
పార్లర్‌లో ఐస్‌క్రీంలను పరిశీలిస్తున్న తలసాని. చిత్రంలో బోయినపల్లి వినోద్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: విజయడెయిరీని దేశంలో నంబర్‌వన్ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. విజయడెయిరీ ఉత్పత్తులకు ఎంతో ఆదరణ ఉందని, వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. సీఎం కేసీఆర్ చొరవతో విజయడెయిరీ రూ.750 కోట్ల టర్నోవర్‌కు చేరిందన్నారు.
గురువారం లుంబినీ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ ఐస్‌క్రీం పార్లర్‌ను ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, పశు సంవర్థక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అధర్ సిన్హాలతో కలిసి ప్రారంభించారు. తలసాని మాట్లాడుతూ అన్నిరకాల విజయ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో 650 ఔట్‌లెట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వీటిని వేయి వరకు పెంచాలనే లక్ష్యంతో ప్రధాన పర్యాటక కేంద్రాలు, దేవాలయాలు, హైవేలు, నెక్లెస్ రోడ్, ట్యాంక్‌బండ్‌లపై కూడా ఐస్‌క్రీం పార్లర్లను ప్రారంభించనున్నట్లు వివరించారు. 50 శాతం సబ్సిడీపై పుష్‌కార్ట్‌లను అందజేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, హాస్టళ్లలో కూడా విజయ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేవిధంగా చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు.
అందులో భాగంగా విజయడెయిరీకి పాలు పోసే రైతులకు సబ్సిడీపై పాడిగేదెల పంపిణీ, లీటర్ పాలకు రూ.4 నగదు ప్రోత్సాహకం, సబ్సిడీపై దాణా, గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్లు గుర్తుచేశారు. ఇటీవల పాలసేకరణ ధరను లీటర్‌కు రూ.5 పెంచడం వల్ల 50 వేల లీటర్లపాలు అదనంగా విజయడెయిరీకి వస్తున్నాయని తెలిపారు. పాల విక్రయకేంద్రాలు 1,500 వరకు పెరిగాయని, వ్యవసాయానికి అనుబంధంగా పాడిరంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంతో కృషి చేస్తున్నట్లు తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment