
శాయంపేట: పీఏసీఎస్ చైర్మన్ కులంపేరుతో దూషించాడన్న మనస్తాపంతో ఓ ఇన్‌చార్జి సీఈఓ.. సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట పీఏసీఎస్ ఇన్‌చార్జి సీఈఓగా నాగెల్లి లింగమూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీ మహాసభ కోసం శుక్రవారం పాలకవర్గ సమావేశం ఏర్పాటుచేసి అక్టోబర్ 10న నిర్వహించడానికి తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని జిల్లా సహకార అధికారి (డీసీఓ) కార్యాలయంలో అందజేయడానికి లింగమూర్తి శనివారం బస్సులో హనుమకొండకు వెళ్తుండగా మధ్యలో చైర్మన్ కుసుమ శరత్ బస్సు ఆపి లింగమూర్తిని కిందకు దించాడు.
తర్వాత ‘మినిట్స్ బుక్ ఎక్కడ ఉంది? తీర్మానం కాపీ నాకు చూపించకుండా డీసీఓ కార్యాలయంలో ఎలా ఇస్తావు?’అని ప్రశ్నించాడు. అనంతరం శాయంపేట కార్యాలయానికి వెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని సీఈఓ, డైరెక్టర్లకు తెలియజేయడంతో వారు కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఏ తప్పూ చేయకపోయినా గతంలో కూడా చైర్మన్ దుర్భాషలాడాడని అంటూ లింగమూర్తి.. పురుగు మందు తాగబోయారు. అక్కడే ఉన్న అతని కుమారుడు ప్రశాంత్, డైరెక్టర్లు అడ్డుకుని నచ్చజెప్పారు. అనంతరం లింగమూర్తి డైరెక్టర్లతోకలసి చైర్మన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్‌ఏ ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment