
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈనెల 22న ఎల్బీస్టేడియంలో ఘనంగా నిర్వహించాలని వజ్రోత్సవాల నిర్వహణ కమిటీ నిర్ణయించింది. గురువారం ఉదయం బీఆర్‌కేఆర్ భవన్‌లో ఎంపీ కె.కేశవరావు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, రాష్ట్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు కేశవరావు మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన ప్రారంభమైన స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన వస్తోందన్నారు. 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరు కానున్నట్లు వివరించారు.
అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఈ ఉత్సవాలకు హాజరు కానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్‌పర్సన్ దీపికా రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ బృందం దేశభక్తి గీతాల సంగీత విభావరి, లేజర్ షో, క్రాకర్స్ ప్రదర్శన ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సినీ తారలు కూడా పాల్గొంటారని కేశవరావు తెలిపారు.
16న సామూహిక జాతీయ గీతాలాపన
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఈనెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ కేశవరావు తెలిపారు. నిర్దేశించిన సమయంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని రహదారులలో ట్రాఫిక్‌ను నిలిపివేసి జాతీయగీతం ఆలపించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని చాటాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment