హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేతన సవరణ కోరుతూ బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన బుధవారం నాటి సమ్మె (జనవరి 7 ) వాయిదా పడింది. ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్(ఐబీఏ)తో జరుపుతున్న చర్చల్లో పురోగతి ఉండటంతో సమ్మెను వాయిదా వేసినట్లు యునెటైడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) ప్రకటించింది. వేతన పెంపుపై గతంలో ప్రతిపాదించిన 11 శాతం నుంచి 12.5 శాతానికి రావడంతో చర్చలు జరపడానికి సమ్మెను వాయిదా వేసినట్లు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు తెలిపారు.
దీనికి తగ్గట్లుగా బ్యాంకు యూనియన్లు కూడా 23 శాతం నుంచి 19.5 శాతానికి దిగొచ్చినట్లు ఆయన తెలిపారు. బుధవారం కూడా చర్చలు జరుగుతాయి. మధ్యే మార్గంగా 14.5- 15 శాతం వద్ద చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. వేతనాల గురించి ఇప్పటికే నాలుగు సార్లు సమ్మె చేసిన నేపథ్యంలో ఇదే అంశంపై ఎక్కువసార్లు సమ్మె చేస్తే ప్రభుత్వానికి ప్రతికూల సంకేతాలు వెళ్తాయన్న ఉద్దేశంతో ఉద్యోగ సంఘాలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఐఎన్‌జీ వైశ్యాఉద్యోగుల సమ్మె యధాతథం
కాగా, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లో విలీనమవుతున్న ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ .. ఉద్యోగులు బుధవారం తమ సమ్మెను యధాప్రకారం కొనసాగించాలని నిర్ణయించారు. అఖిల భారత ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ ఉద్యోగుల సంఘం జనరల్ సెక్రటరీ కేజే రామకృష్ణ రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు
నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె లేదు...
Published Wed, Jan 7 2015 1:02 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM
Advertisement
Advertisement