రోడ్డెక్కిన హోంగార్డులు
Published Thu, Aug 11 2016 12:30 AM | Last Updated on Thu, Oct 4 2018 4:39 PM
రోడ్డెక్కిన హోంగార్డులు
పెబ్బేరు: పుష్కర విధుల్లో పాల్గోనేందుకు వచ్చిన హోంగార్డులకు నిబంధనల ప్రకారం వెంటనే టీఏ,డీఏ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి పెబ్బేరులో పెట్రోలు పంప్‌కు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డులు మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి పెబ్బేరుకు బుధవారం ఉదయం వచ్చామన్నారు. ఇంత వరకు అధికారులు తమ గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన చోటనే వెంటనే టీఏ, డీఏలు చెల్లిస్తారని చెప్పడంతో ఇక్కడికి వచ్చామన్నారు. కాని పెబ్బేరుకు వచ్చి 12 గంటలు గడుస్తున్నా చెల్లించాల్సిన డబ్బుల గురించి ఏ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ హోంగార్డులు పెబ్బేరు– కర్నూల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విధుల్లో చేరిన మూడు రోజుల్లో అన్ని డబ్బులు చెల్లిస్తామని స్థానిక పోలీసులు చెప్పినా పట్టువీడలేదు.
నిర్లక్ష్యం చేస్తే విధులు బహిష్కరిస్తాం..
వెంటనే నిబంధనల ప్రకారం డబ్బులు, సరిౖయెన వసతులు కల్పించకపోతే పుష్కర విధులను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు రాస్తారోకో కొనసాగిస్తామని పెట్రోల్‌పంప్ నుంచి స్థానిక సుభాష్ చౌరస్తాకు చేరుకొని రాస్తారోకో చేపట్టారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ కిషన్, పెబ్బేరు ఎస్‌ఐ రమేష్ హోంగార్డులతో చర్చించారు. నిరసన నిలపివేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చర్చించి నిర్ణయం తీసుకుందామని నచ్చజెప్పడంతో హోంగార్డులు శాంతించారు. నినాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.
Advertisement