పుస్తక ప్రదర్శన ప్రారంభిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో అల్లం నారాయణ, జూలూరీ తదితరులు
సాక్షి, హైదరాబాద్: పుస్తకాలే ఉద్యమాలను ఉరకలెత్తించి మార్పునకు దోహదపడ్డాయని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. గురువారం ఇక్కడ 35వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. తెలంగాణ సాయుధ పోరాటం మొదలు తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సాగిన ఉద్యమాలకు పుస్తకాలు దన్నుగా నిలిచాయని పేర్కొన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా పెరిగినా పుస్తక పఠనం, పుస్తక జ్ఞానం శాశ్వతంగా ఉంటుందని చెప్పారు.
మొబైల్ ఫోన్‌లు, సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తే చెడును అధిగమించేందుకు పుస్తకపఠనం చాలా అవసరమన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ పుస్తకాల్లోనే చరిత్ర అంతా నిక్షిప్తమవుతుందని పేర్కొన్నారు. గాడ్సేను దేశభక్తుడిగా చేసి గాంధీని చరిత్రలో లేకుండా చేసేందుకు కొంతమంది వక్రీకరణలకు ప్రయత్నిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు.
ఈ ధోరణి దేశానికి అత్యంత ప్రమాదకరమన్నారు. ప్రముఖ పాత్రికేయులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని, అనేక కొత్త పదాలను నేర్చుకునేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ప్రతి విద్యార్థి ఏడాదికి పది పుస్తకాలు చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, పత్రికా సంపాదకులు సుధాభాస్కర్, తిగుళ్ల కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
విభిన్నం... వైవిధ్యం...
పుస్తక ప్రదర్శనలో మొత్తం 300 స్టాళ్లలో పుస్తకాలు కొలువుదీరాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ప్రచురణ సంస్థలు విభిన్న రంగాల పుస్తకాలను పాఠకులకు అందుబాటులోకి తెచ్చాయి. మొదటిరోజే పుస్తకప్రియులతో ఆ ప్రాంగణంలో సందడి నెలకొంది. పలు స్కూళ్లకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివచ్చారు. సామాజిక మాధ్యమాలు, డిజిటల్ మీడియా వెల్లువలోనూ పుస్తకానికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదనేందుకు నిదర్శనగా సందర్శకులతో కళకళలాడింది.
తెలుగు రచయితలను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ప్రత్యేక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. తెలంగాణ పబ్లిషర్స్, విశాలాంధ్ర, నవోదయ, ఎమెస్కో, మంచిపుస్తకం, మిళింద్ పబ్లిషర్స్, అన్వీక్షి, నవతెలంగాణ తదితర ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. శ్రీశ్రీ, గోపీచంద్, రావిశాస్త్రి, తిలక్, కొడవటిగంటి కుటుంబరావు వంటి గొప్ప కవులు, రచయితల రచనలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. జనవరి 1వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఏడాది పుస్తక ప్రదర్శన ప్రాంగణానికి ప్రముఖ ఒగ్గు కళాకారుడు మిద్దె రాములు పేరు, పుస్తకావిష్కరణలు, సాహిత్యసభలు నిర్వహించే వేదికకు ప్రముఖకవి అలిశెట్టి ప్రభాకర్ పేరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment