ఫ్యాను గాలి వీచింది | cephalologists clarify in Sakshi TV discussion | Sakshi
Sakshi News home page

ఫ్యాను గాలి వీచింది

Published Tue, Jun 4 2024 3:39 AM | Last Updated on Tue, Jun 4 2024 5:48 AM

cephalologists clarify in Sakshi TV discussion

వైఎస్సార్‌సీపీ ఘన విజయం ఖాయం

‘సాక్షి’ టీవీ చర్చలో ప్రముఖ సెఫాలజిస్టులు స్పష్టీకరణ

సీఎం జగన్‌ అందించిన సంక్షేమం, సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా మారింది: ఆరా మస్తాన్‌

126 స్థానాలకంటే వైఎస్సార్‌సీపీకి అధికంగా వస్తాయి: ఆత్మసాక్షి మూర్తి

సీఎం జగన్‌ చేసిన మంచికి కృతజ్ఞ్ఞతలు చెబుతూ 

ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేశారు: రేస్‌ కిశోర్‌

అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపే : ఫస్ట్‌ స్టెప్‌ సొల్యూషన్స్‌ ఇంద్ర నీల్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రమంతా ఫ్యాను గాలి ఉధృతంగా వీచిందని, ఓటర్లలో అధిక శాతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వైపే ఉన్నారని, ఆ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ప్రముఖ సెఫాలజిస్టులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో 50 శాతం కంటే ఎక్కువ ఓట్లతో అత్యధిక శాసన సభ, లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయమని తేల్చి చెప్పారు. ‘సాక్షి’ టీవీ సోమవారం రాత్రి నిర్వహించిన చర్చలో ప్రముఖ సెఫాలజిస్టులు ‘ఆరా’ మస్తాన్, ‘ఆత్మసాక్షి’ మూర్తి, ‘రేస్‌’ కిషోర్, ‘ఫస్ట్‌ స్టెప్‌ సొల్యూషన్స్‌’ ఇంద్రనీల్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటుతో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వస్తోందని వారంతా స్పష్టం చేశారు.

సీఎం జగన్‌ పాజిటివ్‌ ప్రచారానికి ప్రజలు సానుకూలంగా స్పందించారు
గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ 142కు పైగా శాసనసభ, 22 లోక్‌­సభ స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పాం. అదే ఫలితాలు వచ్చాయి. 18 రాష్ట్రాల్లో మేం నిర్వ­హించిన సర్వేలు నిజమ­య్యాయి. సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి, ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే నినాదాలతో టీడీపీ నెగెటివ్‌ ప్రచారం చేసి సెల్ఫ్‌ గోల్‌ చేసుకుంది.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ప్రజలు అవకాశవాద పొత్తుగా భావించారు. అధి­కారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పి ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడంలో టీడీపీ కూటమి విఫలమైంది. ఐదేళ్లు సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రజలకు మంచి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌.. మళ్లీ అధికారంలోకి వస్తే మరింత మంచి చేస్తానంటూ చేసిన పాజిటివ్‌ ప్రచారం పట్ల ప్రజలు సానుకూలంగా స్పందించారు. నేను సర్వేలో చెప్పిన 126 స్థానాలకంటే అధిక స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయం. – ‘ఆత్మసాక్షి’ మూర్తి

వైఎస్సార్‌సీపీకి 120 సీట్లకంటే ఎక్కువే వస్తాయి..
సంక్షేమం అభివృద్ధి పథకాల ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన మంచికి కృతజ్ఞ్ఞతలు చెబుతూ ప్రజలు వైఎస్సార్‌సీపీకి ఓట్లు వేసినట్లు మా సర్వేలో వెల్లడైంది. టీడీపీ కూటమి మొదటి నుంచి నెగెటివ్‌ ప్రచారానికే పరిమితమైంది. మేనిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కూడా టీడీపీ కూటమి విఫలమైంది. ఇది కూటమిని తీవ్రంగా దెబ్బతీసింది. సానుకూల ఓటుతో వైఎస్సార్‌సీపీ 120 స్థానాల కంటే అధిక స్థానాల్లో విజయం సాధించడం ఖాయం.    – రేస్‌ కిశోర్‌

గ్రామీణ, పట్టణ ప్రాంతాలూ వైఎస్సార్‌సీపీ వైపే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అందించిన సంక్షేమం, అభివృద్ధి, సుపరి­పాల­నతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజలంతా వైఎస్సార్‌సీపీ వైపు నిలబడ్డారు. నాడు–నేడుతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్థాయికి ఆధునికీకరించి, ఇంగ్లిష్‌ మీడియంలో పిల్లలకు చదువులు చెప్పడం అగ్రవర్ణాలనూ ఆకట్టుకుంది.

సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు సీఎం జగన్‌ లబ్ధి చేస్తుంటే.. రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చుతున్నారంటూ టీడీపీ, ఇతర విపక్షాలు విమర్శించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకూ పట్టణ, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రజలు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్సార్‌సీపీ 120 స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి, మళ్లీ అధికారంలోకి రావడం తథ్యం. – ఫస్ట్‌ స్టెప్‌ సొల్యూషన్స్‌ ఇంద్ర నీల్‌

నేను చెప్పిన 104 స్థానాల కంటే వైఎస్సార్‌సీపీకి అధికంగా వస్తాయి
గత ఎన్నికల్లో 50 శాతం ఓట్లు సాధించి వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఈసారి కూడా అంతే స్థాయి ఓట్లతో మళ్లీ ఘనవిజయం సాధించి, అధికారంలోకి రాబోతోందన్నది మా సర్వేలో వెల్లడైంది. సీఎం వైఎస్‌ జగన్‌ గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి గుమ్మం వద్దకే అందించడం గ్రామీణ ప్రాంతాల ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. వారిపై పెను ప్రభావం చూపింది. అర్హతే ప్రామాణికంగా అందరికీ సంక్షేమ పథకాలు అందించడం వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా మారింది. సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సాధికారత సాధించిన మహిళలు 56 శాతం వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఓట్లు వేశారు.

టీడీపీ కూటమితో పోల్చితే వైఎస్సార్‌సీపీకి మహిళలు 13 నుంచి 14 శాతం అధికంగా ఓట్లు వేశారు. మహిళల ఓటింగ్‌ శాతం పెరగడం వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా మారింది. వృద్ధాప్య పెన్షన్‌ను నాలుగు దశల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేలకు పెంచి ఇవ్వడం, ఇంటి వద్దకే రేషన్‌ అందించడం ద్వారా వృద్ధులకు సీఎం జగన్‌ జీవనభద్రత కల్పించారు. ఇది వైఎస్సార్‌సీపీకి సానుకూలంగా మారింది. ఎన్నికల్లో సీఎం జగన్‌ తాను చేసింది చెప్పి, అధికారంలోకి వస్తే తాను ఏం చేస్తానో చెబుతూ పాజిటివ్‌ ప్రచారం చేస్తే.. చంద్రబాబు నెగెటివ్‌ ప్రచారాన్ని చేశారు.

ఇది టీడీపీ కూటమికి ప్రతిబంధకంగా మారింది. సీఎం జగన్‌ అమలు చేసిన సామాజిక న్యాయం వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా మారింది. నేను చెప్పిన 104 స్థానాలకంటే అత్యధిక స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించడం ఖాయం. ఇండియా టుడే – యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌ పోల్స్‌ను సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చిన సంస్థకు రాజకీయ నేపథ్యం ఉండటం వల్ల అది శాస్త్రీయంగా చేయలేదు. దాని గురించి ఇంతకన్నా చెప్పను.  – ‘ఆరా’ మస్తాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement