PACS chairman
-
చైర్మన్ తిట్టాడని ఇన్చార్జి సీఈఓ ఆత్మహత్యాయత్నం
శాయంపేట: పీఏసీఎస్ చైర్మన్ కులంపేరుతో దూషించాడన్న మనస్తాపంతో ఓ ఇన్చార్జి సీఈఓ.. సహకార సంఘం కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హనుమకొండ జిల్లా శాయంపేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. శాయంపేట పీఏసీఎస్ ఇన్చార్జి సీఈఓగా నాగెల్లి లింగమూర్తి విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీ మహాసభ కోసం శుక్రవారం పాలకవర్గ సమావేశం ఏర్పాటుచేసి అక్టోబర్ 10న నిర్వహించడానికి తీర్మానం చేశారు. ఈ తీర్మానం కాపీని జిల్లా సహకార అధికారి (డీసీఓ) కార్యాలయంలో అందజేయడానికి లింగమూర్తి శనివారం బస్సులో హనుమకొండకు వెళ్తుండగా మధ్యలో చైర్మన్ కుసుమ శరత్ బస్సు ఆపి లింగమూర్తిని కిందకు దించాడు. తర్వాత ‘మినిట్స్ బుక్ ఎక్కడ ఉంది? తీర్మానం కాపీ నాకు చూపించకుండా డీసీఓ కార్యాలయంలో ఎలా ఇస్తావు?’అని ప్రశ్నించాడు. అనంతరం శాయంపేట కార్యాలయానికి వెళ్లాలని ఆదేశించాడు. ఈ విషయాన్ని సీఈఓ, డైరెక్టర్లకు తెలియజేయడంతో వారు కార్యాలయానికి చేరుకున్నారు. తాను ఏ తప్పూ చేయకపోయినా గతంలో కూడా చైర్మన్ దుర్భాషలాడాడని అంటూ లింగమూర్తి.. పురుగు మందు తాగబోయారు. అక్కడే ఉన్న అతని కుమారుడు ప్రశాంత్, డైరెక్టర్లు అడ్డుకుని నచ్చజెప్పారు. అనంతరం లింగమూర్తి డైరెక్టర్లతోకలసి చైర్మన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదీ చదవండి: దీక్ష వేదికపైనే బ్లేడ్‌తో గొంతు కోసుకుని వీఆర్ఏ ఆత్మహత్యాయత్నం -
మనస్థాపంతో మాజీ ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) చైర్మన్ పదవి ఇస్తారేమోనని ఆశించిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి భంగపాటు ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన పీఏసీఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరిపై ద్వేషం లేదన్నారు. అదృష్టం లేకపోవడం వల్లే డీసీసీబీ చైర్మన్ పదవి రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. దీనివల్ల ప్రజలకు మేలు జరగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రులు కలిసకట్టుగా పనిచేయాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, అందువల్లే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కానీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన డీసీసీబీ డైరెక్టర్ పదవికి నామినేషన్ కూడా వేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని బి.మనోహర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. -
రాత్రి కాంగ్రెస్‌లోకి.. ఉదయం టీఆర్ఎస్లోకి.!
యాచారం : పీఏసీఏస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే విషయంలో బలం సమకూర్చుకోవడానికి టీఆర్ఎస్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. టీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టినా నెగ్గే విధంగా కాంగ్రెస్ పార్టీ మంతన్‌గౌరెల్లి డెరైక్టర్ కరంటోతు పాం డు(టీడీపీ)ని శుక్రవారం రాత్రి డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేర్చుకుంది. దీన్ని జీర్ణించుకోలేని టీఆర్ఎస్ నాయకులు శనివారం ఉదయం పాండును తమ శిబిరం వైపు తిప్పుకొని ఏకంగా టీఆర్ఎస్లో చేర్చు కున్నారు. అంతకు ముందు శనివారం మధ్యాహ్నం పీఏసీఏస్ డెరైక్టర్ పాండు కాంగ్రెస్‌లో చేరినట్లు ఎంపీటీసీ సభ్యు డు కొర్ర అరవింద్ నాయక్, నక్కర్తమేడిపల్లి సర్పంచ్ పాశ్ఛ భాషా విలేకరులకు తెలిపారు. సాయంత్రం 5 గంటలకు జెడ్పీటీసీ సభ్యుడు కర్నాటి రమేష్‌గౌడ్ విలేకరులకు ఫోన్ చేసి పాండు కాంగ్రెస్ లో చేరలేదని, టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరినట్లు చెప్పారు. పాండుతో కూడా ఫోన్లో విలేకరులతో మాట్లాడించారు. క్యాంపులకు సిద్ధం చైర్మన్ పీఠాన్ని కాపాడుకోడానికి కాంగ్రెస్, చైర్మన్ పీఠాన్ని దక్కించుకోడానికి టీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తున్నా యి. వారంరోజులు పాటు తమ శిబి రంలో ఉండి టీఆర్ఎస్లో చేరిన మంత న్ గౌరెల్లి డెరైక్టర్ తీరుతో ఆందోళన చెందిన కాంగ్రెస్ అప్రమత్తం కాగా ఏడుగురు సభ్యులతో ముందు చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేలా టీఆర్ఎస్ చకచకా పావులు కదుపుతోం ది. శనివారం నగరంలో టీఆర్ఎస్ శ్రేణు లు సమావేశమై క్యాంపుల విషయమై చర్చించారు. కాంగ్రెస్శ్రేణులు కూడా పీఠం చేజారకుండా జాగ్రత్త చర్యలు మొదలుపెట్టాయి. -
వట్టిమీనపల్లి సొసైటీ చైర్మన్‌గా మాణిక్‌రెడ్డి
నవాబుపేట, న్యూస్‌లైన్ : వట్టిమీనపల్లి ప్రాథమిక సహకార సంఘం (పీఏసీఎస్) చైర్మన్‌గా కొంపల్లి మాణిక్‌రెడ్డి ఎన్నికయ్యారు. కోరం లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక గురువారం వాయిదా పడిన విషయం తెలిసిందే. శుక్రవారం ఎన్నికల అధికారి తకీహుస్సేన్ ఆధ్వర్యంలో బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఉదయ 9 నుంచి 11 గంటల వరకు చైర్మన్, ఉపాధ్యక్ష పదవుల ఎన్నికకు నామినేషన్లు స్వీకరించారు. చైర్మన్ పదవికి కాంగ్రెస్‌లో కాలె యాదయ్య వర్గానికి చెందిన కొంపల్లి మాణిక్ రెడ్డి, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి చెందిన రాంరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి టీడీపీకి చెందిన లింగన్నొల ప్రమూకమ్మ, కాంగ్రెస్‌లో మల్లారెడ్డి వర్గానికి చెందిన మాణిక్‌రెడ్డి నామినేషన్లు వేశారు. వీటిని పరిశీలించిన ఎన్నికల అధికారి నామినేషన్ల ఉపసంహరణకు అరగంట గడువిచ్చి, గుర్తులు కేటాయించారు. అభ్యర్థులు ప్రచారం చేసుకోవడానికి మరో అరగంట వ్యవధి ఇచ్చి ఓటింగ్ నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ చేసి ఫలితాలు వెల్లడించారు. మొత్తం 13 ఓట్లలో చెరి 7 చొప్పున ఓట్లు సాధించిన కొంపల్లి మాణిక్‌రెడ్డి చైర్మన్‌గా, ప్రమూకమ్మ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉత్కంఠగా ఎన్నిక... గత బుధవారం వట్టిమీనపల్లి పీఏసీఎస్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నప్పటికీ పార్టీలోని రెండు వర్గాల విభేదాలతో అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోలేని పరిస్థితి. మొత్తం 13వార్డుల్లో కాలె యాదయ్య వర్గానికి 3వార్డులు, చిట్టెపు మల్లారెడ్డి వర్గానికి 5వార్డులు దక్కాయి. కాగా టీడీపీకి 3వార్డులు, టీఆర్ఎస్కు 2వార్డులు దక్కాయి. గురువారం అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా ఎవరికీ మెజారిటీ స్థానాలు దక్కని పరిస్థితిలో వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌లో యాదయ్య వర్గానికి చెందిన ముగ్గురు సభ్యులు వ్యూహాత్మకంగా టీడీపీ, టీఆర్ఎస్ సభ్యుల మద్దతు కూడగట్టారు. టీడీపీకి చెందిన ఓ సభ్యుడు మాత్రం మల్లారెడ్డి వర్గంవైపు మొగ్గు చూపారు. దీంతో ఆ వర్గానికి చెందిన రాంరెడ్డికి ఆరు ఓట్లు లభించాయి. ఒక్క ఓటు ఆధిక్యంతో కొంపల్లి మాణిక్‌రెడ్డి చైర్మన్‌గా, ఉపాధ్యక్షురాలిగా ప్రమూకమ్మ విజయం సాధిం చారు. ఎన్నికైన వారికి అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో విజయోత్సవ ఊరేగింపు నిర్వహించారు. భారీ బందోబస్తు... పోలింగ్ రోజున జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని చైర్మన్ ఎన్నిక సందర్భంగా పీఏసీఎస్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వికారాబాద్ డీఎస్పీ పి.నర్సింలు, ట్రైనీ డీఎస్పీ హర్ష, సీఐ విజయ్లాల, ఎస్ఐలు చతుర్వేది, మోహినోద్దిన్, శిక్షణ ఎస్ఐలు వెంకటేశ్వర్ గౌడ్, శంషోద్దిన్, రమేష్, నర్సింలు ఆధ్వర్యంలో 52 మంది ఏఆర్, సివిల్ సిబ్బందిని మోహరిం చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.