సాక్షి, హైదరాబాద్: నగరం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనలో రెండవ రోజు పుస్తక ప్రియులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈసారి వివిధ పాఠశాలల నుంచి భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో భాగంగా అలిశెట్టి ప్రభాకర్ వేదికపైన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. తెలుగు చిత్రపరిశ్రమకు తాను రావడానికి స్ఫూర్తినిచ్చింది రచయిత వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ అని ప్రముఖ సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ట తెలిపారు.
వెంకట సత్యప్రసాద్ రచించిన ‘తొడిమ లేని మొగ్గలు’ కథా సంపుటిని ముఖ్య అతిథిగా హాజరైన మోహనకృష్ట ఆవిష్కరించారు. ఇదే వేదికపైన ఆంగ్ల అనువాదం చేసిన డాక్టర్ కొండపల్లి నిహరిణి కవితా సంపుటి ‘కాల ప్రభంజనం’ (టెంపెస్ట్ ఆఫ్ టైమ్)ను తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్ ఆవిష్కరించారు. విశేషమైన ఈ కవితా సంపుటిని ‘ఎలనాగ’ ఆంగ్లానువాదం చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.
ప్రముఖ కవయిత్రి శిలాలోలిత రచించిన ‘నేను ఇక్కడి భూమిని’ నాలుగో సంపుటిని ప్రసిద్ధ సాహితీవేత్త తెలంగాణ ఉద్యమకారిణి డాక్టర్ తిరునగరి దేవకీదేవీ ఆవిష్కరించారు. స్త్రీల సమస్యలు, సామాజిక సమస్యల్ని ఎత్తిచూపిన కవయిత్రిగా శిలాలోలిత నిలుస్తారని దేవకీదేవి ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ బుక్ ట్రస్ట్ కోయా చంద్రమోహన్, గోపిరెడ్డి, రమేశ్ కార్తీక్, తాళ్లపల్లి శివకుమార్, రూప రుక్మిణి, అనీఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment