మన ఇంట్లో పాసిపోయిన అన్నం దగ్గర్నుంచి, ఇంట్లో వూడ్చిపారేసిన మకిల వరకు తీసుకెళ్లి వాటిని ఊరి చివరనున్న డంపింగ్‌యార్డులకు తరలిస్తున్న ఆ చేతులెవరివి తల్లీ! తడిచెత్తను, పొడిచెత్తను వేరుచేస్తున్న ఆ చేతులెవరివి తండ్రీ! వాళ్లకు పాదపాదాన పరిపరి దండాలు. ప్రతి నిత్యం ‘అమ్మా, చెత్తబండి వచ్చింది’ అని పలకరిస్తున్న సమాజ ఆరోగ్య దూతల పరిశుభ్ర చేతుల వల్లనే పల్లెల దగ్గర్నుంచి హైదరాబాద్ మహానగరం వరకు పరిశుభ్రంగా ఉంటున్నాయి. ఈ సఫాయి కార్మికులే మన ఆరోగ్య కార్యకర్తలు. వారి సేవలకు వెల కట్టలేం కానీ వారిని ఆదుకోవాలన్న, వారికి అన్నిరకాల సదుపాయాలను అందించాలన్న తలంపు తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో పాత పేపర్లు ఏరుకుని జీవించే వాళ్లంతా కలిసి ఇందిరాపార్కు దగ్గర ధర్నాచేశారు. అది ఉద్యమ చరిత్రలో మరిచిపోలేనిది. వీళ్లు చేసే కృషిని గమనించిన కేసీఆర్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా వీరి జీవనవిధానంలో మార్పులు తెచ్చేందుకు పథక రచన చేశారు. ఈ ఆలోచననే కేటీఆర్ క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్నారు.
చిన్నప్పుడు మా నడిగూడెంలో ‘నమో వెంకటేశా’ అన్న దేవాలయంలోని పాటో, అల్లాహు అక్బర్ అంటూ మసీదు నుంచి వచ్చే ప్రార్థనా గీతమో, చర్చి గంటలో మేలుకొలిపేవి. ఇప్పుడు హైదరాబాద్‌లో పొద్దున్నే అందర్నీ లేపేది మాత్రం జీహెచ్‌ఎంసీ వాహనం నుంచి వచ్చే పాటే. అది ఏ మతానికి చెందిన పాట కాదు. సర్వమానవుల్ని ఆరోగ్యవంతులుగా ఉండమని దీవించి మేలుకొలిపే పాట. ‘పరిశుభ్రత చల్లని రాగం/ పరిశుభ్రత గుండెలోరాగం/ పరిశుభ్రత జీవనవేదం/పరిశుభ్రత వైపుకే పయనం’ అంటూ పాట మొదలవుతుంది. ‘తడిచెత్త, పొడిచెత్తను ఎరువుగా చేసి.../ ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం/ ... ఇంటింటికి ఒక మొక్క నాటుదాం/ స్వచ్ఛదేవా .../ ఆరోగ్య దేవతా .../ స్వచ్ఛ్ హైదరాబాద్/ స్వచ్ఛ్ తెలంగాణ’ అంటూ ముగిసేపాట పరిశుభ్ర దేవతను కొలుస్తూ పాడే పరిశుద్ధ గీతంలాగా ఉంటుంది.
హిమాయత్‌నగర్‌లోని ఎమ్.ఎస్.కె. టవర్స్‌కు ప్రతిరోజు గువ్వల రంగడు ఆటోట్రాలీతో వస్తాడు. ఇందులో 80కి పైగా నివాస గృహాలున్నాయి. ప్రతిరోజు రంగడు తన భార్య సుజాతతో కలిసి 500 ఇళ్లల్లోని తడి, పొడి చెత్తను తీసుకెళతాడు. ఈ భార్యభర్తలిద్దరూ ఐదు గంటలకే ‘మనం మారుదాం మహానగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదాం’ అన్న నినాదమున్న ఆటోట్రాలీతో వస్తారు. ఇలా గువ్వల రంగడి వాహనంలాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 4000కు పైగా ఆటో టిప్పర్‌లను ప్రభుత్వమే సబ్సిడీ కింద అందించింది. 4,50,000 రూపాయల ఖరీదైన ఆటోటిప్పర్‌ను, 1,50,000 చెల్లిస్తే లబ్ధిదారులకు జీహెచ్‌ఎంసీ అందించింది. ఈ వృత్తి ద్వారా అతనికి నెలకు అన్ని ఖర్చులు పోను 5 నుంచి 10 వేలు మిగులుతాయంటున్నాడు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన కేటీఆర్ ఆరోగ్య తెలంగాణకు నమూనాగా మొత్తం తెలంగాణలోని పట్టణాలన్నీ పరిశుభ్రంగా తీర్చిదిద్దే కీలకమైన కర్తవ్యాన్ని ప్రత్యేక శ్రద్ధతో పూర్తిచేస్తున్నారు. ఆటోట్రాలీలు నడిపేవాళ్లు, చెత్తను మోసుకుపోయేవాళ్లు, పొరకల తల్లులకు, తండ్రులకు కొండంత అండగా తెలంగాణ ప్రభుత్వం నిలబడుతుందన్న విశ్వాసం ఆ వర్గాల్లో బలంగా ఉంది. మా పిల్లలందరూ చదువుకునేందుకు గురుకులాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కేటాయించి సీట్లివ్వాలని వాళ్లు కోరుతున్నారు. మహానగరాన్ని పరిశుభ్రం చేస్తున్న ఆ తల్లులు, తండ్రుల బిడ్డలు తెలంగాణ ప్రభుత్వానికున్న సామాజిక దృక్కోణపు చూపుడువేలు సాక్షిగా గురుకులాల్లోంచి ఉన్నత స్థానాలకు ఎదిగే శక్తిమంతులవుతారు.
జూలూరు గౌరీశంకర్
వ్యాసకర్త ప్రముఖ కవి, సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 94401 69896
Comments
Please login to add a commentAdd a comment