సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’కార్యక్రమం నిర్వహణపై సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇల్లు, ప్రతి ప్రభుత్వ కార్యాలయంపై జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం అవసరమైన సుమారు 1.20 కోట్ల త్రివర్ణ పతాకాల తయారీకి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. గద్వాల, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భువనగిరి, వరంగల్ తదితర ప్రాంతాల్లోని చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వాలన్నారు. జాతీయ పతాకాల ముద్రణ, దేశభక్తి ప్రచార కార్యక్రమాల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.
పల్లె నుంచి పట్నం దాకా...
►పంద్రాగస్టుకు వారం ముందు నుంచి వారం తర్వాత వరకు 15 రోజులు రాష్ట్రంలో ‘భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ’ కార్యక్రమాన్ని నిర్వహించాలి.
►గడపగడపకూ జాతీయ పతాకాన్ని ఎగు రవేయాలి. కవి సమ్మేళనాలు, జాతీయ భావాలు పెంపొందించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
►మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఫ్రీడం రన్ నిర్వహించాలి.
►అన్ని విద్యాసంస్థల్లో ఆటలు, వ్యాస రచన, వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు, నాటికలు, ఏకపాత్రాభినయం వంటివి జరపాలి.
►ప్రభుత్వ శాఖలన్నీ జెండా పండుగ కార్యక్రమంలో పాల్గొనాలి. రోజువారీ షెడ్యూల్ రూపొందించుకోవాలి. విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేక కమిటీని నియమించాలి.
►పల్లె నుంచి పట్నం దాకా స్వాతంత్య్ర వజ్రోత్సవ దీప్తిని వెలిగించే దిశగా చర్యలు చేపట్టాలి.
►జాతీయ పతాక చిహ్నాన్ని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు లెటర్ హెడ్‌లపై ముద్రించుకోవాలి.
►15 రోజులు జాతీయ పతాక చిహ్నా న్ని పత్రికలు మాస్టర్ హెడ్స్‌పై ముద్రించాలి.
►టీవీ చానళ్లు సైతం చిహ్నాన్ని నిత్యం కనిపించేలా ప్రసారం చేయాలి. దేశ భక్తిని పెంపొందించే కార్యక్రమాలు ప్రసారం చేయాలి.
నాటి విలువలు నేడు ఏవీ?
‘స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాతలు కలలుగన్న భారత దేశాన్ని మరింత గుణాత్మకంగా రూపొందించుకోవాల్సి ఉంది. ప్రజాస్వామిక, లౌకిక, సమాఖ్య విలువలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ పని ఒత్తిడి, ఆర్థిక అవసరాల నేపథ్యంలో నాటి తరం ఆచరించిన దేశభక్తి, అంతటి భావోద్వేగాలు నేటి యువతలో కనిపించడంలేదు. ఈ వాతావరణాన్ని మనం పునఃసమీక్షించుకోవాల్సి ఉంది. అందుకే దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకోవాల్సిన అక్కెర దేశభక్తులైన తెలంగాణ బిడ్డలకు ఉంది. పల్లె, పట్నం ఒక్కటై భారతావని ఘనకీర్తిని చాటాల్సి ఉంది’అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment