సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ తెలంగాణలో ఎవరిపైనా ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయదని, స్వంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సత్తా తమ పార్టీకి ఉందని రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. గంటకో మాట మార్చే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి విశ్వసనీయత లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ భవన్‌లో బుధవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలతో మమేకమైన తమ పార్టీకి పొత్తులు పెట్టుకునే అవసరం లేదన్నారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌లో ఎంపీగా ఉంటూ మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓట్లు వేయాలని కోమటిరెడ్డి చెప్పారని గుర్తు చేశారు.
చర్చకు సిద్ధమేనా కిషన్‌రెడ్డి?
అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం, సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని తలసాని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో అంబర్‌పేటలో జరిగిన అభివృద్ధిపై చర్చించేందుకు అక్కడి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీలు మారిన వారు, బీఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్లిన వారి పరిస్థితిని ప్రజలు గమనిస్తున్నారని, ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌లోకి రావడం గురించి ఆయనకే తెలియాలని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ప్రారంభానికి అనుమతిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి మాత్రం ఇవ్వలేదని ఆరోపించారు. సెక్రటేరియట్ కట్టడం గొప్పతనం భవిష్యత్తులో అందరికీ తెలుస్తుందని, కొత్త సచివాలయాన్ని చూసి కొందరు ఓర్వలేక పోతున్నారని విమర్శించారు.
కేసీఆర్ జన్మదిన వేడుకలు నగరంలో ఘనంగా నిర్వహిస్తాం
ఈనెల 17న సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను డివిజన్ల వారీగా నిర్వహిస్తామని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు చెందిన ప్రార్థనా స్థలాలు, మందిరాల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరుగుతాయని తలసాని వివరించారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ దేవాలయంలో మేయర్ విజయలక్ష్మి, సికింద్రాబాద్ గణేశ్ దేవాలయంలో డిప్యూటీ మేయర్ శ్రీలత పూజలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. బల్కంపేట ఆలయంలో రాజశ్యామల యాగం నిర్వహించడంతో పాటు నెక్లెస్ రోడ్డులోని థ్రిల్ సిటీలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment