వేతన సవరణ చేపట్టాలి
బ్యాంకు ఉద్యోగుల ధ్వజం
కర్నూలు(జిల్లా పరిషత్): తమకు వెంటనే వేతన సవరణ చేపట్టాలని బ్యాంకు ఉద్యోగులు ధ్వజమెత్తారు. బుధవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె చేశారు. స్థానిక ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద నిర్వహించిన ధర్నాలో యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ జిల్లా కన్వీనర్ వెంకటేశ్వర్లు, ఆలిండియా బ్యాంక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ. నాగరాజు మాట్లాడారు. బ్యాంకు ఉద్యోగులతో యాజమాన్యాలు 14 సార్లు చర్చలు జరిపినా విఫలం కావడంతో సమ్మె చేశామన్నారు.
యాజమాన్యం 11 శాతం మాత్రమే పెంచుతానంటోందని, తాము 25 శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మంగళవారం నాటి చర్చల్లోనూ తాము ఒక మెట్టు కిందకు దిగి 23 శాతానికి వచ్చామని, కానీ యాజమాన్యం మాత్రం 11 శాతానికి మించి పైకి రావడం లేదన్నారు. దీంతో చర్చలు విఫలమై సమ్మె చేయాల్సి వచ్చిందన్నారు. ధర్నాకు ఎల్‌ఐసీ యూనియన్ నాయకుడు సునయకుమార్, జీఐసీయూ నాయకుడు రఘుబాబు, సీఐటీయూ నాయకుడు అంజిబాబు, పుల్లారెడ్డి, మెడికల్ రెప్స్ యూనియన్ నాయకులు ప్రసాదశర్మ మద్దతు తెలిపారు.
ఏఐబీఏ మహిళా విభాగం నాయకులు రోజారమణి, ఎంపీబీఈ నాయకులు విద్యాసాగర్, ఏఐబీఓసీ నాయకుడు రాధాకృష్ణారెడ్డి, ఏఐబీఓఏ నాయకుడు శ్రీనివాసరావు, గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులు సురేష్, మహమ్మద్‌మియ్య తదితరులు పాల్గొన్నారు.