాయి తగ్గిపోతుంది. ఇవేవీ పట్టించుకోని ప్రభుత్వాలు తల్లిభాషా దినోత్సవాలు జరపడానికి అర్హులా? ఏమైనా అంటే, ఆ సందర్భంగా సాహిత్య తదితరమైన నాలుగు అవార్డులు ఇచ్చి భాషా దినోత్సవాన్ని నిర్వహించామని చెప్పుకోవడం ఏపాటి సబబు. కాళోజి పురస్కారం పేరుతో కాళోజి స్ఫూర్తికి విరుద్ధమైన, వ్యతిరేక విలువలు కలిగిన వారికి పురస్కారాలు ఇవ్వకుండా జాగ్రత్తపడాలి. తెలంగాణ సాహిత్య అకాడమి అధ్యక్షులు డాక్టర్ నందిని సిధారెడ్డి ‘దక్కన్ ల్యాండ్’ మాసపత్రిక (జూలై, 2017)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘‘ఈ ప్రపంచ మహాసభలను తెలంగాణ పేరిట నిర్వహిద్దామని కొందరు అన్నా, సీఎం మాత్రం ప్రపంచ తెలుగు మహాసభలుగానే సూచించారు’’ అని చెప్పారు. కాళోజి పేరుతో ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం జరుపుతుంది. కాని ప్రపంచ మహాసభలను మాత్రం తెలుగు మహాసభల పేరనే జరుపుతారట! ఎంత విచిత్రం! ఎంత వైరుధ్యం. ఇది భాషా హిపోక్రసి. తెలంగాణా సాధనలో ‘తెలంగాణ భాష’ కూడా ఒక బలమైన హేతువు. శ్రీకృష్ణ కమిషన్‌కి ఇచ్చిన వందలాది నివేదికలలో తెలం గాణ భాష గురించినవి అనేకం ఉన్నాయి. మరి ఇప్పుడు ప్రపంచ మహాసభలు ఏ భాష గురించి మాట్లాడతాయి? అసలు ప్రభుత్వం లెక్కల్లో తెలంగాణ భాష ఉన్నట్లా? లేనట్లా? తేలవలసి ఉంది. అధినాయకులకు భాష పట్ల వివక్ష గురించి తీరిగ్గా ఆలోచించడం కష్టం. ముఖ్యమంత్రిగారికి ఎన్నో భాషా కోణాల గురించి తెలియచెప్పవలసిన బాధ్యత భాషా సంస్కృతుల శాఖల, సంస్థల పెద్దలపై ఉంటుంది. ఇవాళ కేవలం తెలుగు భాషపై సభలు జరిపితే రేపు తెలంగాణ భాష అని అనడం సాధ్యం కాదు. తెలుగు విశ్వవిద్యాలయంవారు తెలంగాణ నిఘంటువుని తయారు చేస్తున్నామనే పదే పదే గుప్పించే ప్రకటనలకు అర్థం ఏమిటి? తెలంగాణ భాష ఉన్నదనేగా! ప్రపంచ తెలుగు సభల నిర్వహణ వైఫల్యం దాని పేరులో, ఆలోచనల్లోనే దాగి ఉన్నట్లుగా అనిపిస్తున్నది. బంగారు తెలంగాణలో తెలంగాణ వైఢూర్యాల భాష భాగంగా లేకపోతే ఎలా? తెలంగాణ వారి పండుగలు చాలావరకు వేరే. బతుకమ్మ, బోనాల వంటివి తెలంగాణ రాష్ట్ర పండుగలు ప్రకటించుకున్నాం. మన సంస్కృతి వేరే అని స్పష్టంగా చెప్పుకున్నప్పుడు లేని బాధ, భాష వరకు తేడా ఎందుకు? ఇంగ్లిష్ అంతటా ఒకటే. కాని బ్రిటిష్ ఇంగ్లిష్, అమెరికన్ ఇంగ్లిష్ అని వేరు వేరుగా పిలుచుకుంటారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు తెలంగాణ తెలుగు భాష అని ప్రజలు అనవద్దు. సరే. ఐతే, తెలంగాణ భాష అనేది ప్రభుత్వం ఉనికిలో ఉందా లేదా అనే విషయాన్ని విస్పష్టంగా ప్రజలకు వివరించవలసి ఉంది. దానినే రేపు తెలంగాణ సమాజం అంతా అంగీకరించవలసి ఉంటుంది. కాని భాషకీ, హృదయానికీ సెంటిమెంట్ ఎక్కువ. తల్లిని తిడితే బాధపడినట్లే, తల్లి భాషని అవమానపరిస్తే జనం భగ్గుమంటారు. ఆ సెంటిమెంటుని, సున్నితమైన అంశాన్ని తట్టిలేపడం ఇప్పుడు అవసరమా! అకాడమి అధ్యక్షులు అన్నట్లు ఇది కేవలం కె. చంద్రశేఖరరావు అభిప్రాయమా? పాలసీ పరంగా సీఎం గారి ఆలోచనా? తెలియవలసి ఉంది. ఏది ఏమైనా వారి ఆలోచనే అని, ఆయనని ఒక్కరినే బాధ్యునిగా చేయడం సరికాదు. కాళోజి బతికి ఉంటే తెలంగాణ భాష కోసం గేయాలు రాసేవారు. తన అభిప్రాయాల్ని కరాఖండిగా చెప్పేవారు. ప్రభుత్వానికి నచ్చచెప్పేవారు. కాళోజి మన మధ్య లేరు. వందలాది ‘నా గొడవ’ కవితల్లో భాష గురించి అనేక భావాలను మరోసారి అవగాహన చేసుకోవాలి. ఆయన పేర జరిపే తెలంగాణ భాషా దినోత్సవాన్ని గౌరవిస్తూ ప్రపంచ మహాసభలని తెలంగాణ భాషా సాహిత్య, సంస్కృతుల వేడుకలుగా జరిపిం చడం ఔచిత్యం. అది కాళోజికి ఇచ్చే గౌరవం. (కాళోజి జయంతి(సెప్టెంబర్ 9)ని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుతున్న సందర్భంగా) జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త అధ్యక్షులు, తెలంగాణ రచయితల వేదిక మొబైల్ : 99519 42242 -
కాళన్నకు నివాళి
హన్మకొండ : ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రకటనతో ఇదేరోజు సాహితీవేత్తలు తెలంగాణ భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ మేరకు హన్మకొండలోని కాళోజీ విగ్రహానికి కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, మేయర్ నన్నపునేని నరేందర్, వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ సర్ఫరాజు ఆహ్మద్, జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్, వరంగల్ పోలీస్ కమిషనర్ గొట్ట సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిశోర్‌ఝా, సమాచార శాఖ డిప్యూటీ డైరక్టర్ డీ.ఎస్.జగన్, వరంగల్ ఆర్డీఓ వెంకటమాధరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇంకా టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు అన్నమనేని జగన్మోహన్రావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోల రాజేష్‌కుమార్, రత్నవీరాచారి, నాయకులు హసనుద్దీన్, వెంకటేశ్వర్లు, సామ్యేల్ కూడా కాళోజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. అలాగే, కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకులు ఈ.వీ.శ్రీనివాస్, మోడెం శ్రీధర్, శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్‌భాస్కర్, నాయకులు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నాడెం శాంతికుమార్, నాయకులు కాయిత రాజ్‌కుమార్, మేకల రాజు, మనోహర్, గడ్డం రమేష్, ఊరగంటి శ్రీను వేర్వేరుగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా కాళోజీ ఫౌండేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నాగిళ్ల రామశాస్త్రి, వీఆర్. విద్యార్ధి, ప్రముఖ కవి పోట్లపల్లి శ్రీనివాస్‌రావు కాళోజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టి.జితేందర్‌రావు, శనిగారపు రాజమోహన్ తదితర కవులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు డాక్టర్ వి.విశ్వనాథం, మోత్కూరి మనోహర్‌రావు, తెలుగు భాషోద్యమ సమాఖ్య తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తిరువరంగం ప్రభాకర్, జిల్లా కన్వీనర్ వల్స పైడి, రహమాన్, బోయినపల్లి పురుషోత్తమరావు, దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ కన్వీనర్ అస్నాల శ్రీను, కవులు దేవులపల్లి వాణి, దినకర్, అన్వర్ కూడా కాళోజీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. తెలంగాణలోనే కాళోజీకి గుర్తింపు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజా కవి కాళోజీ నారాయణరావుకు తగిన గుర్తింపు, గౌరవం లభించిందని ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాళోజీ జయంతిని హన్మకొండలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, తెలంగాణ ప్రభుత్వం కాళోజీని జయంతిని తెలంగాణ భాషా దినంగా నిర్వహించడంతో పాటు కాళోజీ కేంద్రాన్ని నిర్మిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గుడిమల్ల రవికుమార్, కె.వాసుదేవరెడ్డి, మాడిశెట్టి శివశంకర్, సారంగపాణి, శ్రీకర్, వీఎస్ యాకూబ్‌రెడ్డి, కార్పొరేటర్లు దాస్యం విజయ్‌భాస్కర్, బోయినిపల్లి రంజిత్‌కుమార్, వీరగంటి రవీందర్, నల్ల స్వరూపరాణి, మాధవి, మిడిదొడ్డి స్వప్న, నాయకులు నలుబోలు సతీష్, చెన్నం మధు. పులి రజనీకాంత్ పాల్గొన్నారు. హెల్త్ యూనివర్సిటీలో.. ఎంజీఎం : వరంగల్ కేఎంసీ ప్రాంగణంలోని ఆరోగ్య నారాయణరావు వర్సిటీలో కాళోజీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ బి.కరుణాకర్‌రెడ్డి, రిజిస్ట్రార్ టి.వెంకటేశ్వర్రావులు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్, యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సత్యనారాయణ, వైద్యులు ప్రవీణ్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.