
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) చైర్మన్ పదవి ఇస్తారేమోనని ఆశించిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి భంగపాటు ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన పీఏసీఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరిపై ద్వేషం లేదన్నారు. అదృష్టం లేకపోవడం వల్లే డీసీసీబీ చైర్మన్ పదవి రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం లేదని తెలిపారు.
దీనివల్ల ప్రజలకు మేలు జరగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రులు కలిసకట్టుగా పనిచేయాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, అందువల్లే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కానీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా టీఆర్‌ఎస్ అధిష్ఠానం నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన డీసీసీబీ డైరెక్టర్ పదవికి నామినేషన్ కూడా వేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని బి.మనోహర్ రెడ్డి కైవసం చేసుకున్నారు.