Swiping machines
-
స్వైపింగ్ దందా!
తణుకుకి చెందిన సత్యనారాయణ తన తండ్రి అనారోగ్యం పాలవ్వడంతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆస్పత్రి యాజమాన్యం తక్షణమే రూ.20 వేలు చెల్లించాలని చెప్పారు. సత్యనారాయణ బ్యాంకు ఖాతాల్లో రూ.50 వేలు ఉన్నాయి. దీంతో డబ్బుల కోసం ఏటీఎంల చుట్టూ తిరిగాడు. నో క్యాష్.. బ్యాంకుకు వెళ్లినా పనికాలేదు. ఒక వైపు ఎమర్జెన్సీ కావడంతో ఏం చేయాలో ఆందోళన చెందుతున్న సత్యనారాయణకు తన స్నేహితుడు ఒక వ్యాపారి గురించి చెప్పాడు. ఆయన వద్దకు వెళ్లి ఏటీఎం కార్డు చేతిలో పెట్టి రూ.20 వేలు కావాలని అడిగాడు. స్వైపింగ్ మెషీన్ ద్వారా తన ఖాతాలోకి రూ.20 వేలు మళ్లించుకున్న వ్యాపారి.. సత్యనారాయణ చేతిలో రూ.19,500 పెట్టాడు. ఇదేమని అడిగితే మీకు ‘పుణ్యానికి డబ్బులు ఇవ్వడానికి నేనేమైనా బ్యాంకు నడుపుతున్నానా.. మీకు డబ్బులు ఇచ్చినందుకు మాకు టాక్సులు పడతాయి. ఈ ఖాతాలో డబ్బులు వాడినందుకు రేపు మాకు లేనిపోని తలనొప్పులు వస్తాయి’ అంటూ దబాయించాడు. దీంతో చేసేదేమీ లేక సత్యనారాయణ డబ్బులు తీసుకుని ఆస్పత్రికి వెళ్లాడు.ఇది ఒక్క సత్యనారాయణ పరిస్థితి మాత్రమే కాదు.. నగదు కొరతతో చాలా మంది ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. తణుకు : నగదు కొరత సమస్య ఇప్పటికీ జిల్లాలో పట్టిపీడిస్తోంది. సొమ్ముల కోసం సామాన్యులు నానా పాట్లు పడుతున్నారు. వారి అవసరాలను కొం దరు వ్యాపారులు ఆసరాగా తీసుకుని సొమ్ములు చేసుకుంటున్నారు. నగదురహిత లావాదేవీల కోసం తీసుకున్న స్వైపింగ్ మెషీన్ల ద్వారా కమీషన్ పద్ధతిలో డబ్బులు ఇస్తూ దందా చేస్తున్నారు. ప్రభుత్వం నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు వ్యాపారులు స్వైపింగ్ మెషీన్లు ఏర్పాటు చేసుకోవాలని గతంలో ఆదేశించింది. ఓ మోస్తరు వ్యాపారం నిర్వహించే వారు సైతం మెషీన్లు ఏర్పాటు చేసుకున్నారు. అయితే తమ వ్యాపార లావాదేవీల కోసం మెషీన్లు వాడకుండా కమీషన్‌పై డబ్బులు ఇచ్చేందుకు కొందరు వ్యాపారులు వినియోగిస్తున్నారు. వ్యాపార లావాదేవీలైతే లెక్క చెప్పాల్సి రావడంతో ఇలా పెద్ద మొ త్తంలో కమీషన్‌పై డబ్బులు ఇస్తూ దందా నిర్వహిస్తున్నారు. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడంతో తమ వద్దకు వచ్చిన వ్యక్తితో ఉన్న పరిచయాలు.. అవసరాలను ఆసరాగా చేసుకుని కమీషన్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రూ.100 కోట్ల బ్యాంకు లావాదేవీలు జిల్లాలో సుమారు అన్ని బ్యాంకులకు సంబంధించిన బ్రాంచిలు సుమారు 650 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 1200 వరు ఏటీఎంలు ఉన్నాయి. సాధారణంగా జిల్లాలో నిత్యం రూ. 100 కోట్ల మేర నగదు లావాదేవీలు జరుగుతున్నాయని అంచనా. అయితే పెద్దనోట్ల రద్దు అనంతరం నగదు లావాదేవీలు సగానికి పైగా పడిపోయాయి. మరోవైపు బ్యాంకుల్లో డబ్బులు లేకపోవడం, ఏటీఎంల్లో నగదు కొరత కారణంగా ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే కార్డు ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తే పన్నుల పేరుతో పెద్ద మొత్తంలో చెల్లించాల్సి రావడంతో వినియోగదారులు ఈ విధానంపై ఆసక్తి చూపడంలేదు. మరోవైపు పొలం పనులు, పెళ్లిళ్లు, ఆస్పత్రి ఖర్చులు ఇలా నగదు అవసరం ఎక్కువగా ఉంటోంది. ఏటీఎంలలో డబ్బులు లేకపోవడం, బ్యాంకుల్లో అరకొరగానే నగదు ఇస్తుండటంతో ప్రజలు ఈ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ‘మాకు డబ్బులు ఇచ్చినందుకు మేం బ్యాంకుల్లో టాక్స్‌లు చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తీసుకుంటున్నాం’ అంటూ 2 నుంచి 5 శాతం వరకు కమీషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. రూ.10 కోట్ల మేర స్వైపింగ్ ద్వారా.. జిల్లాలో రోజూ సుమారు రూ.10 కోట్ల మేర స్వైపింగ్ మెషీన్ల ద్వారానే చెల్లింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తణుకుకి చెందిన ఒక వ్యాపారి రోజుకు రూ.10 లక్షల వరకు స్వైపింగ్ మెషీన్ ద్వారా కమీషన్ వ్యాపారం చేస్తున్నట్టు తెలుస్తోంది. సగటు 3 శాతం కమీషన్ వసూలు చేసినా రోజుకు కనీసం రూ.30 వేలు వరకు సంపాదిస్తున్నారు. కేవలం వ్యాపార సంస్థలే కాకుండా పెట్రోలు బంకులు, మద్యం దుకాణాల్లో ఈ కమీషన్ వ్యాపారం జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. స్వైపింగ్ మెషీన్ల ద్వారా బిల్లులు చెల్లించినందుకు ఎలాంటి కమీషన్ తీసుకోవద్దని బ్యాంకర్లు సూచిస్తున్నా పలువురు వ్యాపారులు మాత్రం పెడచెవిన పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మా సొమ్ములకు కూడా కమీషన్ ఇస్తున్నాం ఏటీఎంల్లో ఎప్పుడు చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో అవసరం కోసం వ్యాపారి వద్దకు వెళితే స్వైపింగ్ మెషీన్ ద్వారా 3 నుంచి 5 శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. రూ.10 వేలకు రూ.300 తీసుకుంటున్నారు. మా డబ్బులు మేం తీసుకునేందుకు కూడా కమీషన్లు ఇవ్వాల్సి వస్తోంది.– జీవీఎన్ మూర్తి, ప్రైవేట్ ఉద్యోగి, తణుకు ఏటీఎంల్లో నగదు ఉంచాలి నగదు ఎక్కడా దొరకడం లేదు. బ్యాంకు ఖాతాల్లో డబ్బులు ఉన్నా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండటంలేదు. ఏ ఏటీఎంకు వెళ్లినా సొమ్ములు ఉండటంలేదు. చేబదులు కూడా దొరక్కపోగా అప్పు పుట్టడంలేదు. వ్యాపారుల వద్ద మాత్రం స్వైపింగ్ మెషీన్ల ద్వారా నిమిషాల్లో డబ్బులు ఇస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏటీఎంల్లో నగదు అందుబాటులో ఉంచాలి. – ఎం.రాంబాబు, రైతు, తణుకు -
డిజి‘డల్’!
పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను రద్దు చేసి నేటికి ఏడాదికి గడిచిపోయింది. కొత్త రంగుల్లో రూ.2000, రూ.500 నోట్లు వచ్చాయి. ఇటీవలే రూ.200 నోట్లు, రూ.50 నోట్లు కూడా దర్శనమిస్తున్నాయి. కానీ బ్యాంకులు, ఏటీఎంల ముందు ఖాతాదారుల కష్టాలు మాత్రం నేటికీ తీరట్లేదు. నెల ప్రారంభంలోనే ఏటీఎంలు వెలవెలబోతున్నాయి. ఖాతాల్లో నగదు ఉన్నా బ్యాంకుల్లో నిబంధనల వల్ల అక్కడా విత్‌డ్రా కష్టాలు తప్పట్లేదు. నగదుతో సంబంధం లేకుండా స్వైపింగ్ మెషిన్లు వాడండంటూ ప్రభుత్వం హోరెత్తించినా అవి కాస్త ఢమాల్‌మన్నాయి. వ్యాపారులు మెషిన్ వాడకం కన్నా ‘క్యాష్’ తీసుకోవడంపైనే ఆసక్తి చూపిస్తున్నారు. కాదు కార్డే ఇస్తామంటే 2 శాతం ఎక్కువ మొత్తం బాధేస్తున్నారు. డిజిటల్ కరెన్సీ వాడకంపై బ్యాంకు సిబ్బందితో పాటు డీఆర్డీఏ, డ్వామా, పురపాలక సంఘాలు, పంచాయతీల సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు ఇటీవల వరకూ అవగాహన సదస్సులు నిర్వహించి నా పెద్దగా ఫలితం కనిపించట్లేదు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నగదు రహిత లావాదేవీల నిర్వహణ ఏడాది తిరిగేకల్లా పూర్తిస్థాయిలో సాధిస్తామని అధికార పార్టీ నాయకులు ప్రారంభంలో చాలా హడావుడి చేశారు. డిజిటల్ కరెన్సీ వాడకం సాధ్యాసాధ్యాలపై నిపుణులు పలు సందేహాలు వ్యక్తం చేసినా కొట్టిపారేశారు కూడా. వాస్తవానికి జిల్లాలో నగదురహిత లావాదేవీలు నిర్వహించడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు అంతంత మాత్రమే. జిల్లాలోని వివిధ బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు దాదాపు 5.27 లక్షల వరకూ ఉన్నాయి. వాటిలో ప్రస్తుతం సజీవంగా (కేవైసీ) ఉన్నవి కేవలం 3 లక్షలకు మించిలేవు. అంటే 60 శాతమే. మిగిలినవన్నీ ఉపయోగంలో లేనివే. సాధారణ బ్యాంకు ఖాతాలు జిల్లాలో 25 లక్షల వరకూ ఉన్నాయి. వాటిలో 30 శాతం మంది మొబైల్లో బ్యాంకింగ్ సేవలు వినియోగిస్తున్నారని అధికారులు చెబుతున్నా సాంకేతిక సమస్యల వల్ల ఆ స్థాయిలో కూడా ఉండవనే వాదనలు వినిపిస్తున్నాయి. కానీ మొబైల్ బ్యాంకింగ్‌కు స్మార్ట్‌ఫోన్‌తో పాటు లావాదేవీలపై అవగాహన ఉన్నవారు సామాజిక, ఆర్థిక, అక్షరాస్యత పరిస్థితుల దృష్ట్యా చూస్తే జిల్లాలో రెండు లక్షలు వరకూ ఉంటే గొప్ప విషయమే. జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు, నిరక్షరాస్యులు ఎక్కువ. జన్‌ధన్ ఖాతాలు ఎక్కువగా మహిళలకే ఉన్నాయి. నిరక్షరాస్యత వారిలోనే ఎక్కువ. అయితే జిల్లాలో 3,90,771 రూపే కార్డులు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించినప్పటికీ అవి పెద్దగా ఉపయోగిస్తున్న దాఖలాలు లేవు. ‘పని’కిరాని పీవోఎస్‌లు.. ఎక్కడికక్కడ చిన్న దుకాణాల నుంచి పెద్ద వ్యాపార సంస్థల వరకూ, ఆర్టీసీ, రైలు టిక్కెట్ల నుంచి బిల్లుల చెల్లింపుల వరకూ పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) మెషిన్ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహిస్తామని పెద్దనోట్ల మార్పిడి ప్రక్రియ తర్వాత ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ అవెక్కడున్నాయో ప్రస్తుతం కనిపించట్లేదు. తొలుత 891, ఆ తర్వాత మరో 2,500 పీవోఎస్ మెషిన్లు అందుబాటులోకి తెచ్చామని అధికారులు చెప్పారే తప్ప అవెప్పుడో మూలకు చేరిపోయాయి. జిల్లాలో బ్యాంకు ఆఫ్ బరోడా ద్వారా 480 పీవోఎస్ మెషిన్లు ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్లు ఉపయోగించేందుకు తెప్పించామని అధికారులు ప్రకటించినా ఇప్పటివరకూ ఏ ఒక్క బస్సులోనూ వాడిన దాఖలాలు లేవు. స్వైపింగ్ మెషిన్లు వాడకం కొందరికే.... జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంతోపాటు నియోజకవర్గ కేంద్రాల్లోనూ సూపర్ మార్కెట్లకే స్వైపింగ్ మిషన్లు పరిమితమయ్యాయి. కిరాణా దుకాణాల్లో ఎక్కడా కనిపించట్లేదు. పెద్ద దుకాణాల్లో మాత్రమే స్వైపింగ్ మెషిన్లు కనిపిస్తున్నాయి. కానీ నగదు తీసుకోవడానికే ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. కాదు కార్డు ఉందని చెబితే అదనంగా రెండు శాతం వరకూ నగదు వసూలు చేస్తున్నారు. కార్డు ఎందుకు దండగ అంటూ కొంతమంది వ్యాపారులు నగదు లావాదేవీలనే ప్రోత్సహించడం గమనార్హం. ఇక బంగారం దుకాణాల్లో చాలావరకూ నగదుతోనే లావాదేవీలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం సహా జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో టిక్కెట్ల కౌంటర్లలో ప్రయాణికుల కోసం స్వైపింగ్ మెషిన్లు ఏర్పాటు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు ఏ ఒక్క కౌంటర్లోనూ కనిపించట్లేదు. స్వైపింగ్ మిషన్లు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్ సమస్యలతో మొరాయిస్తుండటంతో వాటిని ఎప్పుడో పక్కనపెడేశారు. పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మెషిన్లతో లావాదేవీలు 20 శాతం మించట్లేదు. పెద్ద నోట్లు రద్దు తర్వాత చిల్లర కొరత ఏర్పడిన సమయంలో చౌక డిపోల్లో తప్పనిసరిగా నగదురహితలావాదేవీలు అమలు చేయాలని అధికారులు ఆదేశించారు. కానీ ప్రస్తుతం ఎక్కడా చౌక డిపోల్లో అమలు చేయటంలేదు. బ్యాంకుల్లో రూ.50 వేలుకు మించి విత్‌డ్రా, డిపాజిట్లకు పాన్ కార్డు అడుగుతుండటంతో ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం నగదు కొరత లేకున్నా విత్‌డ్రాలపై పరిమితి విధించడం వల్ల సమస్య తప్పట్లేదని కొంతమంది వాపోతున్నారు. ఏటీఎంల్లో కూడా తరచుగా నగదు కొరత సమస్య ఏర్పడుతోంది. -
స్వైపింగ్ మిషన్లతో రూ.కోటి స్వాహా
హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా జే అండ్ కే బ్యాంక్ నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల స్వైపింగ్ మిషన్లు తీసుకుని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోటి మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సిటీ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. నగరానికి చెందిన మామిడి మహేష్.. జే అండ్ కే బ్యాంక్‌లో నాలుగు కరెంట్ ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా బ్యాంకు అధికారులు వ్యాపార లావాదేవీల కోసం ఫిబ్రవరిలో అతడికి నాలుగు స్వైపింగ్ మిషన్లు జారీ చేశారు. ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధిలో నమోదైన బందిపోటు దొంగతనం కేసులో మహేష్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే అతడికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో జైలుకు వెళ్తూ తన నాలుగు స్వైపింగ్ మిషన్లను తన స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వీటిని వినియోగించేందుకు కిరణ్ వనస్థలిపురం ప్రాంతంలో చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన చాంద్‌పాషాతో ఇతనికి పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు కార్డులకు సంబంధించిన పిన్ నంబర్, డేటా తెలుసునని కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్ మిషన్లు తనకు అప్పగిస్తే అక్రమ లావాదేవీల ద్వారా వచ్చే మొత్తంలో 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. ఎలాంటి శ్రమ లేకుండా కమీషన్ వస్తోందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించిన కిరణ్‌కుమార్ నాలుగు స్వైపింగ్ మిషన్లను చాంద్‌పాషాకు అప్పగించాడు. తొలుత వనస్థలిపురంలో ఉన్న దుకాణం నుంచి చాంద్‌పాషా తన దందా ప్రారంభించాడు. ఆపై వీటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. ఇతగాడు ఈ స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేయడానికి అవసరమైన క్లోన్డ్ కార్డుల్ని కేరళలోని కసరకోడ్ ప్రాంతానికి చెందిన యూసుఫ్ నుంచి తీసుకుంటున్నాడు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండానే ఈ కార్డుల్ని నాలుగు స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేష్‌కు చెందిన కరెంట్ ఖాతాల్లో పడేట్లు చేస్తున్నాడు. ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలు తెలిసిన కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలిన నగదును అబుబాకర్ చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ వ్యవహారాలు నెరపడానికి కిరణ్‌కు రామ్‌ప్రసాద్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలింది కార్డులు, డేటా అందించిన యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. నగరంలో ఉన్న వారితో సంప్రదించేందుకు అబుబాకర్‌ను హిందీ రాకపోవడంతో కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకారం తీసుకుంటున్నాడు. ఈ గ్యాంగ్ రెండు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అనేక క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోటి స్వాహా చేసింది. ఈ ఏడాది మేలో జే అండ్ కే బ్యాంక్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల నుంచి ఈ మేరకు ఫిర్యాదులు అందాయి. వీరు జారీ చేసిన స్వైపింగ్ మిషన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలియకుండానే వారి కార్డుల్ని క్లోనింగ్ చేసి, నగదు కాజేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో జే అండ్ కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం అధికారులు దర్యాప్తు చేశారు. వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇప్పటికే జైల్లో ఉన్న మహేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్ కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కితే కార్డుల్ని ఎలా క్లోనింగ్ చేస్తున్నారు? బ్యాంకు వినియోగదారుల డేటా, పిన్ నంబర్లు ఎలా సంగ్రహిస్తున్నాడు? అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. -
కాలు దువ్వుతున్న పందెం కోడి
♦ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రజాప్రతినిధులు ♦ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే వ్యూహం .. ♦ కత్తులు కట్టేందుకు పొరుగు జిల్లాల నుంచి రాక.. ♦ భోగినాడు రహస్య ప్రదేశంలో బరిలోకి.. ♦ ఇక మూడు రోజులు పందేలే పందేలు ... ♦ జిల్లాలో రూ. 100 కోట్లు చేతులు మారతాయని అంచనా సాక్షి, అమరావతిబ్యూరో : పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేతతోపాటు ఇద్దరు ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వడమే ఇందుకు కారణం. ఇటీవల పరిణామాల నేపథ్యంలో కొందరు నిర్వాహకులు అధికార పార్టీ కీలక నేతతోపాటు ఇద్దరు ప్రజాప్రతినిధులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పందేల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని ఆ నేతలు భరోసా ఇచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యేను కూడా వారు ఫోన్లో సంప్రదించారు. రెండు జిల్లాల్లో కోడి పందేల నిర్వహణకు ఒకే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణరుుంచారు. పోలీసులు ఇబ్బంది పెట్టకుండా పండుగ మూడురోజులు పందేలకు పరోక్షంగా సహకరించేలా చూస్తామని నిర్వాహకులతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా చేద్దాం.. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం ప్రజాప్రతినిధుల వ్యూహం ప్రకారం కోడిపందేలకు ఏర్పాట్లు ఊపందుకున్నారుు. ప్రధానంగా గుడివాడ, గన్నవరం, కై కలూరు, పెనమలూరు, బందరు, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వాహకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కోళ్లను రప్పించి రహస్య ప్రదేశంలో ఉంచారని తెలుస్తోంది. కోళ్లకు కత్తులు కట్టకూడదన్న నిబంధనను కూడా వ్యూ హాత్మకంగా నీరుగార్చడానికి యత్నిస్తున్నారు. స్థానికులను కాకుండా కత్తులు కట్టేందుకు పొరుగు జిల్లాల వారిని రప్పిస్తున్నారు. ఎందుకంటే కోళ్లకు కత్తులు కట్టే స్థానికులను పోలీసులు ముందుగానే గుర్తించి నిఘా ఉంచుతారు. పాత కేసులు తిరగేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. దాంతో జిల్లా పోలీసులకు తెలియని పొరుగు జిల్లాలకు చెందిన వారిని రప్పించి కత్తులు కట్టించాలన్నది వ్యూహంగా ఉంది. ఈ నెల 12 వరకు ఎక్కడా హడావుడి చేయకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటించనున్నారు. సరిగ్గా భోగి నాడు ముందుగా నిర్ణరుుంచిన ముహూర్తానికి ఓ రహస్య ప్రదేశంలో తొలి పందెం కోళ్లను బరిలోకి వదలాలని నిర్ణరుుంచారు. అంతవరకు పందేలు అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించే పోలీసులు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతారన్నది ప్రజాప్రతినిధుల ముందస్తు వ్యూహం. దాంతో అదే ఊపుతో మిగిలిన బరుల్లో కూడా కోళ్లను దింపాలని భావిస్తున్నారు. ఇలా మూడురోజులపాటు పందేలు సాగేందుకు పక్కా స్కెచ్ వేశారు. రూ.100 కోట్లు.. ! అంతా అనుకున్నట్లు సాగితే... పండుగ మూడురోజులు జిల్లాలో రూ.100కోట్ల వరకు కోడిపందేలు సాగవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో రూ.70 కోట్ల వరకు పందేలు జరిగారుు. ఈసారి అంతకుమించి పందేలు సాగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జిల్లాకు రానున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా విజయవాడలోని హోటళ్లతోపాటు శివారుప్రాంతాల్లోని రిసార్టులు అన్నీ ముందుగానే బుక్ అరుుపోయారుు. నగదు సమస్య ఏర్పడకుండా ఆన్లైన్ చెల్లింపులు, స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం. -
శివయ్య చెంత స్వైపింగ్ సేవలు
శ్రీకాళహస్తి(చిత్తూరు జిల్లా): శ్రీకాళహస్తి దేవస్థానంలో టికెట్ కౌంటర్ల వద్ద బ్యాంకువారు స్వైపింగ్ మిషన్ ఏర్పాటుచేయడంతో భక్తులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. దేవస్థానానికి రోజుకు 25వేల నుంచి 30వేల మంది భక్తులు వస్తుంటారు. అయితే పెద్దనోట్ల రద్దుతో పలువురు భక్తులు దేవస్థానంలో పూజలు చేయించుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నారు. కాగా, బ్యాంక్‌వారు అన్ని టికెట్ కౌంటర్ల వద్ద స్వైపింగ్ యంత్రాలు పెట్టడంతో భక్తులు తమ ఏటీఎం కార్డులు వినియోగించుకుని పూజలు చేసుకుంటున్నారు. -
ఆన్లైన్.. సర్వర్ డౌన్!
⇒ వారాంతంలో నెట్ వర్క్ బిజీ..బిజీ ⇒ మొరాయిస్తున్న స్వైపింగ్ మిషన్లు ⇒ క్యాష్‌లెస్ లావాదేవీలకు ఆటంకాలు ⇒ పెట్రోల్ బంకుల్లో గొడవలు, వివాదాలు ⇒ షాపింగ్ మాల్స్‌లో జనం అగచాట్లు సరైన నెట్వర్క్ వ్యవస్థ లేకపోవడం, వారాంతంలో లావాదేవీలు పెరగడంతో ‘ఆన్లైన్’ వ్యవస్థ స్తంభిస్తోంది. సర్వర్ డౌన్ సమస్యలతో క్యాష్‌లెస్ చెల్లింపులకు ఆటంకం ఎదురవుతోంది. కార్డులతో పనులు ముగించుకోవచ్చని బయలుదేరిన సిటీజనులకు గొడవలు, వివాదాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా పెట్రోల్‌బంకులు, షాపింగ్ మాల్స్‌లో కార్డులు ఉపయోగించడం కుదరడం లేదు. సర్వర్ డౌన్ అయిందని కొన్నిచోట్ల..ఆన్లైన్ నెట్వర్క్ పనిచేయడం లేదని మరికొన్నిచోట్ల బోర్డులు పెడుతున్నారు. కొన్ని షాపింగ్ మాల్స్‌లో ఫలానా బ్యాంకు కార్డులు మాత్రమే యాక్సెప్ట్ చేస్తామంటున్నారు. దీంతో చేసేదేమీ లేక కొనుగోలుదారులు వెనుదిరుగుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: గోషామహల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రవీణ్ గచ్చిబౌలిలోని తన ఐటీ కంపెనీకి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మధ్యలో పెట్రోలు పోయించేందుకు గోషామహల్ సమీపంలోని పెట్రోల్ బంకుకు వెళ్లాడు. అక్కడ స్వైపింగ్ మిషన్ సర్వర్ డౌన్ అని సమాధానం వచ్చింది. మార్గమధ్యలో మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, రేతిబౌలి, టౌలిచౌకి వరకు ఉన్న పెట్రోల్ బంకుల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. చివరకు టౌలిచౌకిలోని ఒక పెట్రోల్ బంకులో రెండు లీటర్ల పెట్రోల్ పోయించుకొని రూ.2 వేల నోటు ఇస్తే చిల్లర లేదని బంకు సిబ్బంది సమాధానం ఇచ్చారు. అరగంట సేపు వెయిట్ చేయించి చిల్లర తెచ్చి ఇచ్చారు. ఈ సమస్యల కారణంగా ఆఫీసుకు గంట ఆలస్యంగా వెళ్లాల్సి వచ్చింది. ఇది ప్రవీణ్ ఒక్కరి సమస్యేకాదు. నగరంలో వీకెండ్లో లావాదేవీలు ఎక్కువగా ఉండి ఆన్లైన్ వ్యవస్థ స్తంభిస్తోంది స్వైపింగ్ మిషన్లు మొరాయిస్తున్నాయి. దీంతో క్యాష్‌లెస్ లావాదేవీలు వివాదాలకు కారణమవుతున్నాయి. గ్రేటర్ వాసులను ‘నగదు’ రహిత లావాదేవీలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రహిత లావాదేవీలు ఊపందుకున్నా.. ఆన్లైన్ సర్వర్ డౌన్ సమస్యలు ఇరకాటంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా వారాంతంలో ఆన్లైన్ కొనుగోళ్లు పెరగడంతో నెట్వర్క్ బిజీగా మారుతోంది. చాలాచోట్ల సర్వర్ డౌన్ కావడంతో క్రెడిట్, డెబిట్ కార్డులు, ఈ–వ్యాలెట్లు మూగబోతున్నాయి. నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వం ప్రకటించిన రాయితీలు, డిస్కౌంట్లు దేవుడేరుగు కానీ.. కొనుగోళ్ల అనంతరం సర్వర్ డౌన్‌తో వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెట్రోల్ బంకుల్లో గొడవలు, షాపింగ్ మాల్స్‌లో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. పెట్రోల్ బంకుల్లో ఎక్కువ.. పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్లు ఎక్కువగా మొరాయిస్తున్నాయి. ఇటీవల డిజిటల్ లావాదేవీలు పెరగడంతో సర్వర్ బిజీబిజీగా మారుతోంది. తాజాగా చమురు సంస్థలు కార్డుల ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై లీటర్‌కు 0.75 శాతం డిస్కౌంట్ ప్రకటించాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహా నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.73.61 పైసలు ఉండగా డిజిటల్ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 55 పైసలు, డీజిల్ ధర రూ. 61.81 పైసలు ఉండగా డిజిటల్ చెల్లింపుల ద్వారా లీటర్‌పై 46 పైసలు డిస్కౌంట్‌గా లభిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్‌లోని పెట్రోల్ బంకుల్లో నగదు రహిత లావాదేవీలు పెరిగాయి. మహానగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా అందులో ప్రతిరోజు రద్దిగా ఉండే సుమారు 220 పైగా పెట్రోల్ బంకుల్లో స్వైపింగ్ మిషన్లు ఉన్నాయి. కానీ చాలాచోట్ల అవి పనిచేయడం లేదని చెబుతున్నారు. వాహనాల్లో పెట్రోల్, డీజిల్ పోయించుకున్న తర్వాత స్వైపింగ్ మిషన్లు పనిచేయకపోవడంతో వినియోగదారులకు తిప్పలు తప్పడంలేదు. కొన్ని చొట్ల ఏకంగా సేల్స్మెన్లు, వాహనదారుల మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. చిల్లర నో..... పెట్రోల్ బంకులు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లలో చిల్లర పెద్ద సమస్యగా మారింది. చాలా చోట్ల రూ.2వేల నోటు తీసుకోలేమని కూడా బోర్డులు పెడుతున్నారు. కొన్ని పెట్రోలు బంకుల్లో రూ.500 పెట్రోలు పోయించుకుంటేనే రూ.2వేల నోటుకు చిల్లర ఇస్తామంటున్నారు. దీంతో పెద్ద వాహనాల్లో ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ నింపుకుంటున్నారు. చిన్న వాహనదారులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు మహానగరంలో ప్రతి రోజు సగటున 40 నుంచి 50 లక్షల లీటర్ల పెట్రోల్, 30 నుంచి 40 లక్షల డీజిల్ అమ్మకాలు సాగుతుంటాయన్నది అంచనా. అందులో స్వైపింగ్ మిషన్లపై 30 శాతం వరకు అమ్మకాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక కొన్ని రెస్టారెంట్లలో రూ.వెయ్యి పైన బిల్లు చేస్తేనే రూ.2 వేల నోటు తీసుకుంటామని చెబుతున్నారు. ఇక చిన్నచిన్న షాపుల్లో రెండు వేల నోటు తీసుకోవడమే మర్చిపోయారు. -
40 శాతం అమ్మకాలు ఢమాల్!
పుస్తక ప్రదర్శనపైనా నోట్ల రద్దు ప్రభావం గతేడాది కంటే తక్కువగా విక్రయాలు సందర్శకులు వస్తున్నా.. అమ్మకాలు మాత్రం అంతంతే! 26తో ముగియనున్న ప్రదర్శన సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పైనా పెద్ద నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పుస్తకాలు కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ చాలామంది పాఠకులు నగదు కొరత వల్ల వెనుకడుగు వేస్తున్నారు. కేవలం సందర్శనకే పరిమితమవుతున్నారు. ప్రతి రోజూ వేలాది మంది పుస్తకప్రియులు బుక్‌ఫెయిర్‌కు వస్తున్నప్పటికీ కొనుగోలు చేసే వాళ్ల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. గతేడాది రోజుకు సుమారు రూ.లక్ష విలువైన పుస్తకాలు విక్రయించిన స్టాళ్లలో ఇప్పుడు సగం మేరకు అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. గతేడాదితో పోల్చుకుంటే 40 శాతం మేర అమ్మకాలు తగ్గినట్లు స్టాళ్ల నిర్వాహకులు చెప్తున్నారు. గతేడాది 350కి పైగా స్టాళ్లు ఏర్పాటు చేయగా.. ఈసారి 290 స్టాళ్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. స్టాళ్ల ఎంపికలో స్క్రీనింగ్ పద్ధతిని పాటించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తవాళ్లకు కాకుండా ప్రతి సంవత్సరం వచ్చేవారికే ఈ ఏడాది స్టాళ్లను కేటాయించారు. దీంతో కొంత మేర స్టాళ్ల సంఖ్య తగ్గిందని నిర్వాహకులు చెప్తున్నపటికీ నోట్ల రద్దు ప్రభావం కూడా స్పష్టంగా ఉంది. ఈ ఏడాది హైదరాబాద్‌లోని ఎమెస్కో, నవచేతన, నవోదయ, నవతెలంగాణ, విశాలాంధ్ర, అరుణోదయ, వీక్షణం, పీకాక్ క్లాసిక్స్ వంటి ప్రముఖ పుస్తక సంస్థలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేశారు. న్యూఢిల్లీకి చెందిన లెఫ్ట్ వరల్డ్, తమిళనాడుకు చెందిన భారతి వంటి ప్రచురణ సంస్థలు స్టాళ్లను ఏర్పాటు చేశాయి. రాజమండ్రి వంటి చోట పుస్తక ప్రదర్శనపై నోట్ల ప్రభావం పడ్డప్పటికీ వెరవకుండా హైదరాబాద్‌లో 30వ జాతీయ పుస్తక ప్రదర్శనకు బుక్ ఫెయిర్ కమిటీ సిద్ధపడింది. ఈ నెల 15న ప్రారంభమైన ప్రదర్శన 26న ముగియనుంది. స్వైపింగ్ మిషన్ల కొరత... నగదు కొరత దృష్ట్యా కొన్ని స్టాళ్లు స్వైపింగ్ మిషన్లు, పేటీఎం ద్వారా పుస్తకాలను విక్రయిస్తున్నాయి. ఎమెస్కో, నవతెలంగాణ, నవచేతన, లెఫ్ట్ వరల్డ్, వంటి ప్రముఖ పుస్తకాల స్టాల్స్‌లో స్వైపింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి.కానీ చాలా చోట్ల స్వైపింగ్ లేకపోవడంతో కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ పాఠకులు వెనుకడుగు వేస్తున్నారు. మరోవైపు నగదు కొరత కూడా వెంటాడుతోంది.‘‘ వంద రూపాయల బుక్ కోసం రూ.2 వేల నోటుతో వస్తున్నారు. చిల్లర కోసం ఎక్కడికెళ్లగలం. అలా వచ్చే కొద్దిపాటి గిరాకీ కూడా పోతోంది.’’ అని ఒక స్టాల్ నిర్వాహకుడు పేర్కొన్నాడు. ఇక తెలుగు అకాడమీ, నేషనల్‌బుక్ ట్రస్టు వంటి కొన్ని ప్రభుత్వ పుస్తక సంస్థల్లోనే స్వైపింగ్ మిషన్లు లేకపోవడంతో పాఠకులు నిరాశగా వెనుదిరిగి వెళ్తున్నారు. స్వైపింగ్ కోసం తాము అధికారులను కోరినప్పటికీ ఇప్పటి వరకు సరఫరా కాలేదని నిర్వాహకులు చెబుతున్నారు. తెలుగు అకాడమీలో గతేడాది రూ.5 లక్షలకు పైగా విలువైన పుస్తకాలు విక్రయించగా ఈసారి ఇప్పటి వరకు రూ.2 లక్షల కంటే ఎక్కువ విక్రయించలేకపోయారు. ఈ నెల 26తో ప్రదర్శన ము గియనుంది. 24, 25 తేదీల్లో కూడా సందర్శకుల సంఖ్య అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. చివరి రోజులు కావడంతో అమ్మకాలు కూడా పెరుగవచ్చని నిర్వాహకులు ఆశాభావంవ్యక్తం చేస్తున్నారు. -
ఆర్టీసీలో స్వైపింగ్ సేవలు
నెల్లూరు టౌన్/గూడూరు: నగదు, చిల్లర కష్టాల నుంచి బయటపడేందుకు నెల్లూరు ఆర్టీసీ అధికారులు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేశారు. చార్జీలను వీటి ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించారు. నాన్‌స్టాప్ బుకింగ్ కౌంటర్లలో 10, ఏసీ బస్సుల్లో 8, సూపర్ లగ్జరీల్లో 6, బస్‌పాస్ జారీ చేసే కౌంటర్లలో 6, శబరిమలై కౌంటర్లో ఒకటి, పార్సెల్ సర్వీసులో ఒకటి మొత్తం 32 మిషన్లను ఏర్పాటు చేశారు. దశలవారీగా 215 మిషన్లను ఏర్పాటు చేయనున్నామని అధికారులు తెలిపారు. చిన్న నోట్లు లేక, కొందరు ఇచ్చే రూ.2 వేల నోట్లకు తిరిగి చిల్లర ఇవ్వలేక, టికెట్‌ను వదులుకోలేక కూడా ప్రయాణికులు, కండక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలకు తెర దించేందుకు స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. -
ట్రాన్స్‌పోర్టు కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లు
ఆత్మకూరురూరల్ : ఆత్మకూరు రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధారిటీ కార్యాలయంలో స్వైప్‌మిషన్లు ఏర్పాటుచేసినట్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు తెలిపారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని నెల్లూరుపాళెం వద్దనున్న కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగదు రహిత లావాదేవీలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో వీటిని ఏర్పాటుచేశామన్నారు. లైసెన్సుల కోసం చెల్లించే ఫీజులు, అపరాధరుసుం స్వైపింగ్ మిషన్ల ద్వారా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కాగా సరైన పత్రాలు లేకుండా సరుకు రవాణా చేస్తున్న వాహనాల నుంచి రూ.40 వేలు అపరాధరుసుం శుక్రవారం వసూలు చేసినట్లు మాధవరావు తెలిపారు. -
మెడికల్ షాపుల్లో స్వైప్ తప్పనిసరి
అనంతగిరి: మెడికల్ షాపుల్లో తప్పకుండా స్వైప్ మిషన్లు ఉపయోగించాలని వికారాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ రువికుమార్ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని యాష్కి సునీల్ నివాసంలో మెడికల్ షాపుల యజమానుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నగదురహిత వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశానుసారం మెడికల్ షాపుల్లో తప్పకుండా స్వైప్ మిషన్లు సాధ్యమైనంత తక్కువ రోజుల్లో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇతర రకాల వ్యాపారుల కంటే ముందు మెడిల్ దుకాణాల్లో స్వైప్ మిషన్లను అందుబాటులోకి తీసుకరావాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మెడికల్ షాపుల్లో కూడా స్వైప్ మిషన్లు తప్పని సరి వాడాలన్నారు. మెడికల్ షాపులు నడిపించే యజమానులకు ఎంతోకొంత అవగాహన ఉన్నవారేనని, స్వైప్ మిషన్లు ఉపయోగించడం వారికి ఎంతో తేలికన్నారు. ప్రతి కుటుంబం ఏదో రకమైన మందులు కొనడానికి మెడికల్ షాపులకు వస్తారని, వారందరికి నగదు రహిత వ్యాపారంపై నచ్చజెప్పాలన్నారు. కొన్ని రకాల బ్యాంక్ డెబిట్ కార్డులకు సేవా పన్ను వసూళ్లు చేస్తున్నారని, ఈ పన్నును మినహాయించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశం మేరకు జిల్లాలోని అన్నీ ప్రాంతాలకు వెళ్లి ప్రతి మెడికల్ షాపులో స్వైప్ మిషన్లు ఉపయోగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మెడికల్ షాపుల యజమానుల సంఘం నాయకుడు వి. శ్రీనివాస్ మాట్లాడుతూ స్వైప్ మిషన్లకోసం ఇప్పటికే బ్యాంక్‌లకు దరఖాస్తు చేసుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మెడికల్ శాపుల యజమానులు ఎం.శ్రీనివాస్, సునీల్, అరవింద్, తిరుపతిరెడ్డి, విజయ్‌కుమార్, సత్యనారాయణ గౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఊళ్లో అంతా ‘క్యాష్ లెస్’!
దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మహారాష్ట్రలోని ధసై - చిన్నా పెద్దా అన్ని దుకాణాల్లోనూ స్వైపింగ్ యంత్రాలు - వడాపావ్ తిన్నా కూడా డెబిట్/క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించొచ్చు - కొద్ది రోజులుగా గ్రామంలోనే మకాం వేసి కరెంట్ ఖాతాలు, - స్వైపింగ్ యంత్రాలు అందజేస్తున్న బ్యాంకు అధికారులు - వ్యాపారులకు ఓ స్వచ్ఛంద సంస్థ, పంచాయతీ సహకారం - ప్రత్యేక కార్యక్రమాలతో జనానికి అవగాహన కల్పిస్తున్న వైనం సాక్షి, ముంబై: అది మహారాష్ట్రలోని థానే జిల్లా ముర్బాడ్ తాలూకా ధసై గ్రామం.. ఈ ఊళ్లో ఏది కొనాలన్నా డబ్బులు అవసరం లేదు.. టిఫిన్ చేయాలన్నా, వడాపావ్ తినాలన్నా సరే.. జస్ట్ క్రెడిట్ కార్డో, డెబిట్కార్డో ఉంటే చాలు.. ఎంత తక్కువ మొత్తమైనా సరే కార్డు స్వైప్ చేసి చెల్లించేయొచ్చు. నోట్ల రద్దుతో దేశమంతా విభిన్నమైన పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ ‘క్యాష్ లెస్’ గ్రామం ఒక్కసారిగా చర్చల్లోకెక్కింది. దేశంలోనే మొట్టమొదటి నగదు రహిత గ్రామంగా నిలిచింది. ధసై గ్రామంలో బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఆర్థిక మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇటీవల స్వైపింగ్ యంత్రాల సేవలు ప్రారంభించి.. దేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా మారిందని ప్రకటించా రు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఆ గ్రామంలో పర్యటించి.. ప్రజలు, వ్యాపారుల అభిప్రాయాలను, నగదు రహిత సేవల వివరాలను తెలుసుకుంది. 10 వేల జనాభాతో.. మహారాష్ట్ర రాజధాని ముంబైకి దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధసై గ్రామ జనాభా సుమారు 10 వేలు. ఈ గ్రామం చుట్టూ మరో 40 గిరిజన, ఆదివాసీ పల్లెలు కూడా ఉన్నారుు. వారంతా కూడా నిత్యావసరాలు, ఇతర సామగ్రి కోసం ధసైకే వస్తుంటారు. ఇక్కడ చిన్నాపెద్దా కలిపి సుమారు 150కి పైగా దుకాణాలు ఉన్నారుు. చిన్న చిన్న టిఫిన్ సెంటర్ల నుంచి కూరగాయలు, మెడికల్, స్టేషనరీ, మాంసం దుకాణాలు తదితర వ్యాపారులంతా కలసి ‘ధసై గ్రామ వ్యాపారీ సంఘటన’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. అందులోని సభ్యులందరూ ధసై గ్రామాన్ని నగదు రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరికి సావర్కర్ స్మారక్ అనే స్వచ్ఛంద సంస్థ, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నారు. ప్రతి దుకాణంలోనూ.. గ్రామంలోని ప్రతి దుకాణంలోనూ స్వైపింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి, నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 37 దుకాణాల్లో స్వైపింగ్ యంత్రాలను వినియోగిస్తుండగా.. మిగతా వారంతా మెషీన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వారందరికీ బ్యాంకు అధికారులు స్వైపింగ్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో 10 రూపాయల తినుబండారాలు, సామగ్రి కూడా డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలు కలుగనుంది. ఇలా నగదు రహిత కొనుగోళ్లకు ధసై గ్రామ ప్రజలు కూడా పూర్తి సానుకూలంగా ఉండడం గమనార్హం. అరుుతే ప్రజల్లో దీనిపై పూర్తి అవగాహన కల్పించేందుకు సావర్కర్ స్మారక్ స్వచ్ఛంద సంస్థతోపాటు గ్రామ పంచాయతీ, బ్యాంకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. చిల్లర సమస్య తప్పింది.. ‘ధసై గ్రామంలో చాలా ఏళ్లుగా చికెన్ సెంటర్ నడుపుతున్నాం. స్వైపింగ్ యంత్రంతో అమ్మకాలు మరింత సులభమయ్యారుు. ముఖ్యంగా చిల్లర సమస్య తప్పింది. ప్రస్తుతం నా వద్దకు వచ్చేవాళ్లలో సగానికిపైగా కార్డులతోనే చెల్లిస్తున్నారు..’’ - సల్మాన్ యూసుఫ్ సయ్యద్ ఇక నుంచి మేమూ వాడతాం.. ‘‘కిరాణా సమానులు కొనుక్కునేందుకు ధసైకి వచ్చాను. స్వైపింగ్ యంత్రం గురించి షాపు యజమాని చెబితే ఇప్పుడే తెలుసుకున్నా. మా వద్ద డెబిట్ కార్డు ఉన్నా ఎప్పుడూ వాడలేదు. ఆ అవకాశం కూడా రాలేదు. ఇక నుంచి మేం కూడా కార్డు వాడేందుకు ప్రయత్నిస్తాం.’’ - మాధురి (ధసై శివారు పల్లెకు చెందిన మహిళ) వడాపావ్ బండి వద్దా స్వైపింగ్ మెషీన్ మన వద్ద కట్లీస్/కచోరీ బండ్లలాగానే మహారాష్ట్రలో ఎక్కడ చూసినా వడాపావ్ బండ్లు కనిపిస్తుంటారుు. ఇలా ధసై గ్రామంలోని ప్రధాన కూడలిలో తోపుడు బండిపై వడాపావ్ అమ్మే విజయ్ సురోషరుు.. తన బండి వద్ద స్వైపింగ్ యంత్రం ఏర్పాటు చేసుకున్నారు. రూ.7 విలువ చేసే ఈ వడాపావ్ తిన్నవారి నుంచి కూడా డెబిట్/క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు స్వీకరిస్తామని విజయ్ చెప్పారు. ‘‘ధసైను నగదు రహిత గ్రామంగా మార్చేందుకు నా వంతు సహకారం అందించేందుకే స్వైపింగ్ యంత్రం పెట్టుకున్నా. ఇక్కడికి వచ్చేవారు దానిని చూసి కొంత ఆశ్చర్యపోరుునా.. తర్వాత కార్డుల ద్వారానే చెల్లిస్తున్నారు. దీంతో నాకు పెద్ద ఎత్తునప్రచారం కూడా లభించింది. రోజూ సుమారు 100 మంది డెబిట్/క్రెడిట్ కార్డులతో చెల్లిస్తున్నారు.’’ అని వివరించారు. అందరూ ఆసక్తి చూపుతున్నారు ‘‘స్వైపింగ్ యం త్రాలు అమర్చుకోవడంపై గ్రామంలోని వ్యాపారులంతా ఆ సక్తి కనబరుస్తున్నారు. చిన్నా చిత కా దుకాణాలన్నింటికీ గ్రామ పంచాయతీ నుంచి వ్యాపార ధ్రువపత్రం ఇప్పిస్తున్నాం. దానిద్వారా బ్యాంకులో కరెంట్ ఖాతా, స్వైపింగ్ యంత్రం అందించే ఏర్పాట్లు చేశాం. ధసైకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరల్గావ్ గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు, పంచాయతీ అధికారులు సహకరిస్తున్నారు..’’ - స్వప్నిల్ పాత్కర్, ధసై వ్యాపారీ సంఘటన అధ్యక్షుడు అవగాహన కల్పిస్తున్నాం.. ‘‘ధసై నగదు రహిత గ్రామంగా మారనున్నందుకు సంతోషంగా ఉంది. చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ధసైతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు స్వైపింగ్ యంత్రాలు, కార్డుల వినియోగంపై అవగాహన కల్పించాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం. ముందుగా విద్యార్థులను జాగృతం చేస్తున్నాం...’’ - విక్రమ్ సావర్కర్, సావర్కర్ స్మారక్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి గ్రామంలోనే మకాం వేసి మెషీన్లు ఇస్తున్నాం ‘‘కరెంట్ ఖాతాలు తెరవడం, స్వైపింగ్ యంత్రాలు అందించడం, అమర్చడం కోసం కొద్ది రోజులుగా ధసై గ్రామంలోనే మకాం వేశాం. కావల్సిన కొన్ని పత్రాల విషయంగా ఇబ్బందులు ఎదురవుతున్నారుు. ధసైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 500 స్వైపింగ్ యంత్రాలను అమర్చాలన్న టార్గెట్‌తో పనిచేస్తున్నాం..’’ - శీలం నాగవరప్రసాద్, బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారి -
15 లక్షల స్వైపింగ్ మిషన్లు కావాలి!
-
15 లక్షల మిషన్లు కావాలి!
స్వైపింగ్ యంత్రాలకు భారీగా డిమాండ్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు ఈసీఐఎల్‌తో సంప్రదింపులు ఏ జిల్లాలో ఎన్ని అవసరం? ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా కలెక్టర్లకు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా స్వైపింగ్ మిషన్లను (పాయింట్ ఆఫ్ సేల్) అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మిషన్లను తయారు చేసే ఈసీఐఎల్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోంది. లక్షలాది మిషన్లు అవసరమవటంతో.. భారీ ఎత్తున తయారీకి, సరఫరాకు ఉన్న మార్గాలపై చర్చలు జరుపుతోంది. రాష్ట్రంలోని బ్యాంకుల్లో ఈ మిషన్లను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుండటంతో స్వైపింగ్ మిషన్ల డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం బడా మాల్స్, సూపర్ మార్కెట్లకు పరిమితమైన స్వైపింగ్ మిషన్లను కూరగాయలమ్మే చిన్న రైతుల వరకు కూడా తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా జిల్లాల వారీగా ప్రస్తుతం ఎన్ని స్వైపింగ్ మిషన్లున్నాయి.. ఎన్ని అవసరమున్నాయన్న ప్రణాళికను సిద్ధం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో దాదాపు పది లక్షల నుంచి 15 లక్షలకు పైగా మిషన్ల అవసరం ఉంటుందని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేసింది. ఆ మేరకు మిషన్ల లభ్యత.. సర్దుబాటుపై దృష్టి సారించింది. అయితే ఇప్పటికిప్పుడు అన్ని మిషన్లు సమకూర్చలేమని బ్యాంకర్లు, అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని మాల్స్, సూపర్ మార్కెట్లలో అవసరానికి మించి స్వైపింగ్ యంత్రాలున్నాయి. ఎక్కువ మిషన్లున్న షాపులు, మాల్స్‌ను గుర్తించి.. అవసరానికి మించి ఉన్న మిషన్లను ఇతరులకు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర స్థారుు బ్యాంకర్లకు సూచించింది. నెట్ లేదా సిమ్ తప్పనిసరి ఇంటర్నెట్ సదుపాయం ఉన్న ఫోన్ లేదా మొబైల్ డేటా సిమ్కార్డుతోనే ఈ యంత్రాలు పనిచేస్తాయి. మిషన్‌లో తమ ఖాతా నంబరుతో పాటు ఆన్లైన్లో లావాదేవీలు జరిగేలా సాఫ్ట్వేర్ ఉంటుంది. దీంతో వ్యాపారులు అన్ని రకాల క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులతో లావాదేవీలు నిర్వహించే వీలుంటుంది. కార్డును స్వైప్ చేసి తమకు రావాల్సిన డబ్బును అందులో ఎంట్రీ చేస్తే.. అంత డబ్బు కార్డుదారుల నుంచి వ్యాపారి కరెంట్ ఖాతాలో జమవుతుంది. కార్డులతో జరిగే ఈ లావాదేవీలపై బ్యాంకులు ఒక శాతం నుంచి 1.6 శాతం చార్జీలు వసూలు చేస్తున్నాయి. డేటా, నెట్ చార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుంది. మిషన్లు ఎవరిస్తారు? దాదాపు అన్ని జాతీయ బ్యాంకులు, ప్రైవేటు బ్యాంకులు.. కరెంటు అకౌంట్ ఖాతాలున్న వారికి స్వైపింగ్ మిషన్లను సరఫరా చేస్తున్నాయి. ఈ మిషన్లు మార్కెట్లో కనీసం రూ.1,700 నుంచి రూ.5 వేల ధరలో అందుబాటులో ఉన్నాయి. కొన్ని బ్యాంకులు వీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నాయి. ఇన్స్టలేషన్ చార్జీలు, మెయింటెనెన్స్ పేరిట కొన్ని బ్యాంకులు నెలకు రూ.200 నుంచి రూ.400 ఖాతాదారుల వద్ద వసూలు చేస్తున్నాయి. -
స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలి
సూళ్లూరుపేట: చిరువ్యాపారులు కూడా స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసుకోవాలని వాణిజ్యపన్నుల శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాసులు సూచించారు. పట్టణంలోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో శనివారం వర్తక, వ్యాపార వర్గాల వారికి స్వైపింగ్ యంత్రాల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. మరో ఏడెనిమిది నెలల వరకు ఇబ్బందుల ఉంటాయని భావించి రాష్ట్ర ప్రభుత్వం స్వైపింగ్ మిషన్లను ప్రవేశపెట్టిందని తెలిపారు. ఈ మిషన్లను ప్రభుత్వమే ఉచితంగా అందజేస్తుందని దీనికి ఎవరూ ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. డీసీటీఓలు గోపీచంద్, వరప్రసాదరావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి వాకిచర్ల శాంతారామ్, క్లాత్ మర్చంట్ అసోసియేన్ అధ్యక్షుడు అలవల సూరిబాబు, పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌జైన్, కిరాణా మర్చం అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ కృష్ణారావు పాల్గొన్నారు. -
చెక్‌పోస్టులో స్వైపింగ్ మిషన్ సేవలు ప్రారంభం
బీవీపాళెం(తడ): బీవీపాళెం చెక్‌పోస్టులోని రవాణాశాఖ కార్యాలయంలో స్వైపింగ్ మిషన్లను శుక్రవారం అందుబాటులోకి తీసుకువచ్చారు. వాహనాల వాహనదారులు డెబిట్ కార్డు ద్వారా పన్నులు, ఇతర లావాదేవీలు జరిపేలా స్వైపింగ్ మిషన్ల సేవలను అమల్లోకి తీసుకువచ్చారు. శుక్రవారం వేకువ జామున వచ్చిన ఓ వాహన దారుడు నగదు చెల్లింపును కార్డు ద్వారా చేసేందుకు ముందుకు రాగా ఎంవీఐ చంద్రశేఖర్‌రెడ్డి స్వైపింగ్ మిషన్ ద్వారా నగదు జమ చేసుకుని రసీదును అందజేశారు. వాహనదారులకు అవగాహన కల్పించి భవిష్యత్తులోనూ నగదు రహిత లావాదేవీలు జరిపేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఎంవీఐ తెలిపారు. -
స్వైపింగ్ మిషన్లతో క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్
రేషన్ డీలర్లు కరెంట్ అకౌంట్లు ప్రారంభించాలి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు జేసీ ఆదేశం నెల్లూరు(పొగతోట): కూరగాయల మార్కెట్లు, పచారిషాపులు, షాపింగ్‌మాల్స్, పెట్రోలు బంకులు, మెడికల్ షాపులు తదితర వాటిల్లో స్వైపింగ్ మిషన్లు ఏర్పాటు చేసి క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ ఏ. మహమ్మద్‌ఇంతియాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం స్థానిక గోల్డన్‌జూబ్లీహాలులో వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, వ్యాపారులు, చౌకదుకాణాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో జేసీ మాట్లాడారు. క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులుపడకుండా బ్యాంకు అకౌంట్లు, జనధన్ అకౌంట్లు ఉన్నా వారందరికి రూపే కార్డులు పంపిణి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బ్యాంకు సేవలకు ఇబ్బందులు పడకుండా చౌకదుకాణాల డీలర్లను బ్యాంకింగ్ కరాస్పాండెంట్లుగా నియమించడం జరిగిందన్నారు. డీలర్లందరు బ్యాంకు కరెంట్ అకౌంట్లు ప్రారంభించాలని సూచించారు. జిల్లాలో 430 ఏటీఎంలు ఉన్నాయన్నారు. వాటిలో 200ఏటీఎంలను కొత్త రూ.2000లు, రూ,500ల నోట్లు తీసుకునేలా సిద్దం చేశామన్నారు. కూరగాయల మార్కెట్లలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మిని ఏటీఎంలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి చౌకదుకాణాల్లో నగదు లేకుండా రేషన్ పంపిణి చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలో 418 బ్యాంకులు ఉన్నాయన్నారు. ప్రతి నిత్యం రూ.220 కోట్లు అ ప్రస్తుతం రూ.80 కోట్లు అందుబాటులో ఉంటున్నాయన్నారు. పరిశ్రమలకు అనుకులమైన భూములను గుర్తించండి. పరిశ్రమలకు అనుకులంగా ఉండే భూములను గుర్తించాలని జాయింట్ కలెక్టర్ ఏ.మహమ్మద్‌ఇంతియాజ్ అధికారులను ఆదేశించారు. పరిశ్రమల ఏర్పాటుకు మౌలికసదుపాయాలు ఉండే భూములను గుర్తించాలని సూచించారు. -
మద్యం షాపుల్లో స్వైపింగ్ యంత్రాలు !
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ స్వైపింగ్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఎక్సైజ్ అధికారులు సర్క్యులర్ జారీ చేశారు. చిల్లర కొరతతో మద్యం అమ్మకాలు తగ్గుముఖం పడుతుండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆర్టీసీ కౌంటర్లలో స్వైపింగ్ మెషిన్లు ఆర్టీసీలో టిక్కెట్ల రిజర్వేషన్‌కు ఈ-పోస్ యంత్రాలను అందుబాటులోకి తెస్తున్నట్లు కార్య నిర్వహణాధికారి ఎ.కోటేశ్వరరావు తెలిపారు. నగదు రహిత చెల్లింపులు ప్రోత్సహించేందుకు ఈ చర్యలు చేపట్టామని, తొలి దశలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని బస్లాండ్లలో 50 స్వైపింగ్ యంత్రాలు ప్రవేశపెడుతున్నామన్నారు. ప్రయాణికులు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద అందుబాటులో ఉంచే స్వైపింగ్ యంత్రాలను వినియోగించుకుని రిజర్వేషన్ చేయించుకోవచ్చని చెప్పారు. -
ఆస్పత్రుల్లో స్వైపింగ్ మిషన్లు
అనంతపురం మెడికల్ : జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, క్లినిక్‌లు, నర్సింగ్ హోమ్స్, డయాగ్నస్టిక్ కేంద్రాలు, మెడికల్ షాపుల్లో తప్పనిసరిగా స్వైపింగ్ మిషన్లు/పీఓసీ యంత్రాలు పెట్టుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు వల్ల ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు, బ్యాంక్ మేనేజర్లు, రెవిన్యూ డివిజన్ అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీకి దరఖాస్తు చేసుకుని ఆ మిషన్లు పొందాలని సూచించారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా యజామాన్యాలు 24 గంటల్లోగా వాటిని అమర్చుకోవాలని ఆదేశించారు. -
‘స్వైపింగ్’ యంత్రాలకు డిమాండ్!
గిరాకీని కాపాడుకునేందుకు హైదరాబాద్‌లో వ్యాపారుల యత్నం - మంగళవారం పలు బ్యాంకులకు సుమారు మూడువేల వినతులు - పది జాతీయ బ్యాంకులు సహా ప్రైవేటు బ్యాంకులను ఆశ్రయిస్తున్న వైనం - నిబంధనలను సడలించాలని కోరుతున్న వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: ప్రజల చేతిలో చిల్లర లేదు.. దుకాణాల్లో గిరాకీ లేదు.. దీంతో తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి దుకాణ నిర్వాహకులు స్వైపింగ్ యంత్రాల కోసం బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. డెబిట్, క్రెడిట్ కార్డులు స్వైపింగ్ చేసే యంత్రాలకు ఇప్పుడు గిరాకీ పెరిగింది. హైదరాబాద్‌లోని వ్యాపారులు గిరాకీని కాపాడుకునేందుకు స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ ఎస్బీఐ, సెంట్రల్‌బ్యాంక్, ఎస్బీహెచ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్ తదితర పది జాతీయ బ్యాంకులతో సహా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, కొటక్‌మహీంద్ర వంటి ప్రైవేటు బ్యాంకుల వద్ద క్యూలు కడుతున్నారు. రోజూ వేల రూపాయల వ్యాపారం నిర్వహించే తినుబండారాల దుకాణదారులు, ఫుట్‌పాత్, వీధి వ్యాపారులు కూడా ఈ యంత్రాలుంటేనే తమ వ్యాపారానికి ఢోకా ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. మంగళవారం ఒకే రోజు ఆయా బ్యాంకులకు సుమారు మూడువేల స్వైపింగ్ యంత్రాలు కావాలంటూ నుంచి విజ్ఞప్తులు అందినట్లు బ్యాంకింగ్ రంగ నిపుణులు తెలపడం గమనార్హం. ఈనెల 8 నుంచి బహిరంగ మార్కెట్లో రూ.500, వెరుు్య నోట్ల చలామణి కష్టతరం కావడం, చిల్లర కష్టాలు మొదలైన నేపథ్యంలో ఈ యంత్రాలకు గిరాకీ పెరిగినట్లు తెలిసింది. కాగా ఈ యంత్రాలను పొందడం అందరికీ సాధ్యపడడం లేదు. మూడేళ్ల ఐటీ రిటర్న్స్, పాన్‌కార్డు, చిరునామా ధ్రువీకరణ, వ్యాట్, లేబర్ సర్టిఫికెట్ వంటి ప్రభుత్వ పరమైన గుర్తింపులు, ధ్రువీకరణలు కలిగి ఉన్న కరెంట్ అకౌంట్ వినియోగదారులకు మాత్రమే ఈ యంత్రాలను సరఫరా చేయనున్నట్లు బ్యాంకర్లు స్పష్టం చేస్తున్నారు. వీధి వ్యాపారాల్లో అధికంగా కూరగాయలు, పండ్లు, టీ, బ్యాగులు, ఫ్యాన్సీ ఐటమ్స్, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు ఉన్నారుు. వీరిలో 70 శాతం మంది మాత్రమే బ్యాంకు అకౌంట్లు ఉన్నాయని, ఇందులోనూ ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్లున్నవారే కావడం గమనార్హం. ఒకవేళ బ్యాంకు అకౌంట్ ఉన్నప్పటికీ ప్రస్తుత బ్యాంకుల నిబంధనల ప్రకారం స్వైపింగ్ యంత్రాలు పొందే అర్హతలున్నవారు సగం మంది మాత్రమే ఉన్నారని ఆయా వ్యాపారాలు నిర్వహించేవారు వాపోతున్నారు. బ్యాంకు అకౌంట్ కలిగిన ప్రతి వ్యాపారికి ఈ యంత్రాలను సరఫరా చేసి నెలవారీ అద్దె వసూలు చేసుకోవాలని ఆయా వ్యాపారులు బ్యాంకర్లను కోరుతున్నారు.