స్వైపింగ్‌ మిషన్లతో రూ.కోటి స్వాహా | Rs.1 crore cheated with swiping machines | Sakshi
Sakshi News home page

స్వైపింగ్‌ మిషన్లతో రూ.కోటి స్వాహా

Published Fri, Jul 7 2017 8:29 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM

స్వైపింగ్‌ మిషన్లతో రూ.కోటి స్వాహా

స్వైపింగ్‌ మిషన్లతో రూ.కోటి స్వాహా

హైదరాబాద్‌: కరెంట్‌ ఖాతాల ఆధారంగా జే అండ్‌ కే బ్యాంక్‌ నుంచి క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల స్వైపింగ్‌ మిషన్లు తీసుకుని క్లోనింగ్‌ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోటి మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సిటీ సైబర్‌ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్‌ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్‌ మహంతి తెలిపారు. నగరానికి చెందిన మామిడి మహేష్‌.. జే అండ్‌ కే బ్యాంక్‌లో నాలుగు కరెంట్‌ ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా బ్యాంకు అధికారులు వ్యాపార లావాదేవీల కోసం ఫిబ్రవరిలో అతడికి నాలుగు స్వైపింగ్‌ మిషన్లు జారీ చేశారు.

ఆసిఫ్‌నగర్‌ ఠాణా పరిధిలో నమోదైన బందిపోటు దొంగతనం కేసులో మహేష్‌ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే అతడికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో జైలుకు వెళ్తూ తన నాలుగు స్వైపింగ్‌ మిషన్లను తన స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వీటిని వినియోగించేందుకు కిరణ్‌ వనస్థలిపురం ప్రాంతంలో చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన చాంద్‌పాషాతో ఇతనికి పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్‌ చేసిన క్రెడిట్, డెబిడ్‌ కార్డులతో పాటు కార్డులకు సంబంధించిన పిన్‌ నంబర్, డేటా తెలుసునని కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్‌ మిషన్లు తనకు అప్పగిస్తే అక్రమ లావాదేవీల ద్వారా వచ్చే మొత్తంలో 10 శాతం కమీషన్‌ ఇస్తానంటూ ఎర వేశాడు.

ఎలాంటి శ్రమ లేకుండా కమీషన్‌ వస్తోందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించిన కిరణ్‌కుమార్‌ నాలుగు స్వైపింగ్‌ మిషన్లను చాంద్‌పాషాకు అప్పగించాడు. తొలుత వనస్థలిపురంలో ఉన్న దుకాణం నుంచి చాంద్‌పాషా తన దందా ప్రారంభించాడు. ఆపై వీటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. ఇతగాడు ఈ స్వైపింగ్‌ మిషన్లలో స్వైప్‌ చేయడానికి అవసరమైన క్లోన్డ్‌ కార్డుల్ని కేరళలోని కసరకోడ్‌ ప్రాంతానికి చెందిన యూసుఫ్‌ నుంచి తీసుకుంటున్నాడు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండానే ఈ కార్డుల్ని నాలుగు స్వైపింగ్‌ మిషన్లలో స్వైప్‌ చేస్తూ నిర్ణీత మొత్తం మహేష్‌కు చెందిన కరెంట్‌ ఖాతాల్లో పడేట్లు చేస్తున్నాడు.

ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలు తెలిసిన కిరణ్‌ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలిన నగదును అబుబాకర్‌ చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్‌ఫర్‌ చేస్తున్నాడు. ఈ వ్యవహారాలు నెరపడానికి కిరణ్‌కు రామ్‌ప్రసాద్‌ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. అబుబాకర్‌ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలింది కార్డులు, డేటా అందించిన యూసుఫ్‌ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. నగరంలో ఉన్న వారితో సంప్రదించేందుకు అబుబాకర్‌ను హిందీ రాకపోవడంతో కేరళకే చెందిన హనీఫ్‌ హంజా సహకారం తీసుకుంటున్నాడు. ఈ గ్యాంగ్‌ రెండు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అనేక క్లోన్డ్‌ కార్డులను వినియోగించి రూ.1.1 కోటి స్వాహా చేసింది.

ఈ ఏడాది మేలో జే అండ్‌ కే బ్యాంక్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల నుంచి ఈ మేరకు ఫిర్యాదులు అందాయి. వీరు జారీ చేసిన స్వైపింగ్‌ మిషన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలియకుండానే వారి కార్డుల్ని క్లోనింగ్‌ చేసి, నగదు కాజేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో జే అండ్‌ కే బ్యాంక్‌ అధికారి మహ్మద్‌ అల్తాఫ్‌ సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైం అధికారులు దర్యాప్తు చేశారు.

వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇప్పటికే జైల్లో ఉన్న మహేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్‌ కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కితే కార్డుల్ని ఎలా క్లోనింగ్‌ చేస్తున్నారు? బ్యాంకు వినియోగదారుల డేటా, పిన్‌ నంబర్లు ఎలా సంగ్రహిస్తున్నాడు? అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement