37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనకు భారీగా తరలివస్తున్న ప్రజలు
సాక్షి, హైదరాబాద్: పుస్తకప్రియుడు గెలిచాడు... పుస్తకానికి మరోసారి పట్టం కట్టాడు... ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలు, ఈ–బుక్‌ల హవా కొనసాగుతున్న కాలంలోనూ సగటు పాఠకుడు పుస్తకానికే జైకొట్టాడు. భాగ్యనగరం వేదికగా జరుగుతున్న 37వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శనే అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. లక్షలాది మంది పాఠక మహాశయులు పుస్తక ప్రదర్శనను సందర్శించి నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల 19న ప్రారంభమైన పుస్తక ప్రదర్శన శనివారం 9వ రోజుకు చేరుకుంది.
ఇప్పటివరకు సుమారు 10 లక్షల మందికిపైగా ప్రజలు పుస్తక ప్రదర్శనను సందర్శించినట్లు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. 350 స్టాళ్లలో కనీసం రూ. 15 కోట్ల విలువైన పుస్తకాలు అమ్ముడైనట్లు హైదరాబాద్ బుక్ ఫెయిర్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు సైతం సందర్శకులను విశేషంగా ఆకటుకున్నాయి. బుక్ ఫెయిర్ వేదికగా పదుల సంఖ్యలో కొత్త పుస్తకాల ఆవిష్కరణ సాగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సైతం శనివారం బుక్ ఫెయిర్‌ను సందర్శించి పలు స్టాళ్లను ఆసక్తిగా తిలకించారు.
జైకొట్టిన యువత..
ఈసారి యువతరం పుస్తక ప్రదర్శనకు భారీగా తరలివచ్చింది. పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలతోపాటు నవలలు, కథల పుస్తకాలు, చరిత్ర గ్రంథాలను యువతీయువకులు విరివిగా కొనుగోలు చేశారు. హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల నుంచి తరలివచ్చిన వేలాది మంది చిన్నారులతో పుస్తక ప్రదర్శన ప్రతిరోజూ కళకళలాడింది. దశాబ్దాలు, శతాబ్దాలు గడిచినా చెక్కుచెదరని పాఠకాదరణ కలిగిన గురజాడ కన్యాశుల్కం, గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర, బుచ్చిబాబు చివరకుమిగిలేది, శ్రీదేవి కాలాతీత వ్యక్తులు, మహాకవి శ్రీశ్రీ మహాప్రస్థానం వంటి పుస్తకాలు పెద్ద ఎత్తున అమ్ముడయ్యాయి.
రాజ్యాంగంపై ఆంగ్లం, తెలుగు భాషల్లో వెలువడిన పుస్తకాలను చాలా మంది కొనుగోలు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల పాలన తదితర పుస్తకాలపట్ల కూడా పాఠకులు ఆసక్తి చూపారు. సామాజిక మాధ్యమ శైలిని అనుకరిస్తూ వెలువడుతున్న నవతరం రచయితల పుస్తకాలకు సైతం ఆదరణ లభించింది. ప్రముఖుల జీవిత చరిత్ర గ్రంథాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, రామాయణం, మహాభారతం వంటి గ్రంథాలను కూడా పాఠకులు అక్కునజేర్చుకున్నారు.
నేటితో ముగింపు
హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన నేటితో ముగియనుంది. సాయంత్రం 5:30 గంటలకు జరిగే ముగింపు వేడుకల్లో మంత్రి జూపల్లి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం తదితరులు హాజరుకానున్నారు.
1. పండుగలా ప్రదర్శన
పుస్తక ప్రదర్శన పండుగ వాతావరణాన్ని తలపిస్తోంది. యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. పుస్తకాలు కొంటున్నారు. ప్రచురణ సంస్థలు సైతం అమ్మకాలపట్ల సంతోషంగా ఉన్నాయి. జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పుస్తక ప్రియులు తరలి వస్తున్నారు. ప్రదర్శన విజయవంతంగా కొనసాగుతోంది.
– వాసు, హైదరాబాద్ బుక్‌ఫెయిర్ కమిటీ కార్యదర్శి
2. పుస్తక పఠనం పెరిగింది
ప్రదర్శనకు వచ్చిన సందర్శకులను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఏటేటా లక్షలాది మంది పుస్తకప్రియులు వస్తూనే ఉన్నారు. ఇది ఆహా్వనించదగ్గ గొప్ప పరిణామం. పుస్తక పఠనం బాగా పెరిగిందనేందుకు పెరిగిన సందర్శకుల సంఖ్యే నిదర్శనం. తల్లిదండ్రులు పిల్లలతో కలిసి రావడం, కావల్సిన పుస్తకాలు కొనడం శుభపరిణామం. పుస్తకాలు చదవకపోవడం వల్ల పిల్లలు ఏం కోల్పోతున్నారో పెద్దలు గుర్తించినట్లుంది.
– ఆనంద్, ప్రముఖ వ్యాఖ్యాత/ఆంజనేయరెడ్డి, రిటైర్డ్ అధికారి
3. భక్తి పుస్తకాలు కొన్నా
పుస్తకప్రదర్శన చాలా బాగుంది. నాకు శ్రీకృష్ణుడు అంటే ఎంతో ఇష్టం, భక్తి. అందుకే భక్తి పుస్తకాలే ఎక్కువగా కొన్నా. నవలలు, కథల పుస్తకాలు కూడా బాగున్నాయి.
– కృతిక, డిగ్రీ విద్యార్ధిని, హయత్‌నగర్
4. యద్దనపూడి, యండమూరి నవలల కోసం వచ్చా
గతంలో చదివినప్పటికీ మరోసారి యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి నవలల కోసం వచ్చా. అన్ని స్టాళ్లలో సాహిత్యం పుస్తకాలు చాలా ఉన్నాయి. ప్రదర్శన బాగుంది.
– రాధాకృష్ణ, హైటెక్‌సిటీ
Comments
Please login to add a commentAdd a comment