కాలు దువ్వుతున్న పందెం కోడి
♦ నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ప్రజాప్రతినిధులు
♦ కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకే వ్యూహం ..
♦ కత్తులు కట్టేందుకు పొరుగు జిల్లాల నుంచి రాక..
♦ భోగినాడు రహస్య ప్రదేశంలో బరిలోకి..
♦ ఇక మూడు రోజులు పందేలే పందేలు ...
♦ జిల్లాలో రూ. 100 కోట్లు చేతులు మారతాయని అంచనా
సాక్షి, అమరావతిబ్యూరో : పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కోడి పందేలకు బరులు సిద్ధమవుతున్నాయి. జిల్లాకు చెందిన కీలక నేతతోపాటు ఇద్దరు ప్రజాప్రతినిధులు భరోసా ఇవ్వడమే ఇందుకు కారణం. ఇటీవల పరిణామాల నేపథ్యంలో కొందరు నిర్వాహకులు అధికార పార్టీ కీలక నేతతోపాటు ఇద్దరు ప్రజాప్రతినిధులను సంప్రదించినట్లు తెలుస్తోంది. పందేల నిర్వహణకు పూర్తిగా సహకరిస్తామని ఆ నేతలు భరోసా ఇచ్చారు. దీనిపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వివాదాస్పద ఎమ్మెల్యేను కూడా వారు ఫోన్‌లో సంప్రదించారు. రెండు జిల్లాల్లో కోడి పందేల నిర్వహణకు ఒకే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణరుుంచారు. పోలీసులు ఇబ్బంది పెట్టకుండా పండుగ మూడురోజులు పందేలకు పరోక్షంగా సహకరించేలా చూస్తామని నిర్వాహకులతో చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా చేద్దాం.. ఎవరు అడ్డుకుంటారో చూద్దాం
ప్రజాప్రతినిధుల వ్యూహం ప్రకారం కోడిపందేలకు ఏర్పాట్లు ఊపందుకున్నారుు. ప్రధానంగా గుడివాడ, గన్నవరం, కై కలూరు, పెనమలూరు, బందరు, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వాహకులు సన్నాహాల్లో నిమగ్నమయ్యారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బరులు సిద్ధం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కోళ్లను రప్పించి రహస్య ప్రదేశంలో ఉంచారని తెలుస్తోంది. కోళ్లకు కత్తులు కట్టకూడదన్న నిబంధనను కూడా వ్యూ హాత్మకంగా నీరుగార్చడానికి యత్నిస్తున్నారు. స్థానికులను కాకుండా కత్తులు కట్టేందుకు పొరుగు జిల్లాల వారిని రప్పిస్తున్నారు. ఎందుకంటే కోళ్లకు కత్తులు కట్టే స్థానికులను పోలీసులు ముందుగానే గుర్తించి నిఘా ఉంచుతారు.
పాత కేసులు తిరగేసి బైండోవర్ కేసులు నమోదు చేస్తారు. దాంతో జిల్లా పోలీసులకు తెలియని పొరుగు జిల్లాలకు చెందిన వారిని రప్పించి కత్తులు కట్టించాలన్నది వ్యూహంగా ఉంది. ఈ నెల 12 వరకు ఎక్కడా హడావుడి చేయకుండా వ్యూహాత్మకంగా మౌనం పాటించనున్నారు. సరిగ్గా భోగి నాడు ముందుగా నిర్ణరుుంచిన ముహూర్తానికి ఓ రహస్య ప్రదేశంలో తొలి పందెం కోళ్లను బరిలోకి వదలాలని నిర్ణరుుంచారు. అంతవరకు పందేలు అడ్డుకోవడానికి కఠినంగా వ్యవహరించే పోలీసులు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతారన్నది ప్రజాప్రతినిధుల ముందస్తు వ్యూహం. దాంతో అదే ఊపుతో మిగిలిన బరుల్లో కూడా కోళ్లను దింపాలని భావిస్తున్నారు. ఇలా మూడురోజులపాటు పందేలు సాగేందుకు పక్కా స్కెచ్ వేశారు.
రూ.100 కోట్లు.. !
అంతా అనుకున్నట్లు సాగితే... పండుగ మూడురోజులు జిల్లాలో రూ.100కోట్ల వరకు కోడిపందేలు సాగవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో రూ.70 కోట్ల వరకు పందేలు జరిగారుు. ఈసారి అంతకుమించి పందేలు సాగుతాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జిల్లాకు రానున్నారని తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా విజయవాడలోని హోటళ్లతోపాటు శివారుప్రాంతాల్లోని రిసార్టులు అన్నీ ముందుగానే బుక్ అరుుపోయారుు. నగదు సమస్య ఏర్పడకుండా ఆన్‌లైన్ చెల్లింపులు, స్వైపింగ్ మెషిన్ల ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేస్తుండడం గమనార్హం.