తెలుగు వీరుడు:
వి.వి.గిరిగా ప్రసిద్ధులైన వరాహగిరి వేంకటగిరి భారతదేశ నాల్గవ రాష్ట్రపతి. మన తెలుగువారు! నేడు ఆయన జయంతి. 1894 ఆగస్టు 10న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని గంజాం జిల్లాకు చెందిన బెర్హంపూర్‌లో జన్మించారు. వి.వి.గిరి తండ్రి వరాహగిరి వెంకట జోగయ్య, తల్లి సుభద్రమ్మ. వెంకట జోగయ్య ప్రసిద్ధి చెందిన న్యాయవాది. తూర్పుగోదావరి జిల్లాలోని చింతల పూడి నుండి బరంపురానికి ఈ కుటుంబం వలస వెళ్లింది. వి.వి.గిరి 1913 ఐర్లండ్‌లోని డబ్లిన్ యూనివర్శిటీ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించడానికి వెళ్లారు.
ఐర్లండ్‌లో ‘సీన్‌ఫెన్’ జాతీయోద్యమంలో పాల్గొని ఆ దేశ బహిష్కరణకు గురయ్యాడు. ఆ ఉద్యమ కాలంలోనే ఆయనకు ఈమొన్ డి వలేరా, డెస్మండ్ ఫిట్జెరాల్డ్, ఈయోన్ మెక్‌నీల్, జేమ్స్ కాన్నలీ వంటి రాజకీయ ఉద్యమనేతలతో సాన్నిహిత్యం ఏర్పడింది. ఇండియా తిరిగి వచ్చాక ఇక్కడ క్రియాశీలకంగా ఉన్న కార్మిక ఉద్యమంలో పాల్గొన్నారు. అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్‌కు అధ్యక్షునిగా పని చేశారు.
అనంతరం 1934లో ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సభ్యుడయ్యారు. 1936లో మద్రాసు రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా బొబ్బిలి రాజా పై పోటీ చేసి గెలిచారు. 1937లో మద్రాసు ప్రావిన్స్‌లో రాజాజీ నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మిక, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 1942లో దేశంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలన్నీ రాజీనామా చేసిన ప్పుడు, వి.వి. గిరి తిరిగి క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా కార్మిక ఉద్యమాన్ని నడిపి జైలుకు వెళ్లారు. 1975లో వి.వి.గిరికి భారత ప్రభుత్వం ‘భారత రత్న’ అవార్డు ప్రదానం చేసింది.
ప్రసన్న కవి
ప్రసన్న కవి
శంకరంబాడి సుందరాచారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతమైన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ రచయిత. నేడు ఆయన జయంతి. 1914 ఆగష్టు 10 న తిరుపతిలో జన్మించారు. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవారు. భుక్తి కోసం ఎన్నో పనులు చేశారు. హోటలు సర్వరుగా, రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేశారు. ‘ఆంధ్ర పత్రిక’లో ప్రూఫ్ రీడర్‌గా, పాఠశాల ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా కూడా చేశారాయన.
మహాత్మా గాంధీ హత్య జరిగినపుడు ఆవేదన చెంది, ‘బలిదానం’ అనే కావ్యం రాశారు. అది ఎంతో మందిని కదిలించింది. కన్నీరు తెప్పించింది. సుందరాచారికి అమితమైన ఆత్మగౌరవం. దాని కోసం ఉద్యోగాలు కూడా వదులుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య వేదమ్మాళ్ మనోవ్యాధిగ్రస్తురాలైన కారణంగా ఆయన వేదన చెంది, జీవిత చరమాంకంలో నిర్లిప్త జీవితం గడిపారని అంటారు.
2004లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుపతి పట్టణం తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్థం ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది. శంకరంబాడి సుందరాచారిని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రసన్న కవి అని గౌరవించింది. ఆయనను భావకవి అనీ, అహంభావకవి అని కూడా అనేవారు. సుందరకవి అన్నది ఆయన మరోపేరు.
(చదవండి: స్వతంత్ర భారతి: మిస్ వరల్డ్ మానుషి)
Comments
Please login to add a commentAdd a comment