హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై దాఖలైన కేసు విచారణను హైకోర్టు మంగళవారానికి వాయిదా పడింది. దీనిపై ప్రభుత్వాన్ని కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. సాక్షి టీవీ ప్రసారాల విషయంలో ఎంఎస్‌వోలకు ఏ రకమైన ఆటంకాలు కలిగించకుండా ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలను నియంత్రించాలని కోరుతూ సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
దీనిపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కేబుల్ టీవీ చట్టం సెక్షన్ 19 ప్రకారం ఉత్తర్వులు ఇవ్వకుండా కేబుల్ టీవీ ప్రసారాల్లో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అర్హమైన కేసుగా ఆయన స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.
కాగా తమ టీవీ చానల్ ప్రసారాల నిలుపుదల విషయంలో న్యాయపోరాటానికి దిగిన సాక్షి టెలివిజన్ ... ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి, టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎంఎస్‌వోల ఫెడరేషన్‌లను ప్రతివాదులుగా పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ సాక్షి టీవీ ప్రసారాలు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్లను ఆదేశించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. సాక్షి ప్రసారాలను నిలిపేయాలని ఎంఎస్‌వోలకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీలు ఇచ్చిన ఆదేశాలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలని కోరింది.