40 శాతం అమ్మకాలు ఢమాల్‌! | demonetisation affect on national book fair | Sakshi
Sakshi News home page

40 శాతం అమ్మకాలు ఢమాల్‌!

Published Fri, Dec 23 2016 10:49 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

40 శాతం అమ్మకాలు ఢమాల్‌! - Sakshi

40 శాతం అమ్మకాలు ఢమాల్‌!

  • పుస్తక ప్రదర్శనపైనా నోట్ల రద్దు ప్రభావం
  • గతేడాది కంటే తక్కువగా విక్రయాలు
  • సందర్శకులు వస్తున్నా.. అమ్మకాలు మాత్రం అంతంతే!
  • 26తో ముగియనున్న ప్రదర్శన   
  • సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన పైనా పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.  పుస్తకాలు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది పాఠకులు నగదు కొరత వల్ల వెనుకడుగు వేస్తున్నారు. కేవలం సందర్శనకే పరిమితమవుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది పుస్తకప్రియులు బుక్‌ఫెయిర్‌కు  వస్తున్నప్పటికీ కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. గతేడాది రోజుకు సుమారు రూ.లక్ష విలువైన పుస్తకాలు విక్రయించిన స్టాళ్లలో ఇప్పుడు సగం మేరకు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోల్చుకుంటే 40 శాతం మేర అమ్మకాలు తగ్గినట్లు స్టాళ్ల నిర్వాహకులు చెప్తున్నారు. గతేడాది 350కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయగా.. ఈసారి 290 స్టాళ్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. స్టాళ్ల ఎంపికలో స్క్రీనింగ్‌ పద్ధతిని పాటించినట్లు నిర్వాహకులు తెలిపారు.

    కొత్తవాళ్లకు కాకుండా ప్రతి సంవత్సరం వచ్చేవారికే ఈ ఏడాది స్టాళ్లను  కేటాయించారు. దీంతో కొంత మేర స్టాళ్ల సంఖ్య తగ్గిందని నిర్వాహకులు చెప్తున్నపటికీ  నోట్ల రద్దు ప్రభావం కూడా స్పష్టంగా ఉంది. ఈ ఏడాది  హైదరాబాద్‌లోని ఎమెస్కో, నవచేతన, నవోదయ, నవతెలంగాణ, విశాలాంధ్ర, అరుణోదయ, వీక్షణం, పీకాక్‌ క్లాసిక్స్‌ వంటి ప్రముఖ పుస్తక సంస్థలతో పాటు  వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు కూడా  ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీకి చెందిన లెఫ్ట్‌ వరల్డ్, తమిళనాడుకు చెందిన భారతి వంటి ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. రాజమండ్రి వంటి చోట పుస్తక ప్రదర్శనపై  నోట్ల ప్రభావం పడ్డప్పటికీ  వెరవకుండా  హైదరాబాద్‌లో 30వ జాతీయ పుస్తక ప్రదర్శనకు  బుక్‌ ఫెయిర్‌ కమిటీ సిద్ధపడింది. ఈ నెల 15న ప్రారంభమైన ప్రదర్శన 26న ముగియనుంది.

    స్వైపింగ్‌ మిషన్‌ల కొరత...
    నగదు కొరత దృష్ట్యా కొన్ని స్టాళ్లు  స్వైపింగ్‌ మిషన్‌లు, పేటీఎం ద్వారా పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఎమెస్కో, నవతెలంగాణ, నవచేతన, లెఫ్ట్‌ వరల్డ్, వంటి ప్రముఖ పుస్తకాల స్టాల్స్‌లో స్వైపింగ్‌ మిషన్లు అందుబాటులో  ఉన్నాయి.కానీ చాలా చోట్ల  స్వైపింగ్‌  లేకపోవడంతో  కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పాఠకులు  వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు నగదు కొరత కూడా  వెంటాడుతోంది.‘‘ వంద రూపాయల బుక్‌ కోసం రూ.2 వేల నోటుతో వస్తున్నారు. చిల్లర కోసం ఎక్కడికెళ్లగలం. అలా వచ్చే కొద్దిపాటి గిరాకీ కూడా పోతోంది.’’ అని ఒక స్టాల్‌ నిర్వాహకుడు పేర్కొన్నాడు. ఇక  తెలుగు అకాడమీ, నేషనల్‌బుక్‌ ట్రస్టు  వంటి కొన్ని ప్రభుత్వ పుస్తక సంస్థల్లోనే స్వైపింగ్‌ మిషన్‌లు లేకపోవడంతో పాఠకులు నిరాశగా వెనుదిరిగి వెళ్తున్నారు.

    స్వైపింగ్‌ కోసం తాము అధికారులను కోరినప్పటికీ ఇప్పటి వరకు సరఫరా కాలేదని నిర్వాహకులు  చెబుతున్నారు. తెలుగు అకాడమీలో గతేడాది రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు విక్రయించగా ఈసారి ఇప్పటి వరకు రూ.2 లక్షల కంటే ఎక్కువ  విక్రయించలేకపోయారు. ఈ నెల 26తో ప్రదర్శన ము గియనుంది. 24, 25 తేదీల్లో కూడా  సందర్శకుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. చివరి  రోజులు  కావడంతో అమ్మకాలు కూడా పెరుగవచ్చని నిర్వాహకులు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement