కవాడిగూడ (హైదరాబాద్): మాతృభాష సంరక్షణ కోసం నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. మాతృభాషాదినోత్సవాలు జీవనోత్సవాలు కావాలని.. తల్లి భాష కోసం, తల్లి నేల కోసం ఏ స్థానంలో ఉన్నా మాతృభాషను వదలం అని ప్రతిజ్ఞ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ స్టడీ సర్కిల్‌లో అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ సభను నిర్వహించారు.
తెలుగు భాషా చైతన్య సమితి, తెలుగుకూటమి, తెలంగాణ రచయితల సంఘం, లక్ష్య సాధన ఫౌండేషన్, మహిళా భారతి, గోల్కొండ సాహితీ కళాసమితి, పాలడుగు నాగయ్య కళాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ.. తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిదారెడ్డి మాట్లాడుతూ.. చదువు లక్ష్యం నెరవేరినప్పుడే భాష బతుకుతుందని అన్నారు. భాషను బతికించేది ప్రజలు కవులు అని పేర్కొన్నారు. మాతృభాషలో చదివిన వారికి ఉద్యోగ అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. తెలంగాణ రచయిత సంఘం అ«ధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ మాట్లాడుతూ భాషను పరిరక్షించడానికి మాండలిక నిఘంటువు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్స్ జాయింట్ డైరెక్టర్ పాలడుగు సరోజిని దేవి, తెలుగు కూటమి అధ్యక్షుడు కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment