ఆదివారం సెలవు రోజు.. ఆ ప్రాంగణం కిటకిటలాడింది.. టికెట్ కౌంటర్ల వద్ద అభిమానులు బారులు తీరారు.. టికెట్ పొంది లోనికి వెళ్లాలన్న ఆత్రుత వారిలో కనిపించింది.. ప్రదర్శన పూర్తయ్యాక ఎంతో సంతృప్తితో వెనుదిరిగారు. ఇది అవతార్ సినిమా థియేటర్ల ముందు సందడి కాదు. ఎన్టీయార్ స్టేడియంలో కొలువుదీరిన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆదివారం 70 వేల మంది ప్రదర్శనను తిలకించారన్నది నిర్వాహకుల మాట.
సాక్షి, హైదరాబాద్: చేతిలో సెల్‌ఫోన్ తప్ప పుస్తకం పట్టరంటూ నేటి తరంపై పెదవి విరుపులు ఎన్నో.. కొత్త పుస్తకాలు అచ్చు వేయడం, అచ్చేసిన పుస్తక విక్రయాలు పలచగా ఉండటం రచయితలకు నీరసాన్నిస్తోంది. పేజీలు తిప్పుతూ, కుదురుగా ఓ చోట కూర్చుని పుస్తకాలు చదివే అలవాటు వేగంగా తగ్గిపోతోందని ఎంతోమంది పుస్తక ప్రియుల నిట్టూర్పులు నిత్యం వింటూంటాం..
ఇవన్నీ నిత్యసత్యాలే. కానీ ఓసారి నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలోకి వచ్చి హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రాంగణాన్ని తిలకిస్తే మాత్రం పుస్తకానికి మళ్లీ మంచిరోజు వస్తోందా అన్న భావన కలగకమానదు. చిన్నారులు, యువకులు, నడి వయసు వారు, వృద్ధులు.. ఇలా తండోపతండాలుగా వచ్చి స్టాళ్లన్నీ కలియతిరిగి నచ్చిన పుస్తకాలను పట్టుకుని సంబరంగా వెళ్తున్నారు.
కోల్‌కతా పుస్తక ప్రదర్శన తర్వాత జాతీయ స్థాయిలో అంత కీర్తిని మూటగట్టుకున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ 35వ ప్రదర్శన ఇప్పుడు విజయవంతంగా సాగుతోంది. నోట్ల రద్దు గందరగోళం ఉన్న తరుణంలో, కోవిడ్ భయాందోళనలు కొనసాగిన సమయంలోనూ సాగిన ఈ బుక్ ఫెయిర్ ఇప్పుడు.. పుస్తక ప్రియుల కోలాహలం మధ్య సందడిగా సాగుతోంది. ఇటు పుస్తకాలు, అటు చర్చాగోష్ఠులు, బయట జనం కోసం తినుబండారాల దుకాణాలు.. వెరసి ఆ ప్రాంతం జాతరను తలపిస్తోంది.
అవీ ఇవీ..
►ఈసారి పుస్తకప్రదర్శనలో 340 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రాంతీయ, జాతీయ స్థాయి కేంద్రాలున్నాయి.
►ఆధ్యాత్మికం మొదలు ఆటల వరకు జానపదం మొదలు అంతర్జాతీయ విషయాల వరకు ఇలా అన్ని రంగాల పుస్తకాలు కొలువుదీరాయి.
►పోటీ పరీక్షలకు ఉపయోగపడే వాటితోపాటు కాలం తెలియకుండా కొత్త ప్రపంచంలో ఓలలాడించే నవలలు, కులమత సాహిత్యం, అట్లాసులు, పంచాంగాలు.. ఇలా సర్వం అక్కడ సిద్ధంగా ఉన్నాయి.
►ఈసారి 8 రాష్ట్రాల నుంచి పబ్లిషర్స్ వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో ఎన్నడూ ఇన్ని రాష్ట్రాల నుంచి రాలేదు.
►రచయితలు నేరుగా వారే తమ పుస్తకాలను పరిచయం చేసుకునేందుకు రైటర్స్ హాల్.. పేరుతో ప్రత్యేకంగా ఓ వేదిక ఏర్పాటు చేశారు.
►తెలుగు రచయితలకు రెండు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో స్థానిక రచయితల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రదర్శనకు రాలేకపోయిన జాతీయస్థాయి రచయితలు పలువురు వారి పుస్తకాలను పంపారు. వాటిని నిర్వాహకులే పుస్తక ప్రియుల ముందుంచి అమ్మిస్తున్నారు. ఆ డబ్బును రచయితలకు పంపుతామని నిర్వాహకులు పేర్కొంటున్నారు.
►తెలంగాణ సీఎం కేసీఆర్‌పై పలువురు రచయితలు రాసిన పుస్తకాల ప్రదర్శనకు ప్రత్యేకంగా ‘మన ముఖ్యమంత్రి స్టాల్’ఏర్పాటు చేశారు. ఇందులో 24 రచనలున్నాయి.
బాల్య స్నేహితులతో కలిసి వచ్చి..: వెంకటేశ్వరరావు
ఓ ప్రైవేటు కంపెనీలో విభాగాధిపతిగా పనిచేస్తున్న విజయవాడకు చెందిన వెంకటేశ్వరరావు తన బాల్యమిత్రులతో కలిసి ఈ ప్రదర్శనకు వచ్చారు. నలుగురు మిత్రులు ముందే కావాల్సిన పుస్తక జాబితాతో వచ్చి వాటికోసం స్టాళ్లలో వెతికారు. కోరుకున్నవే కాకుండా, గతంలో చాలా ప్రాంతాల్లో దొరకని పుస్తకాలు కూడా లభించటంతో కొని మురిసిపోయారు. ‘పద్యం ఉంటేనే పుస్తకం చదవాలన్న ఆసక్తి నాలో కలుగుతుంది. ఆధునిక కాలంలో అలనాటి సాహిత్యం మరుగునపడొద్దని ఏరికోరి ఆ పుస్తకాలు చదువుతాను. ఇప్పుడలాంటి ఎన్నో పాత రచనలు సమీకరించాను’అని వెంకటేశ్వరరావు సంబరంగా చెప్పారు.
పెద్ద బాలశిక్షా సంబరపడుతోంది..
‘పెడదారి పడుతున్న ఈ సమాజానికి సంస్కారం అబ్బాలంటే పెద్ద బాలశిక్ష చదివించాలి’ అంటూ ఓ సినీ పాత్ర గంభీరంగా చెబుతుంది. పెద్దబాలశిక్ష అంటూ ఓ పుస్తకం కూడా ఉంటుందా అంటూ ఈ తరం ఆశ్చర్యపోతుంది. కానీ ఈ పుస్తక ప్రదర్శనలో పెద్దబాల శిక్ష నిజంగా మురిసిపోతోంది. ‘‘మా స్టాల్‌లో రోజుకు 40కి తగ్గకుండా పెద్దబాలశిక్ష పుస్తకాలు అమ్ముడవుతున్నాయి. ఇతర స్టాళ్లలోనూ వాటికి మంచి ఆదరణ ఉంది.’అని ఆనందంగా చెప్తున్నారు.
– శ్యామల, అన్నపూర్ణ పబ్లిషర్స్
స్పందన గొప్పగా ఉంది
జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌కు ఈసారి మరింత ఆదరణ కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రచురణ కర్త లు వారి రచనలతో పుస్తకప్రియుల ముందుకొచ్చారు. నేరుగా వారితో మాట్లాడుతూ పుస్తకాలు విక్రయిస్తున్నారు. కానీ, రచయితలే నేరుగా కొనుగోలుదారులతో మాట్లాడుతుండటం, ఆయా పుస్తకాల ప్రత్యేకతలను చర్చాగోష్ఠుల్లో వివరిస్తుండటం కొత్త అనుభూతిని పంచుతోంది. ప్రదర్శనకు ఈ నాలుగు రోజుల్లో 3 లక్షల మందివచ్చి ఉంటారని అంచనా.
– కోయ చంద్రమోహన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment