‘తెలంగాణ కవులు సోక్రటీస్ వారసులు.’
– (జూలూరు పథం: పుట 43)
తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీ శంకర్ రాస్తే దీర్ఘకవితే రాస్తారు అని రూఢి అయ్యింది. ‘ఎలియాస్’, ‘పాదముద్ర’, ‘చెకిముకిరాయి’, ‘నాలుగో కన్ను’ నుండి దాదాపు 20 దీర్ఘ కవితలు రాసిన కవి గౌరీశంకర్. వాటి పరిణతి రూపంగా ఇప్పుడు ‘జూలూరు పథం’ వచన మహాకావ్యం రాశారు. ఇది 200 పుటల కావ్యం. ఇది ‘తెలంగాణ’ (కుందుర్తి),‘ నా దేశం నా ప్రజలు’ (శేషేంద్ర), ‘కొయ్యగుర్రం’ (నగ్నముని), ‘ఆసుపత్రి గీతం’ (కె. శివారెడ్డి), ‘విశ్వంభర’ (సినారె), ‘జలగీతం’ (ఎన్. గోపి) వంటి వచన మహాకావ్యాల కోవకు చెందిన కావ్యం.
‘జూలూరు పథం’ కావ్య విశిష్టత కేవలం దీర్ఘ కావ్యం కావడమే కాదు, అది ఆయన స్వీయ చరిత్రాత్మక కావ్యం. గుర్రం జాషువ తన జీవితాన్ని ‘నా కథ’ అని పద్యకావ్యంగా రాశారు. శీలా వీర్రాజు తన జీవితాన్ని ‘పడుగు పేకల మధ్య జీవితం’ అన్న వచన కావ్యంగా రాశారు. ఆ తానులో గౌరీశంకర్ తన జీవితాన్ని వచన కావ్యంగా రాశారు. ఇది కేవలం గౌరీశంకర్ సొంతగోల వర్ణనకే పరిమితమైన కావ్యం కాదు. ఇందులో ఆయన జీవిత చిత్రణ కొంతభాగమే. ఆరు దశాబ్దాల తెలంగాణ ప్రజాయుద్ధ వర్ణనే ‘జూలూరు పథం’గా రూపుదిద్దుకొంది.
తెలంగాణ తన నేలలో తాను పరాయీకరణకు గురై ఇతర ప్రాంతాల దోపిడీకి గురై తనను తాను విముక్తం చేసుకొని, తన రాష్ట్రం తాను ఏర్పాటు చేసుకున్న క్రమానికి ఈ కావ్యం విమర్శనాత్మక కళాత్మక ప్రతిబింబం. ‘తెలంగాణలో ఒక్కొక్కరు ఒక మహాకావ్యం’ అని తెలంగాణ ఔన్నత్యాన్ని నిర్వచించారు గౌరీశంకర్. కవి, కవిత్వం అంటే ఏమిటో వర్ణించి, తెలంగాణ కవుల సౌందర్యాన్ని నోరారా వర్ణించి తన జీవితాన్ని క్లుప్తంగా పరిచయం చేశారు మొదట.
‘జై తెలంగాణ అంటే నా జన్మ ధన్యమైంది’ అని పులకరించి పోతారు కవి. జై తెలంగాణ అంటేనే భార్య మెడలో తాళి కడతానన్న వరుని సంఘటనను పరిచయం చేశారు. 1956 అక్టోబర్ 31న అర్ధరాత్రి జరిగింది కొత్త ఆధిపత్యమని, కొత్త ఆక్రమణ అని నిర్వచించి దాని ముద్దుపేరు ‘సమైక్యత’ అని తన కంఠాన్ని స్పష్టంగా వినిపించారు. తెలంగాణ ఆహారం, తెలంగాణ సంస్కృతి ఈ కావ్యంలో కావ్య గౌరవం పొందాయి. తనను కవిగా, ఉద్యమకారునిగా నిలబెట్టిన తెలంగాణ గడ్డను గౌరీశంకర్ కృతజ్ఞతతో కీర్తించారు. కవిగా కవిత్వ శక్తి తెలిసిన గౌరీశంకర్, కవిత్వం ఏమి సాధిస్తుందంటే ‘ఒక రాష్ట్రాన్ని సాధించి పెడ్తది’ అన్నారు.
తెలంగాణ రాష్ట్రోద్యమంలో కళారంగం నిర్దేశించిన చారిత్రక పాత్రను కవి గర్వంగా వర్ణించారు. ‘తెలంగాణ కవులు విముక్తి పోరు వారసులు’ అని నిర్వచించారు. తెలంగాణ రాష్ట్రోద్యమం విజయం సాధించడాన్ని ‘యుద్ధమిప్పుడు గెలిచిన కల’ అని పరవశించి చెప్పారు. గౌరీశంకర్ కవిత్వం ఒక ఉప్పెనలాగా ఉంటుంది. ఆవేశం, ఆవేదన, ఆగ్రహం ముప్పేట దాడితో ఆయన కవిత్వం నడుస్తుంది. మార్క్సిజం, అంబేడ్కరిజం సమన్వయ సిద్ధాంతంగా సాగుతున్న తీరును కవిత్వీకరించారు. ఆయన నడి గూడెం వడ్లబజారు నుంచి ప్రారంభించి అస్తిత్వ సాహిత్య ఉద్యమ జెండాలను పట్టుకుని తెలంగాణ నడిబొడ్డు నడిగడ్డ దాకా దీర్ఘకవితల్ని నడిపించాడు. తెలుగు సాహిత్యంలో దీర్ఘకవితల పథం ‘జూలూరు పథం.’
వ్యాసకర్త సాహితీ విమర్శకులు
(రేపు హైదరాబాద్ రవీంద్రభారతిలో ‘జూలూరు పథం’ ఆవిష్కరణ)
Comments
Please login to add a commentAdd a comment