-
డీసీసీబీ చైర్మన్‌కు పీఏసీఎస్ ఉద్యోగుల వినతి
హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్‌రెడ్డి కోరారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఈమేరకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం తమ వేతనాలు పెంచాలన్నారు. 2012 సంవత్సరం నుంచి వేతన సవరణ జరిపించాలన్నారు. గ్రాట్యుటీ సీఈఓలకు రూ.5 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.3 లక్షలు, అటెండర్లకు రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ 30 శాతం ఇవ్వాలన్నారు. పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెచ్‌ఆర్‌ఏ 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి స్పందిస్తూ తన పరిధిలో ఉన్నంత మేరకు సహాయం చేస్తానన్నారు. పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి, టీఎస్ కాబ్‌కు పంపుతానని ఆయన అన్నారు.