Rs.1 crore
-
స్వైపింగ్ మిషన్లతో రూ.కోటి స్వాహా
హైదరాబాద్: కరెంట్ ఖాతాల ఆధారంగా జే అండ్ కే బ్యాంక్ నుంచి క్రెడిట్/డెబిట్ కార్డుల స్వైపింగ్ మిషన్లు తీసుకుని క్లోనింగ్ కార్డుల్ని వినియోగించి రూ.1.1 కోటి మోసానికి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను సిటీ సైబర్ క్రైం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఈ గ్యాంగ్ దేశ వ్యాప్తంగా మోసాలకు పాల్పడినట్లు ఆధారాలు ఉన్నాయని డీసీపీ అవినాష్ మహంతి తెలిపారు. నగరానికి చెందిన మామిడి మహేష్.. జే అండ్ కే బ్యాంక్‌లో నాలుగు కరెంట్ ఖాతాలు తెరిచాడు. వీటి ఆధారంగా బ్యాంకు అధికారులు వ్యాపార లావాదేవీల కోసం ఫిబ్రవరిలో అతడికి నాలుగు స్వైపింగ్ మిషన్లు జారీ చేశారు. ఆసిఫ్‌నగర్ ఠాణా పరిధిలో నమోదైన బందిపోటు దొంగతనం కేసులో మహేష్ నిందితుడిగా ఉన్నాడు. ఇటీవలే అతడికి కోర్టు జీవిత ఖైదు విధించడంతో జైలుకు వెళ్తూ తన నాలుగు స్వైపింగ్ మిషన్లను తన స్నేహితుడైన కిరణ్‌కుమార్‌కు అప్పగించాడు. వీటిని వినియోగించేందుకు కిరణ్ వనస్థలిపురం ప్రాంతంలో చిన్న దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం నగరానికి చెందిన చాంద్‌పాషాతో ఇతనికి పరిచయమైంది. తనకు కేరళ నుంచి క్లోనింగ్ చేసిన క్రెడిట్, డెబిడ్ కార్డులతో పాటు కార్డులకు సంబంధించిన పిన్ నంబర్, డేటా తెలుసునని కిరణ్‌తో చెప్పాడు. స్వైపింగ్ మిషన్లు తనకు అప్పగిస్తే అక్రమ లావాదేవీల ద్వారా వచ్చే మొత్తంలో 10 శాతం కమీషన్ ఇస్తానంటూ ఎర వేశాడు. ఎలాంటి శ్రమ లేకుండా కమీషన్ వస్తోందనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనకు అంగీకరించిన కిరణ్‌కుమార్ నాలుగు స్వైపింగ్ మిషన్లను చాంద్‌పాషాకు అప్పగించాడు. తొలుత వనస్థలిపురంలో ఉన్న దుకాణం నుంచి చాంద్‌పాషా తన దందా ప్రారంభించాడు. ఆపై వీటిని కేరళకు చెందిన అబుబాకర్‌కు అందించాడు. ఇతగాడు ఈ స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేయడానికి అవసరమైన క్లోన్డ్ కార్డుల్ని కేరళలోని కసరకోడ్ ప్రాంతానికి చెందిన యూసుఫ్ నుంచి తీసుకుంటున్నాడు. ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేకుండానే ఈ కార్డుల్ని నాలుగు స్వైపింగ్ మిషన్లలో స్వైప్ చేస్తూ నిర్ణీత మొత్తం మహేష్‌కు చెందిన కరెంట్ ఖాతాల్లో పడేట్లు చేస్తున్నాడు. ఆ ఖాతాలకు సంబంధించిన వివరాలు తెలిసిన కిరణ్ ఆ మొత్తంలో 10 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలిన నగదును అబుబాకర్ చెప్పిన ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ వ్యవహారాలు నెరపడానికి కిరణ్‌కు రామ్‌ప్రసాద్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. అబుబాకర్ తన ఖాతాల్లోకి చేరిన మొత్తంలో 40 శాతం కమీషన్‌గా తీసుకుంటూ మిగిలింది కార్డులు, డేటా అందించిన యూసుఫ్ ఖాతాల్లోకి జమ చేస్తున్నాడు. నగరంలో ఉన్న వారితో సంప్రదించేందుకు అబుబాకర్‌ను హిందీ రాకపోవడంతో కేరళకే చెందిన హనీఫ్ హంజా సహకారం తీసుకుంటున్నాడు. ఈ గ్యాంగ్ రెండు నెలల కాలంలో దేశ వ్యాప్తంగా ఉన్న అనేక క్లోన్డ్ కార్డులను వినియోగించి రూ.1.1 కోటి స్వాహా చేసింది. ఈ ఏడాది మేలో జే అండ్ కే బ్యాంక్‌కు దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ బ్యాంకుల నుంచి ఈ మేరకు ఫిర్యాదులు అందాయి. వీరు జారీ చేసిన స్వైపింగ్ మిషన్ల ద్వారా తమ కస్టమర్లకు తెలియకుండానే వారి కార్డుల్ని క్లోనింగ్ చేసి, నగదు కాజేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. దీంతో జే అండ్ కే బ్యాంక్ అధికారి మహ్మద్ అల్తాఫ్ సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం అధికారులు దర్యాప్తు చేశారు. వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా కిరణ్, అబుబాకర్, హనీఫ్, రామ్‌కుమార్‌లను అరెస్టు చేశారు. ఇప్పటికే జైల్లో ఉన్న మహేష్‌ను పీటీ వారెంట్‌పై అరెస్టు చేయాలని నిర్ణయించారు. పరారీలో ఉన్న కీలక సూత్రధారి యూసుఫ్ కోసం గాలిస్తున్నారు. అతడు చిక్కితే కార్డుల్ని ఎలా క్లోనింగ్ చేస్తున్నారు? బ్యాంకు వినియోగదారుల డేటా, పిన్ నంబర్లు ఎలా సంగ్రహిస్తున్నాడు? అనే విషయాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. -
రూ.కోటితో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం
జోగిపేట (మెదక్) : మెదక్ జిల్లా జోగిపేటలోని తహశీల్దార్ గెస్ట్‌హౌస్ భవనం.. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుగా మారబోతోంది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యుల క్యాంపు కార్యాలయాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక కాలేజీ రోడ్డులోని 1.20 ఎకరాల స్థలంలో ఉన్న పురాతన తహసీల్దారు గెస్ట్‌హౌస్‌ను నిర్ణయించారు. రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ శిథిల భవనాన్ని కూలగొట్టి రూ.కోటితో కొత్తగా డబుల్ ఫ్లోర్ భవనం నిర్మించనున్నారు. ఈ మేరకు ఉన్నత అధికారులకు నివేదిక పంపారు. రెండు మూడు నెలల్లో కొత్త భవనం నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు అధికారులు సోమావారం తెలిపారు. -
రూ.కోటి మేర ఐపీ పెట్టిన వైద్యుడు
నేరేడ్మెట్ (హైదరాబాద్): ఆస్పత్రి అభివృద్ధి కోసమని దాదాపు రూ.కోటి అప్పుగా తీసుకుని, ఆపై ఐపీ నోటీసులు పంపాడు ఓ వైద్యుడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం నేరేడ్మెట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. డాక్టర్ విజయ్ (40) కొన్నేళ్లుగా నేరేడ్మెట్ ప్రాంతంలో దంత వైద్యశాలను నిర్వహిస్తున్నాడు. మంచిగా సేవలందిస్తూ పేరు తెచ్చుకున్నాడు. అయితే, కొంతకాలంగా ఆస్పత్రి అభివృద్ధి కోసమంటూ తెలిసిన సుమారు 15 మంది వద్ద నుంచి రూ.కోటి వరకు అప్పుగా తీసుకున్నాడు. ఇవి కాకుండా బ్యాంక్‌లు, ఫైనాన్స్ సంస్థల నుంచి రూ.80 లక్షల వరకు ఆయనకు అప్పు ఉంది. బ్యాంకులు, అప్పులు ఇచ్చిన వారికి కొంతకాలంపాటు వడ్డీ సక్రమంగా చెల్లించాడు. ఆ తర్వాత ఆస్పత్రిని మూసి వేసి విదేశాలకు వెళ్లిపోయినట్లు తెలిసింది. కొందరు రుణ దాతలకు ఆయన ఇచ్చిన చెక్కులు చెల్లలేదు. దీంతో బాధితులు నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా వారం క్రితం డబ్బులు ఇచ్చిన వారికి విజయ్ దివాలా తీసినట్లు (ఐపీ) నోటీసులు పంపాడు. దీంతో బాధితులంతా లబోదిబో మంటున్నారు. -
రూ.కోటి విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చంద్రగిరి (చిత్తూరు) : శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే .. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని అటవీ ప్రాంతంలోని పగడగుండాల కోన వద్ద గురువారం సాయంత్రం 35 ఎర్రచందనం దుంగలను స్మగ్లర్లు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. విషయం తెలిసిన 11వ బెటాలియన్ పోలీసులు, అటవీ శాఖ అధికారులు అక్కడికి వెళ్లారు. వారిని చూసి దాదాపు 40 మంది కూలీలు దుంగలను వదిలి పరారయ్యారు. ఈ దాడిలో పట్టుబడిన తమిళనాడుకు చెందిన రామచంద్రన్, చిన్న రాజా అనే కూలీలను అదుపులోకి తీసుకుని, చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
చంద్రగిరి: తరలించేందుకు సిద్ధం చేసిన ఎర్రచందనం దుంగలు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. మంగళవారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలివీ..చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం అగరాల గ్రామ సమీపంలో పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం మేరకు అటవీ అధికారులు కూంబింగ్ ప్రారంభించారు. అయితే అధికారులను పసిగట్టిన కూలీలు దుంగలను వదిలేసి పరారయ్యారు. అధికారులు మొత్తం 37 దుంగలను స్వాధీనం చేసుకుని, రంగంపేట కార్యాలయానికి తరలించారు. సుమారు ఒకటిన్నర టన్నుల బరువైన ఆ దుంగల విలువ రూ.కోటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. -
'పాత్రికేయుల సంక్షేమ నిధి రూ. కోటికి పెంచుతాం'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, సమాచార శాఖ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పి. రఘునాథారెడ్డి శనివారం ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మ వారి ఆలయానికి రూ. లక్ష విరాళం అందజేశారు. అనంతరం ఆయన ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ... పాత్రికేయుల సంక్షేమ నిధిని రూ. కోటికి పెంచుతామని చెప్పారు. తమ ప్రభుత్వం చేపట్టే పథకాలు ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారం ఇస్తామని రఘునాథరెడ్డి వెల్లడించారు. -
అనంతలో రూ. కోటి విలువైన ఎర్రచందనం స్వాధీనం
అనంతపురం జిల్లా తాడిపత్రి మార్కెట్ యార్డ్‌లో భారీ లోడుతో ఉన్న ఎర్రచందనాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ లారీని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎర్రచందనంతోపాటు లారీని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ బహిరంగ మార్కెట్ లో రూ. కోటి ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఆగంతకులు ఇచ్చిన సమాచారం మేరకు తాడిపత్రి మార్కెట్ యార్డ్‌లో సోదాలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. లారీ నెంబర్ ఆధారంగా యజమానులను గుర్తిస్తామని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.