PACS employees
-
చైర్మన్ తిట్టాడని ఇన్చార్జి సీఈఓ ఆత్మహత్యాయత్నం
శాయంపేట: పీఏసీఎస్ చైర్మన్ కులంపేరుతో దూషించాడన్న మనస్తాపంతో ఓ ఇన్చార్జి సీఈఓ.. సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓగా నాగెల్లి లింగమూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీ మహాసభ కోసం శుక్రవారం పాలకవర్గ సమావేశం ఏర్పాటుచేసి అక్టోబర్ 10న నిర్వహించడానికి తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని జిల్లా సహకార అధికారి (డీసీఓ) కార్యాలయంలో అందజేయడానికి లింగమూర్తి శనివారం బస్సులో హనుమకొండకు వెళ్తుండగా మధ్యలో చైర్మన్ కుసుమ శరత్ బస్సు ఆపి లింగమూర్తిని కిందకు దించాడు. తర్వాత ‘మినిట్స్ బుక్ ఎక్కడ ఉంది? తీర్మానం కాపీ నాకు చూపించకుండా డీసీఓ కార్యాలయంలో ఎలా ఇస్తావు?’అని ప్రశ్నించాడు. అనంతరం శాయంపేట కార్యాలయానికి వెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని సీఈఓ, డైరెక్టర్లకు తెలియజేయడంతో వారు కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఏ తప్పూ చేయకపోయినా గతంలో కూడా చైర్మన్ దుర్భాషలాడాడని అంటూ లింగమూర్తి.. పురుగు మందు తాగబోయారు. అక్కడే ఉన్న అతని కుమారుడు ప్రశాంత్, డైరెక్టర్లు అడ్డుకుని నచ్చజెప్పారు. అనంతరం లింగమూర్తి డైరెక్టర్లతోకలసి చైర్మన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం -
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
డీసీసీబీ చైర్మన్‌కు పీఏసీఎస్ ఉద్యోగుల వినతి హన్మకొండ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర పీఏసీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.యాదగిరి, ప్రధాన కార్యదర్శి ఎం.భాస్కర్‌రెడ్డి కోరారు. హన్మకొండలోని డీసీసీబీ కార్యాలయంలో చైర్మన్ జంగా రాఘవరెడ్డికి ఈమేరకు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెరిగిన నిత్యావసరాల ధరల ప్రకారం తమ వేతనాలు పెంచాలన్నారు. 2012 సంవత్సరం నుంచి వేతన సవరణ జరిపించాలన్నారు. గ్రాట్యుటీ సీఈఓలకు రూ.5 లక్షలు, స్టాఫ్ అసిస్టెంట్లకు రూ.3 లక్షలు, అటెండర్లకు రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. ఉద్యోగులకు ఇంటీరియం రిలీఫ్ 30 శాతం ఇవ్వాలన్నారు. పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, హెచ్ఆర్ఏ 30 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ రాఘవరెడ్డి స్పందిస్తూ తన పరిధిలో ఉన్నంత మేరకు సహాయం చేస్తానన్నారు. పీఏసీఎస్ ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వానికి, టీఎస్ కాబ్‌కు పంపుతానని ఆయన అన్నారు.