సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తల్లి విగ్రహ వివాదం ముదురుతోంది. విగ్రహ ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టాపన నిలిపివేయాలని జూలూరి గౌరీశంకర్ పిటిషన్ వేశారు. విగ్రహంలో మార్పులను వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలైంది. విగ్రహంలో మార్పులంటే తెలంగాణ అస్తిత్త్వంపై జరుగుతున్న దాడిగా పిటిషన్‌లో పేర్కొన్నారు.
కాగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘రేవంత్ ప్రతిష్టిస్తోంది.. తెలంగాణ తల్లినా? కాంగ్రెస్ తల్లి విగ్రహాన్నా? విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానం మాకు మ్యాటర్ కాదు.. తెలంగాణ తల్లి మాకు మ్యాటర్. తెలంగాణ తల్లి విగ్రహం అంటే రేవంత్ రెడ్డి ఇంట్లో కార్యక్రమం కాదంటూ మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసినప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు? ప్రభుత్వాలు మారినపుడల్లా గత ప్రభుత్వం నిర్ణయాలు మారాలా?’’ అంటూ ప్రశ్నించారు.
ఇదీ చదవండి: విగ్రహావిష్కరణకు రండి.. కేసీఆర్‌కు రేవంత్ సర్కార్ ఆహ్వానం
మరోవైపు, తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధమైంది. డిసెంబర్ తొమ్మిదో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ తెలంగాణ తల్లికి సంబంధించిన ఒక ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోలో ఆకుపచ్చ చీరలో తెలంగాణ తల్లి విగ్రహం ఉంది. మెడలో కంటె, బంగారు ఆభరణాలు ఉన్నాయి. అలాగే, ఎడమ చేతిలో వరి, మొక్కజొన్న కంకులు, జొన్నలు ఉన్నాయి. చెవులకు కమ్మలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment