home gards
-
తెలంగాణలో హోంగార్డుల జీతాల పెంపు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హోంగార్డుల జీతాలను పెంచుతున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్) లోగోని, సంబంధిత వాహనాలను, బోట్లను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం. హోమ్ గార్డుల రోజు వేతనాన్ని రూ.921 నుంచి రూ.1000కి, వీక్లీ పరేడ్ అలవెన్స్‌ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదంలో మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ నిర్ణయం తీసుకుంటున్నాం’ అని అన్నారు. కాగా, హెంగార్డులకు పెంచిన జీతాలు, ఇతర సదుపాయాలు జనవరి నుంచి అమల్లోకి రానున్నాయి. -
శ్రీ చైతన్య యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి..!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో 65 రోజులు ఎర్రని ఎండలో డ్యూటీ చేసిన హోంగార్డులకు తొమ్మిదివేల చొప్పున డీఏ చెల్లించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు. 12 వేల మంది ఉద్యోగులకు కేవ లంరూ.4500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పూర్తికాని పోలవరం ప్రాజెక్టు సందర్శనకు రూ.400 కోట్లు వెదజల్లి ఖజానా ఖాళీ చేసిన చంద్రబాబుకు హోంగార్డుల కుటుంబాల ఉసురు తగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు చెల్లింపులన్నిటినీ వెంటనే నిలిపివేయాలని అన్నారు. రాయపాటి సంస్థలకు అక్రమంగా రూ.400 కోట్లు చెల్లించేందుకే చంద్రబాబు కేబినేట్ సమావేశమంటూ హడావిడి చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత పనులపై ఆడిటింగ్ జరిపిన తర్వాతే పేమెంట్స్ చేయాలని స్పష్టం చేశారు. సైన్స్ టీచర్ సుధారాణి మృతికి కారణమైన శ్రీ చైతన్య యాజమాన్యంపై హత్యకేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాలేని స్థితిలో ఉన్నా.. శిక్షణ పేరుతో ఆమెను అనంతపురం నుంచి కర్నూలుకు పిలిపించారని, నిండు గర్భిణి దూర ప్రయాణం చేయడం వల్ల తీవ్ర రక్త స్రావమై ఆమె మరణించిందని వివరించారు. సుధారాణి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం చెల్లించాలని కోరారు. -
మావోయిస్టులకు సహకరిస్తున్న హోంగార్డులు
సాక్షి, తూర్పు గోదావరి: సీలేరు జెన్కోలో పనిచేస్తున్న ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు తెలిసింది. కిలో బాబురావు, మరిగల నాగేశ్వరరావు అనే ఇద్దరు హోంగార్డులు గత కొంతకాలంగా మావోయిస్టులకు సమాచారం అందిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిపై నిఘా ఉంచిన పోలీసులు మండలంలోని లంకపాకల వద్ద మావోయిస్టులకు కలిసి వస్తుంటే వారిద్దరి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిద్దరూ మావోయిస్టు నేతలు చలపతిరావు, అరుణకు సహరిస్తున్నట్లు తేలిందని చింతపల్లి ఓఎస్డీ వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆ లెక్కే వేరబ్బా..!
‘‘తిరుపతి రవాణా శాఖ కార్యాలయంలో పనిచేసే ఓ హోంగార్డుపై అవినీతి ఆరోపణలు రావడంతో అతన్ని మాతృశాఖకు పంపుతూ ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) నెల రోజుల క్రితం ఆదేశాలు జారీ చేశారు. కానీ నెలగా ఆయన రవాణా శాఖ చెక్‌పోస్టులో విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల వేతనాలు చెల్లించే బిల్లులో హోంగార్డు చిత్తూరులో పనిచేస్తుండడాన్ని గుర్తించిన కమిషనర్ షాక్‌కు గురయ్యారు.’’ ‘‘నిత్యం ఖద్దరు దుస్తుల్లో కనిపించే గంగాధరనెల్లూరుకు చెందిన ఓ టీడీపీ నేత ఇటీవల ఎంపికైన ఓ హోంగార్డుకు చిత్తూరు రవాణా శాఖ కార్యాలయంలో పోస్టింగ్ వేయిం చాడు. వాహన తనిఖీ అధికారి(ఎంవీఐ)తో పాటు ఉండే ఆ హోంగార్డు అధికారులు లేని సమయంలో ఎంవీఐ వాహనం తీసుకెళ్లి జాతీయ రహదారుల్లో వాహనాలు ఆపుతూ దోపిడీకి పాల్పడుతున్నాడు. టీడీపీ నేత రెకమెండేషన్ కావడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి’’ చిత్తూరు అర్బన్: రోడ్లపై నిలబడి ట్రాఫిక్ చూడడం, అధికారులకు టీ కాఫీలు తెచ్చివ్వడం, రాత్రి గస్తీలకు వెళ్లడం ఇష్టపడని కొందరు హోంగార్డులు వారి పలుకుబడి ఉపయోగించి జిల్లా రవాణా శాఖలోనే పనిచేయడానికే ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సామ, భేద, దండోపాయాలను ఉపయోగిస్తున్నారు. అవసరమైన చోట డబ్బు ఇవ్వడం.. డబ్బులు పనిచేయని చోట అధికార పార్టీ నేతల ద్వారా పోస్టింగులు వేయించుకోవడం చేస్తున్నారు. ఇంతగా రవాణా శాఖలో పోస్టింగులు వేయించుకోవడానికి కారణాలు ఏమిటి..? అసలు రవాణా శాఖే కావాలని ఎందుకు పట్టుపడుతున్నారు..? ఇక్కడ హోంగార్డులు చేసే పనులేమిటి..? ఏంచేస్తున్నారో.. మీరే చదవండి. ఇవీ విధులు.. పోలీసు శాఖలాగే హోంగార్డులకు సైతం పనిగంటల్లో పరిమితి ఉండదు. అయితే శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర విభాగాల్లో పనిచేసే హోంగార్డులకు షిప్టు పద్ధతిలో అధికారులు విధులు కేటాయిస్తుం టారు. పోలీసు శాఖలోని హోంగార్డులకు రవాణా శాఖలో విధులు కేటాయించే బాధ్యత చిత్తూరు, తిరుపతిలోని హోంగార్డు విభాగ అధికారులు చూస్తుంటారు. రవాణా శాఖకు అటాచ్మెంట్ చేసిన హోంగార్డులు డీటీసీ, ఆర్టీఓ, ఎంవీఐ, ఏఎంవీఐ అధికారుల వద్ద పనిచేయాలి. అధికారులు తనిఖీలకు వెళ్లినప్పుడు రాత్రయినా సరే వెళ్లాల్సిందే. నెలమొత్తం పనిచేసిన హోంగార్డు ఎవరి వద్ద పనిచేశారో తెలిపే డ్యూటీ సర్టిఫికెట్‌ను చిత్తూరులోని డీటీసీ కార్యాలయంలో అందజేయాలి. చేస్తున్న పనులు ఇలా.. జిల్లాలో చిత్తూరు, తిరుపతి రవాణా శాఖ కార్యాలయంతో పాటు ఐదు చోట్ల యూనిట్, ఎంవీఐ కార్యాలయాలు, మూడు చెక్‌పోస్టులున్నాయి. ఇద్దరు ఆర్టీఓలతో పాటు 32 మంది ఎంవీఐల వద్ద 32 మంది హోంగార్డులుగా పనిచేస్తున్నారు. వీరికి ప్రతినెలా డ్యూటీ సర్టిఫికెట్ చూసి ఒక్కొక్కరికి నెలకు రూ.18 వేల జీతాన్ని రవాణా శాఖ చెల్లిస్తోంది. రవాణా శాఖలో పనిచేయడానికి చాలామంది హోంగార్డులు డబ్బులిచ్చి పోస్టింగులు వేయించుకుంటున్నారనే విమర్శలున్నాయి. కొందరు ఎంవీఐలు తనిఖీల సమయంలో అవినీతి కార్యకలాపాలకు పాల్పడడాన్ని హోంగార్డులు ప్రత్యక్షంగా చూస్తూ అక్రమ మార్గాల్లో సంపాదనపై దృష్టి పెడుతున్నారు. చిత్తూరులోని ఓ ఎంవీఐ వద్ద పనిచేసే హోంగార్డు ఎంవీఐ వాహనం తీసుకెళ్లి గ్రానైట్ రాళ్లు తీసుకెళ్లే లారీల వద్ద డబ్బు వసూలు చేస్తూ దొరికిపోయినా దీన్ని బయటకు పొక్కనీయకుండా అధికారులు మందలించి సర్దుబాటు చేసేశారు. ఇక కూడళ్లు ఉన్న రోడ్లు, జాతీయ రహదారులు, చెక్‌పోస్టుల్లో ఓవైపు ఎంవీఐలు దందాలు చేస్తుంటే, పక్కనే మరోవైపు హోంగార్డులు మామూళ్లు వసూలు చేస్తుంటారు. ఎన్ఆర్ పేట, పలమనేరు, రేణిగుంట చెక్‌పోస్టుల్లో ఈ చిత్రాలు నిత్యం కనిపిస్తూనే ఉంటాయి. కొందరు హోంగార్డుల్లో రోజుకు రూ.10 వేలు సంపాదించే వాళ్లు కూడా ఉన్నారని బహిరంగ ఆరోపణలున్నాయి. ఇంత ఆదాయం వస్తున్న రవాణా శాఖలో పోస్టింగ్ కోసం తొలుత రూ.30 వేల నుంచి రూ.50 వేలను ఇవ్వడానికి ఏమాత్రమూ వెనుకాడడం లేదు. హోంగార్డు విభాగంలో పనిచేసే ఒకరిద్దరు అధికారుల నుంచి పర్యవేక్షణ చూసే సిబ్బంది వరకు మామూళ్లు ఇస్తూ ఏళ్ల తరబడిగా రవాణా శాఖలో పాతుకుపోయారు. కొందరు ఎంవీఐలు హోంగార్డులను సొంత పనులకు ఉపయోగించుకుంటుండటంతో అధికా రుల బలహీనతను హోంగార్డులు పసిగట్టేసి సొంతంగా తనిఖీలకు సైతం వెళ్లే స్థాయికి చేరుకున్నారనే ఆరోపణలున్నాయి. మార్చమని చెబుతున్నాం.. తిరుపతిలో ఓ హోంగార్డును వద్దని ఆపేస్తే అతను మా చెక్‌పోస్టులోనే పనిచేస్తున్నట్లు గుర్తించాం. జీతం ఆపేసి, అతన్ని వెనక్కు పంపాం. ఆర్నెల్లపాటు హోంగార్డు మా వద్ద పనిచేస్తే బ్యాచ్‌ల వారీగా రొటేట్ చేయమని పోలీసులకు రాస్తున్నాం. మా ఎంవీఐలు ఎక్కడైనా హోంగార్డులను మిస్యూస్ చేస్తుంటే ఫిర్యాదు చేయండి. యాక్షన్ తీసుకుంటాం. – సీహెచ్.ప్రతాప్, ఉప రవాణా కమిషనర్ -
వేతన సంబురం
పరిగి : హోంగార్డుల్లో హర్షాతిరేకాలు.. వేతనం పెంచుతూ ప్రభుత్వం గత డిసెంబర్లో తీసుకున్న నిర్ణయం అమల్లోకి వచ్చింది. పెంచిన ప్రకారం నెలకు రూ. 20 వేల వేతనం గురువారం వారి ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ ఆనందభరితమైన క్షణాలు వారు తోటి సిబ్బంది, పోలీసు అధికారులతో పంచుకున్నారు. మొదటి సారి రూ. 20 వేల వేతనం డ్రా చేసుకున్న వారు స్వీట్లు తీసుకువచ్చి అందరికీ పంచారు. ప్రభుత్వం పెంచుతున్నట్లు ప్రకటించిన రోజు కంటే తమ ఖాతాల్లో జజ అయిన క్షణాల్లో తమ ఆనందం రెట్టింపుయ్యిందని వారు తెలిపారు. పరిగి ఎస్ఐలు కృష్ణ, ఓబుల్‌రెడ్డి వారికి స్వీట్లు తినిపించారు. తమ పనికి తగిన గౌరవం లభించినట్లయ్యిందని సంతోషం వ్యక్తం చేశారు. ఇక ముందు మరింత ఆత్మ విశ్వాసంతో పనిచేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరిస్తే బాగుండేదని మరికొందరు హోంగార్డులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సర కాలంలో రెండు సార్లు వేతనాలు పెంచటంతో పాటు హోంగార్డులకు ఆరోగ్యపరమైన, గృహాలు నిర్మించి ఇచ్చే విషయంలో ప్రభుత్వం వరాల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. నెలకు రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనాలు గత మార్చిలో రూ. 12 వేలకు పెంచగా ప్రస్తుతం రూ. 20 వేలకు పెంచింది. ఎంతో మంచి నిర్ణయం ఇప్పటి వరకు హోంగార్డులుగా అనేక సేవలు అందిస్తూ వచ్చాం. చాలిచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు సీఎం కేసీఆర్ హోంగార్డులకు వేతనాలు పెంచటంతో పాటు తగిన గుర్తింపు ఇచ్చారు. సంక్షేమంపై తీసుకున్న నిర్ణయంతో హోంగార్డుల కుటుంబాలకు ఎంతో మేలు జరగనుంది. – బిచ్చయ్య, హోంగార్డు, పరిగి. సమస్యలు తీరుతాయి సీఎం కేసీఆర్ తమకు వేతనాలు పెంచడంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పటంతో చాలా సంతోషం. తమకు చాలా వరకు సమస్యలు తీరుతాయి. ఇదే సమయంలో కానిస్టేబుల్ నియామకాల్లో రిజర్వేషన్లు పెంచటం కూడా మంచి నిర్ణయమే. మరింత ఉత్సాహంతో పనిచేస్తాం. – యాదలక్ష్మి, హోంగార్డు, పరిగి -
'హోంగార్డుల సర్వీసును క్రమబద్ధీకరించాలి'
సాక్షి, హైదరాబాద్: హోంగార్డులకు వరాలు కురిపించిన సీఎం, వారి భద్రతపై ఎలాంటి హామీ ఇవ్వకపోవడం త్రిశంకు స్వర్గమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. హోంగార్డుల సర్వీసును క్రమబద్ధీకరిస్తామని అనేకసార్లు చెప్పినా, ఇప్పటివరకు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ప్రభుత్వ దయాదాక్షిణ్యాల మీద వారు ఆధారపడటం సరికాదన్నారు. 40 ఏళ్ల నుంచి సేవలందిస్తున్న హోంగార్డులను పట్టించుకున్న నాథుడే లేకుండాపోయారని, ఇప్పటికైనా వారి సర్వీసును క్రమబద్ధీకరించాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
వ్యాయామంతోనే ఆరోగ్యం
– జిల్లా పోలీసు సిబ్బందికి ఎస్పీ సూచన – జగన్నాథగట్టు శివారుల్లోని ఫైరింగ్ రేంజ్ పరిశీలన కర్నూలు: జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న హోంగార్డు నుంచి పోలీసు ఉన్నత స్థాయి అధికారి వరకు ప్రతి రోజు వ్యాయామం చేయడం ద్వారా శరీరాకృతి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ ఆకె రవికృష్ణ సూచించారు. నగర శివారుల్లోని జగన్నాథగట్టు పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో జిల్లా పోలీసుల కోసం ఏర్పాటు చేసిన ఫైరింగ్ రేంజ్ స్థలాన్ని ఎస్పీ ఆకె రవికృష్ణ సోమవారం ఉదయం పరిశీలించారు. పోలీసు కానిస్టేబుళ్లతో కలిసి వరుసలో నిలబడి ఎస్పీ స్వయంగా ఫైరింగ్ చేశారు. ఈ సందర్భగా సిబ్బందిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వరుసలో నిలబడిన వారు ఫైరింగ్ రేంజ్లో ఇచ్చే కమాండింగ్ పాటించి బాగా ఫైర్ చేయాలన్నారు. పోలీసులు చక్కటి శరీరాకృతి, «ధారుడ్యాలతో ఫిట్‌గా ఉండాలన్నారు. ఆళ్లగడ్డ, ఆదోని, డోన్, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు సబ్ డివిజన్ల నుంచి సిబ్బంది ఫైరింగ్ రేంజ్లో పాల్గొంటారు. ప్రతి సబ్ డివిజన్‌కు రెండు రోజుల పాటు ఫైరింగ్ సమయం కేటాయించారు. ఉదయం 6 గంటల నుంచి 10.30 గంటల వరకు ఉంటుంది. కర్నూలు సబ్ డివిజన్ నుంచి మొదటి రోజు 160 మంది సిబ్బంది ఫైరింగ్ రేంజ్లో పాల్గొని ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ బోర్డు దగ్గరకు ఎస్పీ స్వయంగా వెళ్లి, కలియ తిరిగి ఫైరింగ్‌లో ఎవరెవరు (బుల్ ఇన్నల్ ఔటర్ మెక్) ఎంత ప్రతిభ కనబరిచారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కర్నూలు తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి, ఆర్ఐ రంగముని తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన హోంగార్డులు
రోడ్డెక్కిన హోంగార్డులు పెబ్బేరు: పుష్కర విధుల్లో పాల్గోనేందుకు వచ్చిన హోంగార్డులకు నిబంధనల ప్రకారం వెంటనే టీఏ,డీఏ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం రాత్రి పెబ్బేరులో పెట్రోలు పంప్‌కు ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హోంగార్డులు మాట్లాడారు. వివిధ ప్రాంతాల నుంచి పెబ్బేరుకు బుధవారం ఉదయం వచ్చామన్నారు. ఇంత వరకు అధికారులు తమ గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. విధుల్లో చేరేందుకు వెళ్లిన చోటనే వెంటనే టీఏ, డీఏలు చెల్లిస్తారని చెప్పడంతో ఇక్కడికి వచ్చామన్నారు. కాని పెబ్బేరుకు వచ్చి 12 గంటలు గడుస్తున్నా చెల్లించాల్సిన డబ్బుల గురించి ఏ అధికారి పట్టించుకోవడం లేదన్నారు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ హోంగార్డులు పెబ్బేరు– కర్నూల్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విధుల్లో చేరిన మూడు రోజుల్లో అన్ని డబ్బులు చెల్లిస్తామని స్థానిక పోలీసులు చెప్పినా పట్టువీడలేదు. నిర్లక్ష్యం చేస్తే విధులు బహిష్కరిస్తాం.. వెంటనే నిబంధనల ప్రకారం డబ్బులు, సరిౖయెన వసతులు కల్పించకపోతే పుష్కర విధులను బహిష్కరిస్తామని వారు హెచ్చరించారు.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చే వరకు రాస్తారోకో కొనసాగిస్తామని పెట్రోల్‌పంప్ నుంచి స్థానిక సుభాష్ చౌరస్తాకు చేరుకొని రాస్తారోకో చేపట్టారు. వనపర్తి డీఎస్పీ చెన్నయ్య, కొత్తకోట సీఐ కిషన్, పెబ్బేరు ఎస్ఐ రమేష్ హోంగార్డులతో చర్చించారు. నిరసన నిలపివేసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చర్చించి నిర్ణయం తీసుకుందామని నచ్చజెప్పడంతో హోంగార్డులు శాంతించారు. నినాదాలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.