జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాజకీయం మళ్లీ ఆసక్తికరంగా మారుతోంది. ఆరునెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి తిరిగి రెండున్నర నెలల కిందటే విధుల్లో చేరారు. ఇప్పుడు ఏకంగా తన పదవికి రాజీనామా సమర్పించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇక, కొత్తచైర్మన్ ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది.
సాక్షిప్రతినిధి, నల్లగొండ :కాంగ్రెస్‌లో డీసీసీబీ కుంపటి ఆరకుండా ఇంకా రాజుకుంటూనే ఉంది. ఆ ఎన్నిక సందర్భంగా అప్పటి మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో జరిగిన ఒప్పందంలో భాగంగా చైర్మన్ విజయేందర్‌రెడ్డి దీర్ఘకాలిక సెలవు పెట్టాలి. ఆయన స్థానంలో వైస్‌చైర్మన్ పాండురంగారావు ఇన్‌చార్జ్ చైర్మన్ బాధ్యతలు చేపట్టాలి. ఈ ఒప్పందానికి తలొగ్గి ఆరునెలల పాటు దీర్ఘకాలిక సెలవులో వెళ్లిన విజయేందర్‌రెడ్డి మళ్లీ విధుల్లో చేరారు. రెండునెలలుగా మళ్లీ ఇదే విషయం రాజుకుంటోంది. ఒప్పందంలో భాగంగా సెలవుపై వెళ్లాల్సిందేనన్న ఒత్తిడి పెరగడంతో పదవి నుంచే తప్పుకోవడానికి రాజీనామా బాటను ఆయన ఎంచుకున్నారని సమాచారం. అసలు డీసీసీబీ పాలకవర్గం ఎన్నిక సరైన ముహూర్తంలో జరిగినట్లు లేదని కాంగ్రెస్ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు.
జిల్లా సహకారరంగంలో పెద్ద కుంభకోణంగా దేవరకొండ బ్యాంకు అవినీతి బాగోతం బట్టబయలు అయ్యింది. ఈ వ్యవహారాన్ని గాడిలో పెట్టకముందే, కాంగ్రెస్‌లోని ప్రాంతాల వారీ నాయకుల ఆధిపత్యపోరు మొదలైంది. చైర్మన్‌ను పక్కనపెట్టి దొడ్డిదోవన వైస్‌చైర్మన్‌కు చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పారు. ఈలోగా మరోమారు చైర్మన్‌ను పక్కనపెట్టి కొత్తవారిని ఎన్నుకోవాలన్న ప్రయత్నాలూ జరిగాయి. కొందరు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన డెరైక్టర్లు ఒక్కటై వ్యూహరచన కూడా చేశారు. సహకార ఎన్నికల ముందు చేసుకున్న ఒప్పందం మేరకు విజయేందర్‌రెడ్డిపై ఒత్తిడి పెట్టి పక్కకు తప్పుకునేలా చేసి, కోదాడ నియోజకవర్గానికి చెందిన వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్‌చార్జ్ పదవిని కట్టబెట్టారు.
ఈ నిర్ణయం తీసుకునే ముందు జిల్లా కాంగ్రెస్‌లో ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి అప్పటి మంత్రుల హోదాలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. ఒకవైపు తమ నాయకులనుంచి ఒత్తిడి, మరోవైపు బ్యాంకు బోర్డులోని కొందరు డెరైక్టర్లు చైర్మన్‌ను ఎలా పక్కన పెట్టాలని చేసిన ప్రణాళిక రచన.. వెరసి విజయేందర్‌రెడ్డిపై తీవ్రఒత్తిడి పెంచాయని చెబుతున్నారు. ఎన్నికల ముందు జరిగిన ఒప్పందం మేరకు అని చెబుతూ తన పదవికి రెండు మూడు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించిట్లు తెలిసింది.
ముత్తవరానికి... మొండిచేయి..!
చైర్మన్ విజయేందర్‌రెడ్డి రాజీనామా చేసి పదవినుంచి పక్కకు తప్పుకుంటే, కొత్తచైర్మన్ ఎన్నిక కోసం మళ్లీ నోటిఫికేషన్, ఎన్నిక జరగాల్సిందేనని తెలుస్తోంది. సెలవుపై వెళ్లిన సందర్భంలో మాత్రమే వైస్‌చైర్మన్ ఇన్‌చార్జ్ చైర్మన్‌గా వ్యహరించే అవకాశం ఉంది. కానీ, రాజీనామా చేసినప్పుడు మాత్రం చైర్మన్ పోస్టు ఖాళీ అయిన ట్లుగా భావించి కొత్తవారిని ఎన్నుకోవాల్సిందేనని సహకారశాఖ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన డీసీసీబీ ఛైర్మన్ పీఠంపై ఆశలు పెంచుకున్న వైస్‌చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు మొండిచేయి చూపినట్లేనని సమాచారం. ఒకవేళ కాంగ్రెస్ నాయకత్వం వైస్‌చైర్మన్‌నే, చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చినా, ఇప్పటికే ప్రయత్నాలు చేసిన భువనగిరి డివిజన్‌కు చెందిన ఓ డెరైక్టర్ అడ్డుపడే అవకాశం ఉందంటున్నారు. ఇదేజరిగితే, డీసీసీబీ చైర్మన్ ఎన్నిక రంజుగా మారే అవకాశం లేకపోలేదు. ‘ఎన్నికల ముందు ఒప్పందాన్ని అంగీకరించాలనుకుంటున్నా. ఒకటి రెండు రోజుల్లో అందరి సమక్షంలోనే రాజీనామాను ప్రకటిస్తా..’ అని శనివారం జరిగిన డీసీసీబీ బోర్డు మీటింగ్‌లో చైర్మన్ విజయేందర్‌రెడ్డి అన్నట్లు సమాచారం.
యడవెళ్లి పోతున్నారా...
Published Sun, Sep 14 2014 2:56 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement