సాక్షి, సిద్ధిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ కలిశారు. సిద్ధిపేట ఎర్రవల్లి ఫామ్ హౌస్‌కు వెళ్లిన పొన్నం.. రాష్ట్ర సచివాలయంలో ఈ నెల 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే, సీఎం రేవంత్ సర్కార్ ఆవిష్కరిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు కేసీఆర్ వస్తారా..? లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
కాగా, శనివారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ప్రజా పాలన ఉత్సవాలు, సోమవారం సచి వాలయంలో జరిగే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రాష్ట్ర గవర్నర్‌తో పాటు ప్రతిపక్ష నేతలను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్, ప్రొటోకాల్ అధికారులు శనివారం వెళ్లి ఆహ్వానాలు అందజేయనున్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా కలిసి ఆహ్వానం అందజేశారు.
ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై పిటిషన్
కొత్తగా కొలువుదీరబోతున్న తెలంగాణ తల్లి ముడిచిన కొప్పు, మెడలో కంటెతో రెండు సాధారణ బంగారు హారాలు, చెవులకు సాధారణ జూకాలు, చిన్న ముక్కు పుడక, చేతులకు ఆకుపచ్చ మట్టి గాజులు, కాళ్లకు పట్టీలు, మెట్టెలు ధరించి ఉంటుంది. సాధారణ నేత తరహా చీర కనిపిస్తుంది. బంగారు వర్ణం అంచు ఉన్న ఆకుపచ్చ రంగు చీర, ఎరుపు వర్ణం రవిక ఉంటుంది. ఇంటి పనుల్లో తలమునకలయ్యే మహిళలు చీర కొంగును ముడిచిన తీరును ప్రతిబింబిస్తుంది. కుడి చేయిని అభయహస్తంగా తీర్చిదిద్దారు. ఎడమ చేతిలో మొక్కజొన్న, పచ్చ జొన్న, సజ్జ, వరికంకి.. ఇలా తెలంగాణ సంప్రదాయ పంటలైన తృణధాన్యాల గుర్తులు ఏర్పాటు చేశారు. పీఠం దిగువన తెలంగాణ ఉద్యమానికి గుర్తుగా బిగించిన పిడికిళ్లు కనిపిస్తాయి. పైభాగంలో.. పైకి ఎత్తుతున్న తరహాలో చేతుల రూపాలు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment