DCCB Chairman post
-
మనస్థాపంతో మాజీ ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, వికారాబాద్: డీసీసీబీ(జిల్లా సహకార కేంద్ర బ్యాంకు) చైర్మన్ పదవి ఇస్తారేమోనని ఆశించిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డికి భంగపాటు ఎదురైంది. దీంతో మనస్తాపం చెందిన ఆయన తన పీఏసీఎస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ.. తనకు ఎవరిపై ద్వేషం లేదన్నారు. అదృష్టం లేకపోవడం వల్లే డీసీసీబీ చైర్మన్ పదవి రాలేదని విచారం వ్యక్తం చేశారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య సమన్వయం లేదని తెలిపారు. దీనివల్ల ప్రజలకు మేలు జరగదని పేర్కొన్నారు. ఇప్పటికైనా మంత్రులు కలిసకట్టుగా పనిచేయాలని కోరారు. డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారని, అందువల్లే రాజీనామా చేశానని చెప్పుకొచ్చారు. కానీ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. కాగా టీఆర్ఎస్ అధిష్ఠానం నుంచి సానుకూలత లేకపోవడంతో ఆయన డీసీసీబీ డైరెక్టర్ పదవికి నామినేషన్ కూడా వేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో డీసీసీబీ చైర్మన్ పీఠాన్ని బి.మనోహర్ రెడ్డి కైవసం చేసుకున్నారు. -
‘సహకార’ బరి.. డీసీసీబీ పీఠంపై గురి
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) పాలక మండలి ఎన్నికలు పూర్వపు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.దీంతో డీసీసీబీ చైర్మన్ పదవులపై కన్నేసిన టీఆర్ఎస్ నేతలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలపై దృష్టి సారించారు. పీఏసీఎస్ డైరెక్టర్లుగా, ఆ తర్వాత పీఏసీఎస్ చైర్మన్లుగా ఎన్నికైతేనే డీసీసీబీ అధ్యక్ష పీఠానికి పోటీపడే అవకాశం ఉం టుంది. దీంతో డీసీసీబీ పీఠాన్ని ఆశిస్తున్న పలువురు నేతలు పీఏసీఎస్ స్థాయి లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు తమ వంతు ప్రయత్నా లు సాగిస్తున్నారు. రాష్ట్రంలో 905 పీఏసీఎస్‌ల పరిధిలోని 12,100 డైరెక్టర్ స్థానాలకు శనివారంతో నామినేషన్ల స్వీకరణ ముగిసింది. సోమవారం ఉపసంహరణకు గడువు ఉండటంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్య క్ష పదవిని ఆశిస్తున్న నేతలు డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన సహకార ఎన్నికల్లో తెలంగాణలోని 9పూర్వపు జిల్లాల డీసీసీబీ అధ్యక్షులు కాంగ్రెస్ మద్దతుదారులే గెలిచారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వరంగల్ మిన హా మిగతా 8 జిల్లాల డీసీసీబీ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. గతంలో టీఆర్ఎస్లో చేరిన డీసీసీబీ అధ్యక్షుల్లో ఒకరిద్దరు మినహా మిగతా వారు మరోమారు అదే పదవిని ఆశిస్తూ సహకార ఎన్నికల్లో పీఏసీఎస్ డైరెక్టర్ స్థానాలకు నామినేషన్లు దాఖ లు చేశారు. మరో వారంలో పీఏసీఎస్ స్థాయిలో ఎన్నిక పూర్తవ్వనుండటంతో, డీసీసీబీ అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు పూర్వపు ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎంపీ లు, ముఖ్యనేతలతో సమావేశాలు జరపాల్సిందిగా సంబంధిత జిల్లాలకు చెందిన మంత్రులను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన –ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశం పూర్తికాగా, త్వరలో ఇతర జిల్లాల నేతలు కూడా భేటీ కానున్నారు. మెదక్ డీసీసీబీ బరిలో పద్మా దేవేందర్‌రెడ్డి భర్త మెదక్ డీసీసీబీ పదవిని ఆశిస్తూ ప్రస్తుత అధ్యక్షుడు చిట్టి దేవేందర్‌రెడ్డి కొండపాక సొసైటీ పరిధిలో మరోమారు పోటీ చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి భర్త కూడా కోనాపూర్ సొసైటీ నుంచి బరిలోకి దిగారు. గతంలో రెండు పర్యాయాలు వరుసగా కోనాపూర్ సొసైటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వగా, ప్రస్తుతం మూడోసారి పోటీ చేస్తున్నారు. వరంగల్ డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సన్నిహితుడు మార్నేని రవీందర్రావు సింగారం సొసైటీ పరిధిలో నామినేషన్ దాఖలు చేశారు. ఆదిలాబాద్ డీసీసీబీ అధ్యక్ష పదవిని మరోమారు ఆశిస్తూ ఎం.దామోదర్ రెడ్డి తలమడుగు పీఏసీఎస్ నుంచి పోటీ చేస్తుం డగా, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు అడ్డి బోజారెడ్డి తాంసి పీఏసీఎస్ పరిధిలో నామినేషన్ వేశారు. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పదవిని ఆశిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారి బి.మనోహర్‌రెడ్డి కుల్కచర్ల పీఏసీఎస్ పరిధిలో డైరెక్టర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటికే కేటీఆర్‌ను కలిసిన ఔత్సాహికులు డీసీసీబీ అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్న పలువురు టీఆర్ఎస్ నాయకులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి తమకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. కరీంనగర్ డీసీసీబీ అధ్యక్షుడిగా, రాష్ట్ర స్థాయిలో టెస్కాబ్ చైర్మన్‌గా పనిచేసిన కొండూరు రవీందర్రావు మరోమారు అదే పదవిని ఆశిస్తూ, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పీఏసీఎస్ పరిధిలో డైరక్టర్ స్థానానికి నామినేషన్ వేశారు. గతంలో టెస్కాబ్ చైర్మన్‌గా స్వల్ప కాలం పనిచేసిన ఎడవెళ్లి విజయేందర్‌రెడ్డి నల్గొండ డీసీసీబీ అధ్యక్ష పదవిని దృష్టిలో పెట్టుకుని బరిలోకి దిగారు. మరోవైపు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత భర్త మహేందర్‌రెడ్డి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి సొసైటీ డైరక్టర్‌గా నామినేషన్ దాఖలు చేశారు. నిజామాబాద్ జిల్లా డీసీసీబీ అధ్యక్ష పదవిని ఆశిస్తూ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డి దేశాయిపేట పీఏసీఎస్ పరిధిలో నామినేషన్ వేశారు. మహబూబ్‌నగర్ డీసీసీబీ పీఠాన్ని దృష్టిలో పెట్టుకుని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి కొడంగల్ పీఏసీఎస్ పరిధిలో పోటీకి దిగారు. -
యడవెళ్లి పోతున్నారా...
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాజకీయం మళ్లీ ఆసక్తికరంగా మారుతోంది. ఆరునెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి తిరిగి రెండున్నర నెలల కిందటే విధుల్లో చేరారు. ఇప్పుడు ఏకంగా తన పదవికి రాజీనామా సమర్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, కొత్తచైర్మన్ ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. సాక్షిప్రతినిధి, నల్లగొండ :కాంగ్రెస్‌లో డీసీసీబీ కుంపటి ఆరకుండా ఇంకా రాజుకుంటూనే ఉంది. ఆ ఎన్నిక సందర్భంగా అప్పటి మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో జరిగిన ఒప్పందంలో భాగంగా చైర్మన్ విజయేందర్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవు పెట్టాలి. ఆయన స్థానంలో వైస్‌చైర్మన్ పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టాలి. ఈ ఒప్పందానికి తలొగ్గి ఆరునెలల పాటు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన విజయేందర్‌రెడ్డి మళ్లీ విధుల్లో చేరారు. రెండునెలలుగా మళ్లీ ఇదే విషయం రాజుకుంటోంది. ఒప్పందంలో భాగంగా సెలవుపై వెళ్లాల్సిందేనన్న ఒత్తిడి పెరగడంతో పదవి నుంచే తప్పుకోవడానికి రాజీనామా బాటను ఆయన ఎంచుకున్నారని సమాచారం. అసలు డీసీసీబీ పాలకవర్గం ఎన్నిక సరైన ముహూర్తంలో జరిగినట్లు లేదని కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా సహకారరంగంలో పెద్ద కుంభకోణంగా దేవరకొండ బ్యాంకు అవినీతి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ వ్యవహారాన్ని గాడిలో పెట్టకముందే, కాంగ్రెస్‌లోని ప్రాంతాల వారీ నాయకుల ఆధిపత్యపోరు మొదలైంది. చైర్మన్‌ను పక్కనపెట్టి దొడ్డిదోవన వైస్‌చైర్మన్‌కు చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈలోగా మరోమారు చైర్మన్‌ను పక్కనపెట్టి కొత్తవారిని ఎన్నుకోవాలన్న ప్రయత్నాలూ జరిగాయి. కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డెరైక్టర్లు ఒక్కటై వ్యూహరచన కూడా చేశారు. సహకార ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిపై ఒత్తిడి పెట్టి పక్కకు తప్పుకునేలా చేసి, కోదాడ నియోజకవర్గానికి చెందిన వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్చార్జ్ పదవిని కట్టబెట్టారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు జిల్లా కాంగ్రెస్‌లో ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి అప్పటి మంత్రుల హోదాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. ఒకవైపు తమ నాయకులనుంచి ఒత్తిడి, మరోవైపు బ్యాంకు బోర్డులోని కొందరు డెరైక్టర్లు చైర్మన్‌ను ఎలా పక్కన పెట్టాలని చేసిన ప్రణాళిక రచన.. వెరసి విజయేందర్‌రెడ్డిపై తీవ్రఒత్తిడి పెంచాయని చెబుతున్నారు. ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం మేరకు అని చెబుతూ తన పదవికి రెండు మూడు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించిట్లు తెలిసింది. ముత్తవరానికి... మొండిచేయి..! చైర్మన్ విజయేందర్‌రెడ్డి రాజీనామా చేసి పదవినుంచి పక్కకు తప్పుకుంటే, కొత్తచైర్మన్ ఎన్నిక కోసం మళ్లీ నోటిఫికేషన్, ఎన్నిక జరగాల్సిందేనని తెలుస్తోంది. సెలవుపై వెళ్లిన సందర్భంలో మాత్రమే వైస్‌చైర్మన్ ఇన్చార్జ్ చైర్మన్‌గా వ్యహరించే అవకాశం ఉంది. కానీ, రాజీనామా చేసినప్పుడు మాత్రం చైర్మన్ పోస్టు ఖాళీ అయిన ట్లుగా భావించి కొత్తవారిని ఎన్నుకోవాల్సిందేనని సహకారశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన డీసీసీబీ ఛైర్మన్ పీఠంపై ఆశలు పెంచుకున్న వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు మొండిచేయి చూపినట్లేనని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం వైస్చైర్మన్నే, చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చినా, ఇప్పటికే ప్రయత్నాలు చేసిన భువనగిరి డివిజన్‌కు చెందిన ఓ డెరైక్టర్ అడ్డుపడే అవకాశం ఉందంటున్నారు. ఇదేజరిగితే, డీసీసీబీ చైర్మన్ ఎన్నిక రంజుగా మారే అవకాశం లేకపోలేదు. ‘ఎన్నికల ముందు ఒప్పందాన్ని అంగీకరించాలనుకుంటున్నా. ఒకటి రెండు రోజుల్లో అందరి సమక్షంలోనే రాజీనామాను ప్రకటిస్తా..’ అని శనివారం జరిగిన డీసీసీబీ బోర్డు మీటింగ్‌లో చైర్మన్ విజయేందర్‌రెడ్డి అన్నట్లు సమాచారం.